Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    ఇక్కడ ఒక విషయం గమనించాలి - దేవరకొండ సభలో గస్తీనిషాన్ తిర్పన్ రద్దు చేయమని తీర్మానించారు. అంతమాత్రానికి ప్రభుత్వం నాలుగేళ్లు సభ జరుపుకోనివ్వలేదు. ఇప్పుడు ఇంత తీవ్రమయిన హెచ్చరికను మింగవలసి వచ్చింది. ఇది ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పు. బ్రిటిషు ప్రభుత్వ విధానాలకు తాసీల్దారు నిజాం అనుసరించక తప్పలేదు.

 

    ఈ సభలో కౌలుదారీ సమస్యలు - వెట్టిచాకిరీ - రైతుల సమస్యలు - పౌరహక్కులు - స్త్రీల సమస్యలు మున్నగు విషయాలమీద చర్చ జరిగింది. నియమావళిలో తీవ్రమయిన మార్పులు జరిగాయి. ప్రతినిధులను ఎన్నుకునే నియమం చేయడం జరిగింది.

 

    అతి ప్రధానమయిన మార్పు సభ్యత్వ రుసుము రూపాయినుండి పావలాకు తగ్గించడం - ఇది మహాసభను ప్రజల దగ్గరకు చేర్చింది. రైతు కూలీలు సభ్యులు కావడానికి అవకాశం కలిగింది.

 

    తొమ్మిదవ ఆంధ్రమహాసభ 1942లో వరంగల్లు జిల్లా ధర్మవరంలో జరిగింది. దీనికి మాదిరాజు రామకోటేశ్వరరావుగారు అధ్యక్షత వహించారు.

 

    1942 జాతీయంగానూ, అంతర్జాతీయంగాను ప్రాధాన్యత వహించిన సంవత్సరం. అందువలన జాతీయ అంతర్జాతీయ సమస్యలు చర్చకు వచ్చాయి. మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం కూడా అందుకు కారణం.  

 

    ఈ సభలో రాజకీయ తీర్మానాన్ని గురించి చర్చ జరిగింది. ఇందులో రెండు స్పష్టమైన వర్గాలు ఏర్పడినాయి. ఒకటి - రావి వర్గం. ఒకటి - బూర్గుల వర్గం. ఉభయులకు తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. జాతీయవాదుల్లో కొందరు యువకులు రావి పక్షం వహించారు. బాలెట్ పెట్టక తప్పలేదు. ఓటింగులో రావి వర్గం గెలిచింది. బూర్గుల వర్గం ఓడింది. ఇది మహాసభలో కమ్యూనిస్టు భావాల ప్రాబల్యానికి నిదర్శనం.

 

    ఓటమి ఆగ్రహానికి కారణం అయింది. తమ సంస్థలోకి కమ్యూనిస్టులు చొరబడుతున్నారని అలిగారు. ఒక దశలో రామకోటేశ్వరరావుగారు రాజబహద్దూర్ గౌడ్ తో "కమ్యూనిస్టు పార్టీమీద నిషేధం తొలగింది కదా -వేరుగా పనిచేసుకోరాదా?" అన్నారు. "మేము ఈ కుటుంబంలోనే ఉంటాం - విడాకులు తీసుకోం" అన్నారు గౌడ్. అతను చమత్కారి.   

 

    కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని జాతీయులు సహించలేకపోయారు. ముప్పయి మంది స్థాయీ సంఘంనుంచి రాజీనామా చేశారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు - మందుముల రామచంద్రరావు - పరసా రంగారావువంటి ప్రముఖులున్నారు. వీరు యువకుల విషయంలో వృద్ధులవలె అలిగారేగాని విజ్ఞత ప్రదర్శించలేకపోయారు. వీరి అలక వల్ల కమ్యూనిస్టులు బలపడ్డారు. రామకోటేశ్వరరావుగారు ఇరుకున పడ్డారు. వారు ఆ 30 మందిని బ్రతిమిలాడారు. బామాడారు. రాజీనామాలు ఉపసంహరింపజేశారు.  

