Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    బండిలోనే నాకు కడుపు నొప్పి మొదలయింది. నాయన వేసుకునే సోడా ఉప్పు ఇచ్చారు. కాస్సేపటికి వాంతులయినాయి. తరువాత రెండు అయినాయి. చెరువు దగ్గర బండి ఆపారు. సరిగ్గా లక్ష్మికి అయినట్లే అవుతున్నది. డీలా పడిపోయాను. అమ్మా, చెల్లెళ్లనూ చూడకుండానే చచ్చిపోతానని భయం. వెనక్కు పోవాలనిపిస్తుంది. చెప్పలేను. భయం.

 

    నక్కలు దూరంగా ఉరుకుతున్నాయి!

 

    ధైర్యం తెచ్చుకున్నాను. వెనక్కుపోదాం అన్నాను.

 

    నన్ను బండిలో వేశారు. నాకు దాహం. నీళ్లివ్వరు. బండిముందుకే సాగుతున్నది. మానుకోట చేరింది. ఏవో మందులూ మాకులూ ఇచ్చారు. కాస్త తగ్గాయి.

 

    మేము రైలెక్కాం.

                                                     పదమూడు  

 

    హైదరాబాదు నగేనా                                         హైదరాబాదు సౌందర్యం
    అందర్ మట్టి ఊపర్ చున్నా.                             లోన మట్టి, పైన సున్నం.

 

    మేము హైదరాబాదు - నాంపల్లి స్టేషనులో దిగాం. రాత ఉర్దూ, భాష ఉర్దూ. వేషాలు షేర్వానీలు - కుచ్చుటోపీలు. ఫ్లాటుఫారం మీద తమలపు ఉమ్ములు, ఎర్రని మరకలు. బొట్లూ - ధోవతులతో మేం దిగాం. అందరికీ వింత. కొందరు ఇకిలించారు. కొందరు సకిలించారు. కొందరు అపహాస్యం చేశారు.     

 

    దేశంకాని దేశానికి వచ్చినట్లున్నది!

 

    ఒకడు తెలుగు వానివలె ఉన్నాడు. 'ఏమ్టికి వచ్చిన్రు? ఏడికి పోతరు? సీతారాంబాగ్ కేనా? ఎంతిస్తరు?' అన్నాడు. సామాను అందుకున్నాడు. టాంగాలో పెట్టాడు. మమ్ములను ఎక్కించుకున్నాడు. ఒక కోటలోనికి తీసికెళ్లాడు. దింపాడు.

 

    అది పూర్ణమల్ తోట - సీతారాంబాగ్ అంతా కొత్త. ఎవరూ తెలియరు. నాయనకు కొత్తంటూ లేదు. వారి వాగ్ధారతో ఎవరినైనా వశపరచుకోగలరు.

 

    నాయన మార్వాడి ధర్మకర్త దగ్గరకి వెళ్లాడు. అతనికి తెలుగు రాదు. వీరికి హిందీ రాదు. అయినా అతనితో దాసోహం అనిపించారు. అతడు అప్పటికి అప్పుడే ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేశాడు. మేము గృహప్రవేశం చేశాం. వంట పాత్రలు - వంట సామాగ్రి వచ్చింది. వంట నేనే!

 

    ఇల్లు వసతిగానే ఉంది. కాని కరెంటు లేదు. అది జన సామాన్యానికి అందుబాటులో లేదు. పంపు - నల్లా - ప్రత్యేకంగా లేదు. ఉమ్మడి నల్లాయే. చాలాకొద్దిమందికి ఇళ్లల్లో నల్లాలుంటాయి. వంట బొగ్గులమీద. దాన్ని కొల్సా అంటారు. కూరగాయలు అతి చవక. హాలీపైసలో సగాన్ని, "థేలా" అంటారు. పైసా కూరగాయలు సరిపోతాయి. సరుకులు చవక. మంచివి దొరుకుతవి. ఉప్పు సహితంగా అన్నీ తూకమే. కొలత తక్కువ. ఇక్కడి తూకం శేర్లు. సేరుకు 80 తులాలు. నూట ఇరవై సేర్లు పళ్లా.    

 

    సీతారాంబాగ్ వాతావరణానికి బయటి వాతావరణానికి పోలిక లేదు. ఇక్కడ దాక్షిణాత్యుల వరదరాజ స్వామి దేవాలయం ఉంది. మార్వాడీల సీతారామస్వామి దేవాలయం ఉంది. ఇది దేవాలయ ప్రాంగణం. పుష్కరిణులు - ఉద్యానాలు - గోశాలలు అన్నీ పెరుమాళ్ళవే. మంచితోటలు - దొడ్లు - వృక్షాలు - ఆశ్రమంలా ఉంటుంది.

