Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అన్నదానాలూ - సంతర్పణలూ జరిగాయి. వేలమంది భోజనాలు చేశారు. ఉత్సవం ముగిసింది.
మేము గూడూరులో ఉన్నన్నాళ్లు బాగానే జరిగింది. మేము గూడూరు వదిలి ఖమ్మం చేరుకున్నాం. గుహలోని రామునికి పూజ లేకుండా పోయింది.
పన్నెండు
ప్రమాదాలు - వివాదాలు:
భారతదేశం బానిసత్వంలో మగ్గినపుడు ప్రజల ఆరోగ్యాన్నిగురించి ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. ఇంగ్లీషు వారు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. ఉద్ధరించడానికి రాలేదు. దేశంలో ప్లేగు - కలరా - మశూచి - మలేరియా - ఫ్లూలాంటి అంటువ్యాధులు విపరీతంగా ప్రబలాయి. మూక చావులు. వందలు, వేలు పిట్టలు చచ్చినట్లు చచ్చారు.
నిజాం రాజ్యం విషయం వివరింపపనిలేదు. కలరా - గత్తర ఊళ్లల్లో వ్యాపిస్తే వందల వేలు చచ్చేవారు. కలరాకు మందూ, మాకు లేదు. మంత్రాలమీద ఆధారం. ఒక పధ్ధతి ప్రకారం అమ్మవారిని కొలిచేవారు. ఈ విషయాలు నా నవల "మోదుగుపూలు"లో వివరించాను.
మా పెద్ద చెల్లెలు "లక్ష్మి" గత్తరకు బలి అయింది. దాని కథాక్రమంబెట్టిదనిన:-
నేను పుట్టిన తరువాత అయిదేళ్లకు లక్ష్మి పుట్టింది. ఆమె సర్వయ్య సార్ ఇంట్లో పెరిగింది. సర్వయ్య సార్ భద్రమ్మలను కూడా అమ్మా - నాయనా అనేది. భోజనానికి మాత్రం ఇంటికి వచ్చేది. మిగతా సమయం వాళ్లింట్లోనే. ఆమెకు వాళ్లతోనే అనుబంభం ఎక్కువ.
లక్ష్మికి ఎనిమిదేళ్లుండగా సర్వయ్య సార్ కు 'తొర్రూరు' బదిలీ అయింది. వారు లక్ష్మిని వదలలేక బదిలీ రద్దుకోసం విశ్వప్రయత్నం చేశారు. ఫలించలేదు. భద్రమ్మ లక్ష్మిని వదిలిరానని స్పష్టంగా చెప్పింది. సర్వయ్యగారు ఒక్కరే వెళ్లారు. వారి ఆరోగ్యం మంచిది కాదు. జబ్బు పడి వచ్చారు. ఎంతకాలం శలవు పెడ్తారు? భద్రమ్మ ఇరకాటంలో పడింది. అటు భర్త - ఇటు లక్ష్మి - ఇద్దరినీ విడిచి ఉండలేదు.
సర్వయ్యగారు, భద్రమ్మ మా ఇంటికి వచ్చారు. లక్ష్మిని తమతో పంపించవలసిందని - కన్నీటితో - నాయనను అర్థించారు. వైష్ణవుల ఇంట్లో ఉంచుతామన్నారు. తమ ఇంట్లో నీళ్లు కూడా తాగనీయం అన్నారు. పెళ్లి కావలసిన పిల్ల. కోమట్ల ఇంట్లో ఉండడం మంచిది కాదని నాయన పంపనంటే పంపను అన్నారు. ప్రార్థనలు వమ్మైనాయి.
విధిలేని దశలో సర్వయ్యవాళ్లు ప్రయాణం అయ్యారు. లక్ష్మి భద్రమ్మను కరిచి పట్టుకుంది. మర్కట కిశోరంలా పట్టుకుంది. వదలదు. వాళ్ల ఏడుపులు. ఈమె ఏడ్పు. వీధి సాంతం కూడింది. అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఆ దృశ్యం తలచుకుంటే ఈనాటికీ - అర్థశతాబ్దం తరువాత కూడా - హృదయం ద్రవిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలం గుర్తుకు వస్తుంది.
సర్వయ్య సార్ వాళ్లు మూడు సార్లు ప్రయాణం అయి మానుకున్నారు. సారుకు అధికారుల వత్తిడి ఎక్కువయింది. రాత్రికి రాత్రి లక్ష్మికి తెలియకుండా వెళ్లిపోయారు.
