Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    మేము వరవరరావుగారి ఇంట్లో విడిశాం. వారి ఇంటినిండా జనం. బంధువులు -  మిత్రులు - వచ్చిపోయేవాళ్లు. అది ఆరోజుల్లో అతి సహజం. వారి నిత్య జీవనం విచిత్రంగా ఉంటుంది. పొయ్యిమీద నీళ్లు పెట్టి, టీ పొడి చెక్కెరకు ఉరికిస్తారు. ఎసరుపెట్టి బియ్యం దంపిస్తారు. నిప్పు వేసేముందు కట్టెలు కొట్టిస్తారు. లేదా అంటే సమృద్ధి. అనేకమంది పనివాళ్లు! అలవాటును మించింది లేదు. దాన్ని మార్చడం కష్టం.

 

    మాకు అక్కడ బాగానే ఉంది. విశాలం అయిన ఇల్లు. వంటమనుషులు. పనివాళ్లు. నాయనకు కాలక్షేపాలు. ఆలయంలో భోగాలు. తడియారాధనలు!

 

    ఇలా ఉండగా చిలుకూరు శ్రీరాములుగారని అద్వైత పండితుడు. తెనాలినుంచి వచ్చి స్థిరపడ్డారు. ఆనంద రామాయణం రచించారు. వాణిజ్య వర్గాల్లో పలుకుబడి సంపాదించారు. వారు ఊళ్లో రుద్రయాగం చేయించారు.

 

    వారు రుద్రయాగం చేశారని, వైష్ణవ యాగం చేయించడానికి నాయనను పిలిపించారు. నాయనకు శైవం విషతుల్యం. పేష్కారు పలుకుబడి - నాయన పాండిత్యంతో వర్తకులు విరాళాలు ఇచ్చారు. వైష్ణవ యాగం ఘనంగా జరిగింది. చుట్టుపట్ల దాని చర్చలు జరిగాయి.

 

    వాస్తవానికి అద్వైతులు శైవులు కారు. వారు శివ కేశవులను సమానంగా భావిస్తారు. పూజిస్తారు. వారిది జగద్గురు శంకరుని "సర్వఖల్విదాంబ్రహ్మ" సిద్ధాంతం.

 

    శివుని మాత్రం పూజించి "శివాత్పరతరంనాస్తి" అనేవాళ్లు వీరశైవులు. కులపరంగా ఆరాధ్యులు - జంగములు.

 

    ఖమ్మం నుంచి బయలుదేరినపుడే గార్లలో స్థిరపడాలనే నిర్ణయం జరిగినట్లున్నది. పేష్కారు గారు రాతిస్తంభం బజారులో ఊరి చివరన ఒక స్థలం ఇప్పించారు. అందులో మంచినీళ్ల బావి ఉన్నది. దాని ఖరీదు రెండు వందలు. ఆ డబ్బు నాయనే ఇచ్చినట్లు గుర్తు.

 

    ఆ స్థలంలో ఒక గుడిశ వేశారు. దాని వాసాలది ఒక వృత్తాంతం. ఒక కోయతను భూమిశిస్తు కట్టలేక పోయాడు. అతణ్ణి పట్టుకొని వచ్చారు. భూమి నాకు వద్దు మొర్రో అంటాడు. వాపసు తీసుకొమ్మంటాడు. అందుకు దరఖాస్తు కావాలంటారు. దరఖాస్తు కోసం ఇంటి వాసాలు అడవినుంచి తెమ్మన్నారు. వాసాలు కొట్టాడు కోయతను. బండి మీద తెచ్చివేశాడు. ఆ వాసాలతో ఆ గుడిశ కప్పువేశారు.

 

    ఆనాటి భూమి విలువ అంత. రూపాయి పావలా దరఖాస్తుకు వస్తుంది. వదులుకోవాలన్నా రూపాయి పావలా! ఇప్పుడు అడవుల్లేవు. క్షవరం చేశారు. చెట్టు కనిపించదు. లక్షలకు భూమి దొరకేట్లులేదు. భూముల కోసం హత్యలు! దురాశ దుఃఖం చేటు!       

