Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్|
నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
శ్రీ మదాంధ్ర వచన అథర్వవేద సంహిత
ఏడవ కాండ
మొదటి అనువాకము
మొదటి సూక్తము
ధీతీ వా యే అనయన్ వాచో అగ్రం మనసా వా యే2వ దన్నృతాని |
తృతీయేన బ్రహ్మణా వా వృధానా స్తురీయేణా మన్వత నామధేనోః ||
భావము వ్యక్తమగుటకు వాక్కు మొదట మనసున, తదుపరి హృదయమున, మూడవ దశ యందు బ్రాహ్మణమున, తురీయ దశ యందు ఫలాపేక్ష రూపమున వ్యక్తమగుచున్నది.
వినియోగము :-
1) మొదటి సూక్తపు రెండు ఋక్కులచే అర్ధోత్థాపన విఘ్నశాంతి కొరకు ఘ్రుత సమిధాది పదమూడు ద్రవ్యములో ఒక దానితో ఆహుతి ఇచ్చునది. ఫలప్రాప్తి కోరువాడు ఈ రెండు ఋక్కులచే ఇంద్రాగ్నులను యజించునది లేదా ఉపస్థానము చేయునది. మూడవ ఋక్కుచే సర్వఫలకామి "అథర్వాణం యజత"
2) రెండవ తృచలోని మొదటి రెండు ఋక్కులచే కొత్త రథమును అభిమంత్రించి విజయాభిలాషి యగు రాజును ఆసీనుని చేయునది.
రెండవ ఋక్కుచే అశ్వశాంతికి సర్వోషధి చూర్ణమును అశ్వము మీద చల్లునది.
చాతుర్మాస్యపు శూనాసీరీయ పర్వమున దీనిచే వాయవ్య యాగమును అనుమంత్రించునది.
3) మూడవ తృచచే బ్రహ్మ హవిని అనుమంత్రించునది.
2. అతడు పుత్రుని, పితను, మాతను ఎరుగుచున్నాడు. అతడే సకల కర్మల ప్రేరకుడు అగుచున్నాడు. అతడే కర్మఫలము అగుచున్నాడు. అతడే ద్యులోక, భూలోక అంతరిక్షములు అగుచున్నాడు. అతడే విశ్వము అగుచున్నాడు. అయినాడు.
1. అథర్వుడు తండ్రి - దేవబంధువు - మాతృగర్భము - సర్వప్రాణి కర్త. యజ్ఞము. అట్టి వానిని మనసా ధ్యానించి వివరించగలవాడు మాకు ఉపదేశించును గాక.
1. అతడు విశ్వాత్మ. యజ్ఞాదులకు మూలము. దీప్యమానుడు. కర్మఫల ప్రాపకుడు. అతని దేహము విరాడాత్మకము. దానిచే అతడు సమస్త కర్మలకు ప్రేరకుడు అగుచున్నాడు. (4)
1. వాయువా! నీవు శుభములకు ఆహ్వానించవలసినవాడవు. నీవు పదకొండు. ఇరువది రెండు, ముప్పది మూడు అశ్వముల మీద విచ్చేయుము. అట్లు వచ్చి అశ్వములను ఇచటనే విడువుము. (5)
(మరలి పోకుము అని అర్ధము.)
1. దేవతలు యజ్ఞము కొరకని ఆహవనీయ అగ్నిని కల్పించినారు. కావున అగ్ని కర్మములు ప్రథమములు అయినవి. వాని వలన మహిమాన్వితులై - పూర్వము సాధ్యులగు దేవతలు ఉన్నట్టి స్వర్గమునకు చేరినారు. (6)
2. అతడు యజ్ఞమైనాడు. యజ్ఞమున వ్యాపించినాడు. యజ్ఞమున వర్ధిల్లినాడు. అతడు 'దేవానామధి పతిర్భభూవ'. అట్టి వాడు మాకు ద్రవిణములను ఇచ్చును గాక. (7)
3. దేవతలకు హవిస్సులిచ్చి యజించిన వారును, అమర్త్యులను మనసాస్మరించు మానవులు ఏ పదమునకు చేరుచున్నారో మేము ఆ స్థానమునకు చేరి ఆనందింతుము గాక. అచట అనేక సూర్యోదయములను దర్శింతుము గాక. (8)
(చిరకాలము నివసింతుము గాక అని అర్ధము.)
4. దేవతలు పురుషుడే హవిస్సుగా యజ్ఞమును ఆచరించినారు. హవిస్సులేని యజ్ఞము దాని కన్న శ్రేష్ఠము అగుచున్నది. (9)
5. కార్యాకార్యములు ఎరుగని వారు కుక్కతోను, గోవు యొక్క అవయవములతోను అనేక మారులు యజించి నిష్ఫలులు అయినారు.
యజ్ఞమును మనసా యజించిన విద్వాంసులారా! దానిని గురించి మాకు తెలియ పరచండి. (10)
(పశువధతో కూడిన యజ్ఞమును నిరసించుటకు కుక్కతో యజ్ఞము చేయుట అన్నాడు. వాస్తవమునకు అట్టి యజ్ఞము లేదు.
పశుహింసా రహితమై కేవలము మనసుతో ధ్యానించు యజ్ఞమునకు ప్రాధాన్యత ఇచ్చినాడు.
