Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

1.    ఓషధులందు సోముడు ప్రభువుగా గలవి ఉన్నవి. బహు విధములవి, వందల రకములవి ఉన్నవి. వీటిని అన్నింటిని బృహస్పతి ఓషధులుగా ఏర్పరచినాడు. అవన్నియు మమ్ము రోగారూప పాపముల నుండి విముక్తి కలిగించును గాక.
   
2.    జలములు నన్ను శతపథ పాపముల నుండి విముక్తులను చేయును గాక. వరుణుని పాపముల నుండి విడిపించును గాక. యముని పాపబంధముల నుండి విడిపించును గాక. సమస్త దేవతల పాపముల నుండి మేము విముక్తులము అగుదుము గాక.
   
3.    జాగ్రత్త సుప్తావస్థలందు నేత్రములు, మనసు, వాక్కుచే చేసిన పాపముల నుండి పిత్రుదేవతలకు అర్పించిన స్వధచే - సోమ దేవత నన్ను రక్షించును గాక.
   
                                               రెండవ సూక్తము -47
   
వినియోగము :-


      1) ఈ రెండు తృచలచే సంగ్రామ విజయ కర్మమున ఘ్రుత హోమము, సక్తుహోమము ధనువు రూపము గల అగ్నిలో ధనువు వంటి సమిధల ఆధానము, సంపాతిత అభిమంత్రిత ధనుస్సును అందించుట  చేయునది.
   
    వీని పాఠము అపరాజిత గణములందున్నది. అట్టి అవసరములందు వాని వినియోగము.
   
          ఇంద్రమహాఖ్యనామ కర్మమున వీనిచే పూర్ణహోమము చేయునది. ఈ కర్మమందే వీనిచే పశువధ చేయునది. ఇంద్రుని ఉపస్థానము చేయునది.
   
      2) రెండవ త్రుచచే మహా వ్రతమున ఉన్న వానిని బ్రహ్మ దీనిచే అనుమంత్రించునది.
   
    పరసేన విద్వేషణ కర్మమున ఈ త్రుచచే రాజు సేన వైపు మూడు మారులు వెళ్ళునది.
   
1.    ఈ యజ్ఞము శత్రు పరాజయ కారకము అగును గాక. ఇంద్రుడు, అగ్ని, సోముడు శత్రుపరాజయ కారకులు అగుదురు గాక. శత్రువుల సమస్త సేనలను పరాజితులను చేయు శక్తి కొరకుగాను అగ్నికి ఈ హవిస్సును అర్పించుచున్నాను.
   
2.    మిత్రావరుణులారా! మీకు హవి అర్పించుచున్నాము. స్వీకరించండి. సంత్రుప్తులు కండి. ఈ రాజునకు మధుర భావమున ప్రజాబలము కలిగించండి. పాపకారిణి నిర్రుతిని మాకు పెడముఖముగా ఉంచి బాధించండి. శత్రువుల వలన కలిగిన పాపములనుండి మమ్ము విముక్తులను చేయండి.
   
   
3.    మిత్రులగు సైనికులారా! ఈ రాజును శూరులుగ అనుసరించండి. ఉగ్రుడగు ఇంద్రుని వలె హర్షించండి. సంరంభము చేయండి. ఓజస్సుచే గ్రామములను, గోవులను జయంచుచు వజ్రబాహువగు రాజును అనుసరించండి.
   
                                               --౦౦౦--
   
1.    ఈ సంగ్రామమున సహాయకుడుగా వచ్చిన ఇంద్రునకే జయము కలుగునుగాక. పరాజయము కలుగ కుండునుగాక. ఇంద్రుడు ఈ రాజును రాజులందు తేజోవంతుని చేయునుగాక.
   
    ఇంద్రా! నీ యందు అట్టి గుణగణములున్నవి. అందుకే యుద్దములందు మాచే పూజించు బడుచున్నావు.
   
2.    ఇంద్రునకు భిన్నుడవు కానట్టి రాజా! నీవు అన్యరాజుల కన్న అన్నవంతుడవు అగుము.
   
