Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


       

                 భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
                    భద్రా ఉత ప్రశస్తయః ||

                                 ఇరువది ఒకటవ అధ్యయము
                                    మొదటి ఖండము
                          మొదటి తృచ : ఋషి - ప్రజాపతి.

   
    ఆశుః శిశానో వృషభో వభీమో ఘనాఘనః క్షోభణశ్చర్షణీనామ్ |
    సంక్రందనో2నిమిష ఏకవీరః శతం సేనా అజయత్సాకమిన్ద్రః ||

   
1.    ఇంద్రుడు త్వరపడువాడు. భయంకరుడు. వృషభము వలె అరి భీషణుడు. పాపులను నాశము చేయువాడు. ద్వేషులను క్షోభ పెట్టువాడు. దేవ ద్వేషులను ఏడిపించువాడు. యజ్ఞములకు ఆలసింపని వాడు. అతడు వందల సేనలను ఒకే దెబ్బతో గెలుచుచున్నాడు.
   
2.    ఇంద్రుడు దేవ విద్వేషులను ఏడిపించువాడు. ఆలసింపనివాడు. జయశీల. యోద్ధ అన్యుల ముందు చలింపని వాడు. ధనుర్దారి.
   
    నరయోద్ధలారా! ఆ ఇంద్రుని వలన యుద్దమును జయించండి. శత్రువుణు తరిమి కొట్టండి.
   
3.    ఆ ఇంద్రుడు ధనుర్దారులను వశపరచుకొనును. ఖడ్గదారులను వశపరచు కొనును. యుద్దమున శత్రు మూకల మీదికి దూకును. కలిసి పోరాడు వారిని జయించును. సోమపానము చేయును.
   
    ఇంద్రుడు భుజబలశాలి. నిత్యము ధనుస్సును సిద్దముగ ఉంచును. విడిచిన బాణమున వధించక మానడు.
   
                                    రెండవ తృచ : ఋషి -  అప్రతిరథుడు.
   
1.    అనేకులను రక్షించు ఇంద్రా! రథము మీద రమ్ము. వచ్చి రాక్షసులను హతమార్చుము. శత్రువులను పీడించుము. సేనలను చిందర వందర చేయుము. యుద్దములను గెలువుము. మా రథములకు రక్షకుడవు అగుము.
   
2.    ఇంద్రా! నీవు అందరి బలములు తెలిసిన వాడవు. మహానుడవు. పరమవీరుడవు. సాహసివి. అన్నవంతుడవు. శత్రుంజయుడవు. ఉగ్రుడవు. నలుదిశలందు సేవకులు గలవాడవు. శక్తిశాలివి. బలములకు పుట్టిన వాడవు. స్తుత్యుడవు. జైత్రరథమున అధిష్టించుము.
   
3.    ఇంద్రుడు కొండలు విరుచువాడు. స్తుతులు అందుకొనువాడు. వజ్రబాహువు. యుద్దవిజేత. స్వబలమున శత్రువును ధిక్కరించువాడు.
   
    సహవీరులారా! ఇంద్రుని పరాక్రమమును అనుసరించండి. మిత్రులారా! ఇంద్రునితో పాటు క్రొధము ప్రదర్శించండి.
   
                                  మూడవ తృచ : ఋషి - అప్రతిరథుడు.
   
1.    ఇంద్రుడు మబ్బులలోనికి చొరబడువాడు. శత్రు విషయమున నిర్ధయుడు. పరాక్రమశాలి. శతక్రతువు. క్రోధనుడు. అకంపనుడు. శత్రుసేనలను లక్ష్య పెట్టని వాడు. అప్రతిహతుడు.
   
    "అస్మాకం సేనా అవతు ప్రయుత్సు" - యుద్దములందు మా సేనలను భద్రముగా రక్షించును గాత.
   
2.    ఇంద్రుడు మాకు నాయకుడు అగును గాక. బృహస్పతి దక్షిణమున ఉండును గాక. యజ్ఞ, సోమములు అగ్రమున ఉండును గాక. శత్రు మర్దన, విజేత దేవసేనల ముందు మరుత్తులు నడిచెదరు గాక.
   
