Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

1.    కేశవర్ధని యగు ఓషధిని జమదగ్ని తన కూతురు కొరకు త్రవ్వి తీసినాడు. 'వీతహవ్యుడు' వెంట్రుకలు నల్లబడుటకు ఆ ఓషధిని మునుల ఇండ్లనుంచి తెచ్చినాడు.
   
2.    కేశవృద్ది కోరువారలారా! ముందు వ్రేళ్ళతో కొలువ దగిన వెంట్రుకలు బారలచే కొలువదగినవి అయినవి. గరికవలె అంచునుంచి అంతట పెరుగు వెంట్రుకలు నీ తల యందంతటను పెరుగుచున్నవి.
   
3.    ఓషధీ! కేశ మూలములను గట్టి పరచుము. వానిని రాలకుండ చేయుము. కేశాగ్రములను పెంచుము. అంచులందు మొలిచి అంతట వ్యాపించు గరికవలె నల్లని వెంట్రుకలను నా తల మీద పెంచుము.
   
                                             --౦౦౦--
   
1.    ఓషధీ! నీవు నిర్వీర్యము చేయువారిలో శ్రేష్ఠతమవు. నా ఈ శత్రువును నిర్వీర్యుని చేయుము. నపుంసకుని కన్న హీనుని చేయుము.
   
2.    ఓషధీ! నా శత్రువును నపుంసకుని చేయుము. స్త్రీని చేయుము. వెంట్రుకలు గలవాని చేయుము. వాణి వృషణములను ఇంద్రుడు రాళ్ళతో నలిపి వేయును గాక.
   
3.    ఒరే నన్ను ద్వేషించువాడా! నిన్ను ద్వేషించుచున్నాను. నిన్ను నపుంసకుని చేసినాను కదా! స్త్రీ వలె తలపై వెంట్రుకలు మొలిపించి నీటికుండను నెత్తిన పెట్టుచున్నాను.
   
4.    దేవా కృతములైన నీ వృషణములందు వీర్యమును ప్రవహింపచేయునట్టి ఏనాడులున్నవో ఆ రెండింటిని రాతిమీద పెట్టి కట్టెతో కొట్టి నలిపి వేయుచున్నాను.
   
5.    ఆడవారు చాప అల్లుటకు తుంగను రాతితో నలిపినట్లు ఓరి పగవాడా! నీ వృషణములను రాతిమీద పెట్టి రాతితో దంచుచున్నాను.
   
                                           ఎనిమిదవ సూక్తము - 66
   
వినియోగము :-

   
      1) మొదటి తృచ స్త్రీ వశీకరణమున.
   
      2) రెండవ తృచచే శిశువునకు మొదలు పై దంతములు వచ్చినపుడు ఆ దోష శాంతికి ధాన్యము లేక యవలు  లేక తిలలు ఆహుతి ఇచ్చునది. ఆ కర్మము నందే మినుములు, యవలు, తిలలు కలిపి పైన వచ్చిన దంతములచే కొరికించునది.
   
1.    శంఖపుష్పికా! నా దౌర్భాగ్యమును దూరము చేసి నాకు సౌభాగ్యము కలిగించుదానవు. నీవు వేల శాఖల దానవు. ముప్పది మూడు మూలముల దానవు.
   
    ప్రియే! ఆ వేల శాఖలచే నిన్ను తపింపచేయుచున్నాను.
   
2.    ప్రియే! నా విషయమున నీ హృదయము తపించును గాక. నీ వదనము శుష్కించును గాక. నన్ను వలచి నీవు తపింతువు గాక. అట్లై నా దరి చేరుదువు గాక.
   
3.    పీతవర్ణా! శుభంక్రీ ఓషధీ! నీలో వశీకరణ గుణమున్నది. నా ప్రేయసిని నా వద్దకు పంపుము. ఆమెను, నన్ను కలుపుము. మా హృదయములను ఏకము చేయుము.
   
4.    నీరు త్రాగని వాని ముఖము శుష్కించినట్లు నా పరితాపము నిన్ను శుష్కింపచేయును గాక అట్లు పరితప్తవగు నీవు నన్ను చేరుదువు గాక.
   
5.    ముంగిస పామును త్రుంచి మరల కలిపినట్లు ఓషధీ! మనసు విరిగిన నా ప్రేయసిని మరల నాతో కూర్చుము.
   
                                               --౦౦౦--
   
1.    శిశువునకు మొదట వచ్చిన పై దంతములు వ్యాఘ్రము వలె మాతా పితలకు హానికారకములు. బ్రహ్మణస్పతీ! అగ్నీ! మీరు వానిని తల్లిదండ్రులకు హాని కారకములు కాకుండునట్లును, వారికి సుఖప్రధములు అగునట్లును చేయండి.
   