కర్మకన్నా జ్ఞానము మిన్న అనియు, దేహమున కన్న మనసు మిన్న యనియు ప్రవచించుచున్నాడు.)
రెండవ సూక్తము
వినియోగము :-
1) మొదటి నాలుగు ఋక్కులచే సర్వఫలకామి అదితిని యజించునది లేదా ఉపస్థానము చేయునది.
ఆధానపు పవమానేష్టి యొక్క ఆదిత్య హవి అనుమంత్రమున దీని వినియోగము.
2) రెండవ ఋక్కుచే అభిమంత్రించి నావలో దాటునది.
అన్య దేశమునకు నావలో పోవువాడు దీనిచే సంపాతించి సాగునది. ఆ కర్మమునందే 'నౌమణిని సంపాతించి' అభిమంత్రించి కట్టునది.
వివాహపు చతుర్ధికా కర్మయందు "ఖట్వాం స్పర్శయేత్"
3) ఆవా సథ్యానమున క్రియద్విసరజనానంతరము ఇంటి వద్ద నదుల వంటి వానిని చేసి 2, 3 ఋక్కులచే నావను ఎక్కునది.
4) సోమయాగ దీక్షయందు కృష్ణాజినముపై కూర్చున్న యజమాని 3వ ఋక్కును జపించునది.
5) అగ్ని చయనమున వాజ ప్రసణీయ హోమమున బ్రహ్మ 4వ ఋక్కును జపించునది.
6) సర్వఫలకామి 5వ ఋక్కుచే దేవతలను యజించునది. లేక ఉపస్థానము చేయునది.
7) ప్రవాసమున లాభము కోరువాడు 6వ ఋక్కుచే ఘ్రుత, పురోడాశ, సమిధలలో ఒక దానిని ఆహుతి ఇచ్చునది లేదా జపించునది.
అశ్వాది యానమున సాగువాడు అశ్వమును దీనిచే సంపాతన, అభిమంత్రణలు చేసి జలముచే ప్రోక్షించి అశ్వమును విడుచునది.
బట్టల వర్తకుడు లాభార్జనకు గాను దీనిచే సంపాత, అభిమంత్రణలు చేసి కోరిన చోటునకు వెళ్ళునది. అట్లే లాభము కోరువాడు బట్టలను దీనిచే సంపాతన, అభిమంత్రణలు చేసి స్వీకరించునది.
గ్రహ యజ్ఞమున దీనిచే బృహస్పతికి సమిధా దానము - ఉపస్థానము చేయునది.
8) పోయిన ద్రవ్యము తిరిగి పొందగోరువాని కుడిచేతిని 7 - 10 ఋక్కులచే సంపాతించి లేపునది. దీనితోనే 21 ఇసుక రేణువులను అభిమంత్రించి మార్గసంధి యందు చల్లునది.
9) చాతుర్మాస్యపు వైశ్వదేవాపర్వమున 7వ మంత్రముచే పూషాదేవత హవిస్సును అనుమంత్రించునది.
1. అదితిర్ధ్యౌరదితి రంతరిక్షమదితిర్మాతా సపితా నపుత్రః |
విశ్వేదేవా అదితిః పంచజనా అదితి ర్జాతమదితిర్జనిత్వమ్ ||
(1 దేవతలు. 2. మానవులు. 3. గంధర్వులు. 4. అప్సరసలు. 5. సర్పములు లేక పితరులు వీరు పంచజనులు.
జాతమదితిర్జనిత్వమ్ - పుట్టించునది పుట్టనది అదితియే.)
2. అదితి మహా మహులకు తల్లి. ఋతమును సత్యమును పాలించునది. బలశాలి. ధనపతి. అవినాశిని. సుందర వదన. గొప్పనడక కలది. సుఖప్రణీత. విశాల. మమ్ము రక్షించుమని అట్టి అదితిని ప్రార్దించుచున్నాము.
--౦౦౦--
1. దేవి యగు నవ రక్షించునది. విస్తీర్ణ. సాగునది. పాపరహిత. సుందరవదన. అఖండణీయ. అట్టి నావను 'రోహేమస్వస్తయే' శుభము కలుగవలెనని ఎక్కుచున్నాము. (3)
2. ఈ నౌక అన్నమును పుట్టించగలది. అన్నమును నిర్మించగలది. విశాల. అఖండనీయ. అట్టి ఓడను స్తుతించుచున్నాము. విశాల అంతరిక్షమును అంటియున్న నావ మాకు మూడు అంతస్తుల భవనమును ప్రసాదించును గాక. (4)
--౦౦౦--
1. దితి పుత్రుల స్థానమును అదితి పుత్రులగు దేవతలకు వప్పగించుచున్నాను. దైత్యుల స్థానము సముద్రము, నభము అయ్యున్నది. దేవతలు మహామహులు. వారి స్థానమునాకు చలనము లేదు. వారికి నమస్కరించుట కన్న మిన్న ఏది?. (5)
--౦౦౦--
1. వస్త్ర ధనాదులు కోరువాడా! నీకు రక్షణ, శ్రేయస్సు కలుగును గాక. బృహస్పతి నీకు ముందుగా నడచును గాక.
బృహస్పతీ! ఇతడు లాభాభిలాషి, ఇతనిని భూమి మీది శ్రేష్ఠస్థానమునకు చేర్చుము. ఇతని ప్రతి స్పర్ధిని తొలగించుము. (7)





