Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                      

                                        ఆరవ అనువాకము
                                         మొదటి సూక్తము - 15
   

వినియోగము :-

   
      1) దేశాంతరము నుంచి వచ్చినవాడు తన ఇంటిని చూచుచు సమిధలు చేతబట్టి 1 -6 మంత్రములను  జపించుచు ఇంటిలో అడుగు పెట్టునది. తదుపరి సమిధలను కుడిచేత పట్టి 'వలీకతృణము' లను ఎడమచేత తాకి వీనిని జపించుచు సమిధలను ఆహితాగ్ని యందు వేయునది. తన ఇంట అందరు  ఏకమనస్కులగుటకు వీనిని జపించుచు సమిధలను ఒకేసారి ఉంచునది. క్రవ్యాద్విసర్జన తదుపరి వీనిని  జపించుచు యజమాని గృహమున ప్రవేశించునది.అంత్యేష్టియందు శవదహనము తరువాత వీనిని జపించుచు స్వజనులను ఇంటిలో ప్రవేశపెట్టునది.
   
      2) 7వ మంత్రముచే ప్రవాస మందున్నపుడు తన ఇల్లు, భార్య పుత్రులను చూచునది.
   
      3) బుద్ది కోరువాడు 8 - 9 ఋక్కులచే క్షీరోధన పురోడాశము, రసములందు ఒక దానిని సంపాతన, అభిమంత్రణలు చేసి భుజించునది లేదా అగ్నిని ఉపస్థానము చేయునది. ఉపనయనపు అగ్ని కార్యమున వీనిచే అగ్నిని పరి సమూహన చేయునది.
   
      4) ఆవాసాథ్యాధినమందు మహాశాంతి గణ సమయమున 10 వ మంత్రము చదువునది. "తథా అగ్ని చయనే అతిచ్చన్దసేష్ట కానుమన్త్రణానంతరం అనయాగార్హపతయే చీయమానాం ఇష్టకాం బ్రహ్మా అనుమంత్రయేత్"
   
1.    నేను అన్నము, ధనము, సుబుద్ది, మిత్రభావము, స్నేహదృష్టి కలిగి ప్రసన్నమనమున గృహములకు చేరుచున్నాను. గృహములారా! యజమానినగు నాతో ఆటలాడండి. సుఖించండి. దేశాంతరము నుంచి వచ్చినానని బెదరకండి.
   
2.    మా గృహములు సుఖప్రదములు. అన్నవంతములు. క్షీరవంతములు. సమృద్దములు. దేశాంతరము నుండి వచ్చిన మమ్ము అని యజమానులనుగా గుర్తించును గాక.
   
3.    దేశాంతరమున మేము అనేక సత్పదార్దములున్న గృహమును తలచుచుందుము. మేము తిరిగి వచ్చినపుడు మమ్ము యజమానులుగా గుర్తించుమని గృహములను ప్రార్ధించుచున్నాను.
   
4.    గృహములారా! మీ అనుమతి అర్ధించుచున్నాము. మీరు భూరి ధనము, మిత్రరూప, మధుర పదార్ధములు కలవారలగుదురు గాక. ఆకలి, అసంతృప్తిలేని వారు కండి. "మాస్మద్ బిభీతన" మమ్ము చూచి బెదరకండి.
   
5.    ఈ ఇంట గోవులు ఉండును గాక. మేకలు ఉండును గాక. అన్నములు ఉండును గాక. సారవంతములు ఉండును గాక.
   
6.    గృహములారా! మీలో సత్యవాణి ప్రతిధ్వనించును గాక. శుభములు, సంపదలు కలిగి ఉండండి. అన్నవంతులు కండి. మీ యందున్న వారు సదా నవ్వుచుందురు గాక. గృహములు ఆకలి. కలవరము లేనివి అగును గాక. "మాస్మద్ బిభీతన"
   
7.    గృహములారా! మీరు ఇచటనే సుఖముగా ఉండండి. నావెంట రావద్దు. మీరు సకల పదార్ధములతో వర్ధిల్లండి. నేను ధనసహితుడనై వచ్చెదను. అప్పుడు మరల మా వారలు కండి.
   
                                              --౦౦౦--
   
1.    అగ్నిదేవా! నీకు సంబంధించి నిర్వహించవలసిన విధులను నీ వద్దనే నిర్వహించుచున్నాము. మాకు వేదము ప్రియమగును గాక. మంచిబుద్ది, దీర్ఘాయుష్యము కలుగును గాక. (8)
   
2.    అగ్నిదేవా! మేము తపము చేయుచున్నాము. ఆ తపము నీ ముందే చేయుచున్నాము. మా ఇంట వేదము వినిపించును గాక, మాకు సుబుద్ది, దీర్ఘాయువు కలుగును గాక. (9)
   
                                             --౦౦౦--
   
1.    ఈ అగ్ని సత్పాలకుడు. పెద్దవాడు. వర్షించువాడు. పురోహితుడు రథికుని వలె జయించువాడు. పృథివికి నాభివంటివాడు. పరమ దీప్తుడగు అగ్ని నాతో యుద్దము చేయగోరువారిని నా కాలికింద నలుపును గాక. (10)
   
                                     రెండవ సూక్తము - 16
   
వినియోగము :-

   
      1) ఆవసథ్యాధానమున యజమాని అరణిని మథించుటకు మొదటి ఋక్కుచే అగ్నిని ఆహ్వానించునది.
   
      2) దేహమున కాకాభిధాత దోష నివారణార్ధము 2, 3 ఋక్కులచే జలమును అభిమంత్రించి కాకోపహత దేహమును కడుగునది. కాకి కరచిన దోష నివారణార్ధము వీనిచే ఉల్ముకమును అభిమంత్రించి కాకి కరచిన చోట త్రిప్పునది.
   