 

    బయటివలె ఇక్కడ తురక కనిపించడు. తురకవేషం కనిపించదు. అందరూ శ్రీవైష్ణవులే. ధోవతులు - కండువాలు - శిఖాయజ్ఞోపవీతాలు - ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలు - సంస్కృత - ద్రావిడ వేదపఠనాలు - సాక్షాత్తు శ్రీరంగంలా ఉంటుంది - కారివే తప్ప.    

 

    తురకలు వైష్ణవులను బొట్లు పెట్టుకోనిచ్చేవారు కారట. బయటికిపోతే బొట్లు నాకేసేవాళ్లట. ఒక తెలివైన వైష్ణవుడు తిరుమణిలో వసనాభి కలిపి బొట్టు పెట్టారట. అది నాకిన తురకలు అందరూ చచ్చారట. అప్పణ్ణుంచీ నాకడం మానేశారు. కాని 'ఏక్సౌగ్యారా' అని హేళన చేస్తారు.

 

    అది మరలకు అంతగా మరగని కాలం. దురాశ ఇంకా మనసుల్లో దూరనికాలం . సమృద్ధికాలం. ఆలయాల్లో మూడు సార్లు అందించే వివిధ ప్రసాదాలతో నాలుక - కడుపు రెంటి ఆకళ్ళు తీర్చుకోవచ్చు. అదికాక సంపన్నులు సుమారు ప్రతిరోజూ తడియారాధనలు - సమారాధనలు - చేయిస్తుంటారు. అక్కడ నేయి, పెరుగు, అనేక తీపి పదార్థాలు లభిస్తాయి. సాపాట్లు ఉంచి, సంభావనలు కూడా ఇచ్చేవారు.

 

    కరువు ఎరుగని కాలం అది!

 

    అక్కడ సంస్కృత పాఠశాల ఉండేది. ఉచిత భోజన వసతి కల్పించి చదువు చెప్పేవారు. యూనివర్సిటీలో సిలబస్ కాదు - సంప్రదాయ విద్య. అక్కడ చదివి అనేకమంది విద్వాంసులు అయినారు.

 

    హైదరాబాదు వాతావరణం అత్యంత అనుకూలం అయింది. సమశీతోష్ణ ప్రదేశం. చలికాలంలో చలి ఎక్కువైనా ఎండా కాలంలో ఎండ ఉండదు. కొద్దిగా ఎండ తీక్షం అవుతే సాయంత్రానికి ఒక జల్లు. గండిపేటనీళ్లు రుచికరములు - ఆరోగ్యకరములు.

 

    గండిపేట్ కా పానీ - హైదరాబాద్ కీ బిర్యానీ పసిద్ధములు.

 

    నాకు సీతారాంబాగ్ బాగా నచ్చింది. కాని, అమ్మ - చెల్లెళ్లను గురించిన బాధ సతాయించేది. మానుకోట మార్గంలో మొదలయిన కడుపునొప్పి తగ్గలేదు. రాత్రిళ్లు చాలా బాధపెట్టేది. నొప్పి భరించలేక వీధుల్లో పరిగెత్తేవాణ్ణి.

 

    హైదరాబాదు రావడానికి కారణం నాకు తరువాత తెలిసింది. ఒకటి - నాయన అమ్మకు గుణపాఠం నేర్పదలచుకున్నాడు. రెండు - ఆ సంవత్సరం అన్నయ్య మెట్రిక్ లెక్కల్లో ఫెయిలైనాడు. తాను మళ్లీ ఖమ్మంలో చదవనన్నాడు. నాయన అన్నయ్యను హైదరాబాదులో చదివిస్తానన్నాడు. అన్నయ్య తన సాహిత్య వ్యాసంగానికి పట్నం పనికి వస్తుందనుకున్నాడు. పట్నం రావడానికి ఒప్పుకున్నాడు. అమ్మనూ - చెల్లెళ్లనూ వదిలి రావడం నాకు బాగనిపించలేదు. అన్నయ్యతో అన్నాను. ' అయితే నువ్వు వెళ్లు' అన్నాడు అన్నయ్య నన్ను.

