Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
భువనగిరి మహాసభ:
ఈ నేపథ్యంలో చరిత్రాత్మకం అయిన పదకొండవ మహాసభలు భువనగిరిలో జరిగాయి. ఆ సభలు 1944లో జరిగాయి. మరొకసారి రావి నారాయణరెడ్డి గారు అధ్యక్షత వహించారు.
భువనగిరిలో సభ ఏర్పాటు చేయటమే. కమ్యూనిస్టుల ప్రధాన ఎత్తుగడ. రావి వారి గ్రామం బొల్లేపల్లి భువనగిరికి దగ్గరలో ఉంది. నారాయణరెడ్డిగారు తొలినుంచి ప్రజారంగంలో ఉన్నారు. అన్ని ఉద్యమాల్లోనూ వారు పాల్గొన్నారు. నిస్వార్థులు. నిష్కళంకులు. తమ భూములను స్వచ్ఛందంగా ప్రజలకు పంచిపెట్టారు. "అంతా పంచలేదు లెండి. మేమూ తెలివైనవాళ్లమే. కొంత మిగుల్చుకున్నాం మాకోసం" అన్నారు నాతో ఒకసారి నారాయణరెడ్డిగారు. అంత నిష్కపటి. పోరాటాలు నిర్వహించడంలో దురంధరుడు. నేను వారిని 'తెలంగాణా హోచిమిన్' అనేవాణ్ణి. "అంత గొప్పవాణ్ణి చేయకండి" అనేవారు అతి వినయంగా.
1944 వరకే నారాయణరెడ్డిగారికి భువనగిరి ప్రాంతంలో తిరుగులేని పలుకుబడి ఉండేది. ఇది భువనగిరి సభల సందర్భంలో చెపుతున్నమాట. అప్పటికే తెలంగాణంలో పోరాటం - రావి వారు పర్యాయ పదాలుగా ఉండేవి. జాతీయవాదులకు భువనగిరిలో అడుగుపెట్టే ధైర్యం ఉండదు. అందుకనే భువనగిరిలో సభలు ఏర్పాటు చేసింది!
సరిగ్గా అనుకున్నట్లుగానే జరిగింది. కమ్యూనిస్టుల ప్రజా ఉద్యమం త్రివిక్రముని వలె పెరిగింది. ఆంధ్రమహాసభలో జాతీయవాదుల నిలకడ దుస్తరం అయింది. అది వారు గ్రహించారు. ఓటమి కన్న తప్పుకోవడం మిన్న అనుకున్నారు. మూక ఉమ్మడి రాజీనామాలిచ్చి బయటపడినారు. పైగా, తమదే నిజమైన ఆంధ్రమహాసభ అన్నారు. 1945లో మడికొండలో ఆంధ్రమహాసభలు జరిపారు. దానికి మందుముల నరసింగరావుగారు అధ్యక్షత వహించారు. కొండా వేంకటరంగారెడ్డిగారి ప్రోద్భలంతో ఆ సభలు జరిగినాయి.
పరువు దక్కించుకోవడానికే జాతీయవాదులు వేరు కుంపట్టి పెట్టుకున్నది. ప్రజలు కమ్యూనిస్టు ఆంధ్రమహాసభనే "ఆంధ్రమహాసభ"గా గుర్తించారు.
"పోటీ సంగమెందుకయ్య మందుములయ్యా
ఒక సంగం చాలదానయ్య కొండరంగయ్యా!"
అనే పాట ఆబాలగోపాలం నోట వినిపించింది.
ఆంధ్రమహాసభ విప్లవోన్ముఖం కావడం భువనగిరిసభ విశిష్టత - విప్లవత - చరిత్రాత్మకత.
1944 వేసవిలో గస్తీనిషాన్ తిర్పన్ - 53 కింద భువనగిరిలో సభ జరుపుకోవడానికి సులభంగానే అనుమతి లభించింది. కమ్యూనిస్టుపార్టీ ప్రజాయుద్ధం రోజులవి. ప్రభుత్వం అనుమతి నిరాకరించలేకపోయింది. అయినా, ప్రభుత్వం తన కుటిలనీతిని ప్రదర్శించింది.
