Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    తర్వాత కొంతమందిమి తెనాలి వెళ్ళాం. తగలబడిన రైల్వేస్టేషను చూసివచ్చాం. అంతకు మించి ఏమీ చేయలేకపోయాం.

 

    మహాత్ముని ఆశయాలనుకాని, నిర్ణయాలనుగాని శంకించలేం సామాన్యునిగా నా సంశయాలు వ్యక్తం చేస్తున్నాను. అందరూ ఆలోచించాలి:

 

    1. అప్పటికి సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశపు ఈశాన్య భాగంలో ప్రవేశించింది. అది భారతదేశాన్ని విముక్తం చేస్తుందనే ఆశ అందరిలో అంకురించింది. దానికి ప్రతిగా క్విట్టిండియా తీర్మానమా?

 

    2. క్విట్టిండియా తీర్మానం మహాత్ముని అహింసా సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందా? మహాత్ముడు స్వయంగా ఉద్యమంలో హింస చెలరేగుతుందని ఊహించారు. అహింసకు మీ రీతి వ్యాఖ్య మీరు చెప్పుకోండి అన్నారు.

 

    3. మహాత్మునికి లక్ష్యం కంటే మార్గం ప్రశస్తం. ఈ ఉద్యమంలో మార్గం కంటె లక్ష్యం ప్రధానంగా కనిపిస్తుంది.

 

    4. ఉద్యమం విజయవంతం అయితే నిర్ణయం సరియైందని భావించవచ్చా?

 

    5. "ప్రజాపోరాటాల్లో సిద్ధాంతం కన్న కర్తవ్యం మిన్న" అనిపించాను నా "మోదుగుపూలు" నవలలో నాయకుడు రఘుతో. ఇది క్విట్టిండియా తీర్మానానికి వర్తిస్తుందా?

 

    ఒక ఉద్యమం ముగిసింది. కాని, ప్రజా ఉద్యమాలు నిరంతరంగా ఉంటాయి. కాబట్టి, వీటిని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది.

 

    తరువాత సంవత్సరందాకా దేశంలోగాని మా కుటుంబంలోగాని చెప్పుకోదగిన సంఘటనలు లేవు.

 

    1943-44లలో అనుకుంటా - నాయన మా ఇంట్లో దిగాడు. అన్నయ్యకూ - నాయనకూ ఏవో మంతనాలు జరిగాయి. అమ్మకూడా అందుకు సుముఖంగా ఉన్నట్లుంది. నన్ను సంప్రదించలేదు. నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

 

    ఆ నిర్ణయం ప్రకారం నాయన మా అందరినీ గార్ల తీసికెళ్లారు.

 

    ఖమ్మంమెట్టు - మునేరు - లింగం మడుగు - ఏటికాలువ - గుంటిమల్లన్న గుడి - ఊడల మర్రి - నరసింహస్వామి గుట్ట - ఖిల్లా - కిల్లా బావి - బడి - గ్రంథాలయం - వీటితో పుష్కరంగా ఉన్న ముడి విడిపోయింది.  

 

    ఖమ్మంలో సంబంధాలు తెగలేదు. అనుబంధాలు విడిపోయాయి.

 

                                                       పదిహేను

 

    చీలిన కుటుంబం:

 

    నిజాం రాజ్యపు విస్తీర్ణం 82,000 చదరపు మైళ్లు. ఇందులో నిజాం ప్రభుత్వపు పరిపాలన ఉన్న 59,638 చదరపు మైళ్ల ప్రాంతాన్ని ఖాల్సా అంటారు. ఈ ప్రాంతంలో ఒక మాదిరి శాసనబద్ధమయిన ప్రభుత్వం ఉంటుంది.

 

    నిజాం స్వంత వ్యయానికిగాను ఉన్న 8,100 చదరపు మైళ్ల ప్రాంతాన్ని "పర్సేఖాస్" అంటారు. అంటే "స్వంత కర్చులకు" అని అర్థం. ఇందులో వచ్చే ఆదాయం సాంతం నిజాం సొంతం. ప్రజలకు కర్చు పెట్టేది ఉండదు.

 

    నిజాం స్వంత బంధువులకు చెందిన జాగీర్లను పాయోగాలు అంటారు. వాటి విస్తీర్ణం 3,262 చదరపు మైళ్లు. ఇక్కడ ప్రజల మీద పన్నులు తప్ప సౌకర్యాలు సున్న.

