Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
2. సూర్యుడు ద్రష్ట నృచక్షువు దివ్యుడు. సుపర్ణుడు. సహస్రకిరణుడు. శత పదార్ధముల మూలము - "శతయోని" అన్నపతి. అతడు మమ్ము చిరకాలము నిలుపును గాక. పోయిన మా పదార్ధములు పితరులకు 'స్వధ' యగును గాక. (5)
--౦౦౦--
1. సోమ రుద్రులారా! విషూచి, అమీవ వ్యాధులను అంతమొందించండి. మా ఇంట అన్నివైపుల వ్యాపించిన అమీవను నష్ట పరచండి. రోగపిశాచిని దూరమునకు గుంజుకొని పోయి వధించండి. మా పాపములను తొలగించండి. (6)
2. సోమ రుద్రులారా! మా దేహమునందలి వ్యాధులను నివారించుటకు భేషజములను స్థాపించండి. మా దేహమందు గల మేము చేసిన పాపములను తొలగించి వానిని ధ్వంసము చేయండి. (7)
--౦౦౦--
1. విద్వాంసునకు నిందాస్తుతులు సమానములు అగుచున్నవి. వాక్కు యొక్క మూడు భాగములు లోన ఉండగా ఒక భాగమే వ్యక్త మగుచున్నది. (8)
(వాక్కు 1. పరా 2. పశ్యంతి 3. మధ్యమ 4. వైఖరి దశలు కలది.)
--౦౦౦--
1. ఇంద్ర, విష్ణువులారా! మీరు ఎవరి చేతను ఓడలేదు. మీరిద్దరూ కూడ ఒకరికి ఒకరు ఓడలేదు. మీరు వేణి కొరకు అసురులతో స్పర్ధించుచున్నారో ఆ మూడు - జగములు, వేదములు, వాణి - మీ అధీనమునందున్నవి. (9)
2. జనపదము నుండి, విశ్వజనీనత నుండి, సముద్రము నుండి, పైనుండి, దూరము నుండి ఈర్ష్యకు మందు తెచ్చినాను. అది అమృతమై, ఈర్ష్యను తొలగించునని నేను ఎరుంగుదును.
రెండవ సూక్తము - 10
వినియోగము :-
1) ఈర్ష్యా నాశకర్మయందు కాల్చిన గొడ్డలిని, చల్లార్చిన నీటిని మొదటి మంత్రముచే అభిమంత్రించి ఈర్ష్యాళువునకు త్రాగించునది.
2) సర్వవ్యాధి చికిత్సకు ముంజి పాశములను రోగి కీళ్ళకు కట్టి 2 - 10 మంత్రములచే శరపింజూల సహిత ఉదక కుంభమును సంపాతన, అభిమంత్రణలు చేసి రోగికి స్నానము చేయించునది లేదా రోగి మీద చల్లునది. సర్వ సంపత్కామి వీనిచే "యథాలింగం" సినీవాలి, కుహు, రాకా, దేవపత్ని అను నలుగురు దేవతలను యజించునది లేదా ఉపస్థానము చేయునది. దర్శయాగమున వీనిచే సినీవాలి దేవతను పరిగ్రహించునది.
3) దర్శయాగమున 5 -6 ఋక్కులచే 'కుహు' దేవతను పరిగ్రహించునది.
4) పూర్ణమాస యాగమున 7- 8 ఋక్కులచే రాకా దేవిని పరిగ్రహించునది.
5) దర్శపూర్ణమాసపు పత్నీ సంయాజములందు 9 -10 మంత్రములచే దేవపత్నీ యాగమును అనుమంత్రించునది.
1. ఈర్ష్యానివారక దేవతా! ఈర్ష్యాళువు అగ్గివంటి వాడై నా పనులను బూడిద చేయుచున్నాడు. దావాగ్ని వలె నా యొక్క విశేష కార్యములను భస్మము చేయుచున్నాడు. జలము అగ్నిని వలె అతనిని శాంత పరచుము.
