Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                 

                                     అయిదవ అనువాకము
                                       మొదటి సూక్తము - 12
       

వినియోగము :-
   
      1) మొదటి మంత్రపు పాఠము బృహద్గణము లందున్నది. శాంత్యుదకాభి మంత్రణములందు దీని  వినియోగము.
   
      2) సంమానస్య కర్మమున 1, 2 ఋక్కులచే నీటికుండను గాని కల్లు కుండను గాని సంపాతన, అభిమంత్రణలు చేసి గ్రామ మధ్యమునకు తెచ్చునది. ఈ కర్మము నందే 'త్రిహాయణ్యా వత్సతర్యా
     శుక్త్యాని' మాంసములను సంపాతన అభిమంత్రణలు చేసి భుజించునది. అన్నము, సుర లేక ప్రపను వీనిచే సంపాతన అభిమంత్రణలు చేసి త్రాగునది.
   
      3) ఉపనయన కర్మయందు ఆచార్యుడు మాణవకుని నాభిని తాకి  3 - 8 మంత్రములను జపించునది.
       
      4) రాజ్యలక్ష్మి, బ్రహ్మతేజస్సు కోరువాడు బార్హస్పత్య శాంతి యందు మూడవ ఋక్కును చదువునది.
   
      5) పుష్టి కొరకు చేయబడు ఆగ్రహాణీయ కర్మమున అగ్ని వద్దనుండి ప్రాతః కాలము లేచునపుడు 9వ మంత్రముచే ఉత్ర్కమణ చేయునది.
   
      6) అధ్యాపకుల కొరకు ధనము కూర్చుట యందలి విఘ్నశాంతికి 10 వ మంత్రముచే  ఘ్రుతాహుతులిచ్చునది.
   
1.    స్వజనులు అనుకూలురు అగుదురు గాక. వ్యతిరేకులు అనుకూలురు అగుదురు గాక.
   
    అశ్వినులారా! మీరు మా విషయమున స్వ, పరులను అనుకూలురను చేయండి.
   
2.    మా మనసులు అన్యుల మనసులతో కలియును గాక. కలసి తెలిసి కుందుము గాక. కలసి పనిచేయుదము గాక. మనసులను చిందర చేయు ఘోషము లేకుండును గాత. ఇంద్రుని అశని మా మీద పడకుండును గాత.
   
                                             --౦౦౦--
   
1.    హవిస్సులు అందించు మహా మహా దేవతలను పోషించునట్టి అగ్నీ! నీవు యమునకు సంబంధించిన మరణ కారణము నుండి ఈ బాలుని రక్షించగలవు. నీ అనుగ్రహమున అశ్వినులు ఈ బాలుని మృత్యుకారణము నుండి తప్పించెదరు గాక. (3)
   
2.    బాలకా! ప్రాణములు నీ దేహమును విడువకుండును గాక. నీవు ప్రాణాపానములు కలవాడవు అగుదువు గాక. నూరు శరత్తులు జీవించి వర్ధిల్లును. అగ్ని నీ విషయమున పక్ష పాతియై రక్షించును గాత. (4)
   
3.    బాలకా! నీ జీవితము అంతర్హితమై మృత్యు ముఖమున పడనున్నపుడు నీకు మరల ప్రాణ, అపానములు కలుగును గాక. అగ్ని దేవత నిన్ను మృత్యువు నుంచి మరలించి తెచ్చును గాక. అగ్ని తెచ్చిన ఆయువును నీ యందు మరల స్థాపించుచున్నాను. (5)
   
4.    ప్రాణాపానములారా! బండిని లాగు ఎద్దులు గోష్టమున ప్రవేశించిన రీతి మీరు ఈ ఆయుష్కాముని దేహమున ప్రవేశించండి. ఇతడు వార్ధక్యము వరకు జీవించును గాక. ఇతడు మృత్యువాత పడక ఈ లోకమున ప్రసిద్దుడగును గాక. (6)
   
