Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
తోప్ కా సాంచా - గన్ ఫాండ్రీ వద్ద గోలకొండ పత్రిక కార్యాలయం. అందులో విజ్ఞానఖని సురవరం ప్రతాపరెడ్డిగారు. వారు పురాణాదులు విశ్వసించేవారు కారు. దాడి చేసేవారు. వారికీ నాయనకు దగ్గరి పరిచయం. ఉభయులు భిన్న దృక్పథాలవారు. అయినా ఎంతో సామరస్యంగా చర్చించుకునేవారు.
ఒకసారి సురవరంవారు శ్రీవేంకటేశ్వరస్వామి వైష్ణవుడు కాడు, శివుడు అని గోలకొండలో ఒక వ్యాసం వ్రాశారు. ఆ విషయంలో నాయనకూ వారికి ఉద్రోకాలు లేని చర్చ జరిగింది. తరువాత శ్రీనివాసుడు వైష్ణవుడే అని నాయన నిరూపించారు. ఆ వ్యాసాన్ని కూడా సురవరం వారు ప్రకటించారు. ఈ వివరాలు నేను రచించిన "వెంకటేశ్వర మహాత్మ్యము"లో వివరించాను.
ట్రూపు బజారులోని ఆంధ్రకుటీరంలో ఆంధ్రపితామహులు మాడపాటి హనుమంతరావు గారు ఉండేవారు. నాయనతో నేను తరచుగా వారి దగ్గరికి వెళ్లేవాణ్ణి. వారు సాధు స్వభావులు. ఒకరిని నొప్పించరు. అన్ని వాదాలనూ సాకల్యంగా వింటారు. నాయనకూ వారికీ రామాయణం విషయంలో తరచు చర్చ జరిగేది. వాల్మీకి రామాయణం విషయంలో శ్రీవైష్ణవులు ఎంతో కృషి చేశారు. నాయన రామాయణంలో నిష్ణాతులు.
ఆరవ దశకంలో హనుమంతరావుగారితో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. వారు హైదరాబాదు నగర ప్రథమ మేయర్. అప్పుడు కాళేశ్వరరావుగారు స్పీకరు. ఒకసారి అంతటివారు కలుసుకున్నప్పుడు నేను అక్కడ ఉండే అదృష్టం కలిగింది. వారు చమత్కారులు.
కాళేశ్వరరావుగారు "స్పీకరు" అన్నారు హనుమంతరావుగారు. అంటే మాట్లాడరు అని అర్థం. ఇంగ్లీషులో "స్పీకర్" అంటే మాట్లాడేవాడు. కానీ స్పీకర్ పదవి వినడానికే - మాట్లాడ్డానికి కాదు. అందుకే దానికి తెలుగు ప్రత్యయం చేర్చి "స్పీకరు" చేశారు.
కాళేశ్వరరావుగారు వెంటనే హనుమంతరావుగారు "మేయరు" అన్నారు. మేయర్ గా కార్పోరేషను డబ్బు కాజేయలేనివారు అనే అర్థంలో "మేయరు" అనే పదం ఉపయోగించారు.
ఆ తరువాత హనుమంతరావుగారు శాసన మండలి అధ్యక్షులయినారు. ఉభయ సభలకు కాళేశ్వరరావుగారు, హనుమంతరావుగారు ఎంతో గౌరవ ప్రతిపత్తులను సమకూర్చారు.
వట్టికోట ఆళ్వార్ స్వామి - వావిలాల గోపాలకృష్ణయ్య, నేను ఒక కమిటీగా ఏర్పడి మాలపల్లి రచయిత ఉన్నవ లక్ష్మినారాయణ గారికి సన్మానం తలపెట్టాం. ఈలోగా లక్ష్మీనారాయణగారు పరమపదించారు. కాళేశ్వరరావుగారి అధ్యక్షతన మహబూబ్ కాలేజీలో ఉన్నవ వారి సంతాప సభ జరిపాం. ఉన్నవ మాలపల్లిలో మల్లెపొదలు మొలిపించారు. అనే గేయం చదివాను.
నీలం సంజీవరెడ్డిగారు నా "రణరంగం" గాంధీభవనంలో ఆవిష్కరించినపుడు ఆంధ్రపితామహులు విచ్చేశారు. ఆనాటి వారి ఫోటో, వారు వ్రాసిన ఉత్తరం నాదగ్గర ఉన్నాయి.
నా "చిల్లరదేవుళ్లు" ఆంధ్రపితామహులకు అంకితం ఇచ్చాను.
వారు పరమపదించినపుడు "ఆంద్ర పితామహ" అనే వ్యాసం వ్రాశాను 15.11.1970 విశాలాంధ్రలో వచ్చింది. ఆ వ్యాసం చివరన ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి పద్యం ఉటంకించాను.