--౦౦౦--
1. సినీవాలీ! నీవు పృథుజఘనవు. దేవతలకు తోబుట్టువవు. మా ఆహుతులు స్వీకరించుము. మాకు సంతానాదులను ప్రసాదించుము. (2)
(కృష్ణ చతుర్ధశితో కూడిన అమావాస్య 'సినీవాలి' అగుచున్నది. 'యా పూర్వా2మావాస్యాసా సినీవాలీ' అని ఐతరేయము.)
2. సినీవాలి సుబాహు. సుఅంగుళి. సుషమ. ప్రజాపాలిక. ఆమెకు హవిస్సులు ఆహుతులు ఇవ్వండి. (3)
3. సినీవాలి ప్రజాపాలిక. పరమైశ్వర్య సంపన్న ఆమె ఇంద్రుని ముందునకు వెళ్ళునది. ఇంద్రుని పూజించునది. వేల మందిచే స్తుతించబడునది.
దేవపత్నీ! హవిస్సులు అర్పించినాము. తృప్తి చెందుము. నీ పతిదేవుడు మాకు ధనము ప్రసాదించునట్లు చేయుము. (4)
--౦౦౦--
1. కుహూదేవి సుకృత సర్వజ్ఞ ఎన్నో ఆహ్వానములు గలది. నేను ఆమెను ఆహ్వానించుచున్నాను. ఆమె నాకు సర్వ వరణీయ ధనమును, ధనవంతులు, కీర్తివంతులగు పుత్రులను ప్రసాదించును గాక. (5)
("నష్టచన్ద్రా అమావాస్య కుహుః" అని సాయణుడు చంద్రుడు లేని అమావాస్య అని అర్ధము. యోత్తరా అమావాస్య సాకుహుః అని గోపథ ఉత్తరము.)
2. కుహూదేవి దేవతలందు అమృతమయి. ఆమె నా హవిస్సులను ఆరగించును గాక. యజ్ఞము నందలి మా ఆహ్వానములను ఆలకించును గాక. మమ్ము ధనద్రవ్యములచే సంపన్నులను చేయును గాక. (6)
--౦౦౦--
1. రాకాదేవి సుందర ఆహ్వానములు గలది. ఆమెను సుందర స్తుతులచే ఆహ్వానించుచున్నాను. ఆమె మా ఆహ్వానములను ఆలకించి, మా కోరికలు తెలిసికొని - సూదితో కుట్టిన బట్ట గట్టి పడినట్లు మాకు ధనవంతులు, వీరులగు పుత్రులను ప్రసాదించి వంశమును స్థిరపరచును గాక. (7)
("సంపూర్ణచంద్రా పౌర్ణమాసీ రాకా" అని సాయణాచార్యులు. నిండుపున్నమి అని అర్ధము.)
2. రాకాదేవీ! నీవి సుమతులు. సుందర రూపములు. నీవు వానిచే యజమానులకు సంపదలు ప్రసాదించుచున్నావు. నీవు అట్టి మంచి మనసుతో మా వద్దకు విచ్చేయుము. మాకు సహస్రాది ధనములచే పుష్టి కలిగించుము. (8)
--o౦౦--
1. దేవ పత్నులు మమ్ము కాపాడుటకు వచ్చెదరు గాక. మాకు అన్నప్రాప్తి కలిగించుచు, మమ్ము అనుగ్రహించుచు విచ్చేయుదురు గాక. భూమి మీద ఉన్నవారును, జలములందు ఉన్నవరుణు అగు దేవేరులు మా పిలుపును ఆలకించి మాకు సుఖశాంతులు ప్రసాదింతురు గాక. (9)
2. దేవపత్నులు మమ్ము రక్షింతురు గాక. ఇంద్రాణి, అగ్నాని, వరుణాని, అశ్వినుల వెలుగొందు పత్నులు మా ఆహ్వానములను విని - ఋతువులను అనుసరించి - హవిస్సులు ఆరగింతురు గాక. (10)
మూడవ సూక్తము - 11
వినియోగము :-
1) ద్యూత కర్మమందు స్థలశుద్ది, అక్షాధివాసములు చేసి 1 - 9 ఋక్కులచే పాచికలను అభిమంత్రించి జూదమాడునది.
