Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
2. మాకు భూమి తల్లి అదితి జనయిత్రి అంతరిక్షము భ్రాత. వారికి మేము చేసిన అపచారములను వారలు మన్నింతురు గాక. ద్యులోకము మాకు తండ్రి. అతడు పిత్రూణము నుండి మమ్ము విముక్తులను చేయును గాక. భగిన్యాదులతో దుర్వ్యవహారము చేయక పరలోక భ్రష్టుడను కాకుందును గాక.
3. ఎచట వ్యాధిరహితులై తనువును విడిచిన వారు సుఖములు అనుభవించుచున్నారో మేము అట్టి స్వర్గలోకమునకు చేరి మాతాపితరులను, పుత్రులను చూచెదము గాక.
--౦౦౦--
1. వరుణ దేవత తన ఉత్తమ, మధ్యమ, అధమ పాశములను విడిపించును గాక. దుస్స్వప్న దోషములను నివారించును గాక. గచ్చేమ సుకృతస్య లోకమ్ - పుణ్య లోకములకు చేరుదుము గాక.
2. నిన్ను దారువు, రజ్జువు, భూమి ఏవి బంధించినను గార్హపత్యాగ్ని విడిపించును గాక. పుణ్యలోకము కలిగించును గాక.
3. భగవతీ, విచ్రుతనక్షత్రములారా! మీరు ఉదయించి ఇతనికి అమృతతత్వము ప్రసాదించండి. ఇతనికి బంధ విముక్తి కలిగించండి.
4. బంధనములారా! మీరు విభిన్న మార్గములకు వెళ్ళిపొండి. కట్లు విప్పండి. విముక్తునకు దారి కల్పించండి. బంధన విముక్తా! నీవు తల్లికడుపునుంచి వలె బయటపడుము.
అయిదవ సూక్తము - 59
వినియోగము :-
1. 1, 2 తృచలచే అన్ని యజ్ఞములందు సంస్థిత హోమపు ఆహుతులిచ్చునది.
అగ్నిష్టోమమున హవిర్దానమందు చమస పాత్రలు పట్టి పితరులకు పురోడాశ శకలములు అర్పించునపుడు ఈ రెండు తృచలచే అనుమంత్రించునది.
2. 3,4 తృచలచే వైశ్వకర్మణ హోమమున అనుమంత్రించునది.
3. మొదటి తృచలోని 5వ మంత్రముచే సర్వ యజ్ఞములందు ఋత్విజుల హస్త ప్రక్షాళనమునకు నీరు పోయునది.
4. రెండవ తృచలోని 3, 4, 5 మంత్రములచే "యజమానస్య ఆర్షేయ ప్రవరేణ వాచయేత్"
5. మూడవ తృచచే ఆకాశోదకప్లావన దోషనివారణార్ధము నీటిని అభిమంత్రించి ప్రక్షాళన చేయునది. తైలశాంతా ఔషధి, గంధసువర్ణము, వస్త్రమును అభిమంత్రించి తుడుచునది.
1. విశ్వకర్మ తొలుత పుట్టిన వాడు. అతడు విద్వాంసుడు. సత్యస్వరూపుడు. అతనికి హవిర్భాగము అర్పించుచున్నాము. వాటిని స్వీకరించి విశ్వకర్మ మమ్ము వార్ధక్యము తరువాత కొనసాగునట్లు చేయును గాక.
2. జీవితకాలమున రుణము తీర్చలేని వారు పుత్ర, పౌత్రాదుల వలన తరించుచున్నారు. పుత్ర, పౌత్రాదుల వలన తండ్రి తన రుణము నుండి తరించుచున్నాడు. బందువులు లేనివారు తమ రుణమును ఈ లోకమున తీర్చుచున్నారు. సంకల్పము కలిగి శక్తిలేక తీర్చలేనివారు స్వర్గమునకు చేరుచున్నారు.
3. దంపతులారా! సత్కర్మలు ఆరంభించండి. వానిలోనే నిమగ్నులు కండి. శ్రద్దగలవారలకే ఫలితము దక్కుచున్నది. అన్నదానము చేయండి. అగ్నికి ఆహుతులు అర్పించండి. మీకు శుభములు కలుగును గాక.
