Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
1. నిర్రుతి దేవీ! నీ యొక్క సర్వాంగములందు పాప రూప పాశము బంధించినది. విప్పరాకుండునట్లు మెడకు కట్టినది. నేను దానిని విడిపించుచున్నాను. అందువలన నీకు బలము, తేజస్సు కలుగునుగాక. ఈ బలవర్ధక అన్నమును భక్షించుము.
2. తీక్ష్ణ తేజోవంత నిర్రుతి దేవీ! నీ ఇనుప బంధనములను విప్పివేయుము. అట్లగుట వలన యముడు మరల జీవితము ప్రసాదించుచున్నాడు. "యమాయ నమో అస్తు మృత్యవే"
3. నిర్రుతిదేవీ! నీవు ఇనుప తాళ్ళచే బంధించినవాడు మత్యు రూపములగు వేల వ్యాధులకు గురియగు చున్నాడు. నీవు, యముడు, పితరులు కలిసి అట్టివానిని దుఃఖమెరుగని స్వర్గమునకు పంపండి.
4. అగ్నిదేవా! నీవు కోరికలు తీర్చుస్వామివి. ధనములను అందించువాడవు. భూమి మీద ప్రజ్వరిల్లు నీవు మాకు సంపదలు అందించుము.
రెండవ సూక్తము - 32
వినియోగము:
1. తొలి తృచచే సాంమనస్య కర్మమున నీటి కుంట లేక కల్లుకుండను సంపాతన, అభిమంత్రణలు చేసి గ్రామ మధ్యమునకు తెచ్చునది. వత్సతరీ మాంసమును దీనిచే సంపాతన, అభిమంత్రణలు చేసి భుజించునది. అట్లే చేసి సురను త్రాగునది.
2. రెండవ తృచచే సంగ్రామ విజయ కర్మలు చేయునది. దీనిచే అభయ గణములందు, అపరాజిత గణములందు ఘ్రుతాహుతులు ఇచ్చునది.
1. సమాన మనస్కులు కాదలచినవారు సమాన జ్ఞానవంతులు, సమాన ఉపాయవంతులుకండి. అందువలన దేవతలు అసురుల కన్న ముందు ఆహుతులు అందుకున్నట్లు మీరు అభిలషిత ఫలములను అందుకొనగలరు.
2. సమానచిత్తుల ఆలోచన, సహవాసము, కార్యము ఒకే విధములైనవి కావలెను. మీ కొరకు సమాన హవిస్సు అర్పించుచున్నాను. మీరు ఏక మనస్కులు అగుదురుగాక.
3. సమానీవ ఆకూతిః సమానా హృదయానివః సమానమస్తు నో మనో యథావః సుసహాసతి
ఆకూతిః - సంకల్పము - సుసహాసతి - కార్యసిద్ది.
--౦౦౦--
1. శత్రువు కోపము శాంతించుగాక. అతని బాహువులందలి ఆయుధ గ్రహణ శక్తి క్షీణించునుగాక. ఇంద్రదేవా! నీవు నిద్రలో సహితము శత్రువును వధించగలవు. మా శత్రువును ఓడించుము అతని ధనమును మాకు అందించుము.
2. దేవతలు తమ ఆయుధములచే శత్రువుల చేతులు నరికినారు. నేను హవిస్సులు అర్పించి ఆ ఆయుధములతోనే శత్రువుల చేతులు నరికివేయుచున్నాను.
3. తొలుత ఇంద్రుడు అసురులను హస్తరహితులను చేసినాడు. ఇంద్రుని అనుగ్రహము వలన మా యోధులు శత్రువులను జయింతురుగాక.
మూడవ సూక్తము -33
వినియోగము :
1. మొదటి తృచ పూర్వ సూక్తపు రెండవ తృచ వలె.
2. రెండవ తృచ పూర్వ సూక్తపు రెండవ తృచ వలె.
పరసేనను భయపెట్ట దలచినవాడు ఈ తృచచే మూడు సార్లు సేనలను ప్రదక్షిణ చేయవలెను. ఇందుకొరకే సంపాతిత అభిమంత్రిత సోమమణిని చర్మములో చుట్టి కట్టునది.
3. ఈ రెండు తృచల పాఠము అపరాజిత గణమందున్నది.
1. మమ్ము బాధించదలచిన శత్రువు హస్తరహితుడు అగునుగాక. ఇంద్రదేవా! మా మీదకు సేనతో దండెత్తి వచ్చు శత్రువును వజ్రాయుధముచే హతమార్చుము. మాకు దుఃఖము కలిగించదలచిన వానికి దుర్గతి కలుగునుగాక.
2. శత్రువులారా! ధనుస్సును నారి ఎక్కించు, విల్లును ఎక్కుపెట్టు, బాణములను విడుచు, మావైపు ఉరికి వచ్చు మిమ్ము ఇంద్రుడు పరాజితులను చేసి హతమార్చును గాక.
3. మా శత్రువులు నిర్హస్తులు అగుదురుగాక. వారి అవయవములను నిర్వీర్యము చేయుచున్నాము. ఇంద్రదేవా! తదుపరి నీ అనుగ్రహమున శత్రు ధనములను శతశః విభజించుకొనుచున్నాము.
--౦౦౦--
1. ఇంద్రపూశాలు, సంచరించు మార్గములను మూసి వేయుదురుగాక. శత్రుసేన తెలివి తప్పి కార్యాకార్యములు ఎరుగునట్లు చేయుదురుగాక.