3.    వరద ఇంద్రుని, వరుణుని, ఆదిత్యుల, మరుత్తుల మహాబలము మాది అగును గాక. మహా మహులు, లోకపోషకులు, విజేతలగు దేవతల జయ జయ ధ్వానములు ఘోషించును గాక.
   
                               నాలుగవ తృచ : ఋషి - అప్రతిరథుడు.
   
1.    మఘవా! మా ఆయుధములకు తీవ్ర ఉత్సాహము కలిగించుము. మా సేనలకు ఉత్సాహము కలిగించుము.
   
    వృత్రహంతా! అశ్వము వేగములను ప్రకటించును. 'రథానాం జయతాం యస్తు ఘోషాః' రథముల జయ ధ్వానము ఘోషించును గాక.
   
2.    శత్రుసేనలోనికి దూసుకొని పోయిన మా ధ్వజధారి సేనలను ఇంద్రుడు రక్షించును గాక. మా బాణములు జయించును గాక. మా వీరులు ఇతరులను మించుదురు గాక.
   
    "అస్మాం ఉదేవా అవతా హవేషు" దేవతలు యుద్దములందు మమ్మే రక్షింతురు గాత.
   
3.    మరుత్తులారా! బలమున స్పర్ధించు శత్రుసేన మా మీద దండెత్తుచున్నది. వారు ఒకరిని మరొకరు గుర్తించనట్లు గాడాంధకారము కలిగించండి.
   
                                    ఐదవ తృచ : ఋషి - అప్రతిరథుడు.
   
1.    పాపదేవతలారా! మాకు దూరముగా ఉండండి. శత్రువుల చిత్తములను ప్రలోభపెట్టండి. వారి అవయవములను పట్టుకొనండి. వారి మీద దండెత్తండి. వారి హృదయములందు దుఃఖ పరితాపము కలిగించండి. "అన్దేనామిత్రాస్తమసా సచన్తామ్"- శత్రువు చీకట్లలో పడి పోవును గాక.
   
2.    యోద్దలారా! దండెత్తండి. జయించండి. ఇంద్రుడు మీకు సుఖము కలిగించును గాత. మీ భుజదండములు ఉగ్రములు అగును గాక. మీరు ఎవరికీ లొంగకుందురు గాత.
   
3.    బాణములారా! మీరు మంత్రములచే పదును పెట్ట బడిన వారు. హింసించగలవారు. విడిచినంత మీరు శత్రువునకు తాకండి. "అమీషాం కంచానా మా ఉచ్చిషః" పగ వారిలో ఏ ఒక్కరిని విడువకండి.
   
                                               ఆరవ తృచ : ఋషి - ప్రజాపతి.
   
1.    వడిగల రెక్కల పక్షులు శత్రువు వెంట పడును గాత. ఈ శత్రుసేన గ్రద్దలకు తిండి అగును గాక. వీరిలో ఏ ఒక్కరు మిగులరాదు. ఇంద్రా! ఎక్కువ పాపము చేయని వానిని కూడ విడువ వద్దు. "వయాం స్యేనానను సంయన్తు సర్వాన్" పక్షులు వీరి నందరిని వెంబడించును గాత.
   
2.    మఘవ, వృత్రహంత ఇంద్రా! అగ్ని నీవు ఉభయులు కలసి మమ్ము ఎదిరించు శత్రుసేనను భస్మము చేయండి.
   
3.    ఎచట శిఖలు లేని కుమారుల వంటి శరములు పడునో అచట బ్రహ్మణస్పతి, అదితి మాకు సుఖములు కలిగించును గాక. "విశ్వాహా శర్మ యచ్చతు" నిరంతరము సుఖములు కలిగింతురుగాత.
   
                                ఏడవ సూక్తము - ఋషి - భరద్వాజుడు.
   
