Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
మూడవ సూక్తము - 28
వినియోగము :
1. తొలి తృచచే పాము, తేలు మున్నగు వాని భయనివారణకు ఇల్లు, పొలము మున్నగు చోట్ల ఇసుకను మంత్రించి చల్లునది. దీనిచే సంపాతించిన తృణమును ఇల్లు లేక నగర ద్వారమునకు కట్టునది. పేడను అభిమంత్రించి ఇంట చల్లునది. ద్వారమునకు కొట్టునది. అగ్నిలో హోమించునది. దీనిచే అపామార్గమంజరి, గుడీచిని అభిమంత్రించి గృహాదులందు విసర్జనాదులు చేయునది.
ఉపాకర్మమున ఈ తృచచే ఘ్రుతాహుతులు ఇచ్చి, పెరుగు సత్తుల సంపాతములు తెచ్చునది.
2. రెండవ తృచచే 'ముఖరహిత వ్రణపు చికిత్స' కొరకు గోమూత్రముచే వ్రణమును మర్దించునది పంటిపాచిని అభిమంత్రించి వ్రణము మీద రాయునది. నురగను అభిమంత్రించి వ్రణము మీద వేయునది.
ఈ తృచలోని మూడవ మంత్ర పాఠము బృహద్గణములందు ఉన్నందున శాంత్యుదకాదులందు వినియోగము.
1. దేవతలారా! సర్పము మమ్ము, మా సంతానమును, మా పరిజనులను వధించకుండునుగాక. సర్పపు మూసిన నోరు తెరువబడకుండునుగాక. తెరచిన నోరు మూత పడకుండునుగాక. "నమో దేవజనేభ్యః"
2. కృష్ణ సర్పమునకు నమస్కారము. వంకర నడకల సర్పమునకు నమస్కారము బభ్రువర్ణ 'స్వజ' సర్పమునకు నమస్కారము. "నమో దేవజనేభ్యః"
3. సర్పమా! నీ కోరలతో కోరలను, హనువుతో హనువును, నాలుకతో నాలుకను, పడగతో పడగను కొట్టి చంపుదును.
--౦౦౦--
1. ఇదియే రోగనివారక ఔషధము. దీనిని రుద్రుడు ఏక తేజన శతశల్యము మీద ప్రయోగించినాడు.
2. జలాషము - గోమూత్రము మీది నురుగుతో వ్రణమును కడగండి. దానితోనే వ్రణము మీద పూత పూయండి. జలాషము మహదౌషధము. అది మమ్ము జీవింప చేయుచు సుఖములను ఇచ్చును గాక.
3. మా రోగముల శాంతించునుగాక. మాకు సుఖములు కలుగునుగాక. మా ప్రజలు, పశువులు రోగ రహితులు అగుదురుగాక. మా పాపములు శమించునుగాక. "విశ్వం నో అస్తు భేషజం సర్వం నో అస్తు భేషజం" లోకములన్నియు మాకు ఔషధములు అగునుగాక. సమస్తములు మాకు భేషజములు అగునుగాక.
నాలుగవ సూక్తము - 29
వినియోగము :
1. తొలి తృచచే యశస్సు కోరువాడు ఇంద్రుని యజించునది. ఉపస్థానము చేయునది. ఉత్సర్జన కర్మయందు దీనిచే ఘ్రుతాహుతులిచ్చి రసములందు సంపాతములు తెచ్చునది. స్వస్త్యయన కర్మమున 13 ద్రవ్యముల ఆహుతి ఇచ్చునది.
2. రెండవ తృచ పాఠము బృహద్గణములందు ఉన్నందున శాంత్యుదకాదులందు వినియోగము.
ధనము తీయునపుడు 2వ అనువాకము 5వ సూక్తపు తొలి తృచ వినియోగము.
1. ఇంద్రుడు నాకు యశస్సు కలిగించునుగాక. ద్యావాపృథ్వులు నాకు యశస్సు కలిగించునుగాక. సవిత మాకు యశస్సు కలిగించునుగాక. అట్లు యశోవంతుడనగు నేను దక్షిణలు గ్రహించువారికి ప్రీతిపాత్రుడను అగుదునుగాక.
2. ద్యావాపృథ్వులందు ఇంద్రుడు యశస్వి అయినట్లు, ఓషధులందు జలము యశస్వి అయినట్లు మేము సకల దేవతలు, సమస్త మానవులందు యశోవంతులము అగుదుము గాక.
3. ఇంద్రుడు యశస్సునందు, అగ్ని యశస్సునందు, సోమము యశస్సు నందే ఆవిర్భవించినారు. సమస్త భూతముల యశస్సునందు నేను యశస్తముడను అగుచున్నాను.
--౦౦౦--
1. సహదేవీ ఓషధీ! తొలుత నీవు బండ్లకు, ఎద్దులకు సుఖము కలిగించుము. ధేనువులకు, అయిదేళ్ళకన్న తక్కువ వయసు గోవులకు, అశ్వములకు సుఖము కలిగించుము. చతుష్పాత్తులన్నింటికి సుఖములు ప్రసాదించుము.
2. సహదేవీ ఓషధీ! నీవు అభిలషిత ఫలములకు ఆటంకము కలిగించనిదానవు. మాకు సుఖములు కలిగించుము. మా గోష్ఠములను సమృద్ద దుగ్ధములతో సంపన్నము చేయుము. మా జనులను రోగ రహితులను చేయుము.
