Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
గుడిశకు పూర్తి గోడల్లేవు. ద్వారబంధం ఉంది. ద్వారం లేదు. నేల చెమ్మగిల్లుతుంది. వానల్లో ఊటలు వస్తాయి. అడవి దగ్గర. ఊరి బయట. వజవజ వణుకు. తేళ్లు - జెర్లు - పాముల మధ్య కాపురం. తరచుగా అడవి మృగాలు వస్తాయి.
అమ్మా - ఇద్దరు చెల్లెళ్లు పసిపిల్లలు. తెలు కరుస్తే మొత్తుకుంటారు. పాము కనిపిస్తే దడుచుకుంటారు. వంటినిండ బట్టలేదు. కడుపునిండ తిండిలేదు. చలిజ్వరాలు. వణుకు.
అమ్మ కడుపుతో ఉంది. పని చేతకాదు. మనసు వికలం. దుస్థితికి దుఃఖం. అర్థ బలం లేదు. అంగబలం లేదు. ఊళ్లో 'నా' అనేవాడు లేడు. అధికారుల వ్యతిరేకత. పనుల్లో అమ్మకు సాయం చేస్తున్నాను. కానుపు ఎట్లా? కనీసం చాటు లేదు. తడకలు కట్టించాను. ఆడదిక్కు లేదు. కాన్పు ఎవరు చేస్తారు?
ఆలోచన వచ్చింది. గూడూరుకు ఉరికాను. అప్పటికే అమ్మమ్మ పరమపదించింది. తాతయ్య, శేషయ్యమామ తల్లిని రప్పించాడు. ఆమెను తీసుకొని కచ్చడంలో మానుకోట బయల్దేరాను. తోవలో బండి బోల్తాపడింది. అమ్మమ్మ మణికట్టు చర్మం లేచిపోయింది. ఎముక బయటికి వెళ్లింది. రక్తం కారుతున్నది. ఆమె ఏడుస్తున్నది.
స్వార్థంలో మనిషిని మించినవాడు లేడు. నేను ఆమెబాధ గమనించడంలేదు. ఆమె రానంటుందేమోనని భయం తిరిగిపోతుందేమో! అమ్మ వంటిది. కాన్పు ఎలా? అమ్మకు ఏమన్నా అవుతే మాగతి ఏంకాను? ఇవే ఆలోచనలు.
పెద్దవాళ్లకు ఇంకా అనుబంధాలూ - బంధాలూ ఉన్నాయి. అమ్మమ్మ చేయి కడుక్కుంది. తడిబట్ట కట్టుకుంది. సిద్ధం అయింది. బండివాడు బండి లేపాడు. ప్రయాణం సాగింది.
బలయుతులకు దుర్భలులకు
బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు ప్రాణులకును
బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్రా!
అని భగవంతుని బలంతో సాగిపోతున్నాను. ఎడారి పయనంలో భగవంతుడు ఒయాసిస్సులు చూపుతున్నాడు.
అమ్మకు కాన్పువచ్చే రోజులు వచ్చాయి. అమ్మ మూడు రోజులు అలమటించింది. వయసు మళ్లింది. బలహీనత. మనోవ్యాధి! అమ్మకు ఏమవుతుందోనని భయం! తిండ్లు లేవు. నిద్రలు లేవు! మిత్రులు వస్తున్నారు. ఊరడిస్తున్నారు.
నాటు మంత్రసాని. అమ్మమ్మ. వైద్యం లేదు. తుపాకి వేయించాలన్నారు. కిషన్ రావుగారు తుపాకి తెచ్చారు. అది భర్ - మార్. మందు నింపాలి. కొట్టాలి. మూడుసార్లు తుపాకి పేలింది.
అమ్మ భారం దిగింది!
చెల్లె కేర్ మన్నది!!
మాకు అమ్మ దక్కింది.
అమ్మదగ్గర పాలులేవు.
పాలపొడికి డబ్బులేదు. డబ్బున్నా యుద్ధం రోజులు. బ్లాక్ మార్కెట్టు. పొడి సాధించాలి. మిత్రులు ఎంతో సాయపడ్డారు. పాలపొడి అందుతున్నది.
బారసాల శాస్త్రోక్తంగా చేశాను. నాయన కూడా వచ్చారు. చెల్లెలుకు నాయనమ్మ పేరు "బుచ్చమ్మ" అని పెట్టారు. మిత్రులకు ఆ పేరు నచ్చలేదు. కామ్రేడ్ నాగేశ్వరరావు "అరుణ" అన్నాడు. అరుణ, ఆ రోజుల విప్లవమూర్తి, చెల్లెలుకు "అరుణ" పేరే స్థిరపడింది.
