Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
2. పూష సమస్త దిశలు తెలిసినవాడు. అతడు మమ్ము నిర్భయ మార్గమున నడిపించును గాక. పూషా దేవత క్షేమంకరుడు. శుభప్రదుడు. దీప్తుడు. వ్యాప్తుడు. పుత్రాది వీరయుక్తుడు. అతడు మా అభిలాషలను ఎరుంగుచు మా ముందు నడచును గాక. (8)
3. పూషదేవా! మేము ఎన్నటికిని నీ వ్రతమును విడువకుందుము గాక. నిన్ను స్తుతించుచున్నందున మాకు హాని కలుగకుండును గాక. (9)
4. పూషదేవా! అతి దూరమున ఉన్న ధనమును సహితము అందించుటకు నీ కుడిచేతిని చాచుము. మేము కోల్పోయిన ధనము మాకు అందునుగాక. అంతే కాదు. అది మమ్ము చేరి వర్ధిల్లును గాక. (10)
మూడవ సూక్తము
వినియోగము :-
1) మొదటి మంత్రముచే 'జంభీగృహీత' బాలకుని చికిత్స కొరకు స్తనమును అభిమంత్రించి బాలకునకు త్రాగించునది. 'ప్రియంగుత' తండులముల మీద దీనిచే అభిమంత్రించి త్రాగించునది.
2) రెండవ మంత్రముచే అశని నివారణ కర్మమున ఆశనిని ఉపస్థానము చేయునది. గ్రహ యజ్ఞమున దీనిచే ఘ్రుతహోమ, సమిధాదాన, ఉపస్థానములు కేతువు కొరకు చేయునది. ఉపాకర్మయందు దీనిచే ఆహుతులిచ్చునది.
3) 3 - 6 మంత్రములచే సభాజయము కొరకు క్షీరోదన పురోడాశము లేదా రసములను సంపాతిత, అభిమంత్రితములు చేసి భుజించునది. వీనిని చదువుచు సభాస్తంభమును పట్టుకొనునది. వీనితోనే సభలో కూర్చుండునది.
4) కృత్య ప్రతిహరణమున కృత్యానిస్సారణానంతరము 7వ మంత్రమును జపించుచు ప్రదక్షిణ చేయునది.
5) అభిచార కర్మమున శత్రువును చూచుచు 7వ మంత్రమును జపించునది. ఆ కర్మమునందే 8వ మంత్రము జపించి శత్రువును చూచునది.
6) నైర్రుతి కర్మమున నిర్రుతి ప్రతికృతిని విసర్జించిన తదుపరి 7వ మంత్రము జపించుచు ఇంటికి వెళ్ళునది.
1. సరస్వతీ దేవీ! నీ స్తనము బాలకులకు పుష్టి నిచ్చునది. సుఖప్రదము. అభిలషణీయము. ధనప్రదము. తల్లీ! నీవు ఆ స్తనముతోనే స్తోతలకు ధనపుష్టి కలిగించుచున్నావు. నీ స్తనమును ఈ బాలునకు కుడిపింపుము.
--౦౦౦--
1. పర్జన్య దేవా! నీ యొక్క ఉరుముతో కూడిన పిడుగు కేతువై సకల విశ్వమున వ్యాపించుచున్నది. దానితో మమ్ము వధించకుము. నీ విద్యుత్తుతో పంటలను నష్టపరచకుము. సూర్య రశ్మిచే పంటలను కాల్చకుము. (2)
--౦౦౦--
1. విద్వత్సభయు యజ్ఞ లేక యుద్దసభయు ప్రజాపతికి దుహితలు అయ్యున్నవి. అవి నన్ను రక్షించును గాక. నన్ను ఎదిరించు వానిని ఓడించు మాటలు నానోట నుండి వెలువడును గాక.