ఆంధ్రసారస్వతము నిజామాంధ్ర సంఘ
మిటుల నెన్నిటినో గూర్చి ఘటికులందు
నొక్కరుడవయి మించితి వుక్కుమిగుల
రమ్యగుణసాంద్ర హనుమంతరామ చంద్ర!
కొత్వాల్ వెంకట్రామరెడ్డిగారిని నాయన కలుసుకున్న ఉదంతం విచిత్రం. వారి ఇల్లు నారాయణగూడెం వై.యం.సి.ఏ. పక్కన ఉండేది. అప్పటికి అక్కడ జనావాసాలు తక్కువ. రెడ్డిగారి ఇంటి ముందున్న జవాను నాయనను లోనికి వెళ్లనీయలేదు. టెలిఫోను మంత్రం పని చేయలేదు. టెలిఫోను వేరేవాళ్లు తీశారు.
ఒకనాడు జవాను లేనిది చూచి లోనికి దూరాం. హాలులో తురక వేషాల్లో రెడ్డిగారి సహితంగా నలుగురు - గద్దిమీద కూర్చుని, ఉర్దూలో మాట్లాడుకుంటున్నారు. ఆకస్మికంగా నాయన దూరడం వారిని చకితులను చేసింది. ఇంకా వారు తేరుకోకముందే నాయన ఉపన్యాసం ప్రారంభించారు. ఆ నలుగురూ గంటసేపు నిర్విరామంగా నాయన ఉపన్యాసం విన్నారు. ఎంతో ప్రభావితులు అయినారు. వెంకట్రామారెడ్డిగారు నాయనకు వందరూపాయలు సమర్పించి, పాదాభివందనం చేశారు!
ఇంకా ఆరావముదమ్ అయ్యంగార్ - నర్సింగ్ రావు మున్నగు అనేకమందిని నాయన కలుసుకున్నారు.
అప్పుడు టాంగాలు ఎక్కువ. మనుషులు లాగే రిక్షాలు అప్పుడప్పుడే వస్తున్నాయి. మేము కాలినడకనే వెళ్లేవాళ్లం. మరీ దూరం అవుతే అణా - బేడ ఇచ్చి రిక్షాలో వెళ్లేవాళ్లం. వీధులు విశాలంగా శుభ్రంగా ఉండేవి. రోడ్లమీద కొంత కొంత దూరానికి రేకులు - తట్టలు పట్టుకొని మనుష్యులుండేవారు. గుర్రం లద్ది పెట్టినా, చెత్త పడినా వెంటనే తీసేవారు. ట్రాఫికు ప్రధాన మార్గాల్లో కూడా పల్చగా ఉండేది.
నేను తీరిక సమయాల్లో గ్రంథాలయంలో కూర్చునేవాణ్ణి. గోలకొండ పత్రిక కాక "రహబర్ దక్కన్", "రయ్యత్", "ఇమ్రోజ్" లాంటి ఉర్దూ పత్రికలు వచ్చేవి. యుద్ధ వార్తలు ఎక్కువ. బ్రిటిషిండియాలో స్వాతంత్ర్య ఉద్యమ వార్తలు ఉత్సాహాన్నీ; గాంధీజీ, నెహ్రూ, సుభాస్ ఉపన్యాసాలు ఆవేశాన్నీ కలిగించేవి. ప్రజాపోరాటాల్లో నాయన ఉపన్యాసాల పాత్రను గురించి ఆలోచించేవాణ్ణి. కాని, వ్యతిరేకించేవాణ్ణి కాదు. విరోధించేవాణ్ణి కాను.
'భారతి' ఆరోజుల్లో కనిపించిన ఏకైక సాహిత్య పత్రిక. ఎందరో మహానుభావులు ఎన్నో విషయాలను గురించి అందులో వ్రాసేవారు. మా అన్నయ్య దాశరథి కృష్ణమాచార్యుల పద్యాలు ఒకటి రెండు సార్లు వచ్చాయి. ఎంతో బాగా వ్రాశాడు. నాయన తప్ప అనేకమంది మెచ్చుకున్నారు.
సీతారాంబాగ్ లో ఇలా కొంతకాలం గడిచింది. నా కడుపునొప్పి తగ్గలేదు. మందూ మాకూ లేదు. పని తప్పదు. అజీర్ణం. అప్పుడప్పుడూ కుండెడు కుండెడు వాంతి.
