Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
ఇరువదవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - నృమేధ
ప్రాస్య ధారా అక్షరన్ వృష్ణః స్తుత స్యౌజసః |
దేవాం అను ప్రభూషతః ||
1. సోమము అభీష్ణప్రద. అభిషుతము. దేవతలను అనుసరించ దలచినది. సోమము బలముచే ధారగా క్షరించబడినది.
2. సోమము "జ్యోతిః". వర్ధిల్లునది. ప్రవహించునది. యజ్ఞకర్తలగు అధ్వర్యాదులు వేదవాణిచే సోమమును స్తుతింతురు. శుద్ది చేయుదురు.
3. బహు ధనవంత, స్తుతియోగ్య సోమమా! పునీతములగు నీ తేజస్సులు రక్షణ కలిగించుచున్నవి. నీవు సముద్రము వలె వర్ధిల్లుము.
రెండవ తృచ : ఋషి - నృమేధ / వామదేవుడు.
1. ఏ ఇంద్రుని పేరు ప్రసిద్దమో, ఎవడు ఋతువులను ఏర్పరచినాడో అతనిని స్తుతించుచున్నాను.
2. బలాధిపతి ఇంద్రా! నిష్ఠగల వాని స్తుతులు నిన్నే చేరుచున్నవి.
3. రాజమార్గముల నుండి పిల్ల బాటలు పోయినట్లు ఇంద్రా! నీ ధన దానములు నిన్ను అర్చించు వారి వైపు వెళ్ళుచున్నవి.
మూడవ తృచ : ఋషి - ప్రియమేధ.
1. ఇంద్రా! నీ పనులు అనేకములు నీవు హింసకులను తిరస్కరించు వాడవు. ఎంతో బలవంతుడవు. సజ్జన రక్షకుడవు. మమ్ము రక్షించుమని, సుఖములు కలిగించుమని రథమువలె నీకు ప్రదక్షిణ చేయుచున్నాము.
2. మహా బలశాలి, ఆశ్చర్యకార్యములు చేసినవాడు, పరాక్రమవంతుడు, పూజనీయుడగు ఇంద్రుడు విశ్వవ్యాప్తమగు తన మహిమచే లోకములను పూరించినాడు.
3. ఇంద్రుని హస్తములు మహా గొప్పవి. అవి భూమియందు సర్వత్ర వ్యాపించి ఉన్న బంగారమును, వజ్రాయుధమును పట్టి ఉన్నవి.
నాలుగవ తృచ : ఋషి - దీర్ఘతముడు.
1. అగ్ని యజమానుల యజ్ఞ వేదికలను వెలిగించువాడు. వాయువు వలె కోరిన చోటునకు చేరువాడు. కవి. అనేక యజ్ఞములందు అనేక రూపములు ధరించువాడు. అట్టి అగ్ని సూర్యుని వలె ప్రకాశించుచున్నాడు.
2. ఈ అగ్ని 'ద్విజన్మ' - రెండు అరణులు మధించగా పుట్టిన వాడు. ఇతడు ముల్లోకములను ప్రకాశింప చేయుచున్నాడు. అతడు హోత. పరమ పూజ్యుడై జల స్థానమున నిలిచి ఉన్నాడు.
3. 'ద్విజన్మ' హోతయగు అగ్ని సకల సత్కర్మలు చేయుచున్నాడు. హవి రూప అన్నమును ధరించుచున్నాడు. ఏ నరుడు ఈ అగ్నికి హవి అర్పించుచున్నాడో అతడు పుత్రవంతుడు అగుచున్నాడు.
ఐదవ తృచ : ఋషి - వామదేవుడు.
1. ఇంద్రునకు చేర్చవలసిన స్తుతులను అశ్వము వలె వహించువాడును, యజ్ఞము వలె పూజనీయుడును, హృదయమును ప్రియము కలిగించు వాడును అగు అగ్నిని స్తోతలమగు మేము వర్ధిల్ల చేయుచున్నాము.
2. అగ్నిదేవా! నీవు ఇప్పుడే సేవనీయుడవు, వర్ధిల్లువాడవు, అభీష్ట ఫలసాధకుడవు, సత్యస్వరూపి వగుచు "బృహతః క్రతోః రథీ బభూథ - మహా యజ్ఞమునకు సారథివి అగుచున్నావు.
3. అగ్నిదేవా! నీవు తేజస్సున సూర్య సముడవు. సమస్త తేజస్సులందు నీవే మనసున్న వాడవు. మా స్తుతులు వినుము. పూజ్యులగు ఇంద్రాదులు సహితుడవై మాకు దర్శనము కలిగించుము.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - ప్రస్కణ్వుడు.
