Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


 

                               రెండవ తృచ : ఋషి - మేధాతిథి / ప్రియమేధి.
   
1.    హర్యశ్వవంత ఇంద్రా! ధనవంతుడనగు నిన్ను స్తుతించువాడు ధనవంతుతుడు అగును గాత. నిన్ను మించిన ధనవంతుడగు స్తోత మరింత ధనవంతుడు అగును గాత.
   
2.    ఇంద్రదేవా! ఇప్పుడు నీవు స్తుతించని వానిని తెలియుచున్నావు. చేయ బడుచున్న స్తుతులను తెలియుచున్నావు. గానము చేయబడు 'గాయత్రి' సమమును తెలియుచున్నావు.
   
3.    ఇంద్రా! హింసించు వాని కొరకు మమ్ము వీడకుము. తిరస్కరించు వాని కొరకు మమ్ము వీడకుము. శక్తిశాలి ఇంద్రా! నీ పరాక్రమమున మాకు కోరిన ధనము నందించుము.
   
                                         మూడవ తృచ : ఋషి - తిరశ్చి.
   
1.    ఇంద్రా! స్తోతల స్తుతులు వినుటకు హర్యశ్వముల మీద విచ్చేయుము. నీ శాసనమున మేము సుఖముగా ఉన్నాము. దీప్త ధనవంతా! నీవు స్వర్గమునకు వెళ్ళుము.
   
2.    ఈ యజ్ఞమున అభిషవ పాషాణ ధారలు - మగ గొర్రె ఆడ గొర్రెను వడికించినట్లు వడకించుచున్నవి.
   
    ఇంద్రా! నీ శాసనమున మేము సుఖముగా ఉన్నాము. దీప్తధనవంతా! ఇక నీవు స్వర్గమునకు వెళ్ళుము.
   
3.    ఇంద్రా! సోమమును అభిషవించు పాషాణములు ధ్వని సహితముగ నీకు సోమము అందించును గాత.
   
    ఇంద్రా! నీ శాసనమున మేము సుఖముగా ఉన్నాము. దీప్త ధనవంతా! ఇక నీవు స్వర్గమునకు వెళ్ళుము.
   
                                      నాలుగవ తృచ : ఋషి - జమదగ్ని.
   
1.    సోమమా! నీవు మధుర రసమవై, ఆనంద దాయకవై ఇంద్రుని వద్దకు చేరుము.
   
2.    సోమమా! బుద్దివర్ధకము, అభిషుతము, నిర్మలమవై వాయువు వద్దకు చేరుము.
   
3.    యజమానులకు అన్నము అందించ దలచిన దేవతల కొరకు రథము వలె సోమము సిద్దముగా ఉన్నది.
   
                                           అయిదవ ఖండము
                              మొదటి తృచ : ఋషి - పురుచ్చేపుడు.

   
1.    అగ్ని పరమదాత. నివాసము ఏర్పరచువాడు. బలసూనుడు. జాతవేది. బ్రాహ్మణుని వలె పూజ్యుడు. యజ్ఞమును చక్కగా నిర్వహించువాడు. అత్యుత్తముడు. దేవతలకు చేర్చగలవాడు. దీప్తిమంతుడు. యజన యోగ్యుడు. ప్రవహించునదియు లేపన ఘ్రుతమున కాంతిమంతుడు.
   
    "అగ్నిం హోతారు మన్యే" అగ్నిని హోమ సాధకుడని భావించుచున్నాను.
   
2.    అగ్నీ! నీవు విప్రుడవు. జ్వాలవు అగ్నులందు జ్యేష్టుడవు. మేము నిన్ను పూజించదలచినాము. మననమే సాధనముగా గల ఋత్విజుల సమంత్రకముగా పరమ పూజ్యుడవగు నిన్ను ఆహ్వానించుచున్నారు.
   
    అగ్నీ! నీవు సూర్య కిరణముల వలె సర్వత్ర వ్యాపించువాడవు. మానవులకు హోతవు. జ్వాలా కేశివి. వరదుడవు. స్వర్గాదులు కోరు జనులు నిన్ను సంతృప్తుని చేయుచున్నారు.
   
3.    అగ్ని ఎంతో దీప్తివంతుడు. జ్వాలా రూప బలశాలి. మరిన్ని వెలుగులు చిమ్మువాడు. ద్రోహులకు పరశువంటివాడు. మాకు ద్రోహము తలపెట్టు శత్రువులను నాశనము చేసినాడు.
   
