Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                

                                         నాలుగవ సూక్తము - 39
   
వినియోగము :-

   
      1. మొదటి తృచచే ధాన్య సమృద్ది కోరువాడు రాతిని ప్రోక్షించి, అభిమంత్రించి గాదె వద్దకు చేర్చి ఒక్కొక్క మంత్రముచే మూడు పిడికిళ్ల ధాన్యమును దానిపై పోయునది.
   
      2. రెండవ తృచచే కాకి, పావురము, గద్దవలన గాయమైన అవయవమునకు కుక్క త్రొక్కిన మట్టిని  అభిమంత్రించి పూయునది.
   
    కుక్కమీదవాలిన ఈగలను దీనిచే అభిమంత్రించి నిప్పులో వేసి ఆ ధూమముతో గాయమునకు ధూపము  వేయునది.
   
1.    నభనస్పతి ధాన్యవృద్ది కలిగించి మమ్ము రక్షించును గాక. మా గృహములందు లెక్కకు మించిన గాదెలు ఉండునుగాక.
   
2.    సభనస్పతీ! మా గృహములందు బలకర అన్నము నింపుము, పుష్టి, ధనము కలిగించుము.
   
3.    ఆదిత్యదేవా! నీవు వేలమందిని పోషించువాడవు. మాకు అటువంటి ధనమును ప్రసాదించుము. దానముగా ఇమ్ము మేము మీకు భక్తులము అగుదుము గాక.
   
                                                    --౦౦౦--
   
1.    పక్షులు ఆకసమునుండి సమస్త భూతములను చూచుచు నరుని మీద పడుచున్నవి. శ్వానపు తేజమున తుష్టినొందిన అగ్నిదేవత వానిని తొలగించును గాక.
   
2.    కాలకంజ నామకులగు ముగ్గురు అసురులు తమ సత్కర్మలచే స్వర్గమునందు దేవతలు అయినారు. పక్షిపాత దోషనివారణార్ధము, తచ్చాంతి కొరకును వారిని ఆహ్వానించుచున్నాము.
   
3.    అగ్నిదేవా! జలములందు నీ జన్మ సముద్రము నందును, భూమి మీదను నీ మహిమను కనబరచుచున్నావు. అట్టి నీకు దివ్యశ్వానపు తేజస్సుచే హవిస్సులు అర్పించుచున్నాము.
   
                                         అయిదవ సూక్తము - 40
   
వినియోగము :-

   
      1) తొలి తృచచే గర్భాదానమున కంకణాదులను సంపాతన, అభిమంత్రణలు చేసి స్త్రీ చేతికి కట్టునది.
   
      2) వివాహము కోరు పురుషుడు రెండవ తృచచే ఇంద్ర యాగము లేక ఉపస్థానము చేయునది. దీనితోనే వివాహమున ఘ్రుతాహుతులిచ్చి వధూవరుల తలలమీదకు సంపాతములు తెచ్చునది.
   
1.    అగ్నిదేవా! నీవు గర్భమునకు నష్టము కలిగించు రాక్షసాదులను వశమునందుంచుచు చేతులు చాచి ఉన్నావు. అతడే తన చేతులను త్రిప్పి సంతానమును, ప్రజను, ధనమును రక్షణను కలిగించుచున్నాడు.
   
2.    కంకణాదులారా! గర్భము కలుగుటకు యోనిని విస్తరింప చేయండి. భార్యా! పతి నీ వద్దకు చేరినపుడు నీవు అభీష్ట పుత్రుని కనుము.
   
3.    అదితి సంతానము కోరినపుడు ఏ కంకణము ధరించినదో, దానిని త్వష్ట ఈమెకు ధరింపచేయును గాక. అందువలన పుత్ర సంతానము కలుగునుగాక.
   
                                                  --౦౦౦--
   
1.    వచ్చుచున్న, వచ్చియున్న ఇంద్రుని నామములు ఉచ్చరించుచున్నాము. ఇంద్రుడని, వృత్రఘ్నుడని, వాసవుడని, శతక్రతువని కీర్తించి ఫలములు యాచించుచున్నాము.
   
2.    అశ్వినులు ఏ మార్గమున సూర్య పుత్రియగు సావిత్రిని భార్యగా పొందినారో ఆమార్గముననే నాకు భార్యను తెమ్మని కోరుమని భగదేవత నాకు ఉపదేశించినాడు.
   
3.    ఇంద్రా! నీ హస్తము అంకుశము వంటిది. ధనమునిచ్చునది. హిరణ్యము నిచ్చునది. శచీపతీ! నాకు సంతానమును ఇవ్వగల భార్యను ప్రసాదించుము.
   
                                        తొమ్మిదవ అనువాకము
                                               మొదటి సూక్తము - 41
   

వినియోగము :-

   
      1. మొదటి తృచచే గండమాల చికిత్సయందు శంఖమును అరగదీసి అభిమంత్రించి లేదా కుక్కచొల్లును  అభిమంత్రించి గండమాల మీద వేయునది. బల్లిని అభిమంత్రించి రక్తము నిలుచుటకు కట్టునది. సైంధవ లవణమును అభిమంత్రించి గండమాల మీదవేసి ఉమ్మునది. మూడవ మంత్రపు ఉత్తరార్ధమును జపించుచు గోమూత్రముచే కడుగునది. దంత మలమును దీనిచే అభిమంత్రించి గండమాల మీద పూయునది.
   