1. అగ్నిదేవా! నీవు అమరుడవు. జాతవేదివి. ఉషస్సు నడిగి యజమానులకు వివస్వతము, విచిత్రమగు ధనమును తెచ్చిఇమ్ము. నేటి ఉషః కాలమున దేవతలను యజ్ఞమునకు చేర్చుము.
2. అగ్నిదేవా! నీవు సేవించువాడవు. దూతవు. హవ్యా వాహనుడవు. యజ్ఞసారథివి. నీవు అశ్వినులు, ఉషోదేవీ సహితుడవై మమ్ము సువీర్యమగు బృహత్ అన్నమున స్థాపించుము.
రెండవ తృచ : ఋషి - బృహదుక్దః.
(ఇంద్రుడు కాల స్వరూపునిగా స్తుతించబడుచున్నాడు.)
1. ఇంద్రుడు సంస్థ కార్యకర్త. వేల శత్రువుల గుండెలు బ్రద్దలు చేయువాడు. అతడు తలచిన యువతను వార్ధక్యము మ్రింగుచున్నది. కవులారా! అట్టి ఇంద్రుని మహిమలను దర్శించండి.
అద్యమమార సహ్యః సమాన - నేడు మరణించిన వాడు రేపు వ్యక్తమగుచున్నాడు.
(పునర్జన్మ చెప్పుట ఇప్పుడే.)
(ఇంద్రుడు పక్షి రూపమున స్తుతించబడుచున్నాడు.)
2. ఒక శ్రేష్ఠ పక్షి. అరుణ వర్ణ. అది తన బలమున సమర్ధ. అది వచ్చినది. అది పరాక్రమశాలి. సనాతన. ఎచ్చటను గూడులేనిది. ఆ పక్షి ఏ కార్యము చేయునో అది ఫలించుచున్నది. నిష్ఫలము కాకున్నది. అది చెప్పుకొన దగిన ధనమును శత్రువుల నుండి జయించుచున్నది. ఉపాసకులకు ఇచ్చుచున్నది.
3. ఇంద్రుడు మరుత్తుల సహితముగ వర్షము కలిగించు వారిని ఆధీనమునందుంచు కొనును. అతడు మరుత్తులతో కూడియే వృత్రుని వధించినాడు. మహాకార్యములు చేయు ఇంద్రునకు సాయపడు మరుత్తులు వర్షము కలిగించునపుడు వెలువడుదురు.
మూడవ తృచ : ఋషి - విందుడు / పూతదక్షుడు.
1. ఈ సోమము అభిషుతమై ఉన్నది. దీనిని తమ తేజస్సున వెలుగొందు మరుత్తులు, అశ్వినులు సేవించుచున్నారు.
2. మిత్ర, వరుణ, ఆర్యమ ఈ ముగ్గురు దశాపవిత్రమున శుద్దమై మూడు పాత్రలందుండి స్తుతులచే సమర్పించిన సోమమును పానము చేయుచున్నారు.
3. ఇక ఇంద్రుడు అభిషుతమై, గోఘ్రుతాదులచే కలిసిన సోమమును హోతల వలె ప్రాతః కాలమున అభిలషించుచున్నారు.
(స్తోతలు ప్రాతః కాలమున స్తుతించ కోరుదురు.)
నాలుగవ తృచ : ఋషి - జమదగ్ని.
1. సూర్యదేవా! నీవు మహానుడవు - ఇది నిజము. ఆదిత్యదేవా! నీవు మహా బలశాలివి - ఇది నిజము. మహామహులగు స్తోతలు నీ మహిమను స్తుతించుచున్నారు. స్తుతియోగ్య సూర్యా! నీ మహిమలచే నీవు పూజనీయుడవైనావు.
2. సూర్యదేవా! అన్నవంతులలో నీవు గొప్ప వాడవు. ఇది సత్యము. దేవా! దేవతలందు నీ మహత్తు కారణముగా అధికుడవు. ఇది సత్యము. నీవు అసుర నాశకుడవు. దేవతలకు హితకారివి. "విభుజ్యోతి రదాభ్యం" వ్యాప్తమగు నీ తేజము ఇతరులకు లొంగనిది.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - సుకక్షి.
1. సోమముల స్వామీ ఇంద్రా! మేము సోమము అభిషవించినాము, హర్యశ్వముల మీద విచ్చేయుము. విచ్చేయుము హర్యశ్వముల మీద - మా అభిషుత సోమము సేవించుటకు.
(ఉపనో హరిభిః సుతమ్ రెండు సార్లు చెప్పినాడు.)
