Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    నాయన ఎప్పుడోగాని వచ్చేవారు కారు. ముఖ్యంగా డబ్బు చెల్లించడానికి. పనంతా నేనే చూచి పుస్తకాల కట్టలు రోజు ఒకటి చొప్పున బస్సులో చేర్చేవాణ్ణి. ఇద్దరం కలిసి అడ్రసులు వ్రాసి పోస్టు చేసేవాళ్ళం. అలా కొన్ని నెలలు గడిచాయి.

 

    అప్పుడు అన్నయ్య వాళ్ల వార్త అందింది. వాళ్లు ఇక్కణ్ణుంచి బయలుదేరి - అన్నయ్య మామగారింటికి - యాదగిరి గుట్ట చేరారు. అక్కడ కొన్నాళ్లున్నారు. అన్నయ్య "కవికొండ" గ్రామంలో చదువు చెప్పడానికి కుదిరారు. ఏడాదికి వందరూపాయలు హాలీలు. అమ్మనూ - చెల్లెళ్లనూ గూడూరుకు పంపించారు. వార్త తెలిసింతరువాత ఉండబుద్ధి కాలేదు. హైదరాబాదు వదిలేముందు రెండు విషయాలు చెప్పాలి.

 

    ఒకసారి నేను సీతారాంబాగ్ నుంచి వెళ్తున్నాను. నా ముఖాన బొట్టుంది. మంగల్ హాట్ పోలీసు స్టేషను దగ్గర తురక పిల్లలు నన్ను చూచారు. నా వెంటపడ్డారు. ఏక్సౌగ్యారా - నూటపదకొండు - అని వెక్కిరించారు. అయినా వీథిలో వెళ్లేవాళ్లుగాని, పోలీసువాళ్లుగాని ఆదుకోలేదు. అలాసాగింది వాళ్ల పెత్తనం అంత నిశ్చేతనంగా ఉన్నారు మనవాళ్లు.

 

    గౌలీగూడెంలో "శంకర్ షేర్" అనే ప్రఖ్యాత హోటలుండేది. అక్కడి చాయ్ అతి ప్రసిద్ధి. ఏకానేకో మలయిదార్ చాయ్! మూడు పైసలకు సింగల్ చాయ్. ఒక పైసకు లవంగం గుచ్చిన పాన్. ఒక పైసకు నాలుగు చార్మినార్ సిగరెట్లు. అణాలో అప్పటికి ఒక పైసా - తరువాత కాల్చడానికి మూడు సిగరెట్లు మిగుల్తాయి!    

 

    నేను నాయనకు చెప్పకుండా రైలెక్కాను. మానుకోటలో దిగి, కాలినడకన చిన్నగూడూరు చేరుకున్నాను. అమ్మను చూస్తే ప్రాణం లేచి వచ్చింది. జోడుచింతలు, నర్సిగారు - సీత - తామరల చెరువు - అమ్మమ్మ ఇల్లు - కొంత కాలం గడిచింది.

 

    అన్నయ్య కవికొండ వదిలి వచ్చాడు. అందరం మళ్లీ ఖమ్మం చేరుకున్నాం.

 

                                                         పధ్నాలుగు

 

    చిచ్చురగిలింది

 

    మేము ఖమ్మం చేరాం. నాయన మాకు నీడలేకుండా చేశారు. గుంటిమల్లన్న బజారు ఇల్లు అమ్మేశారు. అది ఎవరికీ శాంతులు కలిగించలేదు. పితామహులు - లక్ష్మణాచార్యులవారి - మాట తథ్యం అయింది. మనుషుల్లో వలె - ఇళ్లల్లోనూ మంచివీ చెడ్డవీ ఉంటాయి.   

 

    నాయన మామీద పగబట్టినట్లు - నాయకుల గూడెం పొలం అమ్మారు. మాకు అందకుండా సమస్త సామగ్రి భద్రపరచారు. వారు హైదరాబాదులోనే ఉన్నారు.

 

    అన్నయ్య చాకలి బజారులోని బుచ్చయ్య వకీలుపిల్లలకు చదువుచెప్పారు. వారుమాకు ఒక గది ఇచ్చారు. నేనూ ఒకటి రెండు ట్యూషన్లు చెప్పాను. బుచ్చయ్యగారు నాయనకు శిష్యులు. నాయన ఆజ్ఞాపించారు. వారు మమ్ములను వెళ్లగొట్టారు. అర్వపల్లి వారి సత్రానికి మారాం. అక్కడా అదేకథ. ఖిలాబజారులో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. అక్కణ్ణుంచి వెళ్లగొట్టలేదు.

