Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


   

                                              రెండవ సూక్తము - 51
   
వినియోగము :-

   
      1) మొదటి తృచచే దగ్గు, శ్లేష్మ రోగముల నివారణ కొరకు 'సక్తుమంథము'ను అభిమంత్రించి భక్షించునది. జలమును అభిమంత్రించి త్రాగించునది. దీనిచే సూర్యుని ఉపస్థానము చేయునది.
   
      2) రెండవ తృచచే గ్రుహాదుల అగ్ని దాహ నివృత్యర్ధము గృహమధ్యమున గుంతతీసి నీరు నింపునది.  'అవక' మును అభిమంత్రించి ఇంటిమీదవేయునది. ఉడికిన మినుములు నూనె మున్నగు వానిని అభిమంత్రించి 'శపథకర్త'కు ఇచ్చునది.
   
    కాలిన వానికి ఈ తృచచే అభిమంత్రించిన జలముచే కడుగునది.
   
      3) రెండవ తృచలోని 2,3 ఋక్కులచే అగ్నిచయనమున
    'మండూకావాకవేతసైర్వికృష్యమాణాంచితి 'బ్రహ్మ' అనుమంత్రయేత్'
   
1.    మనసు మనోవేగంతో అతిశీఘ్రంగా ధృవాన్ని సైతం చేరుకుంటుంది. అట్లే దగ్గు మున్నగు శ్లేష్మ వ్యాధులారా! ఈ వ్యక్తిని విడిచి మనోవేగంతో సాగిపొండి.
   
2.    ఎక్కుపెట్టి విడిచిన బాణము నేలను చీల్చుకొని వెళ్ళిపోవును. అట్లే దగ్గు మున్నగు శ్లేష్మ వ్యాధులారా! మీరు ఈ వ్యక్తిని విడిచి పాతాళమునకు చేరుకొనండి.
   
3.    సూర్యకిరణములు ఉదయాచలమునుంచి సముద్రపర్యంతము వ్యాపించినట్లు కాసాది వ్యాధులారా! ఈ వ్యక్తిని విడిచి సముద్రమున పడండి.
   
                                                --౦౦౦--
   
1.    అగ్నిదేవా! నీ ఎదురుగ వెనుక పక్క పూలతో కూడిన 'దుర్వ' మొలచును గాక. ఈ ప్రదేశమున తామరలు గల జలములు ప్రవహించును గాక.
   
2.    మా ఐమ్త జలములు ఉండును గాక. మా ఇల్లు సముద్రమునకు స్థావరమగును గాక. అగ్నిదేవా! నీ జ్వాలా తోరణపు తలలు వంచుము.
   
3.    గృహమా! నీ చుట్టు శైవల యుక్త శీతజల కాసారము ఏర్పరచుచున్నాము. మా విషయమున చల్లని మనసు దానవగుము.
   
                                        మూడవ సూక్తము - 52
   
వినియోగము :-

   
      1) ఈ నాలుగు ఋక్కుల తృచ పాఠము బృహద్గణములందున్నందున శాంతిజల అభిమంత్రణాచులందు వినియోగము. స్వస్త్యయన కర్మమున దీనిచే సమిధ, పురోడాశ యుక్తముగా 13 పదార్ధములను ఆహుతి     ఇచ్చునది.
   
      2) ఐదు ఋక్కుల ఈ తృచచే మేధాజనన కర్మమున క్షీరోదన, పురోడాశాదులను అభిమంత్రించి భక్షించునది.ఆదిత్యుని ఉపస్థానము చేయునది. ఉపనయనమున దీనిచే అగ్నిని ఉపస్థానము చేయునది.
   
1.    విశ్వజితా! నన్ను త్రాయమాణ దేవతకు వప్పగించుము.
   
    "త్రాయమాణే ద్విపాచ్చ సర్వంనోరక్ష చతుష్పాద్ యచ్చ నః స్వమ్"
   
    త్రాయమాణ దేవతా! మాకు గల 'ద్విపాత్తు' లను 'చతుష్పాత్తు' లను రక్షించుము.
   
