Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    డోర్నకల్లు జాగీరు లోనిది కాదు. ఖాల్సా ప్రాంతం. నాగేశ్వరరావు బడికి పత్రిక తెచ్చేవాడు. జనం మూగేవారు. పత్రిక చదివి వినిపించేవాళ్లం. వివరించేవాళ్లం. ముఖ్యంగా జనగాంలో జరుగుతున్న వీరోచిత పోరాటాలు ప్రజలను కదిలించేవి. ఆంధ్రమహాసభను అందరూ ప్రశంసించేవారు. అప్పటి పత్రిక నాలుగు లేక ఆరుపేజీలుండేది. ఖరీదు అణా.

 

    తరువాత పత్రిక పోస్టులో తెప్పించాం. కొన్నాళ్లు తాసిల్దార్, పత్రిక పోస్టులో మాయం చేయించాడు. అది కలకాలం సాగలేదు. పోస్టురాగానే మేం గుంపుగా వెళ్లాం. పోస్టుమాస్టరు దగ్గర కూర్చున్నాం. పత్రిక తెచ్చుకున్నాం. తరువాత పోస్టు మనిషి తెచ్చి ఇచ్చాడు.

 

    పోస్టులో పేపరు తెప్పించడంలో ఒక చిక్కుంది. పోస్టు నిజాం రాజ్యం వరకే పరిమితం. మనియార్డరు ఆంగ్రేజు ఇలాకాకు పోదు. రెండు మనియార్డరు ఫారాలు వ్రాయాలి. ఒకటి హైదరాబాద్ లో ఉన్న బ్రిటిషు పోస్టు మాస్టరు పేర - మరొకటి మనం పంపించదలచినవారి పేర. బ్రిటిషు పోస్టుమాస్టరు పంపించేవరకు సమయం పడుతుంది.  

 

    కొంతకాలం తరువాత పత్రిక ఏజన్సీ తీసుకున్నాను. దినపత్రిక ఆంధ్రప్రభ - వారపత్రిక ప్రజాశక్తి తెప్పించాను. నేనే స్వయంగా పంచేవాణ్ణి. చందాలు వసూలు చేసేవాణ్ణి. వర్తకులు పత్రిక కొనడం ప్రారంభించారు. పత్రిక ఇవ్వడానికి పోయినప్పుడో - చందాకు పోయినపుడో వర్తకులతో మాట్లాడేవాణ్ణి. వాళ్ళతో సంబంధాలు ఏర్పడ్డాయి. వారికి నా విషయంలోనూ - ఉద్యమ విషయంలోనూ సానుభూతి ఏర్పడింది. వారు చందాలు ఇవ్వడానికిగాని, వ్యక్తిగతంగా నాకు ఇవ్వడానికిగాని ఏమాత్రం వెనుకంజ వేసేవారుకారు.

 

    పార్టీ పత్రిక "ఖేమీజంగ్", "గోలకొండ" పోస్టులో వచ్చేవి. బడి ఒక గ్రంథాలయం అయింది. "ప్రజాశక్తి" దినపత్రిక వచ్చిన్నాడు ఎర్రజండాలు పట్టుకొని గుంపులుగా స్వాగతం పలికాం. ఆంధ్రప్రభ బంద్ చేశాం. ప్రజాశక్తి తెప్పించాం. వాస్తవంగా ప్రజాశక్తి అచ్చు బావుండేది. తెలంగాణ ఉద్యమ వార్తలు ఎక్కువగా ఉండేవి. నేను ప్రజాశక్తికి వ్యాసాలు వ్రాశాను. నిజాం పరిస్థితులు - జాగీర్ల దుస్థితిని గురించి వ్రాసిన నా వ్యాసాలు "ప్రజాశక్తి"లో రావడం నాకు గర్వకారణం. మిత్రులకు ఉత్సాహహేతువు.

 

    ఆంధ్రమహాసభ అణా సభ్యత్వ ఫారాలు కిషన్ రావుగారి దగ్గర తీసుకున్నాం. మాటేటి కిషన్ రావుగారు పేష్కారు వరవరరావుగారి పెద్దకొడుకు, పెంపుడు పోయాడు. కావడానికి కరణమే. కాని, లంకలో విభీషణుడు. ఆంధ్రమహాసభ అంకితం అయినాడు. ఎచ్చులు చెపుతాడు. ముఖస్తుతికి పొంగిపోతాడు. అందరూ అతన్ని హేళన చేస్తారు. అయినా మంచి కార్యకర్త. ఆంధ్రమహాసభకు అంకితం అయిన పెద్దల్లో దాశరథి - కిషన్ రావు - చందా భద్రం ముఖ్యులు.   