 

    మేము మా పర్ణశాలకు మారాం. ముందు చాలా స్థలం వదిలారు. వెనుక పాక వేశారు. దానికి ద్వారబంధం ఉంది. ద్వారం లేదు. గోడలు ఇంకా మొండిగానే ఉన్నాయి. నేల కూడా పూర్తిగా చదును కాలేదు. అడవి దగ్గరలో ఉంది. తేళ్లు - దుప్పులు - కుందేళ్లు, ఒక్కొక్కపుడు ఎలుగ్గొడ్లు కనిపిస్తుంటాయి. నక్కలు కనిపిస్తుంటాయి. ఊళలు వినిపిస్తుంటాయి. పాములు కాళ్ళలో మసలుతుంటాయి. తేళ్లు జెర్లు చీమలు దోమల్లా ఉంటాయి. వానపడితే ఇంట్లో ఊటలు వస్తాయి.

 

    ఎంతయినా మన ఇల్లు కదా! బాగు చేసుకున్నాం. ముందరి స్థలంలో మొక్క జొన్న వేశాం. అది ఏపుగా పెరిగింది. ఇంటి చుట్టు బంతి - గోరెంట - రుద్రాక్షమొక్కలు వేశాం. పూశాయి. బావిమీద పందిరికి పొట్లతీగ పారించాం. కాసింది. పొట్ల పిందల చివరన చిన్న చిన్న రాళ్లు కట్టాం. ఇంటి కప్పుకు సొరతీగ పాకించాం. విరగకాసింది. ఉన్నచోట వనం ఏర్పరుచుకున్నాం.  

 

    అన్నయ్య మెట్రిక్ పాసయ్యాడు. వారిపేరు పత్రికలో వచ్చింది. అంటే అంత కొద్దిమంది ఉండేవారు. ముందును గురించి ఆలోచనలు జరుగుతున్నాయి. నేను భవభూతి "ఉత్తర రామచరితం" చదువుతున్నాను. "ఉత్తరే రామచరితే భవభూతిర్విశిష్యతే" ఉత్తర రామాయణం రచనలో భవభూతిని మించినవాడులేడు. "ఏకోరసః కరుణయేవ" అని కరుణ రసంతో కొండలను కోనలను ఏడిపించిన కరుణ కవి భవభూతి.

 

    ఒకనాడు నేను ఖమ్మం వెళ్లాను. తిరిగి వచ్చేవరకు నాయన లేరు. అన్నయ్య నాయన మీద అగ్గి బుగ్గి అవుతున్నారు. అమ్మా చెల్లెళ్లు ఏడుస్తున్నారు. నాకు "ఏమయింది" అని అడిగే ధైర్యం లేకపోయింది.

 

    "అడవిలో తెచ్చి పెట్టి వెళ్లిపోయాడు, దుర్మార్గుడు, దుష్టుడు, పాపి" అని చదివేస్తున్నాడు అన్నయ్య.

 

    అప్పుడు అర్థం అయింది - పథకం ప్రకారమే నాయన మమ్ములను ఇక్కడ దింపాడని. అసలు అన్నయ్య ఖమ్మంనుంచి ఎందుకు కదిలి వచ్చినట్లు? ఆ మాటనేను అడగలేదు.

 

    అప్పటికి అమ్మ గర్భవతి!

 

    నాయన శాశ్వతంగా విడిపోయినట్లే! ఇహ మళ్లీ రారు..

 

    తరువాత తెలిసిన విషయం ఏమంటే - మామూలు వలెనే ఆనాడూ తగాదా! నాయన అమ్మను కొట్టబోయాడు. అన్నయ్య అడ్డుపడ్డాడు. ఇద్దరికీ ఘర్షణ జరిగింది. అన్నయ్య దుడ్డుకర్రతో నాయన కుడిభుజం మీద కొట్టాడు. నాయన "అమ్మో" అని కూలబడ్డారు. లేచి శాపనార్థాలుపెడ్తూ వెళ్లిపోయారు.    

 

    అది విన్నాక దైవిక న్యాయాన్ని మించింది లేదనిపించింది. నాయన తాతయ్యను ఖమ్మంలో సరిగ్గా అదే విధంగా కొట్టారు!

 

    అంతటితో నాయనా మేమూ విడిపోయాం. మళ్లీ కలిసి ఉండలేదు.

 

    వివాహాల్లో దూరపు సంబంధాలు మంచివి. రక్త సంబంధాలు అనర్థాలు తెస్తాయి. శాస్త్ర ప్రకారం ఉభయ పక్షాలు ఏడుతరాలసంబంధాలు కలవరాదు. అందుకోసమే సగోత్రవివాహాలు నిషేధాలు!   

