Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    దేవుని సేవకు కూడా తాసిల్దారు అనుమతి అవసరం. ఒకసారి సీతాకళ్యాణపు ఊరేగింపుకు అనుమతి అడగడానికి వెళ్లారు. వివరించారు. 'హమ్ ఏక్ షాదీసే బేజార్ హైఁ. ఎహ్ హర్ సాల్ కీ షాదీకైసీ. మేము ఒక్క పెళ్లికే బేజారవుతున్నాం. ఏటేటా ఈ పెళ్ళిళ్ళేమిటి? అన్నాడు. తరువాత వీళ్లు వివరించారు. అనుమతిచ్చారు. అదిసరే. సర్కారు ప్రజలకు దూరంగా కోట కట్టుకుని కూర్చుకునేది అనడానికి ఇది నిదర్శనం.   

 

    ఆ రాత్రి మా ఇంట్లో వధువులు కుడికాలు పెట్టి వధూప్రవేశంచేశారు. బంధువుల సందడి - భోజనాలు - అడావుడి - మరిన్న లాంఛనాలు, ఆచారాలు అన్నీ ముగిశాయి.

 

    నా ధర్మపత్ని సింగరమ్మ పేరు కమలమ్మగా మారింది. అళహసింగరాచార్యులవారు పిల్లకు బంగారం పెట్టాల్సిందని అడిగారు. రామంచార్ల మామతో వప్పందంతో బంగారం ప్రస్తావన లేదు. నాయన చకితులయినారు. కాని, ఆ మాట అనలేదు. యుద్ధంవల్ల బంగారం తులం ధర 15 నుంచి  20కి పెరిగింది. తగ్గింతరువాత పెట్తామన్నారు. మా దగ్గర డబ్బు వసూలు చేసినట్లే బంగారం పెట్టాల్సిందే అని నిలదీశారు అళహసింగరాచార్యులవారు. నాయనకు తప్పలేదు. కొన్ని అక్కవి కొన్ని నాయనమ్మవీ నగలు - మెరుగు పెట్టించి పెట్టారు. వాటి పట్టిక తయారు చేశారు. నాయన వారిని ముట్టినట్లు సంతకం పెట్టమన్నారు.   

 

    సంతకం పెట్టమన్న మాటవిని అళహసింగరాచార్యుల వారు మండిపడ్డారు. ఇది బంధుత్వమా? వ్యాపారమా? మీకు డబ్బిచ్చినపుడు రశీదు అడిగామా? మీరు విద్వాంసులు - పెద్దలు అనుకొని పిల్లనిచ్చాం. మీ బంగారమూ వద్దు మీ సంబంధమూ వద్దు అని కమలకు చంకవేసుకుని బయలుదేరాడు. నాయన, అమ్మ మిగతా బంధువులూ బ్రతిమిలాడి శాంతింపచేశారు. నాయన నగలిచ్చి పంపించారు. వధువులూ బంధువులూ వెళ్లిపోయారు. పెళ్లిళ్ల కార్యక్రమాలు ముగిశాయి.

 

    ఆ విధంగా పన్నెండేళ్ళ నాకూ ఏడేళ్ళ కమలకూ - మా వాళ్లసంబంధం లేకుండా నాయనకు కర్చులేకుండా పెళ్లి జరిగింది. మేము అనుకూలంగా ఉన్నాం. మా పెళ్లి సంగతి కమలకు గుర్తే లేదు. నా షష్టిపూర్తి సందర్భంగా ఆమెకు మళ్లీ నేను కట్టిన మంగళసూత్రమే ఆమెకు గుర్తు. 1993లో నేను కమలకు షష్టిపూర్తి జరిపాను. మహిళలకు సహితం షష్టిపూర్తి జరగాలి అనే సంప్రదాయానికి నాంది పలికాను. భార్యకు భర్త షష్టి పూర్తి చేయడంలో నేనే మొదటివాణ్ణేమో    

 

    మేము సుఖాలకు నోచుకోలేదు.

 

    కష్టాలు కలిసి పంచుకుంటున్నాం.

 

    విధి విచిత్రం అయింది. అది మానవుని ప్రణాళిక ప్రకారం నడవదు. మా వదిన రామానుజమ్మ కాపురానికి రాకుండానే గతించింది.

 

    ఇక్కడ ఒక విషయం మనవి చేయాలి. బ్రిటిషిండియాలో సాంఘిక సంస్కరణలు - ఆంగ్లేయుల ఆచారాల అనుకరణగా జరిగాయి. కాబట్టి సంఘసంస్కర్తలకు ప్రభుత్వపు పూర్తి మద్దతు లభించింది.