5.    ప్రాణాపానములు ఇతనిని విడిచి పోకుండును గాక. ఇతనిని సప్తర్షులకు వప్పగించుచున్నాను. వారు ఇతనికి వార్ధక్యము వరకు శుభములు కలిగింతురు గాక. (7)
   
6.    ఆయుష్మాన్! నీ ప్రాణములు తెచ్చుచున్నాము. వానికి ఆటంకమగు యక్ష్మరోగమును త్రిప్పిపంపుచున్నాము. వరణీయ అగ్ని దేవత నీకు నూరేళ్ళ ఆయుష్యము కలిగించును గాత. (8)
   
7.    మేము తిమిరములను అధిగమించి ఉత్తమ నాకమును అధిరోహించినాము. దేవతలందు ఉత్తమ జ్యోతి స్వరూపుడగు సూర్యుని చేరుచున్నాము. (9)
   
                                                 --౦౦౦--
   
1.    వేనితో కర్మలు చేయబడునో అట్టి ఋక్సామ వేదములను యజించుచున్నాము. అవి సదస్సులందు వెలుగొందుచున్నవి, యజ్ఞములను దేవతల వద్దకు చేర్చుచున్నవి. (10)
   
                                         రెండవ సూక్తము - 13
   
వినియోగము :-

   
      1) అధ్యాపకుల అర్దార్జన విఘ్న శాంతికి మొదటి మంత్రముచే ఘ్రుతాహుతు లిచ్చునది.
       
      2) మార్గమున శుభములు కలుగుటకు 2వ మంత్రము జపించుచు కుడిపాదము ఉంచి సాగునది. శుభములు కలుగుటకు అసంఖ్య ధూళి రేణువులు గడ్డి పరకలను దీనిచే అభిమంత్రించి ఇల్లు, పొలములో చల్లునది.
   
      3) తేలు, దోమ, చీమ, శర్కోట కాది విష చికిత్సకు 3 - 10 మంత్రములచే మధూకమును  అభిమంత్రించి త్రాగించునది. చేను మట్టి లేక పుట్టమట్టిని సజీవ జంతువు చర్మమున చుట్టి దీనిచే అభిమంత్రించి కట్టునది. మట్టిని మాత్రము అభిమంత్రించి నీటిలో కలిపి త్రాగించునది. నీటి పాత్రను గాని పసుపు కలిపిన నేతిని గాని సంపాతన అభిమంత్రణలు చేసి త్రాగించునది.
   
      4) ఉపాకర్మమున 7 వ మంత్రముచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
   
1.    ఋగ్వేదమును హవిస్సు గురించి, సామ వేదమును ఓజస్సు గురించి, యజుర్వేదమును బలమును గురించి అడిగినాను. అవి నన్ను బాధించకుండును గాక. ఇంద్రుడు అభిమత ఫలములు ప్రసాదించును గాక.
   
2.    ఇంద్రదేవా! ద్యులోకమునకు దిగువన ఉన్న దారులు నీవు ఏర్పరచినవే. ఆ దారులందే పనులకు ప్రేరణ లభించుచున్నది. విశ్వప్రేరణ సాధకములగు ఆ మార్గములందు మాకు సుఖములు కలిగించుము.
   
                                                --౦౦౦--
   
1.    తిరశ్చరాజ, కృష్ణ, పృదక, కంకపర్వమను పాముల విషమును మధూకమను ఓషధి నాశనము చేయును గాత. (3)
   
2.    ఈ ఓషధి మధుమయము. మధుర రస భరితము. మధుర నిష్యందము. 'మధు' వని పేరు గలది. ఇది కుటిల విషమునకు ఓషధి కుట్టు వానిని బాధించునది. (4)
   
3.    కాటు వేసిన చోటునుండి, త్రాగించిన చోటు నుండి విషమును దింపి వేయుచున్నాము. నీటితో, తోకతో, కాలితో కరచిన మశకాదుల విషమును నిర్వీర్యము చేయుచున్నాము. (5)
   