పదిహేడు
"త్వమేవమాతా":
గార్లలో శివాలయం. శివాలయంలో సత్రం. సత్రం పేరుకే. ఎవరూ రావడం లేదు. అందులో ఒక గది నాకు ఇచ్చారు. అక్కడ చదువు చెప్పడం ప్రారంభించాను. సర్కారు బడిలో చదువు చెప్పరు. ఉర్దూ వచ్చిన పంతులు మరొకడు లేడు. నాకూ అంతంతే. ఖమ్మంలో ట్యూషన్లు చెప్పాను. ఆ అనుభవం ఉంది. నేను ఆముదపు చెట్టునే. కాని అక్కడ మహా వృక్షాన్ని!
ఒక్కొక్కరూ రావడం మొదలుపెట్టారు. నెలకు అయిదు. అది అప్పటికి ఎక్కువే. చదువు బాగా చెపుతానని పేరు వచ్చింది. చాలామందే కూడారు. ఒక బడి అయింది. గార్లలో ఆ తరం సాంతం నా దగ్గర చదివినవాళ్లే. పక్క ఊళ్ల నుంచి కూడా వచ్చారు. కొందరు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్లకు అమ్మ వండి పెట్టేది. అలాంటివాళ్లు ముగ్గురు నలుగురు ఉన్నారు. భద్రాచలం దగ్గరి మాధవరం నుంచి ఒకడు వచ్చాడు. అతని పేరు సుబ్రహ్మణ్యం.
చదువు చెప్పడం అంటే పాఠాలు మాత్రం చెప్పటం కాదు. నాకు పత్రికలు తెలుసు. కొంత రాజకీయాలు తెలుసు. గ్రంథాలయంలో పని చేశాను. దాంతో కొంత జ్ఞానం అలవడింది. విద్యార్థులకు అన్నీ చెప్పేవాణ్ణి. ప్రపంచయుద్ధం. జాతీయ పోరాటం, నిజాం రాజ్యంలో ఉద్యమం, రష్యా విప్లవం - సోషలిజం - ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో - నాకు తెలిసినన్ని చెప్పేవాణ్ణి.
నాకు వేరే ఆసక్తులు లేవు. విద్య ఇతరులకు అందించడమే ఆసక్తి. అందులోనే ఉత్సాహం - ఆనందం. చదువు దీపం లాంటిది. కరెంటు దీపం కాదు. జ్యోతి దీపం. దాంతో ఎన్ని దీపాలయినా వెలిగించవచ్చు. అసలు దీపానికి తరుగురాదు. విద్య దాన్ని మించింది. అందిస్తుంటే వెలుగు పెరుగుతుంది.
నాకు జబ్బు. ఉదయం కుండెడు వాంతి అవుతుంది. తిండి తినలేను. పిడికెడు తిని బయలుదేరడం. దానికే పులి తేనుపులు. తేనుపు తీస్తే పక్కనున్న వాడికి అసహ్యం. అయినా భరించేవారు. రాత్రిళ్లు కూడా చదివించేవాణ్ణి. పిల్లలు ఆసక్తిగా చదివేవాళ్లు. పిల్ల లేమిటి? అంతా సుమారు నా వయసువాళ్లే. ఒకటి రెండేళ్లు తేడా! పంతులుగా నన్ను గ్రామం గుర్తించింది.
శివాలయపు సత్రం బడిమాత్రం కాదు. అది ఒక సంగం. ఒక కూడలి. యువజనులు - వృద్ధులు అందరు కూడేవారు. చరిత్ర - భూగోళం - రాజకీయం అన్నీ చర్చకు వచ్చేవి. అదొక వేదిక. అది అందరినీ ఆకర్షించింది. అలా నాకు మిత్రులు అయిన వారిలో ఇద్దరు ప్రాణమిత్రులు. ఒకడు కొదుమూరి వేంకటేశ్వరరావు. గార్ల జాగీరులో వరదయ్యగారు వ్యవహర్త - వ్యాపారి. సంపన్నులు. వారి కొడుకు వేంకటేశ్వరరావు. అతడు తండ్రి చాటు బిడ్డ. అయినా అవసరం అంటే వందలు - వందలు ఇచ్చాడు. హాలి వంద నోటు నీలం రంగులో ఉండేది. వందంటే చాల ఎక్కువ ఆ రోజుల్లో!