 

    నిజాం సర్కారుకు వెలుగంటే బెదురు. సంఘసంస్కరణ విద్రోహం కింద లెక్క. నిజాం రక్కసి సంఘసంస్కరణలను పూర్తి శక్తియుక్తులతో నిరోధించింది. నిజాం రాజ్యంలో చెప్పుకోదగిన సంఘసంస్కరణ ఉద్యమం రాలేదు.  

 

                                                             పదకొండు

 

    మనుషులు చేసిన దేవుళ్లు:

 

    నాయనకు గూడూరు మీద ధ్యాస పడింది. అంతేకాదు. ఏదో పని పడింది. గూడూరు నుంచి శేషయ్య మామ వచ్చారు. ఏవో మాటలు, ముచ్చట్లు జరిగాయి. ఒక నఖాషీ - శిల్పిని ఇచ్చి శేషయ్యమామను పంపించారు.

 

    గూడూరు నుంచి ధాన్యం అమ్మడానికి వచ్చిన బండ్ల తిరుగు ప్రయాణంలో మేము బయలుదేరాం. రాత్రి - పండు వెన్నెలలో మా ప్రయాణం. వెన్నెట్లో - బండ్ల బిడారులో - బండివాళ్ల కూనిరాగాల్లో - మెల్లనిగాలితో పయనం పరమానందంగా ఉంది.

 

    బండ్ల బిడారు తెల్లవారి పిండిపోలు చేరుతుంది. బండ్లు విడియడానికి - వంటలకు మామిడి తోటలు, మోట బావి ఉన్నాయి. బండ్లు విడిశాయి. బండ్లవాళ్లు వంటల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎద్దులు విశ్రాంతిగా గడ్డి మేస్తున్నాయి.

 

    మేము అందరు చూడగా వంటలు చూసుకోం. దూరంగా ఒక పరుపు బండనీళ్ల వసతి చూసి వచ్చారు. మేము వంట సామాగ్రి సహితంగా అక్కడికి తరలాం. అమ్మ వంటలు చేసింది. మేము మర్రి ఆకుల విస్తళ్లు కుట్టాం. పరుపు బండ పక్కనే మర్రి చెట్టుంది. నాయన తిరువారాధన - ఆరగింపు ముగించారు.

 

    అమ్మ తప్ప అందరం భోజనాలకు కూర్చున్నాం. ఒకవాయి ముగించాం. అంతే, తేనెటీగల దండ్లు - మర్రి చెట్టునుంచి భయంకరంగా దాడి చేశాయి. ఒక్కొక్కళ్లను వందల ఈగలు కుడుతున్నాయి. అన్నాలు వదిలి - మొత్తుకుంటూ - ఏడ్చుకుంటూ - అందరం పరిగెత్తుతున్నాం. ఈగలు మబ్బుల్లా గుంపులు గుంపులు మా వెంట వస్తున్నాయి. మేము అతి కష్టంగా బండ్లున్న చోటికి చేరుకున్నాం.

 

    తేనెటీగలు బండి మనుషులనూ - ఎడ్లనూ కుట్టసాగాయి. బండి మనుషులు మమ్ములను గొంగళ్ళలో చుట్టారు. వాళ్లంతా వచ్చి పోయేవాళ్లమీద దాడి చేస్తూనే ఉన్నాయి. చాలాసేపటి తరువాత అవి నిర్గమించాయి.

 

    తేనెటీగలు నిర్గమించిన విషయం తెలుసుకొని బండ్లమనుషులు బావిలోంచి బయటికి వచ్చారు. మమ్ములను గొంగళ్లలోనుంచి తీశారు. అందరి శరీరాల నిండా తేనెటీగలు నాటిన ముళ్లు, శరీరాలు వాచిపోయాయి. వణుకు, చలి, కొంత భయం - కొంత జ్వరం.

 

    ఆ స్థితిలోనూ ఇతరుల చేతి నీళ్లు తాగం! నాలుకలు ఆరుకుపోతున్నాయి. ఆ దశలో అమ్మ బిందె తోమి, మోట బావిలో దిగి - నీళ్లు తెచ్చింది. అందరం తాగాం. అందరం వణుకుతున్నాం. చెల్లెళ్లు మరీ! పెద్దగా ఏడుస్తున్నారు. నాయన గద్దింపులు ఏడుపులు ఆపలేకపోయాయి.   

 

    బండి మనుషులు గొంగళ్లు కప్పుకొని పరుపుబండ నుంచి సామాగ్రి తెచ్చారు. బండ్లు బయలుదేరాయి. వణుకు, జ్వరాలతో గూడూరు చేరాం. మామూలు మనుషులం కావడానికి చాలాకాలం పట్టింది.

