Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
1. శకధూమము, నక్షత్రములు చంద్రుని రాజునుగా చేసినవి. కళ్యాణ ప్రదమగుటకు నక్షత్ర మండలము చంద్రుని అధీనమున ఉండును గాక.
2. భద్రాహంనో మధ్యందివే భద్రాహం సాయ మస్తువః |
భద్రాహంనో అహ్నాం ప్రాతా రాత్రీ భద్రాహమస్తునః ||
3. శకధూమ రాజా! మాకు రాత్రింబవళ్ళు, నక్షత్రములు, సూర్య చంద్రాదులు శుభప్రదులగునట్లు చేయుము.
4. శక ధూమ, నక్షత్ర రాజా! మీరు మాకు రాత్రింబవళ్ళు, సాయంత్రములు పుణ్యప్రదములు చేసినారు. అందుకొరకు మీకు సదా నమస్కరించుచున్నాము.
మూడవ సూక్తము - 62
వినియోగము :-
1) మొదటి తృచచే 'శంఖపుష్టి' ని వేరుతో త్రవ్వితీసి సంపాతన అభిమంత్రణలు చేసి సౌభాగ్యము కోరువానికి కట్టునది. 'శంఖపుష్టి' పుష్పమును అభిమంత్రించి తలలో పెట్టునది.
2) రెండవ తృచ సహితముగా మూడు తృచలచే దుష్టస్త్రీని వశపరచు కొనుటకు మినుములను అభిమంత్రించి స్త్రీ తిరుగు చోట చల్లునది. నిప్పులో వేసిన 'శరముష్టి' ని నలువైపుల చల్లునది.
స్త్రీబొమ్మను గీసి సూక్తోక్త ప్రకారము ధనుర్బాణములను చేసి స్త్రీ బొమ్మ గుండెలో గ్రుచ్చునది.
1. ఖురాకార భగదేవత వలన నేను సౌభాగ్యవంతుడను అగుచున్నాను. మేము చేసిన సేవకు ప్రసన్నుడైన మిత్రుడగు ఇంద్రుని వలన సౌభాగ్యశాలిని అగుచున్నాను. శత్రువులు మమ్ము విడిచి పలాయనము చిత్తగింతురు గాక.
2. ఓషధీ! నీవు భగదేవత వర్చస్సుగల దానవు అగుచున్నావు. అన్య వృక్షములను తిరస్కరించుచున్నావు. అట్టి నీవు నన్ను సౌభాగ్యవంతుని చేయుము. శత్రువులు పలాయనము చిత్తగింతురు గాక.
3. భగుడు అంధుడు అట్లగుట వలన పట్టిన చెట్టునందే ఉంటున్నాడు. అతడు నాకు సౌభాగ్యము కలిగించును గాక. శత్రువులు పారిపోవుదురు గాక.
--౦౦౦--
1. రథజిత, రథజితేయి అప్సరసలు కామము కలిగించువారు. వారు ఈ స్త్రీ యందు చేరుదురు గాక. ఆమె నా కొరకు శోకించును గాక.
2. ఆమె నన్ను ప్రియునిగా స్మరించునుగాక. నేను మాత్రము ఆమెను తలచను. దేవతలారా! ఆమెను కామార్తను చేయండి. ఆమె నా కొరకు విలపించును గాక.
3. ఇతడే నన్ను స్మరించును గాక. నేను మాత్రము అతనిని తలచును. దేవతలారా! అతనిని కామార్తుని చేయండి. అతడు నా కొరకు విలపించును గాక.
4. మరుత్తులారా! ఈమెకు నా పిచ్చి కలిగించండి. అంతరిక్షమా! అగ్నిదేవతా! ఈమెకు ఉన్మాదము కలిగించండి. ఈమె నా కొరకు ప్రలాపించును గాక.
నాలుగవ సూక్తము - 63
వినియోగము :- గత సూక్తమున చెప్పబడినది.
1. ప్రియా! తలనుండి పాదముల వరకు నీలో కామము నింపుచున్నాను. దేవతలారా! ఆమెను కామార్తను చేయండి. ఆమె నా కొరకు విలపించును గాక.
2. అనుమతి దేవీ! నాకు అనుమతి నిమ్ము. ఆకూతిదేవీ! నన్ను అనుగ్రహింపుము. దేవతలారా! ఈమెను కామార్తను చేయండి. ఈమె నా కొరకు విలపించును గాక.
3. భర్తా! మూడు యోజనములు, ఐదు యోజనములు, అశ్వము మీద పారిపోవుచున్న వాడవైనను తిరిగి రమ్ము. నీవు నా పిల్లల తండ్రివి కదా!
--౦౦౦--
1. దేవతలు కాముని ఆర్తికి ఓర్వజాలక నీట మునిగినారు. ప్రియే! వరుణదేవుని అనుగ్రహమున నిన్ను స్మర పరితప్తను చేయుచున్నాను.
2. విశ్వేదేవతలు కాముని ఆర్తికి తాళజాలక నీట మునిగినారు. ప్రియే! వరుణుని అనుగ్రహమున నిన్ను కామ పరితప్తను చేయుచున్నాను.
3. ఇంద్రాణి కామార్తికి తాళజాలక కాముని నీట ముంచినది. ప్రియే! వరుణుని అనుగ్రహమున నిన్ను కామపరితప్తను చేయుచున్నాను.
4. ఇంద్రాగ్నులు కామాగ్నిని ఓర్చలేక కాముని నీట ముంచినారు. ప్రియే! వరుణుని అనుగ్రహమున నిన్ను కామార్తను చేయుచున్నాను.