4. మేము చేయు యజ్ఞములందలి హవిస్సులను అగ్ని దేవతలకు చేర్చునపుడు మా మనసు అగ్నియందు ప్రవేశించుచున్నది.
హవిస్సులు అందుకున్న అగ్నిదేవా! వార్ధక్యము తరువాత దుఃఖములేని స్వర్గలోకమున ఆనందింతుము గాక.
5. పాపరహితము, జగత్పావన కారకమగు ఈ జలమును ఋత్విక్కుల హస్త ప్రక్షాళనమునకు పోయుచున్నాను. అప్పుడు నేను కోరిన కోరికలను ఇంద్రుడు, మరుత్తులు తీర్చెదరు గాక.
--౦౦౦--
1. స్వర్గమున యజమాని వెంట ఉండు దేవతలారా! ఇదిగో మీకు హవిర్భాగము అర్పించుచున్నాను. ఇదియే జాతవేది అగ్ని మీకు అందించునట్టినిధి. ఈ యజమాని సహితము హవిరూప నిధి సహితుడై మీ వద్దకు వచ్చుచున్నాడు. అతనితో పరిచయము చేసికొనండి. మరువకండి.
2. సహచర దేవతలారా! ఇతఃనితో స్నేహము చేయండి. ఇతని స్థానమును స్థిరపరచండి. హవి సమర్పించిన ఈ యజమాని క్షేమముగా స్వర్గము చేరగలడు. ఇతనికి ఇష్టాపూర్తి కలిగించండి.
3. దేవతలే పితరులు. పితరులే దేవతలు. నేను ఎవరివాడనో, వారి వాడనే.
4. నేను వండుచున్నాను. ఇచ్చుచున్నాను. యజించుచున్నాను. నేను విడిపోకుందును గాక.
5. సోమరాజా! స్వర్గమున మమ్ము నిలుపుము. అచటనే నిలిపి ఉంచుము. రాజా! నాకు ఇష్టాపూర్తి కలిగించుము. 'దేవ సుమనా భవ' దేవా! మా విషయమున సుమనస్కుడవు అగుము.
--౦౦౦--
1. బృహదంతరిక్షమునుండి రసవంతజల బిందువు నామీద పడినది. అగ్నిదేవా! నీ అనుగ్రహమున ఈ దోషము నుండి విముక్తుడనై పాల వంటి అమృతమునందు చేరినాను. ఛందస్సు, యజ్ఞముల వలన మాకు పుణ్యగతులు కలుగును గాక.
2. జలబిందువు చెట్టునుంచి పడినను, ఆకసము నుండి పడినను అందుకు వాయువే కారకుడు అగుచున్నాడు. ఆ బిందువు వంటి మీద పడినను బట్టమీద పడినను కడిగివేసినాను. నిర్రుతిదేవతా! ఆ పాపమును దూరము చేయుము.
3. ఈ వర్ష బిందువు అభ్యంజనము. ఈ సుగంధ ద్రవ్యములు సమృద్ది యగుచున్నవి. ఈ సువర్ణము బలము అగుచున్నది. ఇవన్నియు పవిత్రము చేయు ద్రవ్యములు మాయందు వ్యాపించినవి. కావున పాపదేవత మమ్ము ఆక్రమించకుండును గాక. శత్రువు మమ్ము ఆక్రమించకుండును గాక.
పదమూడవ అనువాకము
మొదటి సూక్తము -60
వినియోగము :-
1) మొదటి తృచచే కొత్త రథమును అభిమంత్రించి విజయార్దియగు రాజును దానిపై ఎక్కించునది. ఆధానమున రథచక్ర హోమము తరువాత దీనిమీద కూర్చుండునది. 3వ ఋక్కుచే రథచక్రములకు ఆహుతులు ఇచ్చునది. మహావ్రతపు మాధ్యందిన సవనమున దీనిచే అభిమంత్రించి రాజును గాని ఇతరుని గాని రథముపై ఎక్కించునది.
2) రెండవ తృచచే శత్రుసేనను చిరాకు పరచుటకు, ద్వేషము వ్యాపింప చేయుటకు వాద్యములను సూత్రములో చెప్పబడిన రీతిగా సంపాతించి, మూడు మారులు మ్రోగించి, వాయించువానికి ఇచ్చునది. మహా వ్రతమున దీనిచే భూమి దుందుభిని మ్రోయించునది.
