Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

3.    దేవతలారా! 'పరివిత్తి' అంగాంగములందు గల పాశబంధన బాధలకు విముక్తి కలిగించండి. మీరు బాధల నుండి విముక్తి కలిగించువారలు కదా! పూషదేవా" భ్రుణాది పాపములను పరిమార్చుము.
   
                                                  --౦౦౦--
   
1.    పరివిత్తికి కలిగిన పాపమును పూర్వము దేవతలు 'ఆప్య' అను త్రితలందు ప్రవేశపెట్టినారు. త్రితలు ఆ పాపమును సూర్యోదయమైన తరువాత నిద్రించు వారియందు ప్రవేశపట్టినారు. పరివిత్తిని ఇంకను బాధించు పాపమును దేవతలు, మంత్రములు దూరము చేయును గాక.
   
2.    పరిదేవన జనిత పాపమా! నీవు పరివిత్తిని విడువుము. అగ్ని సూర్యుల కాంతి యందు చేరుము. అగ్ని ధూమమందు చేరుము. ధూమ మేఘమందు చేరుము. నీటి నురగ యందు చేరుము. వాని యందు బహు రూపములతో చేరుము.

3.    దేవతలు, త్రితలు ఇట్లు ఈ పాపము పన్నెండింటికి పంచబడినది. ఇది మానవులందు కూడ చేరినది. అట్లయినను బాధించుచున్నచో దేవతలు, మంత్రములు దానిని నివారింతురు గాక.
   
                                       పన్నెండవ అనువాకము
                                       మొదటి సూక్తము -55
   

వినియోగము :-

   
     1)    ఆచార్య మరణమున ఘ్రుత, సమిధ, పురోడాశాదుల హోమమున ఈ అనువాకము వినియోగము.
   
    మంచము మీద పడుకొని అన్నము తిను వాని ప్రాయశ్చిత్తార్ధము యాజ్ఞికుడు ధాన్యము, యవలు,  తిలలను ఈ అనువాకముచే హోమించునది. ఈ కర్మమునందే పాక యజ్ఞతంత్రమును చేసి వైవస్వతచరును ఈ అనువాకముచే ఆహుతి ఇచ్చునది. ఖదాశయాన్నమును నాలుగు మూకుళ్ళలో నింపి ఈ అనువాకముచే     అభిమంత్రించి బ్రాహ్మణునకు దానము చేయునది.
   
    "తథా సవాన్ ఆధాస్యమానః సవాగ్నౌ అనేనామ వాకేన ఆజ్యం జుహుయాత్. సమిధః శకలాన్వా ఆదధ్యాత్"
   
    అంత్యేష్టి కర్మమున చితిలో అగ్నిప్రజ్వరిల్లినంత ఈ అనువాకముచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
   
    యముని భయము కలిగినపుడు మహాశాంతి యందు ఈ అనువాకమును చదువునది.
   
     2) సవయజ్ఞపు బ్రహ్మ ఓదనాగ్ని యందు ఈ సూక్తపు రెండవ తృచ, మరుసటి సూక్తపు రెండవ తృచచే  పూర్ణాహుతులు ఇచ్చునది.
   
    ఈ సూక్తపు రెండు తృచలచే అగ్నిష్టోమపు తృతీయ సవనమున ఆదిత్యగ్రహ హోమమును బ్రహ్మ అనుమంత్రించునది. వీనితోనే సర్వప్రాయశ్చిత్త హోమము చేయునది.
   
     3) రెండవ తృచచే ఆగ్రాయణేష్టి యందు వైశ్వదేవచరును బ్రహ్మ అనుమంత్రించునది.
   
1.    మేము ఇంద్రియ పరవశులమై దేవతలకు కోపము తెప్పించు పాపకార్యములు చేసినాము. దేవతలారా! ఆ పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి.
   