5. యం మిత్రావరుణౌ స్మరమసించతా ప్స్వ2న్తః శోశు చానం సహాధ్యా |
తం తే తపామి వరుణస్య ధర్మణా ||
అయిదవ సూక్తము - 64
వినియోగము :-
1) మొదటి తృచచే అభిచార కర్మపు దీక్షయందు మేఖలను సంపాతిత అభిమంత్రణలు చేసి కట్టునది. రెండవ మంత్రముచే మేఖల గ్రంథిని ఆలింపనము చేయునది. మూడవ మంత్రముచే 'బాధక' సమిధలను ఉంచునది.
2) రెండవ తృచచే అభిచారక కర్మయందు దీక్షాదండమును సంపాతిత అభిమంత్రితములు చేసి గ్రహించునది. ఆ కర్మమునందే కర్త దీనిచే అన్నమును అభిమంత్రించి భుజించునది.
1. ఏ దేవత మేఖల కట్టుచుండెనో - ఎవడు కట్టుచున్నాడో ఆ దేవతయే మాకు మేఖలను కట్టుచున్నాడు. మేము ఏ దేవతకు అదీనులమో అతడు మాకు ఇష్టాపూర్తి కలిగించును గాక. మమ్ము శత్రు విముక్తులను చేయును గాక.
2. మేఖలా! నీవు ఆహుతులచే సంస్కరింప బడిన దానవు. నీవు ఋషి పుంగవుల ఆయుధమవు. నీవు వ్రతమును ముందే అనుభవించు దానవు. "వీరఘ్నీభవ మేఖలే" శత్రువీరులను వధించు దానవగుము.
3. నేను బ్రహ్మచారిని. మృత్యువునకు సహాయపడుచున్నాను. శత్రువును యమునకు వప్పగించుచున్నాను. ఆ శత్రువును నా తపస్సుతోను, మంత్రముతోను, శ్రమతోను మేఖలచే కట్టి పడవేయుచున్నాను.
4. ఈ మేఖల శ్రద్దాపుత్రి. తపస్సున జనించినది. భూతకృతులగు ఋషులకు భగిని. అట్టి మేఖలా! మాకు బుద్దిని కలిగించుము. మేధస్సును కలిగించుము. ఆత్మ బలమును, తపమును ప్రసాదించుము.
5. ఏ మేఖలను భూతకృతులగు పూర్వ ఋషులు కట్టుచున్నారో అట్టి మేఖలా! నీవు నన్ను ఆలింగనము చేసికొనుము. అందువలన నాకు దీర్ఘాయువు కలుగును గాక.
--౦౦౦--
1. ఈ దండము వజ్రసమము. యజ్ఞసమము. సత్యసమము. ఇదిశత్రు రాజ్యమును ధ్వంసము చేయును గాక. రాజును హతమార్చును గాక. ఇంద్రుడు వృత్రుని చేసిన రీతి ఈ శత్రురాజు మెడ తెగును గాక. నరములు తెగును గాక.
2. ఈ వజ్రమున హతుడైనవాడు భూమిని ఆలింగనము చేయును గాక. మరల లేవకుండును గాక.
3. వజ్రదండమా! మాకు హాని కలిగించు వానిని వెదుకుము. హాని తలపెట్టిన వానిని హతమార్చుము. అట్టి వాని తల త్రుంచి నెల రాల్చుము.
ఆరవ సూక్తము - 65
వినియోగము :-
1) మొదటి తృచలోని రెండు మంత్రములచే అన్నమును అభిమంత్రించి భక్షించునది. మూడవ ఋక్కుచే జలమును మంత్రించి త్రాగునది.
2) 2వ, మరసటి సూక్తపు మొదటి తృచలచే వెంట్రుకలు పెంచదలచిన వాడు కాచమాచీ ఫలం, జీవన్తీ ఫలం, భ్రుంగ రాజమును సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది. భ్రుంగరాజము వేసిన నీటిని వీనిచే అభిమంత్రించి ఉషః కాలమున స్నానము చేయునది.
1. నా భోజనము బలకరము అగును గాక. నేను వజ్రమును ఎత్త కలుగుదును గాక. ఇంద్రుడు వృత్రుని చేసినట్లు శత్రువు భుజములను ఖండింతును గాక.
2. నేను శత్రుబలమును సముద్రము నదులను వలె పీల్చివేయుచున్నాను. శత్రువు ప్రాణములను పీల్చి, శత్రువుచే పీల్చివేయుచున్నాము.
3. నేను శత్రు బలమును - సముద్రము నదులను వలె - మ్రింగుచున్నాను. శత్రువు ప్రాణములను మ్రింగి శత్రువునే మ్రింగుచున్నాను.
--౦౦౦--
1. ఓషధీ దేవీ! నీవు భూదేవి యందు పుట్టినావు. వంకరగా వ్యాపించుదానవు. కేశములు పెంచుకొనుటకు గాను నిన్ను త్రవ్వి తీయుచున్నాను.
2. ఓషధీ! నీవు ఉన్న వెంట్రుకలను గట్టి పరచుము. మొలవని వాటిని మొలిపించుము.
3. రాలిన వెంట్రుకలు, మొదళ్ళు బాగుండియు తెగిపడు వెంట్రుకలు అట్టి వ్యాధులన్నింటిని చికిత్స చేసి దూరము చేయుచున్నాను.
ఏడవ సూక్తము - 65
వినియోగము :-
1) మొదటి తృచ వినియోగము పూర్వ సూక్తమున చెప్పబడినది.
2) రెండవ తృచచే అభిచార కర్మమందు సూత్రోక్తరీతిని మూత్ర పురీష స్థానమును బాధక కాష్టము చే బాదునది.





