Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
1930లో హైదరాబాదులో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడింది. దానిని ఏర్పరచిన వారు ముఖ్దూం - అలంఖుంద్ మిరి - రాజ్ బహద్దుర్ గౌడ్, ముర్తుజా హైదర్ - సయ్యద్ ఇబ్రహీం. గమనించవలసిందేమంటే - ఇందులో తెలుగువారు లేరు, ఒక్కరు తప్ప అంతా ముస్లిములే! ఇది నూత్న భావాల పట్ల ముస్లిములకు ఉన్న ఆసక్తికి నిదర్శనం! నిజాం 'అనల్ మలిక్' దుష్ట విధానానికి గొడ్డలి పెట్టు.
1939-40లలో నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ అవతరించింది. ఇది అంతకుముందు రాజకీయరంగంలో ఉన్న అనేక మందిని - మంచినీటికి చేపల వలె ఆకర్షించింది. రావి నారాయణరెడ్డి - బద్దం ఎల్లారెడ్డి - దేవులపల్లి వెంకటేశ్వరరావు - సర్వదేవభట్ల రామనాధం మున్నగువారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. పార్టీ విధానాలు - నాయకత్వం కార్యక్రమాలు మేధావుల సహితంగా ప్రజలను ఎంతో ఆకర్షించాయి.
అయితే, కమ్యూనిస్టులు పార్టీగా కాక ఆంధ్రమహాసభ ద్వారానే కార్యక్రమాలు నిర్వహించారు. 1934లో ఖమ్మంలో జరిగిన ఆంధ్రమహాసభల తరువాత అంతగా ప్రాధాన్యత లేని మూడు సభలు జరిగాయి.
నాలుగవ మహాసభ మాడపాటి హనుమంతరావుగారి అధ్యక్షతన 1935లో సిరిసిళ్లలో జరిగింది.
అయిదవ మహాసభ కొండా వెంకటరంగారెడ్డిగారి అధ్యక్షతన 1936లో షాద్ నగర్ లో జరిగింది.
ఆరవ మహాసభ నిజామాబాద్ లో మందుముల నర్సింగరావుగారి అధ్యక్షతన 1937లో జరిగింది.
మల్కాపురంలో జరిగిన ఏడవ ఆంధ్రమహాసభ అంతకుముందువానికన్న భిన్నంగా జరిగింది. ఆ సభలోనే కమ్యూనిస్టులు జనాంతికంగా ప్రవేశించారు. అంతకుముందు సభలు నిర్వహించినవారిని మతవాదులు - మితవాదులు - వృద్ధ నాయకత్వం అని దాడి చేశారు. మార్క్సిజం పేరు చెప్పుకొని చరిత్రను - వారసత్వాన్ని గుర్తించకపోవడం విచారకరం. సామాజిక జీవనంలో సహితం భారతీయ సంస్కృతీ వారసత్వాన్ని వారు నిరసిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఈ సభకు మందుముల రామచంద్రరావుగారు అధ్యక్షత వహించారు.
నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను పూర్తిగా బహిష్కరించాలని కమ్యూనిస్టులు, ఇతర ప్రగతివాదులూ వాదించారు. పూర్వనాయకులు దానిని వ్యతిరేకించారు. ఈ సందర్భంలో కొంత ఘర్షణ జరిగింది. అప్పుడు హనుమంతరావు ఇలా అన్నారు:
"ఈ దేశమునందు విద్యాధికులలో, ముఖ్యముగా యువజనులందు దేశ సేవాసక్తియు, ఆత్మగౌరవ భావమునూ ప్రబలుచున్నవి. ఇట్టి సమయమున మహోత్కృ ష్ణమగు విజ్ఞాన వ్యాపక కార్యక్రమమున ముందడుగు వేయ ప్రయత్నించు చున్నారు. ఇట్టి సేవాసక్తిని అనుమాన దృష్టితో చూడగూడదు. వీరి యుత్సాహమును హెచ్చించి, వారితో పనిగొనుట ఉత్తమ రాజనీతి యగును. వీరియందు ద్రోహబుద్ధి లేదని నేను ఘంటాపథముగా చెప్పగలను."
