Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
లక్ష్మిబాధ చూడలేకుండా ఉన్నాం. వరుసగా తెల్లని వాంతులు - విరేచనాలు - ఆయాసం - నీరసం - ప్రాణాలు కళ్లల్లో ఉన్నాయి. దాహం, దాహం అని తపిస్తున్నది. నీరు ఇవ్వరాదు అన్నారు అది చూడలేక చప్పరించడానికి నీళ్లు పోస్తున్నాం. మా అందరికి దుఃఖాలు పెల్లుబుకుతున్నాయి. కుములుతున్నాం. పెద్దగా ఏడవరాదు. పొరుగువాళ్లకు తెలుస్తుంది.
ఆ రోజు వంటలు లేవు. తిండ్లు లేవు. ఆకళ్లు లేవు. చావు యొక్క అడుగుల చప్పుళ్లు ఇంట్లోకి చేరాయి. అది ఎప్పుడు ఎవరిని తీసుకుపోతుందో? ఎట్లా తీసుకుపోతుందో? ఎందరిని తీసుకుపోతుందో? ఇంట్లో - వంట్లో - ముఖాల్లో - కళ్ళల్లో భయం భయం భయం!"
సూర్యాస్తమయం వరకు కొద్దిగా తగ్గాయి. అమ్మ అక్కణ్ణుంచి కదల్లేదు. ఆమె వారిస్తున్నా మేము లక్ష్మి పక్కనే ఉన్నాం. భయం తగ్గుముఖం పట్టింది. ఆశ అంకురించింది. లాంతర్లు ముట్టించుకొని కూర్చున్నాం. ఇద్దరు చిన్న చెల్లెళ్లు. వాళ్లకు ఇవేమీ తెలియదు. కడుపు మాడ్చుకుని మూలలకు ముడుచుకున్నారు.
నాయుడుగారు వచ్చి చూచాడు. రోజంతా లక్ష్మి కోసమే పూజలు చేస్తున్నామన్నారు. విబూది పెట్టారు. మరో టెంకాయ పాతిపెట్టించారు.
రేయి దొర్లిపోతున్నది. మిత్తి పదాల చప్పుడు దూరం అవుతున్నట్లనిపించింది. అర్ధరాత్రికి నాకు కునుకు పట్టింది. తెల్లవారుజామున అన్నయ్య లేపాడు.
"లక్ష్మి చనిపోయింది" అన్నాడు!
నా ప్రాణాలు పోయినట్లనిపించింది. నోట మాటలేదు. అన్నయ్య కుదిపాడు. మనిషిని అయినాక పెద్దగా ఏడుపు వచ్చింది. అన్నయ్య నోరుమూశాడు. ఏడవరాదు!
నేను ఉరికాను. ప్రాణంలేని లక్ష్మి - తల దగ్గర లాంతరు - అమ్మ లక్ష్మిమీద పడి కుమిలి కుమిలి ఏడుస్తున్నది. ఇద్దరు చెల్లెళ్లు బిక్కు బిక్కుమని చూస్తున్నారు!
అర్ధరాత్రి వరకు ముగ్గురు చెల్లెళ్లు! ఇప్పుడు ఇద్దరు!
అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదు!
ఇంట్లో ఆత్మీయుల కళేబరము దుఃఖపు జాడలు బయటికి తెలియరాదు! పొరుగువారు సాయము చేయరు. "అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి, శేషాంగ శ్రేణికి రక్షణ సేయు క్రియ" - లక్ష్మిని వేగమే పంపి మిగిలిన వారిని రక్షించుకోవాలి.
అమ్మ అక్కణ్ణుంచి లేచింది. ఇద్దరు చెల్లెళ్లను కరిచి పట్టుకొని కూర్చున్నది. "కానున్న కార్యము జరిపించాలె. మనం బయటపడాలె. వీండ్లను రక్షించుకోవాలె" అన్నది.
బతకడానికి - బతికించుకోవడానికి బండబారడం అవసరమేమో!
అన్నయ్యా - నేనూ బయటికి వచ్చాం. తెల్లవారక ముందు లక్ష్మిని బయట పడెయ్యాలి. అమ్మ తీసికెళ్లలేదు. మనకు చేత కాదు. ఎక్కడికి తీసికెళ్లాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. ఎవరి సాయమూ అడగలేం. ఎవడూ సాయం చేయడు ఏం చేయాలి? అర్థంకాదు. ఇద్దరం తడుముకుంటున్నాం. ఇలాంటి ఆపదలు నెత్తిన పడాల్సిన వయసు కాదు. ఆలోచనలు రావు. నాకు అమాంతంగా స్ఫురించింది. అన్నయ్యను ఇంటిదగ్గర ఉండమన్నాను. నేను బయల్దేరాను.