2.    దేవతలారా! మీరు యజ్ఞ - సత్య సంబంధులు. మేము హోమించుటకు అడ్డుతగులు పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి. యజ్ఞము చేయు కోరిక ఉన్నను ఏ పాపము వలన చేయలేక పోవుచున్నామో అట్టి పాపముల నుండి విముక్తి కలిగించండి.
   
3.    విశ్వేదేవతలారా! మేము  పశుమేదచే యాగము చేయదలచినాము. స్రవముచే ఘ్రుతాహుతులు ఇవ్వదలచినాము. కాని పాపభయమున చేయలేకున్నాము. అట్టి పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి.
   
                                                --౦౦౦--
 

1.    విశ్వేదేవతలారా! తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపములు చేసినాము. అనుగ్రహించి ఆ పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి.
   
2.    జాగ్రదావస్థలోను, సుషుప్తావస్థలోను పాపములు చేసినాము. అట్టి పాపముల నుండియు, భూత భవిష్యత్ పాపముల నుండియు, శృంఖలల నుంచి వలె, మమ్ము విముక్తులను చేయండి.
   
3.    శృంఖలలు విడిన వాని వలెను, స్నానముచే మలిన రహితుని వలెను విముక్తుడను అయినాను. జల్లెడచే ఘ్రుతము శుద్దమైనట్లు దేవతలు నన్ను పరిశుద్దుని చేయుదురు గాక.
   
                                       రెండవ సూక్తము - 56
   
వినియోగము :-

   
      1) తొలి తృచచే ఘ్రుత, తైల, మధువుల విపరీత వృద్దిక్షయముల ప్రాయశ్చిత్తార్ధము ఘ్రుతాహుతులు  ఇచ్చునది.
   
      2) అప్పు ఇచ్చినవాడు చనిపోవునపుడు రెండవ తృచ మరియు మరుసటి సూక్తపు రెండు తృచలచే ధనమును అభిమంత్రించి పుత్రునకు గాని, సగోత్రీకునకు గాని ఇచ్చునది. వీనితోనే ధనమును అభిమంత్రించి శ్మశానమందుకాని, బాటల కూడలి యందుగాని పెట్టునది. వీనితోనే అభిమంత్రించి ద్రవ్యమును గడ్డిలో వేయునది లేదా కాల్చునది. ఈ మూడు తృచలు సవయజ్ఞపు పూర్ణాహుతి యందు వినియోగము.
   
    లౌకికాగ్నిచే ఇల్లు కాలినపుడు ఈ మూడు తృచలచే మిశ్రమ ధాన్యపు పూర్ణాంజలి ఆహుతి ఇచ్చునది.
   
      3) అగ్నిష్టోమాంతమున గార్హపత్యాగ్నిని అరుణులందు చేర్చినపుడు రెండవతృచచే అనుమంత్రించునది.
   
1.    కృషీవలురు అజ్ఞానమున భూమిని త్రవ్వునట్టి యమ సంబంధ అక్రియను చేసి ఉన్నారు. కావున వివస్వత పుత్రుడగు యమునకు హవిస్సులు అర్పించుచున్నాను. అతడు మా అన్నమును మధుమంతము చేయును గాక.
   
2.    యముడు తన హవిర్భాగమును స్వీకరించును గాక. మాకు మధు, క్షీరాదులు కలిగించును గాక. తల్లిదండ్రుల విషయమున మేము చేసిన పాపమూ శాంతించును గాక.
   
3.    ఈ పాపము తల్లి, తండ్రి, అన్నదమ్ముల ఆగ్రహము వలన కలిగినను, పుత్రునకు హృదయబాధ వల్ల కలిగినను వారి ఆగ్రహము శాంతించును గాక.
   
                                                          --౦౦౦--
   
1.    నేను రుణగ్రస్తుడనైనాను. అప్పు తీర్చలేక పోయినాను. అట్లై యముని పాశములందు పడినాను. అగ్నిదేవా! నీవు సర్వపాప విమోచకుడవు. మమ్ము ఆ పాశ బంధముల నుండి విడిపింపుము.
   