 

    నిజాం ఇతరులకు - అనేక సందర్భాల్లో - ఇచ్చిన 1,167 జాగీర్ల విస్తీర్ణం 11,000 చదరపు మైళ్లు. జాగీర్దార్లకు స్వంత విలాసాలు తప్ప ప్రజలు పట్టరు. ఇక్కడి ప్రజలకు 'ఖాల్సా' ప్రాంత ప్రజలకున్న నామమాత్రపు హక్కులు హుళక్కి. భూములకు సెటిల్మెంటుండదు. ప్రజలు 200 రకాల పన్నులు చెల్లించాలి. జాగీర్దారు ఇంట్లో పుట్టినా, చచ్చినా, పెండ్లి అయినా ప్రజలు అదనపు పన్నులు ఇచ్చుకోవాలి. కొన్ని పెద్ద జాగీరులకు పోలీసు, న్యాయాధికారాలు కూడా ఉండేవి.  

 

    అలాంటి అధికారాలు ఉన్నదే గార్ల జాగీరు. గార్ల ప్రాంతంకాక పండితాపురం - ఖమ్మం జిల్లా ఈ జాగీరులోనివే. చివరి జాగీర్దారు షోకత్ యార్ జంగ్ బహద్దుర్.

 

    గార్ల అసలు పేరు గాండ్ల. ఇది గానుగల గ్రామం. ఇక్కడ 108 దేవాలయాలు ఉండేవనీ అంటారు. నిజాం పక్షాన ఖమ్మం జిల్లాను పాలించిన జఫరుద్దౌలా క్రూరుడు. ధ్వంసమే ప్రధానవృత్తిగా గలవాడు. అతని పేరే "ధ్వంస" అని వచ్చింది. అతడు ఆ దేవాలయాలకు కూలగొట్టి ఉంటాడు. శిథిలాలు అంతటా కనిపిస్తాయి. కుసిలేక నిలిచిన రాతిస్తంభం కూలిన గోపాల స్వామి ఆలయానికి ధ్వజస్తంభం. ఇప్పుడు ఆ స్తంభం కూడా కూలిపోయింది. ఈ జాగీర్దారులు "ధ్వంస" వంశంవారే అయ్యుంటారు.   

 

    జాగీరు సాంతం మహదారణ్యం ప్రాంతంగా ఉండేది. కోయ గిరి జనులదే నివాసం. బ్రిటిషాంధ్రం నుంచి రైతులు వచ్చారు. భూములు కొన్నారు. అడవులు కొట్టారు. పొలాలు చేశారు. వ్యవసాయం వృద్ధి చేశారు. వారు గ్రామాలకు గ్రామాలు ఏర్పరచుకున్నారు.

 

    జాగీరును జాగీర్దారు తరపున నూరొద్దీన్ తాసిల్దారు పాలించాడు. అతడు అందరికీ గర్భనిర్భేధ్యం. అతడు పట్నంలో జాగీర్దారు మహలును మించిన మహలు గార్లలో కట్టాడు. మహలును జాగీర్దారు లాక్కుంటాడనే భయంతో నూరుద్దీన్ను అందులోనే పాతిపెట్టారు! అతని పేరు ఎవరికీ తెలియదు. అతడు బొర్రతాసిల్దారు.    

 

    గార్ల జాగీరులో జరిగిన ప్రజా ఉద్యమాన్ని నేను "మోదుగుపూలు" నవలలో చిత్రీకరించాను.

 

    తాసిల్దారు కింది ఉద్యోగి పేష్కార్. వారు వరవరరావుగారు. నాయనకు శిష్యులు. సాహిత్యాభిమాని. వేంకటేశ్వర గ్రంథమాల ద్వారా కొన్ని పుస్తకాలు ప్రచురించారు. వేంకటేశ్వర గ్రంథాలయం నిర్వహించారు. పాలనలో కిరాతుడు. సంపాదనలో దక్షుడు.

                 

              

 

    ఆ ఊళ్లో వేంకటేశ్వర స్వామి పూజారి ఇంట్లోనే వేంచేసి ఉంటారు. పురాతనం అయిన వీరభద్రాలయం ఉంది. శివాలయం - లక్ష్మీనారాయణ ఆలయం ఉన్నాయి. ఆలయంలేని పాండవులున్నారు. వానలేకుంటే పాండవులకు అభిషేకం చేస్తారు.                           




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.