2.    త్రాయమాణ దేవతా! నీవు నన్ను విశ్వజిత్తునకు వప్పగించుము.
   
    "విశ్వజిద్ ద్విపాచ్చ సర్వంనో రక్ష చతుష్పాద్ యచ్చనః స్వమ్"
   
3.    విశ్వజితా! నీవు మమ్ము కళ్యాణికి వప్పగించుము. "కళ్యాణి ద్విపాచ్చ సర్వంనో రక్ష చతుష్పాద్ యచ్చ నః స్వమ్"
   
4.    కళ్యాణి సర్వవిదే మా పరిదేహి|
   
    సర్వవిద్ ద్విపాచ్చ సర్వంనో రక్ష చతుష్పాధ యచ్చనః స్వమ్ ||

   
                                                     --౦౦౦--
   
1.    మేధా దేవీ! నీవు ప్రథమవు. అశ్వములు, గోవులు సహితముగ విచ్చేయుము. నీవే సూర్య రశ్మివి. నీవే మాకు యజ్ఞమవు.
   
2.    మేధాదేవి ప్రథమ. బ్రహ్మణ్వతి. బ్రాహ్మణ సేవిత. బ్రహ్మచారులచే స్తుతించబడునది. మమ్ము రక్షింపుమని ఆ దేవిని దేవతలను ఆహ్వానించుచున్నాము.
   
3.    ఏ మేధస్సును ఋభువులు ఎరుగుదురో, దేనిని అసురలు ఎరుగుదురో, ఋషులు ఎరుగుదురో అట్టి మేధస్సు నాయందు నలుదిశల నుండి ప్రవేశించును గాక.
   
4.    అగ్నిదేవా! దేనిని ఋషులు తెలిసినారో, భూత జాతములను కల్పించిన వారు ఎరింగినారో అట్టి మేధస్సుచే నన్ను మేధావిని చేయుము. 'మేధాంవినం కృణు'.
   
5.    మేధాం సాయం మేధాంప్రాతర్మేధాం మధ్యం దినం పరి |
    మేధాం సూర్యరశ్మి భిర్వచసా వేశయా మహే ||

   
    సాయంత్రము మేధోదేవిని, ప్రాతః కాలము మేధోదేవిని, మధ్యాహ్నము మేధోదేవిని, వేయేల సూర్యకిరణములున్నంత సేపు మేధోదేవిని వాక్కులచే ఉపాసించుచున్నాము.
   
                                               నాలుగవ సూక్తము -53
   
వినియోగము :-

    
      1) మొదటి తృచచే ధనుర్వాతాది సకల వాత వ్యాధుల శాంతికి పిప్పలిని సంపాతిత, అభిమంత్రణలు చేసి,  జపించి భక్షించునది.
   
      2) రెండవ తృచచే అభిమంత్రిత, సంపాతిత జలమును పాప నక్షత్రమున పుట్టిన బిడ్డమీద చల్లునది. అట్లే  సంపాతిత, అభిమంత్రిత క్షీరాన్నమును తినిపించునది.
   
1.    పిప్పలి క్షిప్రతమునకు ఔషధము. దీనిని మించినది మరొకటి లేదు. దీనిని దేవతలు కల్పించినారు. ఆరోగ్యముగ జీవించుటకు ఈ పిప్పలి ఒక్కటే చాలును.
   
2.    పిప్పలులు తాము పుట్టినపుడే ఇట్లని మాట్లాడుకున్నవి :-
   
    "జీవించిఉన్న ఒక వ్యక్త్య్యందు మనము వ్యాపించి ఉన్నచో అతనికి ఎటువంటి హాని కలుగదు"
   
3.    పిప్పలీ! నీవు వాతరోగమునకు క్షిప్తవ్యాధికి ఔషధమవు అయి ఉన్నావు. నిన్ను తొలుత అసురులు నాటినారు. పిదప దేవతలు నిన్ను వర్ధిల్లచేసినారు.
   
                                                     --౦౦౦--
   
1.    అగ్నిదేవా! నీవు సర్వదేవ స్వరూపుడవు. స్తోతవ్యుడవు సనాతనహోతవు. ఇప్పుడు నవ్యహోతవై వేదిమీద ఆసీనుడవు అయినావు. అట్టి నీవు మాకు కళ్యాణకర ద్రవ్యమును ప్రసాదించుము.
   
