Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                      

                                         ఐదవ సూక్తము - 25
   
వినియోగము :

   
      1. తొలి తృచ ధాన్యమును నష్టపరచు మూషికాదుల నివారణ కొరకు ఇనుముతో కలసిన సీసమును లాగుచు  దీనిని జపించుచు పొలమున తిరుగునది. దీనితో ఇసుకను జపించి ఎలుకలున్న పొలమున చల్లునది  ఎలుక మూతికి వెంట్రుక కట్టి పొలము నడుమ పాతునది.
   
         తల్లి వంటి రూపపు దూడ గల ఆవు పాల చరును ఈ తృచచే అశ్వినులకు ఆహుతులు ఇచ్చునది.
   
      2. రెండవ తృచ పాఠము బృహద్గణములందు ఉన్నందున శాంత్యుదకాదులందు దీని వినియోగము.
   
    సర్వ రోగ చికిత్స యందు దీనిచే ఘ్రుత హోమము, పలాశాది శాంత వృక్షముల సమిధలుంచు కర్మలను  చేయునది.
   
    సోమము త్రావి వాంతి చేసికొను వ్యాధి నివారణార్ధము ఈ తృచచే సోమరసమున ముంచిన పలాశాది సమిధలను  ఉంచునది.
   
    ధనము తీయునపుడు కలుగు విఘ్నశాంతికి పదవసూక్తము వంటి వినియోగమును ఆచరించునది.
   
    దీని పాఠము అపాంసూక్తములందున్నందున ఆసావనాదులందు వినియోగము.
   
    సోమాతి పూతకర్తృక సౌత్రామణి యందు దశాపవిత్రముచే పవిత్రము చేయు సురను ఈ మంత్రములచే  అభిమంత్రించునది.
   
1.    అశ్వినులారా! మీరు బిలములందు దూరి ఎలుకలను చంపండి. వాని తలలు రెండుముక్కలు చేయండి. ఎముకలు పిండి చేయండి. మాధాన్యాదులు తినకుండునట్లు వాని నోళ్ళు మూయండి. ఆ విధముగా చేసి మాధాన్యమునకు వాని వలన కలుగు భయమును నివారించండి.
   
2.    మూషిక, శలభములారా! మీరు నష్టము కలిగించువారు. అందువలన చంపదగినవారు. మేము అశ్వినులకు అర్పించు హవి బ్రహ్మాస్త్రము వంటిది. కావున హవి హుతము కాకమున్నే మీరు కాలక మా ధాన్యమునకు నష్టము కలిగించక పారిపొండి.
   
3.    హింసక మూషిక, శలభ అధిపతులారా! వాడి యగు కోరలు గల మీరు మా ముందును వచ్చి మా మాట వినండి.
   
    తిండిపోతులగు మీరు అడవులందున్నను, గ్రామములందు ఉన్నను మిమ్ము ధ్వంసము చేయుచున్నాము.
   
                                                          --౦౦౦--      
   
1.    సోమము వాయువుచే శుద్ది చేయబడినది. రసవత్తరము చేయబడినది. అది నోటి నుండి నాభి వరకు ఉరుకులు పెట్టుచున్నది. అది ఇంద్రునకు యోగ్య మిత్రము అగుచున్నది.
   
2.    విశ్వజనని జలము మమ్ము పావనము చేయును గాక. ఘ్రుతరూప జలము మమ్ము పావనము చేయును గాక. దేవతా రూపమగు జలము విశ్వమును పావనము చేయుటకు నదులుగా ప్రవహించుచున్నది. ఈ జలములందు పవిత్రుడనై నేను ఉదయించుచున్నాను.
   
3.    వరుణదేవా! మానవులు దేవతల విషయమున పాపములు చేయుచున్నారు. మేము అజ్ఞానులము. ఎరుగక నీ ఆదేశములను తప్పుగా అనుసరించుచున్నాము. అట్లని మమ్ము హింసించబోకుము.
   
                                            ఆరవ అనువాకము
                                            మొదటి సూక్తము - 26

   
వినియోగము :

   
      1. మొదటి తృచచే చిత్తి మున్నగు ఓషధులు గల పూర్ణ ఘటమును అభిమంత్రించి రోగి మీద చల్లునది 'శమి' పడిన లేక శమి బింబముగల, లేక పండిన ఆకులు రాలిన నీటిచే రోగిపై అవసేచన చేయునది.
   
      2. రెండవ తృచచే తైలమును అభిమంత్రించి గండవ్రణము మీద రాయునది. దీనిని జపించుచు వ్రణమును చేతితో శుభ్రము చేయునది. దీనిని చదువుచు వ్రణమును స్థూణచే గోకునది.
   
         ద్రవ్యాదులకు నాశనము సంభవించినపుడు ఈ తృచచే ద్యావాపృథ్వులు ఉపస్థానము లేక యజనము  చేయునది.
   
    సవ యజ్ఞమున మంత్రమున చెప్పిన అవయవములను ఈ తృచచే అనుమంత్రించునది. మేధా జనన కర్మమున క్షీరోధన పురోడాశము లేక రసములను ఈ తృచచే సంపాతన అభిమంత్రణలు చేసి భుజించునది. బుద్దిని కోరువాడు దీనితోనే సూర్యుని ఉపస్థానము చేయునది.
   
    గోదాన కర్మమున 5వ ఋక్కుచే కత్తిని శుభ్రము చేసి మంగలికి ఇచ్చునది.
   
    ఉపనయన కర్మయందు 6వ ఋక్కుచే జలపూర్ణ పాత్రను అభిమంత్రించి వటువును చూచునది.
   