 

    గూడూరులో ఒకనాటి ఉదయం నాయన; దొర - కరణం - సావుకార్లనూ అందరినీ పిలిపించారు. ఇల్లు వారితో నిండిపోయింది. నాయన ఒక సుదీర్ఘమయిన 'శ్రీసుక్తి' సాయించారు. సారాంశం ఏమంటే - వారికి వేకువ జామున ఒక కల వచ్చింది. శ్రీ సీత, రామ, లక్ష్మణ హనుమానులు దర్సనం ఇచ్చారు. వారు ఈ ఉరి పొలిమేరల్లో నివసిస్తామని చెప్పారు. నాయనను వెంట రమ్మన్నారు. ఒక గుహ వరకు తీసికెళ్లారు. మేము ఈ గుహలో ఉంటాం అన్నారు. అదృశ్యులు అయినారు. ఆ ప్రదేశం నాయనకు గుర్తుంది. దాని చుట్టూ తులసిపొదలున్నాయి.  

 

    నాయన ఈ వివరాలు చెప్పారు. స్వప్న వృత్తాంతాన్ని పరీక్షించాలన్నారు. అందరూ స్నానాలు చేసి వస్తే భజన చేస్తూ సాగవచ్చునన్నారు. శ్రీ రామచంద్రమూర్తి గూడూరును కరుణించినందుకు అంతా మురిసిపోయారు. ఇండ్లకు తరలారు.

 

    నాయన స్నాన సంధ్యాదికాలు ముగించుకున్నారు. ఊర్ధ్వపుండ్రాలు, తులసిపూసలు - తామరపూసలు ధరించిన గ్రామ వైష్ణవులు చేరుకున్నారు. కొద్ది సేపట్లోనే స్నానాలు ముగించి, బొట్లు పెట్టుకొని జనం గుంపులుగా కూడారు. హర్మోనీలు, మద్దెలలు వచ్చాయి. రామ భజన సాగింది.

 

    జనం భజన చేస్తూ నాయన వెంటసాగింది. ముత్యాలమ్మ కుంట - తిరుమణికుంట చెరువుల కట్టలు దిగారు. మరి కొంతదూరం నడిచారు. నాయన నిలిచారు. జనం నిలిచింది. భజన ఆగింది.

 

    నాయన ఒక బండమీద నుంచున్నారు 'ఇక్కడి వరకే గుర్తున్నది. చుట్టుపట్ల తులసి పొదలు వెదకండి" అన్నారు. అక్కడే కూర్చున్నారు. ధ్యానంలో నిమగ్నులయినారు.

 

    జనం గుంపులుగా అన్ని దిశలా వెదుకసాగారు. శేషయ్యమామ వచ్చి "తులసి పొదలు కనిపించినయి" అన్నాడు. ఆమాట అందరికీ తెలిసింది. జన సమూహాలు కూడాయి. మళ్లీ భజనలు మొదలయినాయి.

 

    నాయన ధ్యానం నుంచి బయటికి వచ్చారు. "స్వామి ప్రత్యక్షం అయినారు, ప్రత్యక్షం అయినారు" అని గంతులు వేశారు. వాద్యాలు, భజనలతో నాయన సాగారు. ఒక బోడు ఎక్కారు. అటూ ఇటూ వెదికారు. "అదిగో పరిమళం - ఇక్కడే స్వామి ఉన్నారు" అని ఒక గుహలోకి దారి తీశారు.

 

    గుహలో పూలు, తులసి చల్లి ఉన్నవి. నేతి ప్రమిద వెలుగుతున్నది. 'అదిగో నా స్వామి' అని నాయన సాష్టాంగపడిపోయారు. అందరూ వారిని అనుసరించారు. నాయన రుద్ధకంఠంతో అనుసంధానం చేస్తూ - బాష్పపూర్ణ నేత్రాలతో ముందుకు సాగారు. ఎదురుగా రాతిమీద లీలగా ఆకారాలు కనిపించాయి. 'ఇదిగో రాముడు నా స్వామి - ఇదిగో సీతమ్మ మా యమ్మ - ఇదిగో లక్ష్మణుడు మా అన్న - ఇదిగో హనుమ రామమాత' అని భజన సాగించారు. ఆరాధనాదులు జరిగాయి. అందరూ తిరిగి వచ్చారు.

 

    వార్త కార్చిచ్చులా సాకింది. గుహవద్ద మరునాటి నుంచి - చుట్టు పట్లనుంచి వేల జనం, ఒక తిరునాళ్లు అయింది. దుకాణాలు వెలిశాయి. నిత్యధూపనైవేద్యాలు సాగాయి.

 

    ఒకనాడు ప్రధాన ఉత్సవం - బహుశః ప్రతిష్ఠ కావచ్చు - జరిగింది. చాల హడావుడిగా - అట్టహాసంగా జరిగింది. పందిళ్లు వేశారు. హోమాలు - జపాలు - పూజలు - పారాయణాలు. నాకు బాగనిపించింది. తట్టలు కొద్ది తామరపూలు తెచ్చి పూజ చేశారు. అన్ని తామరలు దొంతరలుగా పేర్చడం ఎంతో బావుంది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.