 

    ఈ సభల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం - జాతీయవాదులు పల్చబడడం స్పష్టం.

 

    పదవ ఆంధ్రమహాసభ 1943లో హైదరాబాదులో జరిగింది. దీనికి జాతీయవాది కొండా వెంకటరంగారెడ్డిగారు అధ్యక్షత వహించారు. కమ్యూనిస్టులు బలపడుతున్న నేపథ్యంలో భూస్వాములు - దొరలకు ప్రాతినిధ్యం వహించే కొండా రంగారెడ్డి అధ్యక్షులు కావడం విచిత్రం. ఇది కమ్యూనిస్టు విధానానికి ఓటమి - కాని, కమ్యూనిస్టు ప్రాబల్యానికి కాదు.   

 

    బ్రిటిషాంధ్రంలోనూ విధానాలను లెక్క చేయక ప్రజలు కమ్యూనిస్టులను బలపర్చారు.

 

    ఈ సభలో రాజకీయ సంస్కరణలు చర్చకు వచ్చాయి. కమ్యూనిస్టులు హిందూ - ముస్లిములకు చెరి సగం ప్రాతినిధ్యాన్ని బలపరిచి, సిద్ధాంతపరంగా అపరాధం చేశారు. ఈ వాదంలో యువకులు కమ్యూనిస్టులకు సహకరించలేదు. ఓడిపోయారు.

 

    "ప్రతాపరెడ్డి, రామకృష్ణుడు, రంగారాయుడు
    పులిజాల రంగారాయుడూ - పితామహుడు
    రంగారెడ్డి, వీరేగాదు - మందుములవారు
    రావివారు, మాదిరాజువారు - మన మాదిరాజువారూ
    పదియవ సభకు రంగారెడ్డికి పట్టం కట్టేరు."

 

    అని కాళోజి నారాయణరావుగారు చదివారు. ఇందులో వ్యంగ్యం ఉంది - అందరూ ఎలా కలిశారా? అని.

 

    "చెరిసగం" సిద్ధాంతానికి విరుగుడుగా కమ్యూనిస్టులు ఆదాయపు పన్ను తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రత్యక్షంగా వర్తకులకు - పరోక్షంగా ప్రజలకు భారం అవుతుందని జాతీయవాదులు వ్యతిరేకించారు. ఓటింగు జరిగింది. తీర్మానానికి వ్యతిరేకంగా 17 ఓట్లు ఎక్కువచ్చాయి. కమ్యూనిస్టుల తీర్మానం ఓడిపోయింది.

 

    కమ్యూనిస్టులు తీర్మానం ఓడిపోవడాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. సభ ముగియగానే జాతీయ నాయకులు వర్తకులకు అనుకూలము - ప్రజలకు వ్యతిరేకులు అని నినాదాలు చేశారు కమ్యూనిస్టులు.

 

    'కమ్యూనిస్టులతో పడలేము' అనుకున్న కొందరు జాతీయ పక్షం ఏర్పరచుకున్నారు. వారిలో రాజలింగం - కోదాటి నారాయణరావు - హయగ్రీవాచారి మున్నగువారు ఉన్నారు.

 

    వృద్ధులు హనుమంతరావు - కోటేశ్వరరావుగారు జాతీయ పక్షంలో చేరలేదు. ఉపేక్షించారు.

 

    ఆ విధంగా ఆంధ్రమహాసభ మూడుగా చీలిపోయింది.

 

    1. కమ్యూనిస్టు సభ.

 

    2. జాతీయవాద యువకుల సభ

 

    3. ఉపేక్షించిన వృద్ధవర్గం.