తెల్లవారి లక్ష్మి ఏడ్చిన ఏడుపుకు - చేసిన గందరగోళానికి వీధి సాంతం తల్లడిల్లింది. నాయన లేరు, మేమేం చేయలేం. లక్ష్మి నిరశనం వహించింది. మూడు రోజులయింది. జ్వరం, అప్సస్మారంగా ఉంది. వాళ్లనే పలవరిస్తుంది. ఇల్లు ఎడారిలా ఉంది. బావురుమంటున్నది. అమ్మ ఏడుస్తుంది. వంట లేదు. అందరం ఉపవాసం అయినా లక్ష్మి బాధ చూడలేకున్నాం.
లక్ష్మి కలలో వచ్చిందట - రమ్మన్నదట! సర్వయ్య దంపతులు దిగారు. వాళ్ల ఏడుపు - లక్ష్మి ఏడుపు - అమ్మ ఏడుపు - మా ఏడుపులతో ఇల్లు శోకతప్తం అయింది. కొంతసేపటికి తాపం తగ్గింది. లక్ష్మి వాళ్లను పట్టుకొని కూర్చుంది. వదలనంటుంది. వారు వాళ్ల ఇంటికి వెళ్లలేదు.
అమ్మ ఆనాడు స్నానం చేసింది. వంట చేసింది. లక్ష్మి సహితంగా అందరం భోజనాలు చేశాం.
ఉద్యోగమన్నా వదులుకుంటాం - లక్ష్మిని వదిలిపో నంటుంది భద్రమ్మ. మేము స్వతంత్రించాం. లక్ష్మిని దక్కించుకోవాలంటే వారి వెంట పంపాలనుకున్నాం. లక్ష్మి మహదానందంగా వారి వెంట వెళ్లింది.
ఈ అనుబంధాలే ఇంకా మానవతను కాపాడుతున్నాయి. డబ్బుతో సాధించలేనివానిలో అనుబంధం ప్రధానం అయింది. అనుబంధాలు ప్రకృతి సిద్ధంగా వసంతంలా - వెన్నెలలా - వరదలా రావాలి. మానవు మేధస్సుకు అందనిది - కార్య, కారణ, ఫలితాలు. ఎరగనిది అనుబంధం! అనుబంధం మరణంతో అంతం కానిది. జన్మ జన్మాలకు సాగేది! అనుబంధాలతోనే బ్రతుకు సొగసు!
కొన్నాళ్లకు నాయన దిగారు. లక్ష్మిని పంపినందుకు మా అందరిమీద కేకలు - కూకలు - అరుపులు కురిపించాడు. తిట్లు - సాపెనలు - క్రోధాలు - ఇంటిమీద ఇల్లు పడ్డట్టు చేశారు. కనీసం భోజనం చేయకుండా తొర్రూరు వెళ్లడానికి బస్సుకు వెళ్లారు.
మనిషి తాపత్రయం సాంతం అధికారం - పెత్తనం కొరకే! అంతర్జాతీయ స్థాయినుండి సాధారణ వ్యక్తి వరకూ ఎంతో కొంత అధికారం ఉంటుంది. ఈ అధికారానికి గండి పడితే మనిషి సహించలేడు. మళ్లీ ఆ పెత్తనం సాధించడానికి గిజగిజలాడ్తాడు. ప్రపంచ యుద్ధాలనుంచి కుటుంబ కలహాల దాకా ఇదే కథ! నాయనకు ఆగ్రహం కలిగిందీ అందుకే! ఇంతకాలం నిర్నిరోధంగా తన మాటకు తిరుగులేకున్నది. ఇప్పుడు తనను ఎదిరించి కాదు కాని - తన ప్రమేయం లేకుండా ఒక పని జరిగింది. మళ్లీ ఇలా జరక్కుండా చేయాలి. తన పెత్తనం మొక్క పోరాదు. దీన్నే అహంకారం అంటాం. దీన్ని వదులుకొమ్మనే సకల శాస్త్రాలు - మతాలు - విధానాలూ బోధిస్తున్నాయి!