3. సహదేవీ ఓషధీ! నీ రూపములు పెక్కులు. నీవు సౌభాగ్యవతివి. నీ ముందునకు వచ్చి ఇష్ట ఫలములు అర్ధించుచున్నాను. రుద్రుడు విసరిన ఆయుధము నుండి మా గోవులు మున్నగు వానిని తప్పించుము. వానిని జీవింప చేయుము.
ఐదవ సూక్తము - 30
వినియోగము :
1. తొలి తృచచే పతిలాభ కర్మమున కాకులు తిరుగక ముందు ఘ్రుతాహుతులు ఇచ్చునది.
2. రెండవ తృచ పాఠము బృహద్గుణములందు శాంత్యుదకాదులందు ప్రయోగము.
ధనము తీయు విషయమున అనువాకము 2 సూక్తము 5 యొక్క మొదటి తృచ వినియోగము.
వాపీ కూప తటాకములందు జలము కోరువాడు ఇంద్రుని యజనము లేక ఉపస్థానము చేయునది.
1. ఆదిత్యుడు తూర్పు దిక్కున విశేష రూపమున ఉదయించినాడు. అతడు ఈ కన్య కొరకు పతిని చూచుచు అవివాహితునకు కన్యను ఇవ్వదలచి అరుదెంచుచున్నాడు.
2. అర్యమ దేవా! ఈమె పతిని కోరుకన్య. ఇతర స్త్రీల వలెనే వ్రతములు చేసి అలసియున్నది. అన్య స్త్రీలు సహితము ఈ కన్యను శాంతి చేయుచున్నారు.
3. ధాత పృథ్విని ఏర్పరచినాడు. దివిని, సూర్యుని నిలిపినాడు. అట్టి ధాతయే పతిని కోరు ఈ కన్యకు భర్తను ప్రసాదించునుగాక.
--౦౦౦--
1. జలము న అకోరకు మధురమై చేరునుగాక. సూర్యుడు నన్ను జ్ఞాన ప్రకాశమునకు సృష్టించినాడు. తపస్సున ఆవిర్భవించిన సమస్త దేవతలు నాకు కోరిన ఫలములు ఇచ్చెదరు గాక. సవిత నాకు వ్యాప్తి కలిగించునుగాక.
2. నేనే ద్యావాపృథ్వులను విడదీసినాను. నేనే ఋతువులను కల్పించినాను. నేనే సత్యాసత్యములు పలుకుచున్నాను. నేనే దైవీ వాణిని గ్రహించుచున్నాను.
3. నేను సత్యాసత్యములు పలుకువాడను. అగ్ని షోమమును నా మిత్రునిగా చేసికొన్నాను. అట్లగుటచే నేనే ద్యావాపృథ్వులను, ఋతువులను, సప్త సింధువులను సృష్టించినాను.
ఏడవ అనువాకము
మొదటి సూక్తము - 31
వినియోగము:
1. మొదటి తృచ పాఠము బృహద్గణములందు ఉన్నందున శాంత్యుదకాదులందు వినియోగము.
అర్దోత్థాపక విఘ్నశమన కర్మమందు దీనిచే క్షీరోదన హవనాదులు చేయునది. దీని పాఠము పవిత్ర గణములందు ఉన్నందున సవ యజ్ఞ ప్రోక్షణ మందు వినియోగము.
2. రెండవ తృచచే అవకీర్ణ ప్రాయశ్చిత్తమున బ్రహ్మచారిని దర్భల త్రాటిచే కట్టి ధాన్యాదులను ఆహుతి చేయునది జలపూర్ణ పాత్రను సంపాతన చేసి దర్భ త్రాటిచే అవకీర్ణములను ప్రోక్షించి దర్భ రజ్జువును వేరుచేయునది.
నైర్రుతేష్ణక యొక్క ఉపాధానానంతరము రుక్మపాశ సహితముగా విసరివేసిన ఆసనమును అనుమంత్రించునది.
2వ మంత్రముచే నైర్రుతి కొరకు పెట్టిన ఇటుకను అనుమంత్రించునది.
4వ మంత్రముచే పెట్టబడిన అనుష్టుభీ ఇష్టికను బ్రహ్మ అనుమంత్రించునది.
1. వైశ్వానరాగ్ని తన కిరణములచే నన్ను పావనుని చేయునుగాక. గాలి తన ప్రాణ శక్తిచే నన్ను పవిత్రుని చేయునుగాక. వాయువు అంతరిక్షమున నన్ను పునీతుని చేయునుగాక. సారభూత రసమున సారవంత యజ్ఞమునకు సిద్ది కలిగించు ద్యావాపృథ్వులు నన్ను పావనము చేయునుగాక.
2. సర్వ దిశలందు వ్యాపించి యున్న వాణి గల వైశ్వానరుని స్తుతించుట ఆరంభించండి. మేము వైశ్వానరాగ్నిని వైశ్వానర వాణిచే స్తుతించుచున్నాము. అతని అనుగ్రహమున సంగ్రామమునందు మేము ధన స్వాములము అగుదుము గాక.
3. వర్చస్సు కొరకు వైశ్వానరుని సంకీర్తన ప్రారంభించండి. అందువలన మీరు పవిత్రులు, తేజోవంతులు, పావకులు అగుదురుగాక.
మాకు అన్నము ప్రసన్నమగునుగాక. మేము చిరకాలము ఉదయించు సూర్యుని దర్శింతుముగాక.
--౦౦౦--