2.    రుణదాతనుండి తీసికొన్న రుణమును జీవించి ఉండగనే తీర్చుచున్నాము. ఒక కొలతతో తీసికొని నేను వాడిన ధాన్యము రుణము అగ్నిదేవా! నీ వలన తీరినది. నేను ఇప్పుడు రుణ విముక్తుడను అయినాను.
   
3.    అగ్నిదేవా! మూడు లోకములందు మేము రుణవిముక్తులము అయినాము. దేవయాన, పిత్రుయానములందును, పరలోకము నందును మేము రుణ విముక్తులము అగుదుము గాక.
   
                                           మూడవ సూక్తము -57
   
వినియోగము :- పూర్వ సూక్తమున చెప్పబడినది.
   
1.    కాళ్ళు, చేతులు పాపము చేసి ఉండవచ్చును. ఇంద్రియలోలత్వమున అప్పులు చేసినాము. ఉగ్రంపశ్య, ఉగ్రజిత అప్సరసలు ఆ రుణమును రుణదాతకు చెల్లింతురు గాక.
   
2.    ఉగ్రంపశ్య, రాష్ట్రభ్రుత్ అప్సరసలారా! మేము పాపములు చేసినాము. నిషిద్ద కర్మలు ఆచరించినాము. అట్టి పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి. రుణము తీర్చలేదని యముడు దండము ఎత్తకుండ చేయండి.
   
3.    నేను ఎవనికి బాకీ పడినానో, కామవశమున ఎవని భార్య వద్దకు పోయినానో, ఎవనిని నేను అప్పు అడుగుటకు వెళ్ళుదునో అట్టివారు నాతో  అతి ప్రతికూలురుగా మాట్లాడకుందురు గాక. అప్సరసలారా! నా మనవిని మనసునందు ఉంచుకొనండి.
   
                                                           --౦౦౦--
   
1.    వ్యవహార జ్ఞానము తీర్చెదనని ప్రతిజ్ఞ చేసిన రుణమును తీర్చలేక పోయినాను. కావున ప్రాణులకు హితకారివి, వైశ్వానరుడవు, అధిపతివి అయిన అగ్నిదేవా! నాకు పుణ్యలోక ప్రాప్తి కలిగించుము.
   
2.    నేను ఈ లోకమున చేసిన రుణమును - దేవతల విషయమున నా యొక్క విధులను వైశ్వానరాగ్నికి అర్పించుచున్నాను. ఋణ బంధ విమోచనజ్ఞుడగు అగ్నిదేవత మమ్ము ఋణబంధముల నుండి విముక్తులను చేసి మాకు పుణ్య లోకములు కలిగించును గాక.
   
3.    యజ్ఞ దానాదులు చేయుదునన్నాను. దేవతలను అర్చింతునన్నాను. ఆ రుణములు తీర్చలేకపోయినాను. అజ్ఞానుడనై ఐహిక వాంఛలనే అర్ధించినాను. కావున పావక వైశ్వానరా! నన్ను పునీతుడను చేయుము. అసత్యాది పాపములను నేను తొలగించుకొందును.
   
                                             నాలుగవ సూక్తము - 58
   
వినియోగము :-

   
      1) రెండవ తృచచే కర్ర, ఇనుము, రజ్జు బంధన విమోచనమునకు చర్మము లేక లోహము లేక రజ్జువులను సంపాతన, అభిమంత్రణలు చేయునది.
   
1.    మేము అంతరిక్షమునకు, భూమికి, ద్యులోకమునకు, తల్లికి, తండ్రికి అపచారములు చేసినాము. ఆ దోషములన్నియు గార్హపత్యాగ్ని సేవ వలన తొలగిపోవును గాక. అగ్ని దేవత మాకు సుకృత లోకములు కలిగించును గాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.