పితరులారా! నన్ను ఎదిరించు వానికి తగు రీతి సమాధాన మిచ్చునట్లు నన్ను అనుగ్రహించండి. (3)
2. సభా! నీ పేరు నాకు తెలియును. నీ పేరు "నిరష్ట" నీ యందున్న విద్వాంసులందరు నా మాటను ఆమోదింతురు గాక. (4)
(ఒక్కని మాటను లెక్క చేయక పోవచ్చును. అనేకుల మాట అనుల్లంఘనీయమగుచున్నది. అందువలన సభకు 'నిరష్ట' అని పేరు కలిగినదని సాయణాచార్యుని వ్యాఖ్య.)
3. ఈ సభలో నా ఎదుట నాతో వాదించుటకు ఆసీనులైన వారి వర్చస్సును, విజ్ఞానమును నేను లాగుకొనుచున్నాను.
ఇంద్రదేవా! ఈ సభయందున్న సదస్యులందరను నేను జయించునట్లు చేయుము. (5)
4. సభాసదులారా! మీ మనసులు అన్యత్ర ఉన్నను, మీ బుద్దిమాకు వ్యతిరిక్తమైనను వానిని అభిముఖము చేయుచున్నాము. మా వైపునకు త్రిప్పిన మనసు మా వాదనను ఆనందించును గాత - "మయి వో రమతాం మనః" (6)
--౦౦౦--
1. సూర్యుడు ఉదయించి నక్షత్రముల తేజస్సును హరించుచున్నాడు. అదే విధముగా నన్ను ద్వేషించు స్త్రీ పురుషుల వర్చస్సును హరించుచున్నాను. (7)
--౦౦౦--
1. సూర్యుడు ఉదయించి నిద్రించు వారి వర్చస్సును హరించిన రీతి మేము మమ్ము ద్వేషించువారల, మా ప్రతిపక్షుల వర్చస్సును హరించుచున్నాము.
రెండవ అనువాకము
మొదటి సూక్తము - 4
వినియోగము :-
1) 1 - 4 ఋక్కులచే సూత్రోక్త స్థానమునకు చేరి పూర్ణకుంభమును సంపాతించి సోమముతో కలిపి తల్లి వంటి దూడగల ఆవు పాల అన్నమును సంపాతన అభిమంత్రణలు చేసి పుష్టిని కోరువాడు భుజించునది.
2) 5వ మంత్రముచే ఒక ఈత ఆవును కట్టిన త్రాటితో మణిని చేసి సంపాతన, అభిమంత్రణలు చేసి పుష్టి కోరువాడు కట్టుకొనునది.
3) 6వ మంత్రముచే సూర్యోదయము తరువాత కూడ నిద్రించు బ్రహ్మచారిని లేపునది. ఆధానపు సంభార స్పర్శ దివసమున యజమానిని దీనితో లేపునది.
4) 7 - 10 ఋక్కులచే ధాత యజనము లేక ఉపస్థానము చేయునది. వీరపుత్రుడు కలుగుటకు వీనిచే గర్భిణి గర్భమును అభిమంత్రించునది.
1. సవితా దేవత ద్యావా పృథ్వుల మధ్యనున్న వాడు. కమనీయ కర్మముల వాడు. సత్యప్రేరకుడు. రమణీయ ధనములు కలవాడు. సర్వప్రియుడు. అట్టి దేవతను ప్రార్దించుచున్నాము.
2. సవితా దేవత కిరణములు విశ్వ వ్యాప్తములు. లోకములకు వెలుగు ప్రసాదించునని. అతని అనుజ్ఞతోనే హిరణ్యప్రాణి స్వర్గప్రదమగు సోమమును సిద్దము చేయుచున్నాడు. అట్టి దేవతను ప్రార్ధించుచున్నాము.
3. సవితా! పాలకుడగు ఈ యజమానికి ఫలము ప్రసాదించుము. పుష్టి కోరువానికి పుత్ర, పౌత్రులను ప్రసాదించుము. మాకు నిత్యము కోరిన వరములను, పశువులను ప్రసాదించుము.