    ఇంద్రా! నీవు మహిమాన్వితుడవు. సకల ప్రాణులను ధిక్కరించ గలవాడవు. దేవప్రజకు ప్రభువవు అగుము. "రాజా యుష్మత్ క్షత్రమజరం తే అస్తు" రాజా! నీవు ఆయుష్మంతుడవగుదువుగాక. నీక్షాత్రము అక్షయము అగునుగాక.
   
3.    ఇంద్రా! నీవు తూర్పునకు అధిపతివి. పశ్చిమమునకు ప్రభువవు. ఉత్తర దక్షిణములు నీ అధీనములు. నీవు నీటి ప్రవాహములన్నింటిని జయించినావు. కోరికలు తీర్చునట్టి నీవు యుద్దమున మాకు సహాయము చేయుమని నీకు ఈ హవిస్సు అర్పించుచున్నాము.
   
                                                మూడవ సూక్తము - 48
   

వినియోగము:-

   
      1) పూర్వపు సూక్తము వలెనే స్మగ్రామ విజయాదులందు తొలి తృచ వినియోగము అగ్నిష్టోమపు  ప్రాతస్సవనమున బ్రహ్మ దీనిచే అనుమంత్రణము చేయునది.
   
      2) రెండవ త్రుచచే స్థావర జంగమ విషనివారణార్ధము సంపాతిత, అభిమంత్రిత పుట్టమట్టిని కట్టునది. నీటితో త్రాగించునది. ఆచమనము చేయించునది. లేపనము చేయునది. ఆహితాగ్ని యొక్క అంతిమ సంస్కారమున పురోడాశమును రొమ్ము మీద పెట్టి అభిమంత్రించునది.

1.    ఇంద్రా! నీవు మహాశరీరుడవు. ఓడించగలవాడవు. అది తెలిసి ముందే నిన్ను ఆహ్వానించుచున్నాను. నీవు ఉగ్రబలశాలివి. అజేయుడవు. విజయ పథము తెలిసినవాడవు. అనేక నామముల వాడవు. అందువలన నిన్ను ఆహ్వానించుచున్నాము.
   
2.    శత్రు సేన ఆయుధము మా మీదకు లేచుచున్నపుడు మమ్ము రక్షించు ఇంద్ర భుజములను కోటగోడలుగా చేసికొనుచున్నాము.
   
3.    ఇంద్రుని బాహువులు మమ్ము అన్ని దిశలందు రక్షించునుగాక. సవితాదేవా! సోమరాజా! మాకు యుద్దమున విజయము కలిగించి మమ్ము సంతోష మనస్కులను చేయండి.
           
                                                                   --౦౦౦--
   
1.    దేవతలు, ద్యులోక భూలోకములు, ఇడ భారతి సరస్వతి మాకు విషనివారక ఔషధము ప్రసాదింతురుగాక.
   
2.    దేవతలారా! మీ ప్రసాదమున జేవేఉలు నీరులేని చోట పుట్టలు పెట్టినవి. దేవతల అట్టి అనుగ్రహమున ఏర్పడిన వల్మీకము విషనివారకము అగును గాక.
   
3.    పుట్ట మట్టీ! నీవు అసురుల పుత్రివి, సురల భగినివి. భూమ్యాకాశముల నుండి పుట్టిన దానవు. నీవు స్థావర జంగమాత్మక విషమును నివారించుము.
   
                                          నాలుగవ సూక్తము - 49

   
వినియోగము:-
   
      1) తొలి తృచచే వాజీకరణము కోరువాడు ఏక శాఖార్క మణిని సంపాతిత, అభిమంత్రణలు చేసి అర్క సూత్రమున బంధించునది.
   
        కృష్ణమృగ చర్మమణిని సంపాతిత, అభిమంత్రణలు చేసి ఆ మృగపు వెంట్రుకచే కట్టునది.
   