ప్రభుత్వం అనుమతి ప్రతి నిర్వాహకులకు ఇవ్వలేదు. కలెక్టరుకు పంపుతానన్నది. పంపలేదు. ప్రజలు వేలకొలది కూడారు. ఊరేగింపు జరపాలి. నల్లగొండ కలెక్టరు భువనగిరిలో మకాం వేశాడు. ఊరేగింపు జరపనివ్వనంటాడు. జనసాగరం పొంగిపొరలుతున్నది.
రావివారు కలెక్టరుతో మాట్లాడారు. కలెక్టరు ఆర్డరు అందలేదన్నాడు. తాను నిస్సహాయుణ్ణి అన్నారు. రావివారు టెలిఫోనులో హోంసెక్రటరీతో మాట్లాడారు. సెక్రటరీ తాలూక్దారుడు - కలెక్టరుకు టెలిఫోనులో అనుమతి పత్రం వినిపించారు.
ప్రజలు దీనినే ఒక ప్రజా విజయంగా భావించారు. భువనగిరి అరుణగిరి అయింది. భువనగిరి వీధుల్లో ప్రజా ప్రవాహం ఉప్పొంగింది. వేలకొద్ది ఎర్రజండాలు రెపరెపలాడేయి.
రావినారాయణరెడ్డి జిందాబాద్
బద్ధం ఎల్లారెడ్డి జిందాబాద్
ఆంధ్రమహాసభ జిందాబాద్
దొరల, పటేల్ - పట్వారీల దౌర్జన్యం నశించాలి.
వెట్టిచాకిరి రద్దుకావాలి.
విప్లవం వర్ధిల్లాలే -
నినాదాలతో భువనగిరి కిల్లా ప్రతిధ్వనించింది.
భువనగిరి సభకు - తెలంగాణంలో మున్నెన్నడు రానంతగా - పదివేల జనం వచ్చింది. వచ్చిన జనం ఉత్సాహంతో ఉర్రూతలూగింది. చైతన్యం వెల్లివిరిసింది. తిరుగుబాటు రవ్వలు అంటుకున్నాయి. ప్రజాద్రోహుల గుండెల్లో ఫిరంగులు పేలాయి.
ఈ మహాసభలో నియమావళిని మార్చడం జరిగింది. సభ్యత్వ రుసుము చిలుకూరు సభలో రూపాయినుండి పావలాకు తగ్గించడం జరిగింది. ఈ సభలో పావలా నుంచి అణాకి తగ్గించి మహాసభను ప్రజాయుత్తం చేశారు.
కౌలుదారి సమస్య, వెట్టిచాకిరి, స్త్రీల సమస్యల మీద చర్చలు - తీర్మానాలు జరిగాయి.
భువనగిరిసభలు ప్రజలలో నూతనోత్సాహం - విప్లవ విస్ఫులింగాలను వెలిగించాయి. ఈ సభల తరువాతనే జనగాం ప్రజల వీరోచిత పోరాటాలు జ్వలించాయి. తెలంగాణా సాయుధ పోరాటానికి పటిష్టమైన పునాదులు వేశాయి. రానున్న విప్లవానికి రక్తపు బాటలు - ఎర్ర తివాచీలు - పరచాయి.
తెలంగాణంలో చిచ్చురగులుతున్నది. గార్లజాగీరు గాఢ నిద్రలో ఉన్నది. వ్యక్తిగతంగా చందా వీరభద్రంవంటివారు వార్దాకు వెళ్లి వచ్చారు. ఖద్దరు కట్టారు. ఆంధ్రమహాసభలకు హాజరయినారు. కాని, ఒక సంస్థలేదు. ఒక ఉద్యమం లేదు. ప్రజలు నిశ్చేతనంగా ఉన్నారు.
ఒకసారి ఊళ్లోకి పత్రిక తెచ్చినవాణ్ణి చావచితక కొట్టి పంపించారు. పత్రిక సైతం రాని స్థితి. తాసిల్దారు పేరు చెబితే పిట్టలు నీళ్లు తాగవు. చుట్టాలు - శాసనాలు లేవు. తాసిల్దార్ ఫర్మాను మాత్రమే. గార్లలో పోలీసు స్టేషను ఉన్నది. జేలు లేదు. ఎదురు తిరిగినవాడు గోరీల గడ్డకే!
