Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

1.     రాజా! నిన్ను రాజ్యమునకు తెచ్చినాను. నీవు మాకు ప్రభువవు అగుము. స్థిరపడుము. విశ్వప్రజ నీ ఆధిపత్యమును కోరునుగాక. నీవు రాజ్యభ్రష్టుడవు కాకుందువుగాక.
   
2.    రాజా! ఇచట స్థిరపడుము. కదలకుము. పర్వతమువలె కదలకుండుము. ఇంద్రునిది వలె నీ సామ్రాజ్యము స్థిరమగునుగాక. నీ రాజ్యమును ఏలుము.
   
3.    ధృవమగు హవిస్సు అందుకున్న ఇంద్రుడు ఈ రాజ్యమును ధృవపరచినాడు. సోమరాజు, బ్రహ్మణస్పతి ఈ రాజును తమవారిగా భావింతురుగాక.
   
4.    ద్యులోకము ధృవమగునుగాక. పృథివి ధృవమగునుగాక. "ధృవం విశ్వమిదం జగత్". పర్వతములు ధృవములు అగునుగాక. ఇతడు విశ్వప్రభువుగా ధృవపడును గాక.
   
5.    ధృవం తే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతిః|
    ధృవంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం|

   
    రాజా! నీ రాజ్యమును వరుణుడు, బృహస్పతి, ఇన్ద్రాగ్నులు ధ్రువ పరతురుగాక. నీవు రాజ్యమును ధ్రువముగా పాలింపుము.
   
6.    రాజా! నీ రాజ్యమును ధృవముగా పాలింపుము. శత్రువులను నలిపి వేయుము. శత్రుభావము గలవారిని త్రొక్కి వేయుము. దిశలు అనుకూలములు అగునుగాక. అందుకొరకు నీవు సమర సమర్దుడవు అగుదువుగాక.
       
                                           నాలుగవ సూక్తము -44
   
      1) అనుకూలురుకాని భార్యా భర్తలందు అననుకూలుర తల లేక చెవిని మొదట తృచచే అనుమంత్రించునది లేదా కేశములు ధరించునది.
   
      2) దేహ శూలను నివారించుటకు ఇనుప లేక రాతి మణిని సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది.
   
1.    ఈ శిరము వీర్య ప్రదము ప్రేమ ప్రాపకము. దీనిని సోమ దేవుడు ప్రసాదించినాడు. అందు ఉత్పన్నమగు వలపుతో నీ మనసునకు వ్యధ కలిగించుచున్నాను.
   
2.    నీ మనసునకు, హృదయమునకు నా వలపుచే వ్యధ కలిగించుచున్నాను. అగ్నిని అనుసరించు ధూమము వలె నీ మనసు నన్నే అనుసరించును గాక.
   
3.    మిత్రా వరుణులు నిన్ను నాతో కూర్చెదరు గాక. దేవీ సరస్వతి నిన్ను నాకు అనుకూలవతిని చేయును గాక. భూమి మధ్యన, భూమి అడుగున, భూమి మీద ఉన్న ప్రాణులన్నియు నీకు నా విషయమున ప్రేమ కలిగించును గాక.
   
                                                  --౦౦౦--
   
1.    రోగీ! రుద్రుడు బాణము గ్రుచ్చి నీ అవయవములకు హృదయమునకు బాధ కలిగించుచున్నాడు. ఆ బాణమును నేడు మేము పెరికి వేయుచున్నాము.
   
2.    నీకు గల శత ధమనులందలి శూలను తొలగించుటకు అట్టి అన్నిధమనుల నుండి విషమును తొలగించి నిర్విష ధమనులను చేయుచున్నాము.
   
3.    రుద్రదేవా! నీకు నమస్కారము. నీవు ఎక్కుపెట్టిన బాణమునకు నమస్కారము. నీవు విడిచిన బాణమునాకు నమస్కారము. తాకిన బాణమునకు నమస్కారము.
   
                                           అయిదవ సూక్తము - 45
   

వినియోగము:-

   
      1) సర్వరోగ చికిత్స యందు మొదటి తృచచే ఘ్రుతాహుతులిచ్చి, యవలు వేసిన లేదా నిండు నీటి పాత్రలోనికి నాలుగు సంపాతములు తెచ్చి వానిలో రెంటిని నెల మీదకు తెచ్చి అట్టి సంపాతిత మృత్తికచే అభిమంత్రించిన జలముతో రోగికి, స్నానము చేయించునది. యవమణిని సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది.
   
      2) రెండవ తృచచే అశ్వశాంతి యందు ఘ్రుతాహుతులు ఇచ్చునది. జలపూర్ణ పాత్రలోనికి సంపాతములు  తెచ్చి, ఆ జలముతో సూక్తోక్తప్రకారము అశ్వమునకు ఆచమనము స్నానము చేయించునది.
   
1.    ఈ యవలు ఎనిమిది ఎద్దులతోను, ఆరు ఎద్దులతోను దున్ని పండించ బడినవి. అట్టి యవలచే రోగకారణమగు పాపమును తొలగించుచున్నాను.
   
2.    వాయువు క్రిందకు వీచును. సూర్యుడు దిగువను తపింపచేయును. గోవు తలవంచి పారిపోవును గాక.
   
3.    జలములందు ఓషధులన్నియు చేరి ఉన్నవి. జలమే రోగనాశకము. జలమే సమస్త చికిత్స అట్టి జలము నీకు రోగ నివారక ఔషధము అగును గాక.
   
                                                 --౦౦౦--
   
1.    అశ్వమా! రథమున పూన్చినపుడు నీకు వాయు వేగము కలుగును గాక. ఇంద్రుని ప్రేరణచే మనో వేగమున గమ్యము చేరుదువుగాక. విశ్వజ్ఞానులగు మరుత్తులు నీలో చేరుదురుగాక. త్వష్ట నీ పాదములందు వేగమును చేర్చునుగాక.
   
