Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
3) 8వ మంత్రముచే తండులములను పర్వగ్ని కరణము చేయునది. సోమయాగపు మధ్యందిన సవనమున ధిష్న్యాగ్నిని దర్శించుచు బ్రహ్మ మరియు యజమాని దీనిని జపించునది. అగ్ని చయనమున కుండము కొరకు త్రవ్విన మట్టిని బ్రహ్మ దీనిచే అనుమంత్రించునది.
4) సోమయాగ ప్రవర్గ్యమున 'ఘర్మ దుగ్దోహార్ధమ్' లేచునట్టి అధ్వర్యాదులను బ్రహ్మ 9, 10 మంత్రములచే అనుమంత్రించునది.
1. సరస్వతీ దేవీ! నీవు మా వ్యాధులను పూర్తిగ నిర్మూలింపుము. మాకు సుఖములు కలిగించుము. మేము నీ దర్శన వంచితులము కాకుందుము గాక.
--౦౦౦--
1. గాలి మాకు సుఖముగా వీచును గాక. సూర్యుడు మాకు సుఖము కలుగునట్లు వెలుగును గాక. బాధించకుండును గాక. పగళ్ళు, రాత్రులు శుభప్రధములు అగును గాక. ఉషస్సు మాకు సుఖము కలిగించుచు ఉదయించును గాక. (2)
--౦౦౦--
1. శత్రువు మనసుతోను, వాక్కుతోను, యజ్ఞముతోను, హవిస్సుతోను మాకు హాని కలిగించదలచినపుడు అవి పూర్తికాక ముందే నిర్రుతి దేవత మృత్యువుచే వానిని హతమార్చును గాక. (3)
2. యాతుధానులు, నిర్రుతి, రాక్షసులు మాకు తలపెట్టిన హాని ఫలించకుండును గాక. విపరీత ఫలములు కలిగి వారికే హాని కలిగించును గాక. ఇంద్ర ప్రేరిత దేవతలు శత్రువు యొక్క ఆజ్య కార్యములను నలిపివేయుదురు గాక. శత్రువు చేయు కర్మ నిష్ఫలమగును గాక. (4)
3. మాతో యుద్దము తలపెట్టు వాణి ఆజ్య హోమాదులను 'అజీర' 'అధిరాజ' నామక మృత్యుదూతలు - ఆకసమున ఎగురు డేగ పడినట్లు - పడి నాశనము చేయుదురు గాక. మా ఎదుట నిలిచి మమ్ము హింసించదలచిన వాణి హోమాదులను నష్టపరచును గాక. (5)
4. శత్రువా! హోమము చేయు నీ చేతులను వీపునకు విరిచి కట్టుచున్నాను. మత్రములు చదువకుండ నీ నోటిని మూయుచున్నాను. అగ్ని దేవుని క్రోధమున నేను నీ కర్మను నష్టపరచుచున్నాను. (6)
5. శత్రువా! నీ బాహువులు వెనుకకు విరిచికట్టుచున్నాను. నోరు మూయుచున్నాను. అగ్ని దేవుని ఘోరక్రోధమున నీ ఆజ్య కర్మను ధ్వంసము చేయుచున్నాను. (7)
1. అగ్నిదేవా! నీవు బలసూనుడవు. ఫలప్రదుడవు. విద్వాంసుడవు. నిన్ను మేము నలుదిశలందు ఆశ్రయించుచున్నాము. నీది జ్వాలా రూపము. నీవు హోతలకు భంగము కలిగించువారలను హతమార్చుచున్నావు. (8)
--౦౦౦--
1. ఋత్విజులారా! లేవండి. యజ్ఞమునకు సంబంధించిన ఇంద్రుని భాగమును వీక్షించండి. అది పక్వమైనచో అగ్నికి అర్పించండి. కాకున్న పక్వమగు వరకు ఇంద్రుని కీర్తించండి. (9)
2. ఇంద్రదేవా! నీకు సంబంధించిన హవి ఉదికినది. త్వరగా విచ్చేయండి. సూర్యుడు సగమునకు కొద్ది తక్కువ దూరమునకు చేరినాడు. నీకు తగిన సమర్దులగు ఋత్విజులు సోమరసముతో - తిరుగుబోతు తండ్రిని కాపాడు పుత్రుని వలె - ఆహ్వానించుచున్నారు.