ఒక విచిత్రం అయిన విషయం ఏమంటే - రావి నారాయణరెడ్డిగారి బొల్లేపల్లి - కొండా వెంకటరంగారెడ్డిగారి మంగళవారం అత్రాఫ్ బల్దా జిల్లాలోనివి. అది సర్ఫెఖాస్ ప్రాంతం. అంటే నాయకత్వం జాగీర్లనుంచే వచ్చింది!
కటిక చీకటినుంచే కాంతిరేఖ ప్రభవిస్తుంది!
అయితే, గార్ల జాగీరు మాత్రం కటిక చీకటిలో ఉంది. కాంతిరేఖ కోసం ఎదిరిచూస్తున్నది.
కొండపల్లి గోపాలరావు రాటుదేరిన కమ్యూనిస్టు. వాళ్లది కొత్తపల్లి. వాళ్ల చెల్లెలును మాటేటి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. మా అన్నయ్య శ్రీనివాసరావు ఇంట్లో ఎక్కువ ఉండేవాడు. గోపాలరావుగారు వచ్చినపుడు మా అన్నయ్యను కలుసుకున్నారు. అన్నయ్యలో నిక్లిప్తమయిన నిప్పును గోపాలరావు కనిపెట్టారు.
అప్పటినుంచి కామ్రేడ్ గోపాలరావు కవి దాశరథి విడువలేదు. మా ఇంటికి నిరంతరం వచ్చారు. అమ్మ పెట్టిన 'పచ్చి పుళి - ప్రసాదం' ఆనందంగా భుజించారు. నేలమీద - చాపమీద పడుకున్నారు. రాత్రింబవళ్లు చర్చించారు. అన్నయ్యను సమాధానపరచారు.
అన్నయ్య కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. పార్టీలో సభ్యులయినాడు. మాకు సహజంగా ఆవేశం ఎక్కువ. అందునా దాశరథి కవి. ఉరకలు పెడుతున్న పరువంలో ఉన్నాడు. పార్టీకి అంకితం అయినాడు. గోపాలరావు వెంట వెళ్లిపోయాడు.
కామ్రేడ్ గోపాలరావుగాని - కామ్రేడ్ దాశరథిగాని - కమ్యూనిస్టుపార్టీగాని; ఇద్దరు చెల్లెళ్లు - నేను - అమ్మ - అడవిలో ఇల్లు - వీటిని గురించి ఇసుమంతాలోచించలేదు. వెళ్లిపోయారు.
అన్నయ్య పార్టీలో చేరడం తెలంగాణా సాహిత్య చరిత్రకు ఒక క్రాంతిరేఖ. అంతకుముందు దాశరథి కవి మాత్రమే. విశ్వనాథ 'పిట్ట కొంచెం - కూత ఘనం' అని మెచ్చిన కవి. కాని, కామ్రేడ్ దాశరథి కవితలో "అగ్నిధార" కురిపించాడు. 'రుద్రవీణ' పలికించాడు. కవితలో విప్లవ పలాశాలబాట పరచాడు. "నా గీతావళి ఎంతదూరము ప్రయాణంబౌనొ అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టి"నాడు.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి, అగ్గిలో దింపినావు
నా తెలంగాణ, కోటి రత్నాల వీణ!
అని నిజాము జేలునుంచి రణన్నినాదము చేసినాడు.
"సారే జహాఁ సే అచ్ఛా" అని ఒక్క ఇక్బాలే, 'కోటిరత్నాలవీణ' అని ఒక్క దాశరథి మాత్రమే అనగలిగినారు.
ఆ తరువాత పోలీసు చర్య వరకూ అన్నయ్య పట్టుమని పదిరోజులు ఇంటి పట్టున ఉండలేదు.
నాయన ఆస్తి మూట కట్టుకొని వెళ్లిపోయారు. అన్నయ్య కవితాగ్ని కిరీటం ధరించి వెళ్ళిపోయాడు. నేను పసివాణ్ణి. పదిహేనేళ్లవాణ్ణి. చదువు లేనివాణ్ణి. రోగిష్టిని. ఆవేశపరుణ్ణి. నామీద సంసారభారం.