2.    అశ్వమా! నీ యొక్క ఏ వేగము గుహయందున్నదో, గాలియందున్నదో, డేగయందున్నదో ఆ వేగమున బలశాలివై యుద్దమున విజయము సాధించుము.
   
3.    జవనాశ్వమా! నీ దేహబలము నీపైస్వారి చేయు వానిని యుద్దభూమికి చేర్చి విజయము కలిగించును గాక. నిన్ను ఆయుధము తాక కుండును గాక. సుఖముగా సాగుదువు గాక. సూర్యసామాన్ తేజస్సుచే నీ గమ్యమునకు చేరుము.
   
                                       పదవ అనువాకము
                                         మొదటి సూక్తము - 46

   
వినియోగము:-

   
      1) తొలితృచ పాఠము వాస్తోష్పత్యగణమున ఉన్నందున ఆ గణములందును, మహాశాంతి యందును శాంత్యుదక అభిమంత్రణములందును వినియోగము.
   
    స్వస్త్యయన కర్మమునందు ఘ్రుత, సమిధ, పురోడాశముల సహితముగ 13 ద్రవ్యములను దీనిచే  ఆహుతి ఇచ్చునది.
   
      2) రెండవ త్రుచచే సాంమనస్య కర్మమున గ్రామ మధ్యమునకు సంపాతిత పూర్ణ కుంభము తెచ్చుట,  సురాకుంభము తెచ్చుట, మూడేళ్ళ దూడగల గోపిశిత ప్రాశనము, సంపాతిత అన్న ప్రాశనము,   సంపాతిత సుర, జలము త్రాగించుట చేయునది.
   
      3) మూడవ తృచచే 'రాజ యక్ష్మ, కుష్ఠుమున్నగు రోగముల నివారణకు 'కుష్ఠ' నామక ఔషధము  కలిసిన వెన్నను అభిమంత్రించి దిగువ నుండి శరీరమున పూత పూయునది.
   
      4) నాలుగవ తృచ లోని మొదటి ఋక్కుచే అగ్ని చయనమందు నీటిలో వేయవలసిన ఉఖ్యభస్మమును బ్రహ్మ   జపించునది.
   
    2,3 ఋక్కులచే బ్రాహ్మణాగ్రహ, జలోధర శాంతులందు సోమలతను నిప్పుల మీద వేసి రోగికి  పొగవేయునది. తేనె కలిసిన పెరుగును అభిమంత్రించి తినిపించునది. పాలను మజ్జిగలో కలిపి  త్రాగించునది. పెరుగు తేనె, పాలు, పల్చని మజ్జిగ కలిపి త్రాగించునది.
   
    దీని పాఠము అంహోలింగ గణములందున్నది.
   
1.    ప్రాణులను నియమించువాడు యముడు. ప్రాణములను విడిపించువాడు మృత్యువు. పాపముల కారణముగ బాధించువాడు అఘమారుడు. మరింత పీడించునది నిర్రుతి. వీరందరు తమతమ సేనా సమేతులై పాపులను బాధించుటకు తిరుగుచుందురు. ఉపద్రవ కారకులగు వారు మా పుత్ర, పౌత్రాదులను బాధించ కుందురు గాక.
   
2.    సంకల్పమున, ఘ్రుతహోమమున శర్వుని, మహా దేవునకు పూర్వ మంత్రమున పేర్కొన్న దేవతలకు నమస్కరించుచున్నాను. వారు విషసములగు కృత్యాదులను మానుంచి దూరదేశమునకు చేర్చెదరు గాక.
   
3.    విశ్వము నెరిగిన మరుత్తులు, విశ్వేదేవతలు, అగ్నిషోములు, వరుణుడు మమ్ము అధివిషముల బాధల నుండి రక్షింతురు గాక. వాయువు, పర్జన్యుల సద్భుద్దియందు మేము నిలుతుము గాక.
   
                                                 --౦౦౦--
   
1.    మీ మనసులు కలిసి ఉండును గాక. మీ కార్యములు కలసినవి అగునుగాక. సంకల్పములు సమానములు అగును గాక. మీ పూర్వపు విమనస్కతను దూరము చేయుచున్నాము.
   
2.    మీవి ప్రతికూల మనసులు. నా మనసుచే మీ మనసులను స్వాధీనము చేసికొనుచున్నాను. మీరు అనుకూల చిత్తములతో నన్ను అనుసరించండి. నా మార్గమున మీరు నడచిరండి.
   
3.    నా విషయమున ద్యావాపృథ్వులు, సరస్వతీ దేవి, ఇంద్రాగ్నులు ప్రసన్నులగుదురు గాక. సరస్వతి మాకు సమృద్దిని కలిగించును గాక.
   
                                                 --౦౦౦--
   
1.    ఇక్కడి నుంచి మూడవ ద్యులోకమున దేవతలు ఆసీనులగు అశ్వత్ధము ఉన్నది. అమృతసమమగు 'కుష్టము'ను దేవతలు కనుగొన్నారు.
   
2.    స్వర్గమున స్వర్గబంధములు గల బంగారు నావ కదలు చుండును. దేవతలు అచట అమృత పుష్పమగు కుష్ఠమును అందుకున్నారు.
   
3.    అగ్ని దేవా! ఈ 'కుష్ఠ' ఓషధులకు గర్భము అగుచున్నది. హిమవంతమునకు గర్భము అగుచున్నది. విశ్వభూతములన్నింటికి గర్భభూతమగుచున్నది. దీనిని మాకు వ్యాధి నిర్మూలకమును చేయుము.
   
                                                 --౦౦౦--




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.