ఇలా ఉండగా ఒకనాడు అమ్మా చెల్లెళ్లూ దిగారు. నాకు ఎంతో సంబరం అయింది. అన్నయ్య కూడా ఆనందించాడు. అమ్మ దగ్గరా, చెల్లెళ్లతో కాలక్షేపం చేశాను. నాయన ముభావం వహించారు. అభావం లేదు. విసర్జన లేదు. సర్దుకు పోవడం అమ్మకు పుట్టుకతోనే వచ్చింది. నాకు పని తప్పింది కాని, జబ్బు హెచ్చింది. రోజూ వాంతులు అవుతున్నాయి. అమ్మ వచ్చిందని తెలిసి కావచ్చు, మామగారు కమలను తీసుకొచ్చారు. రెండు మూడు రోజులున్నది. ఎప్పుడూ అమ్మతోనే ఉండేది. నాతో మాట్లాడినట్లు గుర్తులేదు.
ఈ తడవ పెద్దగా గొడవలున్నట్లు అనిపించలేదు. నాయనకూ అమ్మకూ ఆప్యాయత లేక కలకాలం అయింది. సర్దుకుపోతున్నట్లు అనిపించింది. అన్నయ్య లెక్కల్లో మళ్లీ తప్పాడు.
ఒకనాడు తెల్లారేవరకు అన్నయ్యా - అమ్మా - చెల్లెళ్లు లేరు. రాత్రే వెళ్లిపోయినట్లున్నారు. నన్ను వదిలిపోవడం ఎందుకు? నేను పెద్దగా ఏడ్చాను. నాయన తొలిసారి నన్ను ఓదార్చారు! నాకు జబ్బు - వాంతులు. నాయన నన్ను బన్సీలాల్ ఆస్పత్రిలో చేర్పించారు. వారు గౌలీగూడెంలోని నరసింహాచార్యులవారి హోటల్లో చేరారు.
హోటలంటే ఇవ్వాళ్టి హోటలు కాదు. అది పూటకూళ్ల ఇల్లే. వైష్ణవులు - వైష్ణవమతాభిమానులు అక్కడికి వచ్చేవారు. ఒక హాలుండేది. ఉంట పంట అక్కడే. రెండు గదులుండేవి. సంపన్నులు కానీ, అందులో ఉండేవారు కాదు. మాకు ఒక గది ఇచ్చారు. మాకు గది - భోజనం ఉచితం. నాయన తీరిగ్గా ఉన్నప్పుడు శ్రీసూక్తి సాయిస్తారు.
నాయన "దాశరథి" అనే ఒక మాసపత్రిక వెలువరించడం ప్రారంభించారు. వానిలో ద్రావిడ ప్రబంధాల ఆంధ్రానువాదం ఉండేది. అనువాదం కొంత నేను - కొంత నాయన చేసేవారం. అచ్చుపని బాధ్యత సాంతం నాది . పత్రికలు పంపడం నాయనా నేనూ కలిసి చేసేవాళ్లం.
హైదరాబాదులో తెలుగులేదు. ఉర్దూయే. తెలుగు మాట - తెలుగు అచ్చు - తెలుగు సినిమా - తెలుగు నాటకం - తెలుగు సభ అంటే సికిందరాబాదు వెళ్లాల్సిందే. రెండే రూట్లలో బస్సులుండేవి. నాంపల్లి మీదినుంచి 8, బషీర్ బాగ్ మీదనుంచి 7నెంబరు బస్సులు సికిందరాబాదు వెళ్లేవి. నాకు సగం టిక్కెట్టు. అణాకు సికిందరాబాదు చేరేవాణ్ణి.
హుసేన్ సాగర్ లో తామరపూలు - అల్లిపూలు - కలువ పూలు ఉండేవి. కట్ట కింద "కెవుడాబన్" - మొగిలి వనం పొలాలు ఉండేవి.
కొన్నాళ్లు భారతీ ప్రెస్సులోనూ, కొన్నాళ్లు ప్రీమియర్ ప్రెస్సులోనూ "దాశరథి" అచ్చయింది. యుద్ధం మూలంగా మిల్లు కాగితం లభించేది కాదు. చేతికాగితం డెమ్మీ సైజు రీము ఎనిమిది హాలీ రూపాయలు. అచ్చుకు ఫారం ఆరు రూపాయలని గుర్తు. నేను నిత్యమూ సికిందరాబాదు వెళ్లేవాణ్ణి. రోజంతా ప్రెస్సులోనే. కూర్పించే పనో. ప్రూప్సు చూచే పనో! పనివాళ్లంతా దోస్తులయినారు. అప్పుడప్పుడూ అణాకు ఒక గులాబ్ జాం, షోలాపూర్ మిఠాయి దుకాణంనుంచి తెప్పించుకొని తినేవాళ్ళం.