    ఎవనితో కూడిన కఠిన శిలలు సహితము బ్రద్దలగునో, పర్వతములు కరిగి నీరై పారునో అట్టి అగ్ని శత్రుశేషము లేకుండ చేసి క్రీడించుచున్నాడు. అతడు పారిపోడు. ధనుర్దారి శత్రువు ముందు నిలిచినను కదలడు.
   
                                           రెండవ తృచ : ఋషి - అగ్ని.
   
1.    అగ్నీ! నీ వద్దగల అన్నములు ప్రశంసనీయములు. దీప్తిరూప ధనశాలీ! నీ కాంతులు శోభాయ మానములు. బృహద్భానూ! కవీ! బలసమేతములగు ప్రశంసణీయ అన్నములను యజమానులకు ఇచ్చుచున్నావు.
   
2.    అగ్నిదేవా! నీ జ్యోతులు పావకములు. నీ జ్యోతులు నిర్మలములు. నీ జ్యోతులు పరిపూర్ణములు. నీవు తేజోవంతుడవై ప్రత్యక్షమగుచున్నావు. నీవు పుత్రుని వలెను, మాతృమూర్తి వలెను దగ్గర ఉండి రక్షించుచున్నావు. ద్యావాపృథ్వులను హవిస్సులు అందించి కలుపుచున్నావు.
   
3.    అరణ్య పుత్రా! జాతవేదీ! అగ్నీ! మేము నిన్ను చక్కగా స్తుతించుచున్నాము. మా స్తుతులను స్వీకరించుము. మేము అగ్నిహోత్రాదులు నిర్వహించుచున్నాము. తృప్తి చెందుము.
   
    అనేక రూపములు కలదియు, తృప్తి కలిగించునదియు, సుజాతయునగు అన్నములను యజమానులు నీ కొరకు హోమించుచున్నారు.
   
4.    అగ్నీ! నీవు అమరుడవు. నీ కాంతుల వలన నీవు ఈశ్వరుడవు అగుచున్నావు. మా దానములను పెంపొందించుము.
   
    అగ్నీ! తేజోమయ రూపమున కాంతులు విరజిమ్ముచున్నావు. దర్శనీయ కర్మములను ఫలయుక్తము చేయుచున్నావు.
   
5.    అగ్నీ! నీవు అధ్వరములను సంస్కరించు వాడవు. శ్రేష్ఠ. జ్ఞానవంతుడవు. ధనస్వామివి. ధనదాతవు. అట్టి నిన్ను మేము స్తుతించుచున్నాము. నీవు స్తోతలకు మరింత ధనము, సౌభాగ్య ధనము, అనుభవయోగ్య ధనము ఇచ్చుచున్నావు.
   
6.    అగ్నీ! నీవు సత్యస్వరూపివి. పూజనీయుడవు. విశ్వ దర్శనీయుడవు. తమకు సుఖము కలుగ వలెనని జనులు నిన్ను తూర్పు దిక్కున మొదట స్థాపించుచున్నారు.

    అగ్నీ! నీవు స్తుతులను శ్రద్దగా ఆలకించువాడవు. ఎంతో కీర్తి శాలివి. దేవతా సంబంధివి. మానవ దంపతులు నిన్ను వేదవాణిచే నుతించుచున్నారు.
   
                                                ఆరవ ఖండము
                                   మొదటి తృచ : ఋషి - సౌభరి.

   
1.    అగ్నీ! నీవు ఎవరితో స్నేహము చేయుదువో అతడు వీరపుత్రవంతుడు, అన్నవంతుడు, బలవంతుడు అగుచున్నాడు. అతడు నీ రక్షణలందు వర్ధిల్లుచున్నాడు.
   
2.    సోమము ప్రవహించునది. శకట రూపమున స్థిరపడునది. శబ్దించునది. వసంతమున వర్ధిల్లునది. దీపించునది. అగ్నిదేవా! నీ కొరకు హోమము చేయుటకు అధ్వర్యులు అట్టి సోమమును గ్రహించుచున్నారు. నీవు మహా ఉషస్సులకు మిత్రుడవు. రాత్రులందు వస్తువులను ప్రకాశింపచేయుచున్నావు.
   
                                               రెండవ తృచ : ఋషి - అరుణుడు.
   