1.    సూర్యుడు పూర్వ దిశయందు ఉదయించి రాక్షసులను ధ్వంసము చేయుచున్నాడు. ఆదిత్యుడు పర్వతములందు దాగి కనిపించని దానిని చూచు విశ్వ ద్రష్ట అగుచున్నాడు.
   
2.    గోష్టము లందు గోవులు, అడవులందు మృగములు నిర్భయముగ ఉన్నవి. రాత్రి కనిపించని నదుల తరంగములు ఇప్పుడు కనిపించుచున్నవి.
   
3.    ఈ ఓషధి ఆయువు నిచ్చునది. సర్వరోగ నివారణి. సుప్రసిద్ధ కణ్వ మహర్షి దర్శించినది. సర్వరోగ నివారిణి. కనిపించని వ్యాధులను నివారించునది. అది సమస్త వ్యాధులను శాంత పరచును గాత.
   
                                                    --౦౦౦-- 
   
1.    నన్ను ద్యులోకము పృథ్వి రక్షింతురుగాక. కాంతిమయుడగు సూర్యుడు నన్ను దక్షిణదిశ యందు యముని నుండి రక్షించునుగాక. అన్నమును అనుగ్రహించు స్వధ, సోముడు, వాయువు, సవిత, భగుడు మమ్ము కాపాడుదురుగాక.
   
2.    మరల ప్రాణము, మరల ఆత్మ, మరల చక్షువులు, మరల చైతన్యము మా యందు చేరునుగాక. వైశ్వానరాగ్ని మమ్ము సకల వ్యాధుల నుండి రక్షించుచు, సకల పాపములను నశింపచేయుచు మా యందు నివసించునుగాక.
   
3.    మాకు శరీర వర్చస్సు రసభరిత దుగ్ధములు, శరీర అవయవములు సంపన్నములు అగునుగాక. త్వష్ట మా దేహములను పటిష్ఠములు చేయును గాక. మా దేహమందు గల వ్యాధి గ్రస్త అవయవములను తన చేతితో పావనము చేయునుగాక.
   
                                           రెండవ సూక్తము -27
   
వినియోగము :

   
       1. తొలి తృచచే అభిచార కర్మయందు పలాశ మధ్యను పత్రముచే ఫలీకరణముల ఆహుతులు ఇచ్చునది.
   
    రెండవ ఋక్కుచే పౌర్ణమాస యాగమున అగ్ని షోమీయ చరు ఆహుతులు ఇచ్చునది. దీనితోనే స్వస్త్యయనము చేయుటకు మంథౌదనము నిచ్చునది.
   
      2. రెండవ తృచచే మరొక ప్రదేశమునకు వెళ్ళువాడు 13 ద్రవ్యములచే ఆహుతులిచ్చునది.
    2వ ఋక్కుచే బ్రహ్మ ప్రయాజపు అనుమంత్రణ చేయునది.
   
    అభిచార కర్మమున 3వ ఋక్కుచే సమిధలనుంచి ఘ్రుతాహుతులు ఇచ్చునది.
   
1.    నేను శ్రేష్ఠ కర్మను ఆచరించుచున్నాను. దేవతలందు శ్రేష్ఠుడగు ఇంద్రుని ప్రసన్నుని చేయుచున్నాను. వానకు గడ్డి పెరిగినట్లు ఇంద్రుడు ఇతని త్రాక్షమును, ధనమును వర్ధిల్ల చేయునుగాక.
   
2.    అగ్ని సోములారా! ఇతనికి బలము కలిగించండి. ధనము కలిగించండి. ఇతనిని రాజ్యాభివర్గమున చేర్చండి. అందుకొరకు నేను ఉత్తమ కర్మలను ఆచరించుచున్నాను.
   
3.    ఇంద్రదేవా! మా యజమాని సోమాభిషవము చేయుచున్నాడు. అతనికి హాని కలిగించు స్వబంధువులను, ఆబంధువులను పరిమార్చుము.
   
                                              --౦౦౦--
   
1.    ద్యావాపృథ్వుల మధ్య అనేక దేవయానములు ఉన్నవి. వానిలో సమృద్దమగు మార్గమును దేవతలారా! ఈ ప్రదేశమున నాకు లభింపచేయండి.
   
2.    గ్రీష్మ, హేమంత, శిశిర, వసంత, శరద, వర్ష ఋతువులారా! మీరు మాకు శ్రేష్ఠ పదార్ధములను ప్రసాదించండి. మాకు గోవులను, ప్రజలను కలిగించండి. వాయువును వలె మిమ్ము శరణు వేడుచున్నాము.
   
3.    ఇదావత్సరాయ, పరివత్సరాయ, సంవత్సరాయ బహు నమస్కారములు చేయుచున్నాము. మేము రుతువుల సుమతులందును, యజ్ఞముల సుమతులందును ఉందుముగాక.
   
    (చాంద్రాణాం ప్రభవాదీనాం పంచకే పంచకేయుగే|
    సంపరీ దాన్విదిత్యే తచ్చబ్ద పూర్వాస్తు వత్సరాః ||
   

    ప్రభవాది సంవత్సరములను అయిదయింటిని వర్గముగా ఏర్పరచి మొదటి దానికి సమ్వత్సరము, రెండవదానికి పరివత్సరము, మూడవదానికి ఇదావత్సరము, నాలుగవ దానికి అనువత్సరము, ఐదవ పంచకమునాకు ఇద్వత్సరము అను విశేషణములు చేర్చుట జరిగినది.
   
    తైత్తిరీయ బ్రాహ్మణమున ఆ వర్గములకు దేవతలను ఏర్పరచుట జరిగినది.
   
    అగ్నిర్వావసమ్వత్సరః | ఆదిత్యః పరివత్సరః | చన్ద్రమా ఇదావత్సరః | వాయురనువత్సరః.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.