నాలుగవ సూక్తము - 18
వినియోగము :-
1) అగ్నిష్టోమపు ప్రవర్గ్యమున హోమించబడు ఘ్రుతమును మొదటి మంత్రముచే బ్రహ్మ అనుమంత్రించునది అగ్నిష్టోమపు మధ్యందిన సవనమున దధిఘర్మ హోమమును దీనిచే బ్రహ్మ అనుమంత్రించునది.
2) ప్రవర్గ్యమున హోత్రు కర్త్రుక వషట్కారము మరియు అనువషట్కారమును 4, 5 మంత్రములచే బ్రహ్మ అనుమంత్రించునది.
3) ప్రవర్గ్యమును దుహించబడు 'ఘర్మదుఘ'ను బ్రహ్మ 8వ మంత్రముచే అనుమంత్రించునది.
4) ప్రవాసము చేయువాడు 12వ మంత్రముచే తన పశువులను అభిమంత్రించునది.
"మధుపర్కే ఉత్స్కష్టాంగాం అనయా అభ్యాగతోనుమంత్రయేత్"
1. ఆవు పొదుగునందు హవి సిద్దమగుచున్నదాని ఎరుగుదును. అది అగ్నియందు సిద్దమగుచున్నదని ఎరుగుదును. అది పక్వమనియు దధియను నవీన హవి యనియు ఎరుంగుదును. ఇది మద్యందిన సవనమునకు సిద్దమైనది. వజ్రధారి ఇంద్రా! నీవు ప్రసన్నుడవగుము. దధిగల సోమము హవిని ఆరగించుము.
--౦౦౦--
1. అశ్వినులారా మీరు అభీష్ట ఫలప్రదులు. స్వర్గమందున్న దేవతలకు నేతలు. అగ్ని ప్రజ్వలితమైనది. ఘ్రుతము పాత్రలందు తప్తమైనది. మీ కొరకు మధుర రస దుగ్ధములు పితుకబడినవి. మేము స్తోతలము. మా అగ్రుహములు హవిపూర్ణములు. మిమ్ము మా యజ్ఞములకు ఆహ్వానించుచున్నాము. (2)
2. అశ్వినులారా! అగ్ని ప్రజ్వలితమైనది. ఘ్రుతము కరిగినది. ఘర్మ హవిసేవించుటకు విచ్చేయండి. అభిమత ఫలప్రద అశ్వినులారా! మీ కొరకు ఆవులు మరిన్ని పాలిచ్చినవి. హోతలు మిమ్ము స్తుతించుచు మురిసిపోవుచున్నారు. (3)
3. అశ్వినులకు యజ్ఞములందు హవిస్సులు సమర్పించ బడుచున్నవి. అశ్వినుల చమసము లందే ద్వాతలు పానము చేయుచున్నారు. అమృతము సేవించునట్టి దేవతలు సూర్యుని ముఖముచే, నోటిచే సేవించుచున్నారు. (4)
4. అశ్వినులారా! ఘ్రుతోత్పాదక దుగ్ధము పాత్రలందుంచబడినది. ఇది మీ భాగము రండి. సేవించండి. మీరు మధువిద్యావంతులు. ఈ యజ్ఞమున పోషించండి. సూర్యుడు కరిగించిన ఘ్రుతమును సేవించండి. (5)
5. అశ్వినులారా! హోతచే అభిష్టుతమై తపించబడిన ఘ్రుతము మీకు చేరును గాక. మీ వలన ప్రసన్నులైన హోతలు మీకు హవిస్సులు అర్పించెదరు గాక. గోవు పాలిచ్చి, యజ్ఞములను వర్ధిల్లచేయుచున్నది. మధువు వంటి గోవుపాడిని తినండి. త్రాగండి. (6)
6. అధ్వర్యులారా! పాలను కాచండి. వానిని ఎండలో కరిగిన నేతిలో పోయండి. సూర్యుడు స్వర్గమును ప్రకాశింపచేయువాడు. సూర్యుడు ఉషస్సును అనుసరించి ఉదయించుచున్నాడు. (7)
(అట్టి సూర్యతాపమున కరిగినది అని.)