1.    రుతువులందు పుట్టు ఓషధులు అగ్నిని తమ గర్భమున దాల్చుచున్నవి. ఆ అగ్నిని తల్లి వంటి జలములు ప్రసవించుచున్నవి. అరణ్యములు సహితము అగ్నిని ఆవిర్భవింప చేయుచున్నవి. గర్భవతులగు ఓషధులు సహితము విశ్వదాహ అగ్నిని ఉత్పన్నము చేయుచున్నవి.
   
                                  మూడవ తృచ : ఋషి - అగ్ని/ప్రజాపతి.
   
1.    అగ్ని ఇంద్రుని కొరకు జ్వలించుచున్నాడు. తెల్లని వెలుగుతో అంతరిక్షమున ప్రకాశించుచున్నాడు. గేదె గడ్డి తిని పాలిచ్చినట్లు - అగ్ని దేవతల కొరకు అన్నము కలిగించుచున్నాడు.
   
                                  నాలుగవ తృచ : ఋషి - అవత్సారుడు.
   
1.    ఎవడు అప్రమత్తుడో వానిని ఋక్కులు వరించుచున్నవి. ఎవడు అప్రమత్తుడో వానిని సామములు చేరుచున్నవి. ఎవడు అప్రమత్తుడో వానికి సోమము చెందుచున్నది. అగ్నీ! నీవు అట్టి వాడవు. నీ మైత్రి కలిగినంత నేను స్థిరనివాసిని అగుచున్నావు.
   
                                    ఐదవ తృచ : ఋషి - అవత్సారుడు.
   
1.    అగ్ని జాగృతుడు. అతనిని ఋక్కులు వరించుచున్నవి. అగ్ని జాగృతుడు. అతనిని సామములు చేరుచున్నవి. అగ్ని జాగృతుడు. అతనికి సోమము చెందుచున్నది. అగ్నీ! నీ మైత్రి కలిగినంత నేను స్థిరనివాసిని అగుచున్నాను.
   
                                     ఆరవ తృచ : ఋషి - భ్రుగువు.
   
1.    పూర్వ సదస్యులగు మిత్రులకు నమస్కారము. ఇప్పుడు వెంట ఉన్నవారికి నమస్కారము. నూర్ల పదముల వచనములు పలుకుచున్నాను.
   
2.    శతపద వచనము వల్లించుచున్నాను. గాయత్రి, త్రిష్టుప్, జగతి చందస్సుల సహస్ర పద సామమును గానము చేయుచున్నాను.
   
3.    గాయత్రి, త్రిష్టుప్, జగతి ఛందో సామములను ఉద్గాతలు గానము చేయుచున్నారు. అనేక విధ స్థానములను దేవతలు కల్పించుచున్నారు.
   
                                 ఏడవ తృచ : ఋషి - అవత్సారుడు.
   
1.    అగ్ని జ్యోతి. జ్యోతి అగ్ని. ఇంద్రుడు జ్యోతి. జ్యోతి ఇంద్రుడు. సూర్యుడు జ్యోతి. జ్యోతి సూర్యుడు.
   
2.    అగ్నిదేవా! బలసహితుడవై మాకు మరల లభించుము. అన్నము, ఆయువు సహితుడవై మాకు మరల లభించుము. పాపముల నుండి మమ్ము మరల రక్షించుము.
   
3.    అగ్నిదేవా! రమణీయ ధన సహితువై మమ్ము చేరుకొనుము. విశ్వము పైన నిలిచి విశ్వమును తడుపు ధారలు కలిగించుము.
   
                                               ఏడవ ఖండము
                          మొదటి తృచ : ఋషి - గో సూక్తి. / అశ్వసూక్తి.

   
1.    ఇంద్రా! ఎట్లు నీవు ఒక్కడవే ధనస్వామివి అగుచున్నావో అట్లే నేను ధనవంతుడను అగుదును గాక. అట్లయిన నన్ను స్తుతించువారు గోవులు కలవారు అగుదురు గాక.
   
2.    శచీపతీ! నేను గోవులు కలవాడనైనచో నన్ను స్తుతించువారికి ధనము ఇవ్వదలచుదును ఇచ్చెదను.
   
3.    ఇంద్రా! నిన్ను గురించిన స్తుతి సత్యస్వరూపము, మధురము, గోరూపము అగుచున్నది. అది యజమానుని వృద్ది కోరుచున్నది. అభిషవ కర్తయగు యజమానికి గోవులను, అశ్వములను ఇచ్చుచున్నది.
   