 

    నాయన అన్నయ్యను నాంపల్లిలో ఒక ట్యూటోరియల్లో చేర్చారు - బహుశః అది ఒక్కటేనేమో అప్పటికి. అక్కడ ఫీజు నెలకుపది రూపాయలు. ఆ పది రూపాయలకు గాను నాయన వారానికి మూడు సార్లు ఆ ట్యూటోరియల్లో తెలుగు పీరియడ్ తీసుకునేవారు. అది వేమన గ్రంథాలయానికి పక్కనే ఉండేది. అది అన్నయ్యకు బాగా ఉపకరించింది.

 

    నాయనా - నేనూ మల్లేపల్లి చెరువు కట్టమీది నుంచి నడిచి ట్యూటోరియల్ కు వెళ్లేవాళ్లం. అప్పుడే CIB వాళ్లు మల్లేపల్లిలో క్వార్టర్సు కడ్తున్నారు. వాటినే ఆగాపుర క్వార్టర్సు అన్నారు. అవి తురకల గోషాకు అనుకూలంగా కట్టారు. ఒక్కొక్క బ్లాకు వర్తులంగా ఉంటుంది. అందులో ఉన్న ఇళ్లకు ప్రవేశ ద్వారం ఒక్కటే. ఆ ఇళ్లకు కరెంటు లేదు. సర్కారు వారు ఇంటింటి నల్లాలు ఇవ్వలేదు. అయిదో దశకంలో కమల మేనమామ నారాయణాచార్యులకు ఆగాపురంలో ఇల్లుండేది.

 

    హైదరాబాదులో ఉండగా నాయన అనేకమంది ప్రముఖుల పరిచయాలు సంపాదించాడు. నేనూ వారివెంట వెళ్తుండేవాణ్ణి. అందువల్ల వారితో పరిచయం అవలేదు కాని దర్శన భాగ్యం కలిగింది. వారి సంభాషణల్లో రామాయణ, భారత, భాగవతాది పురాణాలు, వైష్ణవ ప్రబంధాల ప్రస్తావన ఎక్కువ. అవి నాకు రుచించేవి. తరువాత కాలంలో ఉపకరించాయి.

 

    సెక్రటేరియట్ ముందు నాయని వెంకటరంగారావు బహాద్దుర్ వారు ఉండేవారు. వారు మునగాల రాజావారు. కృష్ణ దేవరాయ గ్రంథాలయాన్ని స్థాపించినవారు వారే. కొమర్రాజు లక్ష్మణరావుగారు వారి దివాను. అప్పటికి సెక్రటేరియట్ ఊరిబయలు.  

 

    వారి ఇంటిముందు ఎల్లవేళలా జవాను కాపలా ఉండేవాడు. నాయనకు ప్రవేశం లభించలేదు. అప్పటికి ఫోనులు అంతగా లేవు. నాయన ఒకరి ఇంటినుంచి పోను చేసి రాజావారితో మాట్లాడారు. తరువాత రాజా వారే గేటు దగ్గరికి వచ్చి నాయనను తీసికెళ్లారు. తరువాత చాలాసార్లు వెళ్లాం. వారు ఉదారులు. తరువాత తొమ్మిదవ దశకంలో కోదాటి నారాయణరావుగారి "చిన్ననాటి ముచ్చట్లు" పుస్తకంలో రాజారావు బయటి వారికే ఉదారులు - సంస్థాన ప్రజలకు వారు చేసింది ఏమీ లేదని అర్థం అయింది.   

 

    మొఅజ్జం జాహీ మార్కెటు కట్టి అప్పటికి ఎంతో కాలం కాలేదు. దాని దగ్గరలో ఉన్న వనపర్తి బిల్డింగ్స్ లో బూరుగుల రామకృష్ణారావుగారు ఉండేవారు. వారు ప్రసిద్ధ అడ్వకేటు. బహు భాషా కోవిదులు. రాజకీయ నాయకులు. వారితో నాయనకు సన్నిహిత సంబంధం. వారు ఎంత పనిలో ఉన్నా నాయన వచ్చారంటే వదిలి వచ్చేవారు. పాదాభివందనం చేసేవారు. నాయన శ్రీసూక్తి సాయించినంతసేపు కదిలేవారు కారు. బూరుగుల వారు తరువాతి కాలంలో హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ఆంద్రప్రదేశ్ ఏర్పడటానికి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఉత్తరప్రదేశ్ - కేరళ గవర్నరు పదవులను నిర్వహించి దివంగతులయినారు. ఇటీవల వారి పుత్రులు రంగనాథరావుగారు, రామకృష్ణారావు వారి రచనలను ఒక్కొక్కటిగా ప్రచురిస్తున్నారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.