నాయన తొర్రూరులో దిగగానే లక్ష్మి గడగడలాడి పోయింది. నాయన సర్వయ్యగారి మీద వంటికాలుమీద లేచారు - నానా మాటలు అన్నారు, తనకు తెలియకుండా లక్ష్మిని తీసుకొని వచ్చినందుకు! భార్యా భర్తలు ఇద్దరూ నాయన పాదాలమీదపడి వేడుకున్నారు. మన్నించలేదు. ఆలగోడు బాలగోడు మధ్య లక్ష్మిని గుంజుకొని వచ్చి ఖమ్మంలో పడేశారు. కాలక్షేపం సాయించడానికి ఇనుగుర్తి వెళ్లారు.
లక్ష్మి గడగడలాడిపోతున్నది. ఆమె నరనరాన భయం నిండిపోయింది. ఆకు అల్లడితే ఏడుస్తుంది. అమ్మ ఆడది. మేం పిల్లలం - ఏం చేయగలం? లక్ష్మి ఎంగిలి పడుతుంది. కాని తినదు. రాత్రిళ్లు ఉలిక్కిపడి లేస్తుంది. పలవరిస్తుంది మేము ప్రేక్షకులం మాత్రమే! నిస్సహాయులం. అప్పటికీ అమ్మ బొట్టు పెట్టించింది. మొక్కులు మొక్కింది. ముడుపులు కట్టింది.
సర్వయ్యవాళ్లు బెదిరిపోయారు! ఇటు రాలేదు.
గుంటి మల్లన్న మర్రికింద ఇద్దరు బిచ్చగాళ్లకు గత్తర - కలరా - తగిలి చచ్చిపోయారని వార్త. అది విని ఊరంతా గడగడలాడింది. గత్తర వ్యాప్తికి నిరోధించే ఉపాయం లేదు. అమ్మవారికి ఊరి తరపున మొక్కుకున్నారు. అంతకుమించి చేయగలిగింది లేదు.
మనిషికి సాధ్యంకానప్పుడు దేవుడు దిక్కు అవుతాడు.
ఆనాటి ఉదయం లక్ష్మి నలిగినట్లనిపించింది. కడుపునొప్పి అన్నది. సోడా ఉప్పు ఇచ్చాం. తగ్గలేదు. వాంతులు అయినాయి. విరేచనాలు మొదలయినాయి. తోట కూర కాడవలె పడిపోయింది. అది గత్తర - కలరా అని అర్థం అయింది. కాని, ఏం చేయాలో అర్థం కాలేదు.
గత్తర అని బయటికి చెప్పకూడదు. చెపితే వీధివాళ్లు ఇంట్లో ఉండనివ్వరు!
అదొక నికృష్టస్థితి! లక్ష్మికి పడక దగ్గరనే వాంతులు - విరేచనాలు అవుతున్నాయి. మృత్యువు ద్వారం ముందు వేచి ఉంది. చావు రానున్నదని తెలుసు. ఏమీ చేయలేం. అప్పటికి ఈ రోగానికి మందున్నదని తెలియదు. మందు వేస్తే అమ్మవారికి అలక! మంత్రాలే మార్గం!!
ఇంటిముందు నాయుడుగారు ఉండేవారు. వారికి మంత్రాలు వచ్చునని వాడుక. పిలుస్తే వచ్చారు. ఏవో మంత్రాలు వేశారు. కొబ్బరికాయ తలక్రిందులుగా పూడ్చమన్నారు. ఎంత అడిగినా నీళ్లు మాత్రం ఇవ్వద్దన్నారు. వారు రెండు మూడుసార్లు వచ్చి చూచారు.
ఈ స్థితిలో ఇంట్లో కానీలేదు. నేను లక్ష్మిదగ్గర ఉన్నాను. అన్నయ్య ఎక్కణ్ణుంచో పది రూపాయలు తెచ్చాడు. అన్నయ్యను ఉంచి నేను లింగయ్య దగ్గరికి వెళ్లాను. అతను విలవిల్లాడాడు. అతని దగ్గరా లేదు. ఎవరినో అడిగి ఇచ్చాడు. తాను వస్తానన్నాడు. నేనే వారించాను.
అమ్మ బాధను అంచనా వేయడం అసంభవం - మా చెల్లెళ్లు ఇద్దరు. గత్తర అంటువ్యాధి! ఏ క్షణాన ఎవరికి తగులుతుందో తెలియదు. లక్ష్మిని విడువలేదు. మమ్ములను పట్టలేదు! అమ్మ తన విషయం ఆలోచించడం మరచి చాలాకాలం అయింది. తల్లికి పిల్లలే ప్రాణం!