                          రెండవ తృచ : ఋషి - త్రిశిరుడు. / సింధుద్వీపుడు.
   
1.    జలములారా! మీరు సుఖములు కలిగించువారు. మాకు అన్నము కలిగించు సమర్ధులు అగుదురు గాక. మమ్ము మహాజ్ఞాన యోగ్యులను చేయండి.
   
2.    జలములారా! ఈ లోకమున మీ యొక్క రసములు పరమ సుఖస్వరూపలు అగుచున్నవి. తల్లులు పిల్లలకు చన్నిచ్చినట్లు మాకు మీ రసములను అందించండి.
   
3.    జలమా! ఏ పాపము నాశమగుటకు నీవు మాకు ప్రేరణ కలిగించుచున్నావో, ఆ పాపక్షయము నకు గాను నేను నిన్ను తలదాల్చుచున్నాను. మాకు పుట్టించు శక్తి కలిగించుము.
   
                                         మూడవ తృచ : ఋషి - ఉల్వుడు.
   
1.    వాయువు మాకు హృదయానంద కరము అగునట్లును, ఔషధరూపము అగుచును వీచును గాక. మా ఆయువులను పెంచును గాక.
   
2.    వాయువా! నీవు మాకు తండ్రివి, సోదరుడవు, సఖుడవు అగుచున్నావు. అట్టి నీవు మమ్ము జీవించు సమర్ధులను చేయుము.
   
3.    వాయువా! నీ ఇంట ఏ అమృతము దాగి ఉన్నదో దానిని ప్రకాశవంతుడవై మాకు అందించుము.
   
                                   నాలుగవ తృచ : ఋషి - సుపర్ణుడు.
   
1.    సూర్యుడు వేగవంతుడు. బలవంతుడు. విశ్వరూపి పక్వము చేయువాడు. అతడు ఉదయించి వ్యాపించును. బంగారము మీద బట్ట కప్పినట్లు రాత్రిళ్ళు కనిపించకున్నాడు. యజ్ఞము కొరకు మరల ఆవిర్భవించుచున్నాడు.
   
2.    జలమును ఆశ్రయించియే రేతస్సున్నది, విశ్వరూపమగు తేజస్సు ఉన్నది. ఏది భూమి మీద ఉన్నదో అది తన మహిమచే ఆకాశమున ప్రకాశించుచున్నది. అది సోమపు ఆహ్వానము విని గర్జించుచున్నది.
   
3.    అగ్ని స్వర్గలోక, భూలోకములను భరించుచున్నాడు. జనులకు పాలించుచున్నాడు. యాచకులకు వందలు, వేలుగా భూరి దానములు చేయుచున్నాడు.
   
    యజించు ఈ అగ్ని సహస్ర కిరణుడై సకల దిశల వ్యాపించి రాత్రులందు సూర్య ప్రకాశము కలవాడగుచున్నాడు.
   
                                          ఐదవ తృచ : ఋషి - వేనుడు.
   
1.    నీవు సుపర్ణుడవు. అంతరిక్షపువాడవు. బంగరు రెక్కల వాడవు. వరుణుని దూతవు. మెరుపులా నిలయమగు ఆకసమున ఉన్నవాడవు. జగత్ పోషకుడవు. పక్షి వలె ఆకసమున దర్సనమిచ్చుచున్నావు. అట్టి నిన్ను స్తోతలు అభిలషించినపుడు లభించుచున్నావు.
   
2.    అతడు పైన ఉన్నాడు. జలములు ధరించి ఉన్నాడు. ప్రత్యక్షమగు చున్నాడు.  ఆశ్చర్యకర ఆయుధములు ధరించి, తన కాంతులను సర్వత్ర నింపి అంతరిక్షమున నిలిచి ఉన్నాడు. తదుపరి హర్షము నిచ్చు వర్షము కలిగించుచున్నాడు.
   
3.    అతడు ఆకసమున ఉన్నవాడు. జలబిందువులు దాల్చువాడు. సూర్య నేత్రమున చూచినాడు. అతడు మేఘము వైపు సాగినపుడు సూర్యుడు స్వచ్చ కాంతిచే ప్రకాశించును. మూడవ లోకమున దీప్తుడై వర్షము కలిగించుచున్నాడు.
   
   
                          దాశరథి రంగాచార్య విరచిత
                    శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
        ఉత్తరార్చిక యందలి ఇరువదవ అధ్యాయము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.