      3) కాకి తాకిన దోష నివారణార్ధము 6వ మంత్రమును జపించునది. రోగశాంతి కొరకు 4 - 6  మంత్రములచే అపామార్గ సమిధలను ఉంచునది.
   
      4) వివాహమున వధువునకు స్నానము చేసిన తరువాత 5, 6 మంత్రములచే బట్టతో తుడుచునది.
   
      5) బృహద్గణములందు 7, 8 మంత్రముల పాఠము ఉన్నందున శాంతిజల అభిమంత్రణాదులందు వినియోగము. ప్రతిగ్రహ దోష నివారణార్ధము 8 వ మంత్రముచే ప్రతిగ్రహ వస్తువును  అభిమంత్రించి  తీసికొనునది. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు మరియు పాక యజ్ఞ తంత్రమున కర్మ సమాప్తి తరువాత న్యూనాతిరేక దోష నివారణార్ధము ఈ ఋక్కును జపించునది. గోదానము నందు ముండన చేయుటకు దీనిచే కత్తిని స్వచ్ఛము చేసి నాపకునకు ఇచ్చునది. సవ యజ్ఞమున దీనిచే ఇంద్రియములను అభిమర్సన,         అనుమంత్రణములు చేయునది. బ్రహ్మచారి దండము విరిగినంత దీనిచే రెండవ దండమును అభిమంత్రించి తీసికొనునది. "అగ్నిష్టోయే తృతీయ సవనే హోత్రాదిధిష్ణ్యేషు విహ్రుతాన్ అగ్నీన్ అనేన ఋచాబ్రహ్మా  అనుమంత్రయేత్"
   
      6) సారస్వత హోమమున 9, 10 ఋక్కులచే ఘ్రుతాహుతులిచ్చునది. చాతుర్మాస్యపు వైశ్వదేవ పర్వమున వీనిచే బ్రహ్మ అనుమంత్రించునది. అన్వారంభణీయేష్టియందు సారస్వత చరు యాగమును వీనిచే  అభిమంత్రించునది.
   
1.    అగ్ని యుద్దవిజేత. దేవతలకు హవి చేర్చువాడు స్వర్గవాసి. అతనిని ఉక్థములచే ఆహ్వానించుచున్నాము. అతడు మమ్ము అన్ని కష్టముల నుండి దాటించును గాక. అరిష్టములు కలిగించు పాపములను పూర్తిగా తొలగించును గాక.
   
                                            --౦౦౦--
   
1.    ఈ నల్లని పక్షి - కాకి - పైనుంచి లేక ముందు నుంచి వచ్చి నా అవయవములను బాధించినది. ఈ జలము - అందువలన కలిగిన సమస్త దురితములు, పాపముల నుండి - రక్షించును గాక. (2)
   
2.    ఈ కాకి మృత్యు ముఖము వంటి దాని ముక్కుతో నన్ను తాకినది. గార్హపత్యాగ్ని నన్ను ఆ పాపమునుండి విముక్తుని చేయును గాక. (3)
   
                                            --౦౦౦--
   
1.    అపామార్గ సమిధా! నీవు ఆద్యంతము ఫలములు ఇచ్చుదానవు అగుచున్నావు కావున నాయందు గల సకల దోషములను నివారించుము. (4)
   
2.    మాకు దుఃఖములు కలిగించు పాపములు చేసినాము. మలినమగు పాపము మాచే జరిగినది. దుర్భుద్దిచే పాపాలు చేసినాము. నాలుగు వైపుల శాఖలున్న అపామార్గమా! నీ ద్వారా వానిని అన్నింటిని దూరమునకు పారద్రోలుచున్నాము. (5)
   
3.    నలుపు పసుపు రంగు కలసిన దంతములు, వంకర గోళ్ళు గల నిర్వీర్యునితో సహవాసము చెఇ చేసిన పాపమును అపామార్గమా! నీ వలన పారద్రోలుచున్నాము. (6)
   
                                          --౦౦౦--
   
1.    అంతరిక్షమున ఎక్కువ గాలిగల చోట పంట చేలలో పశువుల మధ్య చదివిన వేదము పాఠకులకు మరల లభ్యమగును గాక. (7)
   
                                           --౦౦౦--
   
1.    నాకు మరల చక్షురాది ఇంద్రియములు కలుగును గాక. మరల ఆత్మ నాలో చేరును గాక. ధనము, వేదము నాలో చేరును గాక. హోత్రాది స్థానములందు విహరించు అగ్నులు మరల యథాస్థానములందు సమృద్దములు అగును గాక. (8)
   
                                            --౦౦౦--
   
1.    సరస్వతీ! నీకు సంబందించిన దివ్య వ్రతములు దివియందును, గృహములందును జరుగుచున్నవి. ఆహ్వానములు అందుకొని వానిని స్వీకరించుము. దేవీ! మాకు పుష్కల సంతానమును ప్రసాదించుము. (9)
   
2.    సరస్వతీ! నీ కొరకు ఘ్రుతపూరిత హవి హోమించబడుచున్నది. దానిని పితరులకు అందచేయుము. నీకు శుభప్రదమగు హవి అందించినందున మేము మధుర రసపూరిత అన్నవంతులము అగుదుము గాక. (10)
   
                                   మూడవ సూక్తము - 17
   

వినియోగము :-

   
      1) 1, 2 ఋక్కుల పాఠము బృహద్గుణములందు ఉన్నందున శాంతిజల అభిమంత్రణాదులందు వినియోగము.
   
      2) 3 - 7 మంత్రములచే అభిచార కర్మమున మధ్యమ పలాశము ద్వారా ఫలీకరణములకు  ఆహుతులిచ్చునది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.