4. దాతయగు సవిత మాకు రత్నాదులు ప్రసాదించును గాక. పితరుల ఆయుష్యము కలిగించును గాక. అతడు సోమము సేవించి ఆనందించును గాక. సోమము సవితా దేవత ఉదరమున నిలుచును గాత.
--౦౦౦--
1. బృహస్పతి, సవితా దేవతలారా! ఇతనిని వర్ధిల్లచేయండి. మహా సౌభాగ్యములు కలిగించండి. ఇతడు వ్రతపాలకుడగును. అయినను మరింత వ్రతపాలకుని చేయండి. సకల దేవతలు ఇతని వ్రతములను ఆమోదింతురుగాక. (5)
1. సర్వప్రేరక సవితా దేవా! నీవు మహా బుద్ది ప్రదాతవు. సహస్రరూపముల అట్టి బుద్దిని కణ్వ మహర్షి తన సౌభాగ్యము కొరకు సాధించినాడు. అట్టి సత్యనిష్టము, చయన యోగ్యము, వరణీయము, శుభప్రదమగు బుద్దిని ప్రసాదించుమని ప్రార్ధించుచున్నాను. (6)
2. ధాత ఈశానుడు - జగతస్పతి. అతడు మాకు పరిపూర్ణ ధనమును ఇచ్చును గాక. (7)
3. ధాత యజమానికి జీవనదాయిని యగు అక్షయ బుద్దినొసంగును గాక. ధనము ప్రసాదించుమని ధాత అనుగ్రహ బుద్దిని యాచించుచున్నాము. (8)
4. దాతయగు ధాత, సవిత, ప్రజాపతి, నిధిపతి, త్వష్ట, విష్ణువు మా హవిస్సులు స్వీకరింతురు గాక. వారు యజమానికి ద్రవ్యము ప్రసాదింతురు గాక. (9)
రెండవ సూక్తము - 5
వినియోగము :-
1) 1 - 2 మంత్రములచే వృష్టికోరువాడు దేవతలకు క్షీరోదన లేక ఘ్రుత హోమము చేయునది ఉపతారకాద్భుత శాంతి యందు వీనిచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
2) 2 వ మంత్రముచే దర్శపూర్ణయాగపు పత్నీ సంయాజములందు సౌభాగ్యయాగమును అనుమంత్రించునది. ఈ కర్మమునందే ఎరుపు మేక మాంసమును దీనిచే సంపాతన, అభిమంత్రణలు చేసి భుజించునది. పూర్ణకుంభము లేక సురా కుంభమును దీనిచే సంపాతన అభిమంత్రణలు చేసి సంతానము కోరునట్టి స్త్రీని దానిచుట్టు త్రిప్పి ఎదుటకు తెచ్చునది. అన్నము, సుర లేక ప్రపను దీనిచే సంపాతన అభిమంత్రణలు చేసి దానిని సంతానాభిలాషిణి స్త్రీకి ఇచ్చునది. ఫలాభిలాషి దీనిచే ప్రజాపతిని యజించునది లేదా ఉపస్థానము చేయునది.
3) 3 - 9 మంత్రములచే అభిలషిత ఫలము కోరువాడు అనుమతి దేవతను యజించునది లేదా ఉపస్థానము చేయునది. పూర్ణమాస యాగమున అనుమతి దేవతను వీనిచే పరిగ్రహించునది.
4) పదవ మంత్రముచే ఇటుకల శ్మశానము మీద బంధువులు నీళ్ళు పోయునది.
5) 11, 12 మంత్రములచే పృశ్ని సవమున హవిమర్సన సంపాత ప్రదానాది కర్మలు చేయునది.
1. భూదేవీ! వర్షము పడినపుడు నీవు నీరసపడకుము. బలపడుము.
పర్జన్యదేవా! మేఘములను పరచుము. నీటితిత్తి మూతి తెరచినప్పటి వలె వర్షించుము.