2. అమిత్ర సేనలు - పడగరాలిన పాము వలె - ఎటు తోచని వారు అగుదురుగాక. ఇంద్రాగ్నులు శత్రు సేనాధిపతులను వధింతురుగాక.
వరద ఇంద్రా! జింక చర్మము చుట్టిన మణిని మా సేనకు కట్టుము. శత్రు సేనలో భయోత్పాతము కలిగించుము. శత్రువు యుద్ద భూమి నుండి పారిపోవును గాక. వారి గోవులు మున్నగునవి మాకు దక్కునుగాక.
నాలుగవ సూక్తము - 34
వినియోగము :
1. మొదటి తృచచే గోదానము. చూడాకరణమున క్షౌర కర్మకు నీటి పాత్రను అభిమంత్రించునది. రెండవ మంత్రముచే బాలుని తల తడుపునది. మూడవ మంత్రముచే గుండు చేయునది.
ఉపనయన కర్మమున మొదటి మంత్రపు ప్రథమ భాగముచే కత్తి పదును పెట్టునది. రెండవ భాగాముచే నీటిని అనుమంత్రించునది. మూడవ పాదముచే తల తడుపునది. నాలుగవ భాగముచే ముండన చేయునది.
2. రెండవ తృచచే బుద్దిని కోరువారు లేవగానే ముఖము కడుగునది.
కుమారీ వర్చస్య కర్మమున పెరుగు, తేనె కలిపి దీనిచే సంపాతన, అభిమంత్రణలు చేసి కన్యకు తినిపించునది.
క్షత్రియ వర్చస్య కర్మమున పెరుగు, తేనె కలిసిన అన్నమును దీనిచే సంపాతన, అభిమంత్రణలు చేసి తినిపించునది. వైశ్య, శూద్రుల విషయమున అన్నమును సంపాతన, అభిమంత్రణలు చేసి తినిపించునది.
క్షత్రియాదుల వర్చస్య కర్మమున సూత్రమున చెప్పిన ఏడు మృగములలో ఒకదాని మర్మమును స్థాలీ పాకమున వేసి దీనిచే సంపాతన అభిమంత్రణలు చేసి కట్టునది. దీనిచే జలమును సంపాతన, అభిమంత్రణలు చేసి ఆసావన లేక ఆవసించన చేయునది.
ఉత్సర్జన కర్మమున దీనిచే ఘ్రుతాహుతులిచ్చి రసములందులకు సంపాతములు తెచ్చునది.
అగ్ని చయనమున బ్రహ్మ స్వయముగా ఆసించమాన శత తృణను దీనిచే అభిమంత్రించునది.
"స్వర్గోదన బ్రహ్మోదయోస్తంత్ర సంనిపాతే తండులానామ్. అవసేన ప్రాయశ్చిత్తార్ద త్రయో ఋచేన బ్రహ్మ యజమానం వాచయేత్"
1. సవిత కత్తితో వచ్చినాడు. వాయువు ఉష్ణజలములందు చేరినాడు. ఆదిత్య, వసు, రుద్రులు శిరోజములను తడుపుదురు గాక. క్షురకా! వరుణ, సోమ సంబంధముగల కత్తిచే వపనము చేయండి.
2. అదితి గడ్డము, మీసములు తీయునుగాక. జలము వర్చస్సును ఇచ్చునుగాక. ఇతనికి దీర్ఘాయువు, మంచి చూపు కలుగునట్లు ప్రజాపతి చికిత్స చేయునుగాక.
3. ఈ కత్తితో సవిత విద్వాంసుడగు సోముని, రాజగు వరుణునకు వపనము చేసినాడు. బ్రాహ్మణులారా! అట్టి కత్తిచే మీరు ఇతనికి వపనము చేయండి. ఇతడు గోమంతుడు. అశ్వవంతుడు, ప్రజావంతుడు అగునుగాక.
--౦౦౦--
1. పర్వతములందు, రథములందు, స్వర్ణమందు, గోవులందు ఉన్న యశస్సు నాకు కలుగునుగాక. సురయందు, పాత్రలందు, అన్నములందున్న మధువు నాయందు చేరునుగాక.
2. అశ్వినులారా! తేనెటీగలు చేర్చిన రసమును నాలో కల్పించుము. జనులతో మధుర భాషణ చేయురీతి నాయందు మాధుర్యము చేర్చండి.
3. ప్రజాపతి ఆకసమున జ్యోతిర్మండలమును స్థిర పరచిన రీతి నాయందు వర్చస్సును, యశస్సును, యజ్ఞ ఫలమును కలిగించునుగాక.
ఐదవ సూక్తము - 35
వినియోగము :
1. మొదటి తృచచే గోవత్సముల విరోధ సమాప్తికి సాంమనస్య కర్మన దూడను స్నానము చేయించి గోమూత్రముతో తడిపి, దూడను మూడుసార్లు త్రిప్పి, అభిమంత్రించి, పాలు త్రాగుటకు విడుచునది. అట్లే గోవు తలను, చెవులను దీనిచే అనుమంత్రించునది.
2. రెండవ తృచచే దూషిత, అదూషిత దాన పరిగ్రహ శాంత్యర్దము పరిగ్రహించుదానిని దీనిచే అభిమంత్రించి తీసికొనునది.
బ్రహ్మచార అగ్నికార్యమున ప్రతిదినము భిక్ష యొక్క ఆహుతులు ఇచ్చునది.
దర్శ పూర్ణమాస పురోడాశమును బ్రహ్మ తొలి ఋక్కుచే భక్షించునది.