2) సర్వ ఫలకామి 10వ మంత్రముచే బృహస్పతిని యజించునది లేదా ఉపస్థానము చేయునది. ఉక్ధ్య ఋతువున బ్రాహ్మణాచ్చంసి యొక్క యాజ్యహోమమున 'బ్రహ్మ' దీనిచే అనుమంత్రించునది. గ్రహ యజ్ఞమున బృహస్పతి కొరకు ఘ్రుత, హవి, హోమ సమిధలను ఉంచునది. రాజ్యము, బ్రహ్మవర్చస్సు కోరువాడు మహా శాంతి యందు దీనిని చదువునది.
1. అశని అప్రతిహతముగ ఎట్లు వృక్షములను కూల్చుచున్నదో అట్లే నేను నేడు ఎదురు లేని వాడనై నాతో జూదమాడు వానిని పాచికలతో వేధించుచున్నాను.
2. జూదమందు ఆతురులలో, అనాతురులలో నేనే ముఖ్యుడను. కితవులను ఓడించుటలో నేనే ప్రథముడను. విశ్వమందలి సంపదలన్ని నా యందు చేరును గాక. గెలుపు పాచిక నా చేత ఉండును గాక.
3. స్వావసువను అగ్నిని నమస్సులతో ఆరాధించుచున్నాను. అగ్ని దేవత నాకు 'కృతం అను గెలుపు పాచికను నా చేత ఉంచును గాక. అప్పుడు రథము మీద పదార్దములు తెచ్చినట్లు శత్రువును ఓడించి వాణి సమస్త ధనమును తేగలను.
4. రుద్రదేవా! నీ సాయమున నేను ప్రతిపక్షిని ఓడించగలుగుచున్నాను. ప్రతిపక్షి వద్ద గల విజయాంశమును ధ్వంసము చేయుము. ధనము మా వద్దకు సుగమముగ చేరునట్లు చేయుము.
ఇంద్రదేవా! నీవు శత్రువుల విజయమును నివారించుము.
5. కితవా! లెక్కలందును, పందెమునను నిన్ను గెలువగలను. తోడేలు గొర్రెను పట్టి నలిపినట్లు నీ 'కృత' మను గెలుపు పాచికను నలిపి వేయుదును.
6. మొనగాడగు ఆటకాడు గెలుపు పాచిక యగు 'కృత' మును మాత్రమే లక్షించి ప్రతిపక్షిని గెలుచుచున్నాడు. అతడు గెలిచినా ద్రవ్యమును సత్కార్యములకు వినియోగించుచున్నాడు.
7. ఇంద్రదేవా! దుర్గతి గల దారిద్ర్యము వలన కలిగిన దుర్భుద్దిని పశువుల ద్వారా దాటుదుము గాక. ధాన్యాదులతో ఆకలిని జయింతుము గాక. రాజుల వద్దనున్న శ్రేష్ఠధనమును - మేము ప్రతికితావులచే ఓడకుండ - పాచికలచే గెలితుము గాక.
8. నా కుడిచేత 'కృత' మను గెలుపు పాచిక, ఎడమచేత విజయాక్షము ఉన్నవి. వీనిచే శత్రువు గోవులను, అశ్వములను, ధనమును, హిరణ్యమును గెలుచుచున్నాను.
9. అక్షములు పాలిచ్చు గోవుల వలె ఫలవంతములు అగును గాక. ధనుస్సునకు బిగించిన నారి విజయ కారణమైనట్లు 'కృత' అను అక్షము నాకు విజయము కలిగించును గాత.
10. బృహస్పతి మమ్ము పడమట, పైన, క్రింద, హింసకుల నుండి రక్షించును గాక. ఇంద్రుడు తూర్పున, మధ్య దిశన మమ్ము రక్షించును గాత, మిత్రుడగు ఇంద్రుడు స్తోతలమగు మాకు భూరి ధనము లిచ్చును గాత. (10)