మల్కాపురం సభలో ప్రగతివాదులకే విజయం లభించింది. అప్పటినుంచే ఆంధ్రమహాసభలో అంతర్గతంగా చీలికలు వచ్చాయి. సభ రెండు వర్గాలుగా అవకూడదు కాని, రెండు గ్రూపులుగా విడిపోయింది.
పాతనాయకత్వం తమను "జాతీయవాదులు"గా పేర్కొన్నారు. ప్రగతివాదులు తమను "అభ్యుదయ శక్తులు"గా పేర్కొన్నారు. ప్రగతివాదులకు "రష్యామానసపుత్రులు" అనే ముద్రవేశారు.
పాత నాయకత్వాన్ని వృద్ధనాయకులు - బూర్జువాలు అని నామకరణం చేశారు.
పాత నాయకులు వాస్తవంగా ప్రజలకు దూరంగానే ఉన్నారు. తీర్మానాలు చేయడంతోనే సరిపెట్టుకున్నారు. కార్యక్రమాలకు పూనుకోలేదు. అసలు నాయకత్వంలోనే భూస్వామ్య లక్షణాలు ఉన్నాయి. నాయకులు గ్రామాలకు వెళ్లడం సంభవించినా కచ్చడాల్లో వెళ్లేవారు. గడీల్లో విడిసేవారు. మంతనాలు జరిపి బయట పడేవారు. దాంతో దొరల దౌర్జన్యాలకు మహాసభ ముద్రపదినట్లు అయ్యేది. అయినా కాకున్నా ప్రజలు అట్లా అనుకోవడానికి అవకాశం కలిగింది. ఆ నాయకత్వపు పరిధి అంత. దొరలు - పటేల్, పట్వారీలు - వకీళ్లు - వర్తకులను దాటి పోలేదు. వారి లక్షణమే అంత. వారు అది దాటిపోలేరు.
ప్రగతి వాదులు అచ్చం కమ్యూనిస్టులే కాదు - కమ్యూనిస్టుల సిద్ధాంతాలు కాదు - వారి కార్యక్రమాలను అనుసరించే కమ్యూనిస్టేతరులు కూడా ఉన్నారు. కొమగిరి నారాయణరావు వంటి జాతీయవాదులు కూడా ఉన్నారు.
కమ్యూనిస్టులది విశాల వేదిక. విప్లవాల చరిత్ర. పోరాటాల పథకం. వారి ప్రజలు సామాన్యులు. రైతులు, కూలీలు. వారు స్థాపించదలచింది సమాజవాదం. కమ్యూనిస్టు నాయకులు యువకులు. ఉత్సాహవంతులు. క్రాంతికారులు. వారికి ఒక విశ్వాసం ఉంది. సిద్ధాంతం ఉంది. అన్నింటినీ మించి వారు ప్రజల్లోనివారు - ప్రజలనుండి వచ్చారు - శ్రామిక సిద్ధాంతాలనుంచి వచ్చారు.
మల్కాపురపు సభ తరువాతనే ఆంధ్రమహాసభ ప్రజల 'సంగం' అయింది. గ్రామాలలో ఒక చైతన్యం వచ్చింది. స్పష్టంగా వర్గాలు చీలిపోయాయి. దోచుకునే దొరలది ఒక వర్గం. దోపిడిని ఎదిరించే ప్రజలది ఒక వర్గం. కమ్యూనిస్టు నాయకత్వం గ్రామాలలోంచి - దోపిడిని గురియైనవారినుంచి వచ్చింది. చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రజలు తమను - తమ శక్తిని గుర్తించారు. ప్రజలు ఇంతకాలంగా వేచిన నాయకత్వం లభించింది అనిపించింది. అందువల్లనే కమ్యూనిస్టుల నాయకత్వాన ఆంధ్రమహాసభ తెలంగాణా గ్రామాలలో కొరివి మంటవలె - దావానలంవలె - కార్చిచ్చువలె వ్యాపించింది.
ప్రజా ఉద్యమాల్లో ఇంత ఉరుకులు పరుగుల మీద వ్యాప్తి చెందిన సంస్థ మరొకటి కనిపించదు.
అంతమాత్రాన కమ్యూనిస్టులు తప్పులు చేయలేదని అర్థంకాదు. నిజాం రాజు "రాజకీయ సంస్కరణలు" అనే ఎండమావిని చూపాడు. తాను ప్రతిపాదించిన శాసన సభలో హిందువులకు - ముసల్మానులకు సమాన ప్రాతినిధ్యం కల్గిస్తానన్నాడు. హిందువులు - ముస్లిములు తనకు రెండు కళ్లు అని ప్రచారం చేయించాడు.