2. ఇంద్రుడు వృత్రహంత శతక్రతువు. అతడు ఉగ్ర - శాంతి రెండు రూపముల వాడు అగుచున్నాడు.
"ఉపవో హరిభిః సుతమ్"
3. ఇంద్రా! నీవు పాపనాశకుడవు. ఏలనన నీవు సోమపాయివి గదా!
"ఉపవో హరిభిః సుతమ్"
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. మహా ధనములను సహితము పెంచగల మహా ఇంద్రునకు సోమము సమర్పించండి. మంచి బుద్ది గల ఇంద్రుని మంచి స్తుతులచే కీర్తించండి. మానవుల అభీష్టములు తీర్చు ఇంద్రా! హవి సమర్పించు వారి వద్దకు విచ్చేయుము.
2. విప్రులారా! మహా వ్యాప్తి గల ఇంద్రుని గొప్పగా స్తుతించండి. ఎంతటి వీరులును ఇంద్రుని దీక్షను నివారించజాలరు.
3. ఇంద్రుడు సమస్తమునకు ప్రభువు. అతని కోపము ముందు నిలువగలవారు లేరు. అతడు శత్రుహంత. అందుకే స్తుతులన్నియు ఇంద్రునే చేరుచున్నవి. స్తోతా! నీవు సహితము ఇంద్రుని స్తుతించుటకు నీ బందువులను ప్రోత్సహించుము.
మూడవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. ఇంద్రా! నీవు ఎంతటి ధనస్వామివో నేను అంతటి ధనస్వామిని అగుదును గాక. కేవలము ధనహీనులకు కాక స్తోతలకు ధనదాతను అగుదును గాక.
2. ఇంద్రా! నిన్ను స్తుతించు వారు ఎక్కడ ఉన్నను వారికి రోజు ధనము ఇచ్చుచున్నాను. నీవు వినా బంధువులు లేకున్నారు. ప్రశంసనీయ పాలకుడు కూడా నిన్ను వినా మరొకడు లేకున్నాడు.
నాలుగవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. ఇంద్రా! నీవు సోమపాయివి. నేను ఉపాసకుడను. నా పిలుపు వినుము. అర్చించు విప్రుని స్తుతులను స్వీకరించుము. మేము నిన్ను సేవించుచున్నాము. మాకు దగ్గరి వాడవగుము. సహాయకుడవై మా సేవల నందుకొనుము.
2. ఇంద్రా! నీవు శత్రు నాశకుడవు. స్తుతి మంతుడవు. నేను నీ శక్తి తెలిసినవాడను. నిన్ను విడువను. మహా స్తుతులను మరువను. కీర్తిశాలి వగు నీ స్తుతులను సదా ఉచ్చరించుచుందును.
3. మఘవా! మానవులందు నీ కొరకు సోమభిషేకము చేయువారు అనేకులున్నారు. మానవులు నిన్నే ఎక్కువగా ఆహ్వానించుచున్నారు. అట్లని ఎంతో కాలము మాకు దూరము కాకుము.
నాలుగవ ఖండము
తొలి తృచ : ఋషి - సుదాముడు.
1. స్తోతలారా! మన ఇంద్రుని రథము బలోపేతమై వచ్చుచున్నది. దాని ఎదుట నిలిచి పూజించండి. సంగ్రామములందు శత్రువు మీదకు వచ్చినను లోకమును రక్షించు వాడును, శత్రునాశకుడగు ఇంద్రుడు మాకు ధనములను ఇచ్చును గాత. మమ్ము గుర్తుంచుకొను గాత.
శత్రువుల ధనుస్సుల అల్లెత్రాళ్ళు తెగును గాక. "నభన్తా మన్యకేషాం జ్యాకా అధిధన్వసు"
2. ఇంద్రా! నీవు అంతరిక్షమునకు పోవు మేఘమును భిన్నము చేసినావు. అధోముఖము గల మేఘములను కురిపించుము.
ఇంద్రా! నీవు శత్రురహితుడవు అగుచున్నావు. అట్టి నిన్ను "పరిష్వజామహే" ఆలింగనము చేసి కొనుచున్నాము.
"నభన్తా మాన్య కేషాం జ్యాకా అధిధన్వసు"
3. మా అన్నములను, దానములను పెంపొందనీయకుండు శత్రువులు నశించినారు.
ఇంద్రా! మా కర్మములు కొనసాగును గాత. మమ్ము వధించదలచిన శత్రువు మీదకు నీ ఆయుధములు విసరుచున్నావు. నీవు ధనప్రదాతవు. మాకు ధనములు ప్రసాదించుము. "నభస్త మన్య కేషాం జ్యాకా అధిధన్వసు"