నేను లింగయ్య ఇంటికి వెళ్లాను. తలుపు తట్టాను. లింగయ్య తలుపు తీశాడు. అతనిని చూడగానే నాకు ఏడుపు పొంగి వచ్చింది. బిగ్గరగా ఏడ్చాను. గ్రహించినట్లున్నాడు. నన్ను కాల్వ వడ్డుకు తీసికెళ్లాడు. ఓదార్చాడు. విషయం తెలుసుకున్నాడు. నన్ను అక్కడే ఉండమన్నాడు. వెళ్లాడు. కొంతసేపటికి సుమారు భూతంలా కనిపించే వ్యక్తిని వెంటపెట్టుకొని వచ్చాడు. అతని చేతిలో గోనెసంచి ఉంది.
ముగ్గురం మా ఇంటివైపు బయలుదేరాం. అన్నయ్య ముందునుంచున్నాడు. అందరం మౌనంగా ఉన్నాం. అంతా నిశ్శబ్దం. అన్నయ్య సహితంగా నలుగురం ఇంట్లోకి వెళ్లాం. వచ్చినవాడు లక్ష్మిముందు - శవం అనబుద్ధి కావడంలేదు. క్షణం నుంచున్నాడు. లింగయ్య వాడికి డబ్బిచ్చాడు. వచ్చినవాడు లక్ష్మిని బస్తాలో చుట్టి ఎత్తుకున్నాడు.
అమ్మ భరించలేకపోయింది.
లక్ష్మిని పట్టుకొని గొల్లుమన్నది.
మేము ఆమెనోరు మూశాం.
వచ్చినవాడు లక్ష్మిని తీసుకొని సాగిపోయాడు - లింగయ్య వాణ్ణి అనుసరించి వెళ్లిపోయాడు.
కన్నీటి కుండలు తలమీద పెట్టుకొని అలా కాలువవైపు వెళ్తున్నవాళ్లను చూస్తున్నాం. అంత కఠినంగా - అంత నిర్దయగా - ఏ లాంఛనమూ లేకుండా లక్ష్మిని సాగనంపాం!
సాగిపోతున్న లింగయ్య వెనుకనుంచి శివస్వామిలా కనిపించాడు!
దైవం ఇందుకే కూర్చినట్లున్నాడు! లింగయ్య మళ్లీ కనిపించలేదు!!
పోయినవాళ్లు పోయారు. ఉన్నవాళ్లను రక్షించుకోవాలి. ఇల్లు మృత్యువుకు హారంలా ఉంది. ముందు బయట పడాలి. ఇంటికి తాళం వేశాం. గమ్యం లేకుండా సాగాం. స్టేషను చేరుకున్నాం. అప్పటికి తెల్లవారింది. మా ముఖాలు మాకే అసహ్యంగా ఉన్నాయి! కాలిన కొంపల్లోంచి బయటపడ్డట్లున్నాం.
అక్కడ నిర్ణయించుకున్నాం. అన్నయ్య నాయన దగ్గరకు ఇనుగుర్తి వెళ్తాడు. నేను అమ్మను తీసుకొని గూడూరు వెళ్లాలి. మేము వరంగల్లు బస్సు ఎక్కాం. అందరూ మమ్ములను వింతగా చూస్తున్నారు. గత్తర తగిలి బయటపడ్డట్లున్నాం. బస్సు మమ్ములను 'నాగారం' స్టేజిలో దింపింది. రావి చెట్టుక్రింద కూలబడ్డాం. అక్కణ్ణుంచి ఎద్దుల బండిలో గూడూరు చేరాలి.
నిన్నటినుంచి కనీసం నీళ్లు తాగిన గుర్తులేదు. దాహం అయింది. ఎదురుగా మోట బావి కనిపించింది. మోట కొడ్తున్నాడు. అతడు మమ్ములను చూచాడు. దడుచుకున్నట్లున్నాడు. బావి దగ్గరకు రావద్దన్నాడు. అమ్మ చాలా దీనంగా ప్రార్థించింది. తాతయ్య పేరు విని మెత్తపడ్డారు. నీళ్లు తాగనిచ్చాడు. ముఖాలు కడుక్కొని నీళ్లు - అందరం కడుపునిండా తాగాం. కొంత సత్తువ వచ్చింది. "లక్ష్మి కాలు జారి బావిలో పడి చనిపోయిం"దని మా కథ సాంతం అతనికి వెళ్లబోసుకున్నాం. గత్తర తగిలి చచ్చిందంటే ఊళ్లోకి రానివ్వరు. అందుకు అబద్ధం. అతను జాలి పడ్డాడు. తన బండి తెచ్చాడు. మమ్ములను ఎక్కించుకున్నాడు. గూడూరు చేర్చాడు.