      2) రెండవ తృచచే స్త్రీవశీకరణమందు చెట్టు బెరడు, శరఖండము, తగర అంజనము, వాతసంభ్రణతృణాది ద్రవ్యములను నూరి, నేతిలో కలిపి స్త్రీయోని మీద లేపనము చేయునది.
   
1.    పురుషా! ఆబోతువలె ఆచరించుము. నీ అంగము పెరుగును గాక. దేహము బలపడును గాక. వర్ధిల్లిన అంగముతో రతిని అభిలషించు స్త్రీ వద్దకు చేరుము.
   
2.    బ్రహ్మణస్పతీ! ఏరసము బలహీనుని బలకరుని చేయుచున్నదో, ఏ రసము పురుషుని కామాతురుని చేయచున్నదో దానిచే ఇతని అంగమును ఎక్కుపెట్టిన ధనుస్సు వంటి దానిని చేయుము.
   
3.    వీర్యాభిలాషీ! నీ పురుషాంగమును ధనుస్సుకు బిగించిన నారివంటి దానిని చేయుచున్నాను. నీవు ఆబోతు వలె గంతులు వేయుచు స్తంభిత అంగముతో నిత్యము భార్యను చేరుము.
   
                                                   --౦౦౦--
   
1.    అశ్వము రౌతు మనసును గుర్తించును. ఆ ప్రకారము సాగును. ప్రియే! అట్లే నీవు నా మనసును గుర్తించుము. అందుననుసరించి ప్రవర్తించుము.
   
2.    ప్రేయసీ! అశ్వరాజము త్రాటితో తనను కట్టిన గూటమును పెల్లగించినట్లు నీ మనసును పెల్లగించుచున్నాను. గాలికి ఎగిరిన గడ్డిపరకల వలె నీ మనసు నా చుట్టు భ్రమించుచుండును గాక.
   
3.    ఇది ఆంజనము, మదుధము, కుష్టము, నలదములచే చేసినది. భగునిచేతిచే దీనిని నీ అంగము మీద లేపనము చేయుచున్నాము.
   
                                        పదకొండవ అనువాకము
                                           మొదటి సూక్తము - 50

   
వినియోగము:-

   
    ఈ రెండు త్రుచలచే సంగ్రామజయ కర్మమున భాంగ పాశమునుగాని, ఇంగిడాలంకృత అన్య పాశములనుగాని సంపాతిత అభిమంత్రణలు చేసి శత్రుసేన తిరుగు చోట వేయునది.
   
1.    శత్రుసేనలారా! బృహస్పతి మిమ్ము బంధించునుగాక. సవిత, మిత్రుడు, ఆర్యమ. భగుడు, అశ్వినులు మిమ్ము కట్టి పడవేయుదురు గాక.
   
2.    దూరమున ఉన్న, దగ్గర ఉన్న, మధ్యన ఉన్న శత్రువులను నేను కట్టి పడవేయుచున్నాను. ఇంద్రుడు శత్రు సేనాపతులను వేరు చేయును గాక. అగ్నిదేవా! మిగిలిన శత్రువులను కట్టి పడవేయుము.
   
3.    అల్లదిగో దూరమున శత్రుసేన ధ్వజారోహణ చేసి మా మీదకు ఎత్తివచ్చుచున్నది. ఇంద్రదేవా! వారిని చెల్లాచెదరు చేయుము. అగ్నిదేవా! వారిని పాశములతో బంధించుము.
   
                                                --౦౦౦--
   
1.    'ఆదాన' సందానము' లతో శత్రువులను బంధించుచున్నాను. శత్రువుల ప్రాణాపానములను నిలిపి వారిని వధించుచున్నాను.
   
2.    ఇంద్రుడు పదునుపెట్టిన 'ఆధానము'ను ప్రయోగించినాను. అగ్నిదేవా! మా శత్రువులు ఎచట ఉన్నను వారిని కట్టివేయుము.
   
3.    ఇంద్రాగ్నులు, రాజాసోముడు, భూమ్యాకాశములు, మరుత్తులు, మిత్రావరుణులు మా శత్రువులను బంధింతురు గాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.