4.    పాము కాటునకు ఇతని అవయవములు ముడుచుకొనుచున్నవి. కీళ్ళు సడలు చున్నవి. ముఖము వంకర పోవుచున్నది. బ్రహ్మణస్పతీ! అట్టి వాణి విషమును దించి అవయవములను సరళము చేయుము. (6)
   
5.    విషహీనమై, నేల ముఖముతో ప్రాకునట్టి శర్కోటక విషమును, విషము గల శర్కోటకపు విషమును కూడ నాశము చేసినాము. (7)
   
6.    వృశ్చికమా! నీ బాహువులందు బలము లేదు. తలలో లేదు. మధ్యన లేదు. ఇతరులకు బాధ కలిగించు ఆలోప విషమును తోకలో పెట్టుకొని ఏల తిరుగుచున్నావు? (8)
   
7.    సర్పమా! నిన్ను చీమలు తినుచున్నవి. నెమళ్ళు తెగ నరకుచున్నవి. విష నివారక సకల ఓషధులారా! శర్కోటక విషమును నిర్వీర్యము చేయండి. (9)
   
8.    వృశ్చికమా! నీవు తోకతోను, నోటితోను కొట్టుచున్నావు. ఈ రెంటిలో నోట విషము లేదు. తోకలోనే స్వల్ప విషము ఉండవచ్చును!
   
                                              మూడవ సూక్తము - 14
   

వినియోగము :-

   
      1) యాచకుల అభిలషితార్ద సిద్ది కొరకు 1 - 2 మంత్రములచే తల్లి రూపపు దూడగల ఆవు పాల పాయసమును సంపాతన అభిమంత్రణలు చేసి భుజించునది.
   
      2) 3, 4 మంత్రములచే ఉక్ధ్యక్రతువు నందు మైత్రావరుణ యాజ్యహోమమును అనుమంత్రించునది.
   
      3) 5వ ఋక్కుచే అభిచార కర్మమున పిడుగు పడిన వృక్షపు సమిధను ఉంచునది.
   
1.    దాతల ఈసడింపులచే నా మనసు వ్యాకుల మగుచున్నది. అడిగినది లభించక బాధపడుచున్నాను. సరస్వతీ దేవి నాయందు చేరి శక్తి ప్రసాదించును గాక. సరస్వతి నాజిహ్వను ఘ్రుతము వంటి దానితో నింపును గాక.
   
2.    మరుత్తులకు పుత్ర రూపలగు సప్తనదులు ప్రవహించుచున్నవి. తండ్రుల వంటి దేవతలకు పుత్రుల వంటి మనుష్యులు యజ్ఞములందు హవిస్పులు అర్పించుచున్నారు. ఉభయులు పరస్పర కళ్యాణము కొరకు పాటుబడుచున్నారు. ఉభయులు పుష్టి కొరకు యత్రించుచున్నారు.
   
                                            --౦౦౦--
   
1.    ఇంద్రావరుణులారా! మీరు అభిషుత సోమపాన ప్రియులు. ఈ అభిషుత సోమమును సేవించండి. సంత్రుప్తులు కండి. మీ అపరాజిత రథము మీకు సోమము అందించు యజమాని గృహమును చేరును గాక. (3)
   
2.    ఇంద్రావరుణులారా! మీరు అభిషుత ఫలమును వర్షించువారు. మధుమత్తమము, వర్షము కలిగించు సోమభాగమును సేవించండి. ఇచట గ్రహ చమసాదులందు సోమము సిద్దముగా ఉన్నది. దర్భాసనముల మీద ఆసీనులై పానము చేయండి. (4)
   
                                                       --౦౦౦--
   
1.    మేము నిందించకున్నను మమ్ము దూషించి బెదిరించునట్టియు, కఠోర వాక్యములచే మమ్ము ఆడిపోసు కొనువారు పిడుగు పడిన చెట్టువలె సమూలముగ నాశనమగుదురు గాక. (5)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.