 

    అక్కడ ఉన్నపుడే విద్యార్థి సంఘం గ్రంథాలయంలో లైబ్రేరియన్ గా చేరాను. అది సర్కారు ఉద్యోగం కాదు. ఆ ఉద్యోగం ఎవరూ చేసేవారు కాదు. దానికి జీత భత్యాలు లేవు. పైగా, ప్రభుత్వం గ్రంథాలయాలను సహించదు. అవి విప్లవకేంద్రాలని ప్రభుత్వపు అనుమానం!   

 

    ప్రభుత్వపు అనుమానం చాలావరకు నిజమే. ఆనాటి పుస్తకాలు యువకులలో ఆలోచనను - దేశభక్తిని కలిగించేవి. గ్రంథాలయంలో చర్చలు - సమావేశాలు జరిగేవి. ఉద్యమాలకు రూపు రేఖలు - ప్రణాళికలు సహితం అక్కడే ఏర్పడేవి.

 

    లైబ్రేరియన్ పని దేశభక్తికి సంబంధించింది. గ్రంథాలయానికి గ్రాంట్లు ఉండవు. చందాలమీద ఆధారపడాలి. చందాదారులను చేర్పించాలి. నెలనెలా వాళ్ళ ఇళ్లకు ఒకటికి రెండు సార్లు వెళ్లి ఓపిగ్గా చందాలు వసూలు చేయాలి. దాంతో పత్రికలకు చందాలు కట్టాలి. కట్టకుంటే పత్రికలు రావు. పుస్తకాలు కొనాలి. వీటికే ప్రాధాన్యత. అన్నీ ఆయిం తరువాత మిగుల్తే వేతనం. సాధారణంగా మిగలదు. మిగిలినా బహుకొద్ది.

 

    తురకపిల్లలకు తొలినుంచీ నేనంటే కుర్రు. అది వందేమాతరంతో నాకు మొదలయింది. కుచ్చుటోపిల సమ్మె నేనే చేయించానని వాళ్ళ నమ్మకం. సమ్మె నేను మాత్రమే చేయించానంతే ఇవ్వాళ్టికీ నాకు నమ్మకం లేదు. నేను కొంత - మరింత - ఆవేశపడి ఉంటాను. పిడుగు నామీద పడింది. అకారణంగా కలిగిన నష్టాన్నే దురదృష్టం అంటాం.

 

    నేను లోపల గడియవేసుకొని లైబ్రరీలో చదువుకుంటున్నాను. తురక పిల్లలే అనుకుంటా బయటినుంచి గొళ్లెం పెట్టారు. నేను రాత్రికి బయటికి రావడానికి తీస్తే తలుపు రాదు. గత్యంతరం లేదు. చీకటి పడింది. అటు జనం రారు. బల్లమీద పడుకున్నాను . చాల రాత్రికి అన్నయ్య నన్ను వెదుక్కుంటూ వచ్చాడు . గొళ్లెం చూచి వెళ్లిపోవాల్సిందే. తాళం లేదని అనుమానం వచ్చింది. తలుపు తట్టాడు. నేను లేచాను. ఇద్దరం ఇంటికి చేరాం. అమ్మ ఎదిరి చూస్తున్నది. కలవరపడుతున్నది. ఎవరూ అన్నాలు తినలేదు. అమ్మకు అడుగడుగునా బుగులే. నన్ను పట్టుకొని ఏడ్చింది. ఇంకా లక్ష్మి చావు గాయం మానలేదు! కెలుకుతున్నది! భోజనాలు చేశాం. పడుకున్నాం. ఆనాడు దేశాన్ని విప్లవోన్ముఖం చేస్తున్నది క్విట్ ఇండియా తీర్మానం. అన్నయ్యా నేనూ దాన్ని గురించి ముచ్చటించుకున్నాం. మహాత్ముడు భారతదేశమే పెద్ద కారాగారం అన్నాడు. అలాంటప్పుడు నిజాం రాజ్యం అండమాన్ దీవి అవుతుంది. ఇక్కడ ఉద్యమ ప్రభావం అంతగా కనిపించలేదు.

 

    1942 ఆగస్టు 15వ తేదీన బొంబాయిలో కాంగ్రెస్ మహాసభ జరిగింది. భారత స్వాతంత్ర్యం కోసం అంతిమ పోరాటం జరపాలని నిర్ణయం అయింది. ఆంగ్లేయులను భారతదేశం వదిలి పోవాలని ఆదేశించడం జరిగింది - "క్విట్ ఇండియా!"