1. కర్రతో చేసిన రథమా! నీ భాగములు దృఢములు అగును గాక. నీవు మాకు మిత్రమవు. శత్రువును జయించగల దానవు. వీరులను ఎక్కించుకొను దానవు అగుచున్నావు. చర్మపుత్రాళ్ళచే కట్టబడి యుద్దసన్నద్దవై ఉన్నావు. నిన్ను అధిరోహించువాడు పరసేనను గెలుచువాడు, పరధనమును గెలుచువాడు అగును గాక.
2. ఈ రథమునకు ద్యులోక, భూలోక శక్తులున్నవి. దారు నిర్మితయై, శత్రుంజయమై ఉన్నది. దీనికి జల బలమున్నది. తోలు త్రాళ్ళచే కట్టబడిన ఈ రథము ఇంద్రుని వజ్రము వంటిదై యున్నది. 'హవిషారథం యజ' హవిస్సులచే రథమును యజింపుము.
3. దేవ రథమా! నీవు ఇంద్రుని బలమవు. మరుత్తుల సేనవు. మిత్రుని గర్భమవు. వరుణుని నాభివి. అట్టి నీవు మా యజ్ఞము నందలి హవిస్సులను స్వీకరించుము.
--౦౦౦--
1. దుందుభీ! మీ ధ్వనిచే భూమిని నింపుము. ద్యులోకమును పూరింపుము. సమస్త జగములందు ఘోషింపుము. సంగ్రామాధిపతి ఇంద్రుడు, మరుత్తులతో కూడిన దానవై శత్రువును దూరాతి దూరమునకు త్రోసివేయుము.
2. దుందుభీ! శత్రువును గడగడలాడించుము. శత్రుసేనలో ఆర్తనాదములు కలిగించుము. నీవు ఇంద్రుని ముష్టి వంటిదానవు. శత్రువును దెబ్బతీయుము.
3. ఇంద్రా! ఆ దూరమున ఉన్న శత్రువును జయించుము. మా భటులు శత్రువును ఓడించి దుందుభులు మ్రోగింతురు గాక. మా అశ్వారూఢులు, రథికులు యుద్దభూమి యందంతటను సంచరింతురు గాక.
రెండవ సూక్తము - 61
వినియోగము :-
1) జలోదర, విసర్పాది సకల వ్యాధిచికిత్సకు మొదటి తృచచే రోగి తలమీదకు సంపాతములు తెచ్చునది. పలాశపు నాలుగు అంగుళముల బెరడును నూరి అభిమంత్రించి రోగి దేహమునకు పూయునది.
2) రెండవ త్రుచచే శుభములు కోరువాడు ఘ్రుతాది 13 పదార్ధములను ఆహుతి ఇచ్చునది. నిత్య నైమిత్తిక కర్మలు శీఘ్రముగా చేయగోరువారు బ్రాహ్మణ సంఘమున గోమయ పిండముల నుంచి, దానిని అగ్నిగా భావించి సూక్తోక్త రీతిని ప్రశ్నోత్తరములు చేయునది. చంద్రగ్రహణము వలన కలుగు అరిష్టమునకు శాంతికి గాను దీనిచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
"తథా సోమగ్రహణ జనితారిష్ట శాన్తయే అనేనాజ్యం జుహూయాత్"
1. వనస్పతీ! నీవు విద్రధ, బలాస. లోహిత విసల్పక వ్యాధులకు ఓషధివి అగుచున్నావు. మాంసమునందును, చర్మమునందును గల ఈ వ్యాధులను నిర్మూలించుము.
2. బలాసమా! నీవు చంకలను, అండకోశములను బాధించుదానవు. నాకు దీనికి విరుగుడు తెలియును. "చీపద్రు" వృక్షము ఈ వ్యాధుల మూలములను పెరికి వేయును.
3. విసర్పక వ్యాధి కాళ్ళు, చేతులకు, చెవులకు, కన్నులకు కలుగును. అట్టి విసర్పకమును సమూలముగ పెరికి వేయుచున్నాము. అట్లే విద్రుధవ్యాధిని, హృదయరోగమును, తెలియరాని యక్ష్మను తలలు వంచి గెంటి వేయుచున్నాము.
--౦౦౦--