      2. నాలుగు ఋక్కుల రెండవ తృచచే శాంత్యుదకములను అభిమంత్రించి గండమాలను కడుగునది. దీనితోనే     ఘ్రుతాహుతులిచ్చి, మనసున సంకల్పించి వ్రణము మీదకు సంపాతములు తెచ్చునది.
   
1.    గండమాలా! నా దేహమునుండి పక్షివలె ఎగిరి పొమ్ము. ఆదిత్యుడు నీకు చికిత్స చేయునుగాక. అమృతమయ చంద్రుడు నిన్ను దూరము చేయునుగాక.
   
2.    గండమాలలో ఒకటి ఎరుపు కలిసిన తెలుపునది. మరొకటి శుభ్రవర్ణ. ఇంకొకటి నలుపు రెండు ఎరుపు రంగువి. గండమాలా! వీటి నామములు ఉచ్చరించుచున్నాము. మమ్ము చంపకుము. విడిచిపొమ్ము.
   
3.    మరల పుట్టనిదియు, రామాయణ, నాడిని బాధించునదియు నగు గండమాల రాలిపోవునుగాక. వ్రణపు బాధ రాలిపోవునుగాక. గోమూత్రము దీనిని రాల్చునుగాక.
   
                                                  --౦౦౦--
   
1.    వ్రణాభిమాన దేవతా! నీకు మనసా హవిస్సు అర్పించుచున్నాను. నీవు దానిని మనసా స్వీకరింపుము - స్వాహా.
       
2.    సాధారణులు నిన్ను వ్యాపించు దానినిగనే గుర్తించుచున్నారు. నాకు నీవు సర్వరోగ కారకమగు నిర్రుతిగా భాసించుచున్నావు. మేము అందించు హవిస్సులచే హవివంతవగుము. నీ భాగము అందుకొనుము. తృప్తి చెందుము. గోవులు మున్నగు వానిని రోగ విముక్తులను చేయుము. స్వాహా.
   
3.    నిర్రుతి దేవతా! నీవు మమ్ము బాధించకుము. రోగముల శృంఖలములను విడిపించుము. రోగీ! యముడు నిన్ను తిరిగి ఇచ్చుచున్నాడు. "తస్మై యమాయ నమో అస్తు మృత్యవే"
   
4.    అమ్మా నిర్రుతీ! నీవు ఇనుప లేక చెక్కబేడీ వేసినవాడు వేల రోగముల పాలై బాధలు పడును. నీవు అతనిని యమునితోను, పితరులతోనూ ఏక మనస్కవై స్వర్గమున కంపుము.
   
                                                    రెండవ సూక్తము - 42
   
వినియోగము :-   
   

      1) రాజ యక్ష్మాది రోగ చికిత్స కొరకు వరణవృక్ష మణిని సంపాతన, అభిమంత్రణలు చేసి ఈ తృచ జపించి     కట్టునది.
       
      2) శ్రేష్టత కోరువాడు ఈ తృచచే ఇంద్రుని యజించునది లేదా ఉపస్థానము చేయునది.
   
1.    ఇది వరణవృక్షము. ఇది దేవత. ఇది యక్ష్మను నివారించును గాక. యక్ష్మప్రవేశించిన ఇతనిని దేవతలు రక్షింతురు గాక.
   
2.    ఇంద్రుని మాట, వరుణుని మాట, మిత్రుని మాట, సమస్త దేవతల మాటలచే నీ యక్ష్మను నివారించుచున్నాము.
   
3.    ఎట్లు వృత్రుడు సర్వవ్యాప్త మేఘములను నిలిపి ఉంచినాడో అట్లే నీ యక్ష్మవ్యాధిని అగ్ని ద్వారా నివారించుచున్నాను.
   
                                                 --౦౦౦--
   
1.    నీవు ఇంద్రుని తృప్తి పరచుము. దివిని తృప్తి పరచుము. భూమిని తృప్తి పరచుము. విశ్వమును తృప్తి పరచుము. సమస్త భూతములకు నీవు ఒక్కడవే వృషభమవు అగుము.
   
2.    నదులకు సాగరము స్వామి. అగ్ని పృథివికి స్వామి, నక్షత్రములకు చంద్రుడు స్వామి. అట్లే నీవు ఏకవృషమగుము.
   
3.    ఇంద్రా! నీవు అసురులకు సామ్రాట్టువు. ఇతడు మనుష్యులందు నూపురము వంటివాడు అగును గాక.
   
    ఇంద్రా! దేవతలందు సగము భాగమవు. అట్లే ఇతడు ఏకవృషుడు అగునుగాక.
   
                                        మూడవ సూక్తము - 43
   
వినియోగము :-

   
     1) స్థిరత్వము కోరువాడు ఈ రెండు తృచలచే ఇంద్రుని యజించునది లేదా ఉపస్థానము చేయునది.
   
    భూకంపము కలిగినపుడు ప్రాయశ్చిత్తమునకు ఈ రెండు త్రుచలచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
   
    నిండు కుండ పగిలినపుడు ప్రాయశ్చిత్తమునకు ఈ రెంటిచే కొత్తకుండను దృఢపరచుటకు అభిమంత్రించునది.
   
    ఇంద్రమహా ఉత్సవమున ఈ రెంటిచే ఇంద్రుని లేవదీయునది.
   
    2) బ్రహ్మ అగ్ని చయనమున మొదటి ఋక్కుచే ఉన్నత ఉఖ్యాగ్నిని అనుమంత్రించునది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.