 

    మేనరికపు వివాహాల్ని వైద్యశాస్త్రము, సామాజిక శాస్త్రమూ అనుమతింపవు. ఇవి ఆస్తిని కాపాడుకోవడానికి ఏర్పడ్డాయి. అదే ఆచారంగా మారింది.

 

    మేనరికపు పెళ్లిళ్ల వల్ల వ్యాధులు సంక్రమించటం - సంతానానికి నష్టం కలుగుతుందని స్పష్టం అయింది. మనస్తత్వాల విషయం కూడా ఆలోచించాలి. మేనత్త పోలికలు. మేనమామ చారికలు అని ఒక సామెత ఉంది. పుట్టింటి గుణాలు కూతురుకు వస్తాయని కైక విషయంలో రామాయణంలో చెప్పబడింది.

 

    జీన్స్ శారీరకం మాత్రమేకాదు - మానసికం కూడా. జీనియస్ అనే పదం జీన్స్ నుంచి, అంటే పుట్టుక నుంచి వస్తుంది. గుణగణాలు కూడా వారసత్వంగా వస్తాయని అర్థం. మేనరికాలది ఒకే వారసత్వం. కాబట్టి ఒకే గుణాలు కలిసి ఉండడం అసంభవం కాకున్నా అసాధ్యం - దుస్సాధ్యం.

 

    `మా అమ్మా - నాయనలది మేనరికం. వారి ఇరువురి కోపతాపాలు - పట్టుదలలు - ఆలోచనలు - స్వతంత్ర భావాలు సుమారు ఒకలాంటివే! ఇద్దరి పట్టూ ఒకటే. ఎన్నడూ వారికి పడలేదు. కలిసి ఉన్నది విధి లేకనే!

 

    తప్పు నాయనదే ఎక్కువ. అమ్మది తక్కువే కాని, సర్దుకుపోయే స్వభావం లేదు. స్వతంత్రం - ఎదిరించడం ఆమె ప్రధాన లక్షణాలు. అవే మాకూ వచ్చాయి.

 

    ఉభయులూ సంతానం విషయంలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు. నాయన బాధ్యత గుర్తించనేలేదు.

 

    పెళ్లి రెండు మనసుల కలయిక. మనసు భౌతిక శాస్త్రానికి అందనిది. అయినా అనుకూల దాంపత్యం కోసం నిరంతరం యత్నించడం మన విధి.

 

    సమాజ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మేనరికపు ఆచారానికి స్వస్తి చెప్పడం ఉత్తమం.

 

    అన్నయ్య జాగీరు స్కూల్లో పదిహేను రూపాయిలు నెలవేతనానికి టీచరుగా చేరాడు. చిలుకూరి శ్రీరాములుగారు కూడా అక్కడే టీచరు. వారి కలయిక సాహిత్య కృషికి - కవితారచనకు ఎంతో ఉపకరించింది. అయిదో దశకంలో శ్రీరాములుగారు అన్నయ్య "రుద్రవీణ" ప్రచురించారు.

 

    నాయన పోవడం పోవడం, వరవరరావుగారి ఇంట్లో మకాం పెట్టారు. అధికారులు అంతా నాయన పక్షం. మమ్ములను ఇల్లు కాళీ చేయించే ప్రయత్నం చేశారు. కాని, అధికారులు అందుకు తోడ్పడినట్లులేదు. మామీద వత్తిడి వచ్చిన మాట నిజం. అది ఊళ్లోంచి వెళ్లగొట్టేవరకు రాలేదు.

 

    నాయన మైసూరు వెళ్లి, మళ్లీ పెళ్లి చేసుకొని దిగారు. ఈ ప్రాంతంలో వారికథ తెలుసు. పిల్లను ఇవ్వరు. మైసూరులో తన భార్య చచ్చిపోయిందనీ, తనకు పిల్లలు లేరనీ బొంకి, నాగరత్నమ్మను పెళ్లి చేసుకొని వచ్చారు. నాగరత్మమ్మ వైష్ణవ నామం కాదు. ఆమెకు "శ్రీదేవి" అని పేరు పెట్టారు. కరణాలు దస్తరం ఎంతగా మార్చారంటే - ఎన్నడూ నాయన పేర ఉన్న దాఖలాలు ఉండకుండా చేశారు. అంటే, మాను మాకు హక్కులేకుండా చేశారు.

 

    నాయన చిన్నమ్మను - చిన్నమ్మేకదా - తీసుకొని ఖమ్మం వెళ్లి కాపురం పెట్టారు.

 

    మేము ఆధారంలేక అడవిలో పడిపోయాం




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.