 

    పదవ ఆంధ్రమహాసభ తరువాత కమ్యూనిస్టులు మరింత బలపడ్డారు. అలా అనడంకంటె తెలంగాణంలో కమ్యూనిస్టు పార్టీ మాత్రమే రాజకీయంగా స్థిరపడింది అనడంలో అతిశయోక్తి లేదు. "సంగం" ఊరూరా వెలిసింది. అపారం అయిన ప్రజల సమీకరణ సాగింది. వేలకొలది కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరి, పూర్తి సమయం పనిచేశారు. "చైతన్యం" అనే పదమే తెలియని గ్రామాల్లో చైతన్య జ్వాలలు రగిలాయి. నిజమైన ప్రజలు రైతులు - కూలీలు - ఎట్టివారు - మహిళలు - బాలురు చైతన్యవంతులయి, ఎర్రబావుటాలతో కదిలారు. మహాసభ సభ్యత్వపు రశీదు హక్కు పత్రం అయింది. దొరలూ కరణాలు - వర్తకులు - సర్కారీ ఉద్యోగులు ఆ చీటీని చూచి జంకారు.

 

    ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై
    నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
    నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
    నంతై సత్యపదొన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

 

    అని పోతనామాత్యుడు అన్నట్లు ఆంధ్రమహాసభ పెరిగింది - ఎదిగింది - ఎగిసింది.

 

    ఆంధ్రమహాసభయొక్క ఈ దశను నేను నా "జానపదం" నవలలో ఒక సంఘటనగా చిత్రించాను.

 

    అమృతవాణి ఆడబాప. రాముడు ఆమెకు దొరవలన కలిగిన కొడుకు. చిన్న పిల్లవాడు.

 

    వీరభద్రం ఊరికి "సంగం" తెచ్చిండు. ఊరంత ఉరుకులు పెడుతున్నది. రాముడు చూచిండు. తానూ ఏమన్న చెయ్యాలె ననుకున్నాడు. వీరభద్రం దగ్గరికి పోయిండు.

 

    "పోరనివి, నువ్వేం చేస్తువుర" అన్నాడు వీరభద్రం.

 

    "చెప్పి చూడండి చేస్తనోలేదో" అన్నాడు రాముడు. వీరభద్రం మోకాళ్ల కాడికున్నడు.

 

    "అట్లయితే నీకు దొరపేరు ఎరికెనా?" అడిగిండు వీరభద్రం.

 

    "దొరకు పేరుంటాది?" మళ్ల పోయాడు రాముడు.

 

    "దొర దయ్యమనుకున్నవ! మనిషే. ఆనికి పేరుంటది. బలరామయ్య నువ్వంటవా?"

 

    "ఓ. ఎందుకన - బలరామయ్య. నన్నేంచెయ్యమంటావ్?"

 

    "బలరామయ్య అను."

 

    "ఉస్స్ ఇంతేన" అని రాముడు ఉరికిండు. ఇంటికి పోయిండు. బలరామయ్య, బలరామయ్య అనబట్టిండు. తల్లి అమృతవాణి విన్నది. రామున్ని చచ్చెటట్టు కొట్టింది "లంజకొడుక, దొరపేరు పలుకుతావుర" అని.

 

    రాముడు ఏడ్చిండు. ఏడ్చిండు. వానికి ఊరుకో బుద్ధిఅవుతలేదు. బలరామయ్య అని అరవాలెననుకున్నాడు, లేచిండు. ఊరిబయటికి పోయిండు. గుట్టలమీదికి పోయిండు. గుహలున్న చోటికి పోయిండు.

 

    "బలరామయ్య" అని అరిచిండు. ఆ ధ్వని గుట్టల్ల - గుహల్ల మారుమోగింది.

 

    "బలరామయ్య - బలరామయ్య." మళ్ల మళ్ల అరిచిండు రాముడు. పెద్దగ అరిచిండు. గొంతు చించుకొని అరిచిండు.

 

    కొండలు - గుట్టలు - కోణాలు అన్ని మారుమోగినయి.

 

    అప్పుడు రాముడు పట్టలేకపోయిండు. ఎగిరిండు, దునికిండు. ఎందుకనుకున్నారు?

 

    సంగం చెప్పింది చేసినందుకు! 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.