Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
2. సోమ దేవత పూజింపబడిన దేశమున నిత్యము శుభములు కలుగును. అచట గ్రీష్మము బాధించదు. హేమంతము వడికించదు. నేల జీవనప్రదయై వర్ధిల్లును. నీరు ఘ్రుతము వంటిదై వర్షించును.
--౦౦౦--
1. ప్రజాపతి ప్రజలను సృష్టించును గాత. ధాత సుమనస్కుడై బలము ప్రసాదించును గాత. ప్రజలు ఏకమనస్కులై, ఏక కార్య రతులై ఉందురు గాత. అందుకు పుష్టిపతి దేవత నాకు శక్తి నిచ్చును గాత. (3)
2. పౌర్ణమాస అభిమాన దేవత మా యజ్ఞమును పూజనీయ దేవతలకు తెలియపరచును గాత. అగ్ని యందు హవి అర్పించునట్టి వాడనగు నా హవిస్సులను దేవతలకు చేర్చును గాక. (4)
3. అనుమతి దేవీ! మాకు అనుమతి నిమ్ము. శుభములను, సుఖములను ఇమ్ము అగ్నికి అర్పించిన హవిస్సులు అందుకొనుము. మాకు పుత్ర, పౌత్రాదులను ప్రసాదించుము. (5)
4. అనుమతి దేవతా! మాకు పుత్రాదులతో కూడిన అక్షయ ధనము ప్రసాదించుము. మేము ఇతని కోపమున పడకుందుము గాక. ఈ దేవత యొక్క సుఖప్రద అనుగ్రహ బుద్ది యందు నిరుతుము గాక. (6)
5. నిన్ను ఆహ్వానించు వరాల కోరికలు తీర్చి అభిమత ఫలములు ఇచ్చుట వలన నీ పేరు అనుమతి దేవత అయినది. ఆ పేరుతోనే మా యజ్ఞమును పరిపూర్ణము చేయుము. మాకు మంగళకర ద్రవ్యమును ప్రసాదించుము. (7)
6. అనుమతి దేవి మా యజ్ఞమునకు విచ్చేయును గాక. మాకు సుక్షేత్ర పుత్రులను - కోరిన ఫలములను ఇచ్చును గాక. అగ్న్యాదులను రక్షించు అనుమతి ఈ యజ్ఞమును రక్షించును గాత. (8)
7. ఈ సర్వము అనుమతియే అయినది. స్థావర, జంగమములు, బుద్దిజీవులు అనుమతియే అయ్యున్నారు. అట్టి అనుమతి సుబుద్ది యందు మేము ఉందుము గాక. అనుమతి దేవీ! నీవు మమ్ము ఆమోదించుము. (9)
1. బంధువులారా! సూర్యుడు ద్యులోక స్వామి. అతనిని కీర్తించండి. సూర్యుడు సకల ప్రాణులకు స్వామి. అతిథి సముడు. పూజనీయుడు. ప్రాచీనుడగు సూర్యుడు ఈ నవీనుని తనవానిగా భావించి అనుగ్రహించును గాక. ఒకే సూర్యుని నుండి అనేక సన్మార్గములు వెలువడునవి. (10)
--౦౦౦--
1. సూర్యుడు మాకు వేల సంవత్సరములు దర్శనమిచ్చును గాక. అతడు విద్వాంసులకు పూజనీయుడు. జ్యోతిర్మయుడు. నిత్యము ఉదయించుచున్నాడు. (11)
2. ఉషస్సులు పాప హారిణులు. జ్ఞానవంతలు. ఉదయము ప్రకాశించునవి. అవి సూర్య కిరణములకు ప్రేరణ కలిగించును గాక. (12)
--౦౦౦--
1. దుస్స్వప్నమును, దుర్జీవనమును, రాక్షస, అభిచార భయమును, అసమృద్దిని, పాప లక్షణములను, దుర్నామా పిశాచములను, దుర్వాచనులను, మా నుండి దూరము చేయుచున్నాము.