తాతయ్యను చూచింది అమ్మ. ఆపుకోలేకపోయింది. గొల్లుమన్నది. మేమూ, చెల్లెళ్లూ నిన్నటి నుంచి దుఃఖం దిగమింగాం - వెళ్లకక్కాం ఊరంతా కూడింది. అదే అబద్ధపు కథ! లక్ష్మి బావిలో పడింది. బంధువులు వచ్చారు. ఓదార్చారు వైరాగ్యం బోధించారు. తమ అనుభవాలు చెప్పారు. మాకు స్నానాలు చేయించారు. భోజనాలయినాయి. ఒడలు తెలియని నిద్రపోయాం.
సాయంకాలం ఏడుపులు - పెడబొబ్బలు విని లేచాం. సర్వయ్యగారు - భద్రమ్మ కొన ప్రాణాలతో ఉన్నారు. గుండెలు అవిసేట్లు ఏడుస్తున్నారు. అమ్మ వాళ్లమీద పడి ఏడ్చింది. దుఃఖం సాంతం గుమ్మరించింది. "నా బిడ్డను గుంజుకుపోయి చంపిన్రమ్మా!" అన్న భద్రమ్మ ఏడుపుకు కూడిన వారంతా కన్నీరు పెట్టారు.
సర్వయ్యగారు, భద్రమ్మ తామే నేరం చేసినట్లు విలవిల్లాడారు. ఆ రాత్రి తినలేదు. తెల్లవారి ఉండలేదు. వెళ్లిపోయారు.
తెల్లవారి అన్నయ్య ఒక్కడే దిగాడు. నాయన ఇల్లు చూసుకోవడానికి ఖమ్మం వెళ్లారట. ఇంట తాళాలు వగైరా భద్రంగా చూసి మూడోనాడు వచ్చారు. తామే తప్పు చేశామని విలపించారు. విధిని నిరోధించడం ఎవరికీ సాధ్యపడదని కథలు చెప్పారు. నాయన తాతయ్య ఇంటికి రాలేదు. మేమే మా ఇంటికి మారాం.
కాలం ఆగదు కదా! కాలాన్ని ఆపలేరు కదా! కాలం దాని ధర్మం నిర్వర్తిస్తుంది గదా! అది సాగిపోతున్నది.
అమ్మ కడుపుచిచ్చు చల్లారలేదు. తొర్రూరు నుంచి గుంజుకొని వచ్చి నాయనే లక్ష్మి ప్రాణాలు తీశారంటుంది. అనటం కాదు. అదే అంటుంటుంది. నాయన విధిబలీయం అని మృత్యువే గుంజుకు పోయిందని చెపుతుంటారు.
ఒకనాడు కడుపు చిచ్చు కార్చిచ్చు అయింది. అమ్మకూ నాయనకూ భీషణ యుద్ధం జరిగింది. అమ్మ గట్టిగా కేకలు పెట్టింది. నాయన గొంతు చించుకొని అరిచారు. అమ్మను జుట్టు పట్టుకొని కొట్టారు. అమ్మ పళ్లు ఊడిపోయాయి. నోటి నిండా రక్తం. రక్తం ఉముస్తున్నది. తల నేలకు వేసుకొని కొట్టుకుంటున్నది. నాయన దుర్వాసుడు అయినారు. అమ్మను జుట్టుపట్టి గుంజుకు పోయి వీధిలోకి నెట్టారు. మొత్తుకుంటున్న ఇద్దరు చెల్లెళ్లను అమ్మమీద వేశారు. తలుపు వేసుకున్నారు.
ఊరిజనం సాంతం గూడారు.
ఒక్కరూ పలకలేదు - నాయనంటే భయం!
తాతయ్యా - అమ్మమ్మా అమ్మనూ, చెల్లెళ్లనూ తీసికెళ్లారు.
సూర్యుడు సిగ్గుపడి క్రుంగిపోయాడు!
ఇంట్లో మేము ముగ్గురమే. నేను వంట చేశాను. భోజనాలు అయినాయి. అన్నయ్యా, నాయనా ఏమనుకున్నారో నాకు తెలియదు. తెల్లవారి ఇంటి ముందు బండి నిలిచింది. సామానులు ఎక్కించారు. నన్ను ఎక్కమన్నారు. ఎక్కడికో తెలియదు. నాకు అమ్మా - చెల్లెళ్ల మీద గుంజుతున్నది. అయినా ఎక్కను అనలేకపోయాను. ఎక్కాను. వాళ్లూ ఎక్కారు. బండి వాస్తవంగా తాతయ్య ఇంటిముందునుంచి వెళ్లాలి. దోవ మార్చారు. ఊరు దాటింది. అప్పుడు తెలిసింది మానుకోట వెళ్తున్నామని!