రెండో వాడు నకిరెకంటి కృష్ణమూర్తి. వెంకటేశ్వరరావు. అక్కకొడుకే. కృష్ణమూర్తి కిరాణందుకాణంలో కూర్చునేవాడు. అడిగిన డబ్బు లేదనలేదు. సరుకులు ఇంటికొట్టువలెనే తీసికెళ్లేవాణ్ణి. పేపరు చదివినా - బాలసంఘం పెట్టినా - రాజకీయాలు నడిపినా - భయ్యాదుకాణంలో గులాబ్ జామున్ తిన్నా - నాగలింగం హోటల్లో పెసరట్టు తిన్నా ముగ్గురం ఉండేవాళ్లం. అది అపూర్వస్నేహం. పూర్వ జన్మబంధం!
ఒకసారి తెనాలి సభకు పి.సి. జోషీ వస్తున్నాడని తెలిసింది. పి.సి. జోషీ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి. పార్టీని ప్రజల్లోకి తీసివెళ్లింది అతనే. ప్రతిష్ట పెంచిందీ అతనే. జోషీ అంటే గొప్ప అడ్మిరేషన్. నేనూ - కృష్ణమూర్తి - హానీఫ్ బయలుదేరాం. తెనాలికి జోషీ రాలేదు. మేము మద్రాసు వెళ్లాం. చక్రపాణి గారిని కలిశాం. బాలసంఘం విషయం చెప్పాం. వారు ఎంతో సంతోషించారు. మేము చిన్నపిల్లలం. మమ్ములను మెచ్చుకున్నారు. అప్పుడు వారు ఆంధ్రజ్యోతి నడుపుతున్నారు. అది మాసపత్రిక. మేము బాలల పత్రిక నడుపుతామన్నాం. మారుమూల ప్రాంతంనుంచి అది సాధ్యపడదన్నారు. వారి ఆదరం మాకెంతో ఆవేశం - ఉత్సాహం కలిగించాయి.
మేము రావడం ఆలస్యం అయింది. ఊరు అట్టుడికింది. వీళ్లు ఏమైనట్లు? వస్తారా? రారా? కృష్ణమూర్తి ఒక్కడే కొడుకు. కుటుంబం సాంతం కలవరపడింది. రోజూ స్టేషనుకు వస్తున్నారు. నిరాశచెంది పోతున్నారు. మేము దిగాం. వారి ఆనందానికి అవధులు లేవు. అలా తీసికెళ్లినందుకు నన్ను కోప్పడ్డారు. మేం మద్రాసు వెళ్లివచ్చాం. అదొక అడ్వంచర్. మిత్రులు కూడారు. వివరాలు అడిగారు. వివరించాను. రెండు మూడు రోజులు పిల్లలకు అవే పాఠాలు!
పత్రిక రావడం కష్టం అని చెప్పాను కదా! నాగేశ్వరరావు మరో మిత్రుడు. అతడు డోర్నకల్లునుంచి తెచ్చేవాడు. డోర్నకల్లు రైల్వే జంక్షన్. అక్కణ్ణుంచి ఇల్లందుకూ, కొత్తగూడానికీ రైలు మార్గాలున్నాయి. అప్పటికి కొత్తగూడెంలో గనులు లేవు. స్టేషను కూడా భద్రాచలం యాత్రికుల కోసం ఏర్పడింది. బొగ్గు ఇల్లందునుండి వచ్చేది. దాన్ని "బొగ్గుట్టి" అంటారు. అన్ని రైళ్లూ డోర్నకల్లులో ఆగాల్సిందే. అక్కడ ఇంజనులో బొగ్గూ, నీళ్లూ నింపుతారు. అప్పుడు విమానాల్లేవు. ఢిల్లీ నుంచి మద్రాసు జి.టి.లో వెళ్లాల్సిందే. అది డోర్నకల్లులో చాలాసేపు ఆగుతుంది. ఆ బండిలో వచ్చిన రాజాజీ - రాజేంద్రప్రసాద్ - ఆజాద్ వంటి జాతీయనాయకులను డోర్నకల్లు వెళ్లి చూచాం. ఆనాడు వాళ్లను దర్శించడం - ఈనాడు సినిమా హీరోలను చూచినదానికన్నా గొప్ప థ్రిల్! వారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది.