మూడవ అనువాకము
మొదటి సూక్తము - 6
వినియోగము :-
1) మొదటి ఋక్కుచే మంత్రోక్త ఇంద్రాది నవ దేవతలను యజించునది లేదా ఉపస్థానము చేయునది.
2) 2, 3 మంత్రములచే విష్ణువు, వరుణ దేవుని యజించునది. లేక ఉపస్థానము చేయునది.
3) 4వ మంత్రముచే సర్వసంపత్కామి విష్ణువును యజించునది లేక ఉపస్థానము చేయునది. వైష్ణవీ మహాశాంతి యందు దీనిని చదువునది. దీనిచే వైష్ణవ హవి అభిమర్సన చేయునది. సోమయాగపు ఔపవస్థ్య దినమున హవిర్దానమందు ఉపన్తభ్యమాన ఉపస్తంభాన సమిధను దీనిచే అభిమంత్రించునది.
4) సోమ యాగమున 6వ మంత్రముచే సోమ క్రయణమునకు సాగునది.
పశుయాగమున ప్రథమమున చేయు ఇష్టి యందు 6వ మంత్రముచే వైష్ణవ హోమమును బ్రహ్మ అనుమంత్రించునది. అద్భుత శాంతియందు ఈ మంత్రముచే విష్ణువును యజించునది లేక ఉపస్థానము చేయునది.
5) 7వ మంత్రముచే దర్శపూర్ణ మాసపు ప్రణీత, ప్రణయనాది హవిష్క్రుదు ద్వానసమునకు ముందు అభివదన ప్రాయశ్చిత్తమునకు జపించునది. సోమయాగమందు ఉత్తర వేది యొక్క అగ్ని ప్రణయనానంతరము దక్షి హవిర్దానపు వర్త్మహోమమున బ్రహ్మ దీనిచే అనుమంత్రించునది. తృతీయ సవనమున సోమయాగము తదుపరి దీనిచే చమసములను నీటిలో వేయునది. త్వాష్ట్రి శాంతి యందు త్రివ్రుణ్మణి కట్టునది.
6) సోమయాగమున పూర్వము చెప్పిన కర్మయందు 8 వ మంత్రముచే ఉత్తరహవిర్దానపు వర్త్మనహోమమున బ్రహ్మ అనుమంత్రించునది.
7) పశుతంత్రమున అవటమున స్థాపించిన యూపమును 8,9 మంత్రములచే బ్రహ్మ అనుమంత్రించునది అగ్నిచయనమున కర్మాభ్యంజనానంతరము వీనిచే రోలు, రోకలిని అనుమంత్రించునది.
1. ఇంద్రుడు, అగ్ని, విశ్వేదేవతలు, మరుత్తులు మాకు ఏ ఫలములు ప్రసాదించినారో అట్టి ఫలములను సూర్యుడు, సత్యధర్మ, ప్రజాపతి, అనుమతి దేవి మాకు అందింతురు గాక.