7. మంచి పాడినిచ్చు గోవును ఆహ్వానించుచున్నాను. ఈ ధేనువును అద్వర్యు పితుకును గాక. 'సవము' అనునామము గల పాలను సవితాదేవత మాకు కలిగించును గాక. ఘ్రుతము కరిగినది. అది గోవును తనలో పాలుపితుకమనుచున్నది. (8)
8. ధేనువు ధనపాలిక. 'హిమ్' అనుచు దూడను కూడిన ఆవు వచ్చును గాక. అహంతవ్య, అవధ్య గోవు అశ్వినుల కొరకు పాలను ఇచ్చును గాక. ఆ గోవు మమ్ము మహాసౌభాగ్యములచే వర్ధిల్ల చేయును గాక. (9)
9. అగ్నిదేవా! నీవు ధతహవు. ఇంటింట అతిథివి. విద్వాంసుడవు. మా యజ్ఞమునకు విచ్చేయుము. విచ్చేసి శత్రుసేనను హతమార్చుము. వారి ధనములను మాకు అందించుము. (10)
10. అగ్నిదేవా! మాకు మహా సౌభాగ్యము కలిగించుటకు ఆర్ద్ర మనస్కుడవగుము. భార్యాభర్తలము నిన్ను సేవింతుము గాక. మమ్ము శత్రువుగా భావించువారిని అణచివేయుము. (11)
11. పాడియావా! గడ్డి మేయుచు భాగ్యవతిని అగుము. మేము సహితము భాగ్యవంతులము అగుదుము గాక. అహింస్య గోవూ! నీవు గడ్డి మేయుచు స్వేచ్చగా సంచరించుము. శుద్ద, నిర్మల జలమును త్రాగుము. (12)
ఏడవ అనువాకము
మొదటి సూక్తము - 19
వినియోగము :-
1) గండమాల చికిత్సకు 1, 2 మంత్రములచే సూత్రోక్తరీతిగా ధనుర్బాణములచే గండమాలను బిధ్నించునది.
2) ఈర్ష్యా వినాశన కర్మమున 3వ మంత్రమున ఈర్ష్యాళువును చూచుచు జపించునది. దీనిచే సక్తుమంథమును అభిమంత్రించి ఈర్ష్యాళువునకు ఇచ్చునది లేదా వానిని చూచుచు జపించునది.
3) దర్శపూర్ణమాస వ్రతోపాయనమున 4వ మంత్రము వినియోగము.
4) 5, 6 ఋక్కులు గోపుష్టి కర్మమున వినియోగములు.
5) 7, 8 మంత్రములచే శంఖమును అరగదీసి గండమాల మీద పూయునది. "శునకలాలాం వా అభిమంత్ర్య గండమాలాం ప్రలిమ్పేత్". వీనిచే బల్లిని అభిమంత్రించి రక్తము పీల్చుటకు గండమాల మీద ఉంచునది. సైంధవ లవణమును వీనిచే అభిమంత్రించి గండమాల మీద చల్లి ఉమ్మునది.
6) రాజ యక్ష్మ నివారణకు వీణాతంత్రిఖండమును వాద్యఖండము లేదా శంఖ ఖండమును సంపాతిత అభిమంత్రణలు చేసి కట్టునది.
1. గొంతు నుండి చంకవరకు ప్రాకునట్టి గండమాల 'అపచిత' మనబడును అది లోహి, కృష్ణ రెండు రంగులది. వాని మూలము పిశాచమగుచున్నది. దేవతల, మునుల దయవలన నేను అట్టి సర్వ పిశాచములను పారద్రోలుచున్నాను.
2. అసాధ్యమగు గండమాలను, మధ్యవిధపు గండమాలను, అల్పగండమాలను అన్నింటిని చెట్టు నరికినట్లు నరికి వేయుచున్నాను.
3. ఈర్ష్యాళువా! త్వష్ట అనుగ్రహమున నీ క్రోధమును నిర్వీర్యము చేయుచున్నాను. పతిదేవా! నీ కోపమును శాంతింప చేయుచున్నాను.
4. అగ్నిదేవా! మేము నిన్ను పూజించుచున్నాము. మా పూజలందు కొనుము. మా గృహములందు ప్రజ్వరిల్లుము.
--౦౦౦--