నిజాముది ప్రమాదకర వాదం. నూటికి పన్నెండు మాత్రం ఉన్న ముస్లిములకు సగం సీట్లు ఇవ్వచూపడం ఒక పథకం. ముస్లిములను హిందువులమీదకు ఉసికొల్పడం. దీన్ని మజ్లిస్ తప్ప, అన్ని సంస్థలూ వ్యతిరేకించాయి.
కమ్యూనిస్టులు బిటిషిండియాలో కాంగ్రెసును, ముస్లింలీగును సమానంగా భావించారు. రెండు జండాలమధ్య ఎర్ర జండా పెట్టుకొని ఊరేగారు. అది అసమంజసం - ప్రమాదకరం కాదు.
హైదరాబాదు కమ్యూనిస్టులు - భారత కమ్యూనిస్టులను అనుసరించి - నిజాంలో హిందూ ముస్లింలకు చెరిసగం ప్రాతినిధ్యాన్ని బలపరచారు. తరువాత తమ తప్పు గుర్తించారు!
చీలిన బృందాల నేపథ్యంలో చిలుకూరు మహాసభకు ఎంతో ప్రాధాన్యత - ప్రాముఖ్యత - విశిష్టత ఉన్నాయి.
1941లో 8వ ఆంధ్ర మహాసభ చిలుకూరులో జరిగింది. దీనికి కమ్యూనిస్టు ఉద్యమనేత రావి నారాయణరెడ్డిగారు అధ్యక్షులయినారు.
చిలుకూరు సభలు విశేషంగా జనాన్ని ఆకర్షించాయి. ప్రజలు - ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తేజం పొందారు. ఈ సభలో నిజాం రాజ్యాన్ని గురించి మాత్రమే కాక, జాతీయ అంతర్జాతీయ విషయాలు చర్చకు వచ్చాయి.
"హైదరాబాదు నందలి కొందరు ముస్లిము సోదరులు వ్యవస్థాపూర్వకముగా వింతవింత స్వప్నములు గని, హైదరాబాదుకు మహమ్మదీయు లెల్లరూ రాజులనియూ, మహమ్మదీయులు లేకున్న రాజు లేడనియూ హద్దూ పద్దూ లేని ఆడంబరములు ప్రదర్శించి ఆందోళనకు కారకులైరి.
స్వాతంత్ర్య పోరాటములు విరివిగా వివిధ సంస్థానములయందు సాగింపబడినవి. ఈ ఉద్యమముల నణచుటకై ఒకదానికంటె ఒకటి కఠినముగా శాసనములు గావించబడినవి. సత్యాగ్రహాలు క్రూరముగా కొట్టబడి నానా విధములగు హింసలకు లోబడవలసి వచ్చింది. ఆస్తులు జప్తులు చేయబడినవి. తుపాకులు ప్రేల్చబడినవి. హింసలు సహింపలేక ఎన్నియో సంస్థానములయందలి ప్రజలు తమ ఆస్తులు, ఇండ్లు వదలి వలస పోవలసి వచ్చింది. ఇన్ని హింసా పద్ధతులు అవలంబించినప్పటికీ స్వాతంత్ర్యోద్యమము అణచబడలేదు. ఈ మహాయజ్ఞము యొక్క ఫలితము ఈనాడుగాకున్న రేపైనను సంస్థాన ప్రజలకు లభించక తీరదని ప్రపంచ చరిత్రయే మనకు చాటుచున్నది."
ఇది రావినారాయణ రెడ్డిగారి అధ్యక్ష ఉపన్యాసంలోని భాగం.
అంతకుముందు ఏ సభలోనూ ముస్లిములను ఇంత స్పష్టంగా హెచ్చరించలేదు.
ఇతర సంస్థానాల పోరాటాలను ప్రస్తావించి స్వాతంత్ర్య ఉద్యమాలను అణచలేరనీ - చరిత్రలో ప్రభువులు గెలవలేరనీ - ప్రజలే గెలుస్తారనీ చెప్పడం విశేషం.