2.    జ్యేష్టానక్షత్రమున పుట్టినవాడు వంశనాశకుడు, మూలా నక్షత్రమున పుట్టినవాడు కులనాశకుడు అగుచున్నాడు. దేవతలారా! ఇతనిని యముని మూలచ్చేద కర్మనుండి రక్షించండి. సకల పాపముల నుండి రక్షించండి. శత శరత్తుల దీర్ఘాయువు ప్రసాదించండి.
   
3.    ఇతడు వ్యాఘ్రము వంటి క్ర్రూర నక్షత్రమున జన్మించినాడు. అయినను ఇతడు పుట్టుకతోనే వీరుడు అగును గాక. పెద్దవాడై తల్లిదండ్రులను హింసించకుండును గాక.
   
                                  అయిదవ సూక్తము - 54
   
వినియోగము :-

   
      1) నాలుగు ఋక్కుల మొదటి తృచ పాఠము మాతృగణములందు ఉన్నందున ఇది అచట వినియోగము. అట్లే  గంధర్వ, రాక్షస, అప్సర, భూత గ్రహాది పీడా శాంతికి ఇచ్చు ఘ్రుతమున తడిసిన సర్వోషధి     హోమమునను గ్రహపీడిత పురుషుని నెత్తి మీద గల మట్టి కుండ అగ్ని హోమమందునను వినియోగము.
   
      2) 2,3 తృచలచే 'పరివిత్తి' 'పరివేత్త' ప్రాయశ్చిత్తమునకు పూర్ణ కుంభమును సంపాతన,  అభిమంత్రణలు చేసి పర్వదినములందు ముంజ పాశములతో కట్టి అవసేకించునది.
   
1.    అగ్నిదేవా! ఇతడు పాప పాశ బద్దుడై ప్రలాపములు చేయుచున్నాడు. ఇతనిని ఆ పాపముల నుండి విముక్తి కలిగించండి. ఇతడు నీకు అధిక హవిస్సులు అర్పించుచున్నాడు. అతనిని ఉన్మాద రోగ రహితుని చేయండి.
   
2.    అగ్నిదేవత నీ యొక్క మనో వైకల్యమును శాంతింప చేయును గాక. నేను వైద్య విద్యా విశారదుడను. నీ ఉన్మాదమును నివారింపచేయుచున్నాను.
   
3.    నీ ఉన్మాదము దేవతల వలన లేక రాక్షసుల వలన కలిగి ఉండవచ్చును. అయినను వైద్య విద్వాంసుడనగు నేను నీ ఉన్మాదమును నయము చేయుచున్నాను.
   
4.    అప్సరసలు, ఇంద్రుడు, భగుడు నిన్ను మరల ఆరోగ్యవంతుని చేసినారు. సమస్త దేవతలు నిన్ను ఆరోగ్యవంతుని చేసినారు. నీవు ఇపుడు ఉన్మాదివి కావు.
   
                                                --౦౦౦--

   
1.    అగ్నిదేవా! ఇతడు అన్నకన్న ముందు వివాహమాడిన "పరివిత్తి" వీడు తన కన్న పెద్ద వారిని వధించకుండును గాక. పెళ్ళి కాని అన్న "పరివేత్త" ని రక్షింపుము. నీవు పాశవిమోచన విద్వాంసుడవు. వీని గ్రహ పాశములను విప్పుము. అట్లు విప్పుటకు సకల దేవతలు నిన్ను అనుమంతింతురు గాక.
   
2.    'పరివిత్తి' చర్య వలన తల్లిదండ్రులు అన్నకు కలిగిన పరివేదనను, ఉత్తమ, అధమ, మధ్యమ పాశములను విప్పుము. అగ్నిదేవా! నీవు పాశబంధ విమోచనా, చతురుడవు. వీరికి పాశబంధ విముక్తి కలిగించుము. సకల దేవతలు నిన్ను అనుమతింతురు గాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.