 

    నేనూ - నాగేశ్వరరావు - వేంకటేశ్వరావు - కృష్ణమూర్తి పిల్లలం. సభ్యత్వం ఫారాలు నలుగురం నింపినా సరిపోవడం లేదు. శివాలయం జనంతో నిండుతున్నది. బడి ఆంధ్రమహాసభ కార్యాలయం అయింది. విద్యార్థులు - కిషన్ రావు వంటి పెద్దలు నింపినా జనం ఇంకా వస్తూనే ఉన్నారు.

 

    నా బడి గ్రంథాలయం అయింది. ఆంధ్రమహాసభ అనధికార కార్యాలయం అయింది. నేనూ నాగేశ్వరరావు ఫారాలు తీసుకున్నాం. ఊళ్లమీద పడ్డాం. ఇంటింటికీ వెళ్లి చేయించాం. వెళ్లిన చోటనల్లా మజ్జిగ ఇచ్చారు. టీ ఇచ్చారు. భోజనాలు పెట్టారు. ఎంతో ఆదరం చూపారు. ఆత్మీయత కనబరచారు. అదొక అపూర్వ అనుభవం! అనంత అనుభూతి!! అసామాన్య ఆత్మీయత!!

 

    ఇదంతా ఎవరో చెప్పితే చేసింది కాదు. ఒకరు బోధించింది కాదు. ఇది సాంతం ఉద్యమ ప్రభావం! ఉద్యమమే నన్ను ఉరికించింది. ప్రజలు నన్ను తమవాణ్ణిగా చేసుకున్నారు. వారే నాకు పాఠాలు నేర్పారు. నేను వ్యక్తులతో సంబంధం పెట్టుకోలేదు. పదవులకు పాకులాడలేదు. ఉద్యమం నన్ను ఉత్తేజితుణ్ణి చేసింది. నా కర్తవ్యం నిర్వహించాను. నాకు సభ్యుణ్ణి అయ్యే వయసు లేదు. నేను సభ్యుణ్ణి కాలేదు.

 

    ఈనాటి వరకు నేను ఏ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు పత్రికలు - పుస్తకాలు - పరిస్థితులు - ప్రజలు నన్ను మనిషిని చేశాయి. దేశం మనకంటే గొప్పది. దేశంకోసం ఏదయినా చేయాలి. నాకు సాధ్యం అయినంత చేస్తున్నాను. ఇంతవరకు ఫలితం ఆశించలేదు. గుర్తింపుకు పాకులాడలేదు.

 

    కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన
    మాకర్మఫల హేతుర్భూర్మాతే సంగోత్స్వకర్మణి.        - భగవద్గీత -2-47.

 

    పని చేయడమే నీ కర్తవ్యం. ఫలమును ఆశించకు. ఫలితానికి కారణభూతుడవు కావద్దు. అట్లని పని చేయకుండరాదు. ఇది వేదాంతం కాదు. మనిషికి నిత్యావసరం. మానవతకు మహిత మార్గం.

 

    పని ఎట్లాగూ చేస్తున్నాం - "బాలసంఘం" ఏర్పరచడం మంచిది అనుకున్నాం. ఆలోచన నాగేశ్వరరావుది అనుకుంటా. వెంకటేశ్వరావు డబ్బు అందించాడు. ఖమ్మం వెళ్ళి సభ్యత్వ ఫారాలు, రసీదు పుస్తకాలు అచ్చువేయించి తెచ్చాం. బోర్డు వ్రాయించాం. అన్నీ సిద్ధం చేశాం. తేదీగూడా నిర్ణయించాం.    

 

    బాల సంఘం గప్ చిప్ గా ప్రారంభించడం ఇష్టం లేదు. ఏదో కాస్త సందడి - అలజడి ఉండాలి. గ్రామంలో మరికొన్ని వీధి బళ్లున్నాయి. ఆ పంతుళ్లను ఒప్పించాం. పిల్లలను సిద్ధం చేశాం. అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఊరేగింపు తీయాలనుకున్నాం. దానికి గస్తీతిర్పన్ కింద అనుమతి కావాలి. తాసిల్దారును అడిగే ధైర్యం లేదు. ఇస్తాడని నమ్మకం లేదు.    

 

    అనుమతి లేకుండానే ఊరేగింపు తీయడానికి నిర్ణయించాం. కిషన్ రావు వగైరాలు వారించారు. పోరలం కదా! వినలేదు. ఏమవుతుంది? అరెస్టు చేస్తారు. నాలుగు దెబ్బలు కొడ్తారు. ఇంతేకదా! అది ఆనాటి తెగింపు. శాసనోల్లంఘనానికి పూనుకున్నాం! అది వెర్రి సాహసమే! కాని, అంతా సాహసం చేశారు.