 

    "ఇదిగో మంత్రం. ఇది చిన్నది. మీకు అందిస్తున్నాను. దీన్ని మీ గుండెలకు హత్తుకొండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ మంత్రమే కావాలి. చేయండి లేక చావండి. ఇదే ఆ మంత్రం. మీరు ఇండియాను విముక్తం చేయాలి. లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలు అర్పించాలి. మన బానిసత్వం స్థిరపడడానికి మనం జీవించం. ప్రతి వాస్తవ కాంగ్రెసువాది ఈ ఉద్యమంలో చేరాలి. మన దేశాన్ని బానిస బంధాల్లో చూడ్డానికి జీవించను అనే సంకల్పంతో ఉద్యమించాలి..... ఈక్షణం నుంచి ప్రతి వ్యక్తి పోరాటానికి అంకితం కావాలి. తినడం - బ్రతకడం అన్నీ స్వాతంత్ర్యం కోసమే అని గుర్తుంచుకోవాలి. లక్ష్యం సాధించడానికి - అవసరం అవుతే - ప్రాణాలర్పించాలి. స్వాతంత్ర్యం సాధించేదాకా విశ్రమించమని  - అక్కరపడితే ప్రాణాలు అర్పిస్తామని భగవత్ సాక్షిగా లేక మనస్సాక్షిగా ప్రమాణం చేయండి. ప్రాణాలను త్యాగం చేసినవాడు సాధిస్తాడు - రక్షించుకున్నవాడు వదులుకుంటాడు. పిరికివాళ్లు - సోమరులు స్వాతంత్ర్యం సాధించలేరు. అది వారికోసం కాదు" అని మహాత్ముడు మంటల సందేశం ప్రసారం చేశాడు.

 

    "ప్రతి అహింసా స్వాతంత్ర్య సమరయోధుడు 'చేయండి లేక చావండి' నినాదం గుడ్డ పేలికమీదకాని కాగితం ముక్కమీద గాని వ్రాసి వారి దుస్తులకు అంటించుకోవాలి. ఎంచేతంటే, సత్యాగ్రహ సందర్భంగా మరణిస్తే హింసావాదులనుండి వేరుగా వారిని గుర్తించవచ్చు." ఇవి మహాత్ముడు 9 ఆగస్టు 1942న అరెస్టు అయిన తరువాత అన్నమాటలు.

 

    అహింసను గురించి నెహ్రూ అడిగినప్పుడు గాంధీజీ "అహింసను మీ పద్ధతిలో వ్యాఖ్యానించే స్వేచ్చ మీకుంది" అన్నారు.

 

    1942 ఆగస్టు 9న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్లందరినీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ వార్త దేశం నలుమూలలా చిచ్చురేపింది. దేశమంతటా టెలిఫోనువైర్లు తెంపారు. రైలు పట్టాలు ఊడపెరికారు. ప్రభుత్వ భవనాలు తగలపెట్టారు. వేల సంఖ్యలో ప్రజలు అరెస్టు అయినారు.  

 

    దేశవ్యాప్తంగా కార్చిచ్చు రగిలింది. ప్రభుత్వం తగలబడిపోతున్నది. దానిని రక్షించే నాథుడు దిక్కులేకుండా పోయాడు.

 

    నిజాం రాజ్యంలో స్వామీజీని అరెస్టు చేశారు. రాజ్యమంతటి నుంచి పన్నెండు మంది ప్రధాన కాంగ్రెసు నేతలను అరెస్టు చేశారు. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలు వదిలారు.  ఊరేగింపులు జరిగాయి. జంట నగరాల్లో హర్తాళ్ జరిగింది. లాఠీ ఛార్జీలు జరిగాయి. కొత్తగూడెం రైల్వేలైను పెరకడం జరిగింది.

 

    ఆనాడు మాలో ఆవేశం హద్దులు దాటింది. "చేయాలి లేక చావాలి!" "పిరికిపందలు, సోమరులు స్వాతంత్ర్యానికి అర్హులు కాదు" అనే మహాత్ముని నినాదం మా రక్తంలో మంటలు లేపింది. క్రియా శూన్యులు కావడం కంటే చావడం మేలు! కాని, ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏమీ అర్థం కాలేదు. ఆరోజు సాంతం ముళ్లమీద ఉన్నాం. గ్రంథాలయంలో సమావేశం అయినాం. ఉపన్యాసాలు తప్ప మార్గం  కనిపించలేదు. వ్యక్తిగత సంతృప్తికి నిరశనం పాటించాలనుకున్నాం. గ్రంథాలయంలోనే గడిపాం.              




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.