--౦౦౦--
1. విష్ణువు, వరుణుడు తమ బలమున పృథివ్యాధి లోకములను స్థిరపరచినారు. వారు శత్రుంజయులై వీరులైనారు. వారు అజేయులై సంపదలు సాధించినారు. సర్వవ్యాప్త విష్ణువు, అనర్ధనివారక వరుణుడు, పూర్వ ఆహ్వానములు కలవారలైనను ఈ యజ్ఞమును హవియుక్తము చేయుదురు గాక. (2)
2. విష్ణువు, వరుణుని ఆజ్ఞవలననే విశ్వము విరాజిల్లుచున్నది. కర్మఫలములు కలుగుచున్నవి. వారి శక్తి చేతనే లోకములు ప్రవర్తిల్లినవి. ప్రవర్తిల్లుచున్నవి. ప్రవర్తిల్లనున్నవి. అట్టి వారిని హోత ఆహ్వానించి, హవిస్సులు అర్పించును గాక. (3)
--౦౦౦--
1. విష్ణువు సర్వ వ్యాపకుడు. అతని దివ్య కృత్యములను వినిపించుచున్నాను :-
విష్ణువే పృథివి, అంతరిక్షము, స్వర్గములను నిర్మించినాడు. మహా కీర్తిశాలియైన విష్ణువు స్వర్గమును ధరించినాడు. అతడు వీనిని తన మూడు పాదములచే రచించినాడు. (4)
2. అట్టి శక్తి శాలి యగు విష్ణువును స్తుతించుచున్నాము. సింహము భూమిపై సంచరించుచునే పర్వతము మీదకు లంఘించును. అట్లే విష్ణువు ఎంత దూరమున ఉన్నను విచ్చేయును గాక. (5)
3. సకల విశ్వము మీద విష్ణువు యొక్క మూడు పాదములు ఉన్నవి. విష్ణువా! విక్రమించుము. మాకు అక్షయములగు ధనములను, నివాసములను కల్పించుము. ఈ యజ్ఞము నందలి ఘ్రుతమును స్వీకరించుము. ఈ యజమానిని వర్ధిల్లచేయుము. (6)
4. ఈ విష్ణువు విక్రమించి లోకముల మీద మూడు పాదములు ఉంచినాడు. ఈ లోకములు అతని పాదరేణువులచే నిండి ఉన్నవి. (7)
5. విష్ణువు ఇతరులకు లొంగనివాడు. రక్షకుడు. అతడు ముల్లోకముల మీద మూడు పాదములుంచి వానిని పోషించుచున్నాడు. (8)
6. స్తోతలారా! సర్వవ్యాపక విష్ణుదేవుని మహిమలు చూడండి. అతడు మిమ్ములను కర్మలకు కట్టి వేయుచున్నాడు. అతడు ఇంద్రునకు యోగ్యుడగు మిత్రుడు అగుచున్నాడు. (9)
రెండవ సూక్తము - 7
వినియోగము :-
1) మొదటి రెండు మంతర్ములు సర్వసంపత్కామ కర్మయందు వినియోగము.
2) దర్శపూర్ణ మాసమున 4వ మంత్రముచే వేదవిముంచన చేయునది. ప్రాయణీయేష్టి యందు దీనిచే స్వస్తియాగ అనుమంత్రణము చేయునది.
3) 5, 6 మంత్రములచే సర్వవ్యాధి నివారణకు రోగి కీళ్ళకు ముంజపాశములు కట్టి శరపింజూలములతో నీటి కుండను సంపాతన, అభిమంత్రణలు చేసి రోగికి స్నానము చేయించునది - లేదా చల్లునది. సర్వసంపత్కామి వీనిచే విష్ణువును యజించునది లేదా ఉపస్థానము చేయునది.
4) 7వ ఋక్కుచే కాటుకను మంత్రించి గోదానమందు బ్రహ్మచారి కాళ్ళకు పెట్టునది. యూపమును దీనిచే అభిమంత్రించునది.
5) 8వ మంత్రముచే అభిచార కర్మమున పిడుగు పడిన చెట్టు యొక్క సమిధను పెట్టునది.
6) ఉపనయనమున ఆయువు ఆశించు బాలకుని తలను 9వ మంత్రముచే అనుమంత్రించునది.
7) బలము కోరువాడు జనులు వాడు జలమున మిశ్రధాన్యము వేసి 10వ మంత్రముచే సంపాతన అభిమంత్రణలు చేసి భుజించునది. 'తథా అగ్ని కార్యే అనయామాణవకో2గ్నిం పర్యుక్షేత్". అగ్ని చయనమందు అభిషిచ్యమాన యజమానిచే బ్రహ్మ దీనిని చెప్పించునది.
1. విష్ణువు యొక్క పరమపదము ఆకాశమునందలి సూర్యుని వలె విద్వాంసుడు సర్వవేళల దర్శించుచున్నారు.
2. విష్ణుదేవా! దివి, పృథివి, అంతరిక్షములందు గల సంపదలను కుడి, ఎడమ చేతులతో అందుకొని మాకు ప్రసాదించుము. (2)
--౦౦౦--