 

    ఆ రోజు వచ్చింది. ఉదయమే శివాలయం చేరుకున్నాం. క్రమక్రమంగా పిల్లలు చేరుతున్నారు. వింత చూడాలనో - అవాంతరం జరుగుతుందనో - దూరంగా జనం కూడుతున్నారు. వాతావరణంలో జంకు, భయం, సస్పెన్సు కనిపిస్తున్నాయి. అయినా పిల్లలు కూడుతూనే ఉన్నారు. జనం మూగుతున్నారు. గుసగుసలు చెప్పుకుంటున్నారు.

 

    పిల్లలను వరుసలుగా రోడ్డుమీద నిలబెట్టాం. ఎర్రజండాలు ఇచ్చాం. "బాలసంఘ సభ్యులం - భరతమాత పుత్రులం" పాడుతున్నాం. చూడడానికి వచ్చిన జనం ఎక్కువయినారు. అమ్మా, చెల్లెళ్లు కూడా వచ్చారు. ఇది జాగీరు చరిత్రలో తొలి ఊరేగింపు! జనం డాబాలమీద, చెట్లమీద ఎక్కారు.

 

    పోలీసులను వెంటపెట్టుకొని అమీన్ సాబ్ వచ్చాడు. వాళ్లూ వరుసగా నుంచున్నారు. పోలీసులను జనం చూచారు. పిల్లలు చూచారు. ఒక్కరూ కదల్లేదు!

 

    "బాలసంఘం - గార్ల" అని వ్రాసిన ఎరుపు బ్యానర్ నేనూ, నాగేశ్వరరావు పట్టుకున్నాం. నా చేతిలోని కర్ర నాగేశ్వరరావుకు ఇచ్చాను. నేను అమీన్ సాబ్ - సబిన్ స్పెక్టరు - దగ్గరకి వెళ్ళాను.

 

    "మార్తే క్యా! - కొడ్తారా?" అని అడిగాను.

 

    అమీను తడబడ్డాడు. ఈ ప్రశ్న వస్తుందనీ - ఇలా అడుగుతారనీ అతను ఊహించలేదు. ఏం చెప్పాలో అర్థం కాలేదు.

 

    "క్యోఁ మార్తే - ఎందుకు కొడ్తాం?" అన్నాడు.

 

    "ఫిర్ క్యోఁ ఆయే? - ఎందుకు వచ్చినట్లు?" అడిగాను.

 

    "సాథ్ చలేంగే - వెంట సాగుతాం" అన్నాడు.

 

    "చలో" అని నేను బ్యానర్ అందుకున్నాను.

 

    'బాలసంఘం జిందాబాద్' అని సాగాం. పిల్లల వరుస కొద్దిగానే ఉంది. జనం తండోపతండాలుగా మావెంట సాగారు. ఊరేగింపు అత్యంత ఉత్సాహంగా సాగింది.

 

    "బాలసంఘం జిందాబాద్
    ఆంధ్రమహాసభ జిందాబాద్
    రావి నారాయణరెడ్డి జిందాబాద్
    ఎర్రబావుటా జిందాబాద్!"

 

    నినాదాలతో ఆవేశంగా ఉత్సాహంగా సాగింది. ఉద్రేకం లేదు. ముర్దాబాదులు లేవు. ఊరేగింపును చూడడానికి జనం ఇళ్లముందు గుంపులుగా కూడారు.

 

    ఊరేగింపు పెద్ద బజారుకు చేరింది. బాజావాళ్లు నాదస్వరం వాయిస్తూ స్వాగతం పలికారు. ఊరేగింపు ముందు నడిచారు. ఆనాటి ఊరి ఉత్సాహం చూడాల్సిందే. వ్రాయరాదు. అన్ని వీధులూ తిరిగి శివాలయం ముందుకు చేరుకున్నాం.   

 

    అక్కడ అమీను నన్ను పిలిచాడు. ఏదో అవాంతరం జరుగుతుందని అంతా ఊపిరి బిగపట్టారు. నేను భయపడలేదు. వెళ్లాను.

 

    "మీటింగ్ బాహర్ నహీఁ - అందర్ కర్నా. అంజామ్ బురాహోగా - మీటింగు బయటకాదు. లోన చేసుకోండి. పరిణామాలు బాగుండవు" అన్నాడు. అమీను ఆవేశంలో ఉన్నాడు. ఓడినట్లున్నాడు. బింకం ప్రదర్శిస్తున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.