2.    మొదలు మొలిచిన ఉపరి దంతములారా! ధాన్యమును కొరకండి. యవలను కొరకండి. తిలలను కొరకండి. రమణీయ ఫలమునకు గాను వానిని మీకు అందించినాము. దానిచే తృప్తి చెంది ఈ శిశువు తల్లిదండ్రులను వధించకుము.
   
3.    దంతములు దేవతా ప్రసాదములు. సుఖప్రదములు. మంగళకరములు. తల్లిదండ్రులను చంపు ఘోర కర్మము ఈ శిశువు నుండి దూరమగును గాక. మా హింసిష్టం పితరం మాతరంచ.
   
                                       తొమ్మిదవ సూక్తము - 67
   
వినియోగము :-

   
      1) మొదటి తృచచే పుష్ట్యర్దచిత్ర కర్మమున వృక్షాది సామగ్రిని సంపాతితము చేయునది. దీనితోనే ప్రభాత కాలమున నీటిధార, సంయుక్త శాఖచే గోప్రదక్షిణ చేయునది.
   
    రెండవ మంత్రముచే సూక్తోక్త రీతిని దూడచెవిని చేదించునది. మూడవ మంత్రముచే చెవి రక్తమును దధి,  మధు, ఘ్రుత, జలములతో కలిపి సంపాతన అభిమంత్రణలు చేసి నాకించునది.
   
      2) రెండవ త్రుచచే బీజవాపన కర్మయందు ధాన్యాది విత్తనములను నేతిలో కలిపి అభిమంత్రించి ఒక్కొక్క  మంత్రముచే మూడు పిడికిళ్ళ ధాన్యాదుల విత్తనములను లాంగల పద్దతిలో వేసి మట్టి కప్పునది.
   
1.    వాయు దేవత గుంపులు గుంపులుగా గోవులను తెచ్చును గాక. త్వష్ట వానిని పోషించును గాక. ఇంద్రుడు మంచి మాట పలుకును గాక. రుద్రుడు గోవులకు చికిత్స చేయును గాక.
   
2.    గోపాలా! లోహిత శస్త్రముచే దూడ చెవి మీద మిథున చిహ్నము వేయుము. అశ్వినులు కూడ అట్టి చిహ్నము చేయుదురు గాక. అందువలన అధిక సంతానము కలుగును గాక.
   
3.    దేవతలు, అసురులు పశువుల కర్ణములకు గుర్తులు పెట్టినారు. మానవులు కూడ అట్లే చేసినారు. అశ్వినులారా! గో సమృద్దికి గాను మీరు అట్టి చిహ్నములు చేయండి.
   
                                                 --౦౦౦--
   
1.    ధాన్యమా! మొలుచుము. ఎదుగుము. అనేకముగా వర్ధిల్లుము. నీ యొక్క రసవీర్య రూప తేజస్సున గుమ్ములు నింపుము. ఆకాశపు అశని నిన్ను వధించకుండును గాక.
   
2.    యవ దేవతా! మా విన్నపము ఆలకించుము. నీవు ఈ భూమి మీద ఆకాశమంత, సముద్రమంతగా వర్ధిల్లుము.
   
3.    అక్షితాస్త ఉపసదోక్షితాః సస్తు రాశయః |
    పృణన్తో అక్షితాః సన్త్యత్తారః సన్త్యక్షితాః ||

   
    ధాన్యమా! కృషీవలుడు అక్షయుడు అగును గాక. ధాన్యము అక్షయ మగును గాక. ఇంటికి చేర్చువారు అక్షయులు అగుదురు గాక.    
       
   
   
    విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాల సాహిత్య రచయిత, విమర్శకుడు, చలనచిత్ర రచయిత, వ్యాసకర్త, వక్త, స్వాతంత్ర్య  సమరయోధుడు, ప్రగతిపథగామి, ప్రసన్నుడు, ఆంగ్లము నుండి "దేవుని పేరిట" ఉర్దూ నుండి 'ఉమ్రావ్ జాన్ అదా' నవలల అనువాదకుడు, ఉర్దూ నుండి జిలానీబాను కథలు తెలుగులోనికి, "తెలుగు అఫ్సానే" అను తెలుగు కథల ఉర్దూ అనువాదకుడగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంద్ర వచన అథర్వ వేద సంహిత యందలి ఆరవ కాండము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.