1.    ఇంద్రా! రాక్షసులను నాశము చేయుము. యుద్దము చేయువారిని నాశము చేయుము. మా శత్రువుల తలలు రాల్చుము. మాకు మరింత హాని కలిగించు శత్రువుల క్రోధమును సహితము నష్టపరచుము.
   
2.    ఇంద్రా! మాతో యుద్దము చేయు శత్రువులను వధించుము. యుద్దము చేయు సేనల తలలు వంచి త్రిప్పిపంపుము. మమ్ము చుట్టుముట్ట దలచిన వారిని నికృష్ట అంధకారమున త్రోయుము.
   
3.    అసురుల మహా బలమున గెలిచిన ఇంద్రుని స్థూల, తరుణ, అప్రతిహత, ఏనుగు తొండము వంటి భుజ దండములను - యుద్దము సంభవించినంత - తొలుత ప్రయోగించండి.
   
                                 ఎనిమిదవ తృచ : ఋషి - అప్రతిరథుడు.
   
1.    రాజా! నీ శరీర మందలి మర్మ స్థానములను కవచముచే కప్పుచున్నాను. సోమరాజు నిన్ను అమృతమున ముంచును గాక. వరుణుడు నీకు మహా సుఖములు కలిగించును గాక. విజయుడవగు నీకు సమస్త దేవతలు ఆనందము కలిగింతురు గాక.
   
2.    శత్రువులరా! మీరు కుబుసము కప్పిన పాముల వలె అంధులు అగుదురు గాక. అగ్ని భస్మము చేయగా మిగిలిన వరిష్ట శత్రువులను ఇంద్రుడు పరిమార్చును గాక.
   
3.    మా విషయమున అభిమానము లేని బంధువులను చాటున ఉండి దూరము నుంచి హింసించు వారిని సకల దేవతలు నష్టపరతురు గాక. మాత్రమే నాకు బాణముల నుండి రక్షించు కవచము అగుచున్నది. కళ్యాణమయ కవచము నాకు రక్షణ అగును గాత.
   
                              తొమ్మిదవ తృచ : ఋషి - అప్రతిహతుడు.
   
1.    ఇంద్రా! నీవు గుహమందలి హింసక సింహము వంటి భయంకరుడవు. దూరము నుంచి ద్యులోకము నుండి విచ్చేయుము. వచ్చి దూరమునకు చేరు, తీక్ష్ణ వజ్రముచే మా శత్రువులను బాదుము. యుద్దమునకు సిద్దమగు వైర్ని నష్టపరచుము.
   
2.    భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యే మాక్షిభిర్యజత్రాః |
    స్థిరైరజ్గైస్తు ష్టువాం సస్తమా భిర్వ్యశే మహి దేవహితం యదాయుః ||

   
    యజించబడు దేవతలారా! మేము చెవులతో శుభములనే విందుము గాక. కనులతో శుభములనే కాంచుదుము గాక. స్థిరమగు అవయవములు దేహములు కలిగి నిన్ను స్తుతించుచు దేవతలు నిర్ణయించిన ఆయువును పొందుదుము గాక.
   
    (యదాయుః షోడశాధికశత ప్రమాణం వింశతాధిక శతప్రమాణం నా దేవాయుః" అని సాయణుని వ్యాఖ్య. దేవతలు నరులకు ఇచ్చిన ఆయువు నూట పదహారు లేక నూట ఇరువది సంవత్సరములు. అందుకే భారతీయులు సంపూర్ణ ఆయువులో సగమగు షష్టిపూర్తి జరుపుకొనుచున్నారు. పాశ్చాత్యులకు తెలిసిన పరిపూర్ణ ఆయువు నూరు సంవత్సరములు. అందుకే వారు HALF WAY అని అర్ధ శతాబ్ది ఉత్సవము జరుపు కొనుచున్నారు.)
   
3.    స్వస్తిన ఇన్ద్రో వృద్ద శ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః |
    స్వస్తి నస్తార్ధ్వో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతి ర్దధాతు ||

   
    ఇంద్రుడు బహుస్తుతులవాడు. అతడు మాకు అక్షయ శుభములు కలిగించును గాక. సర్వజ్ఞాని యగు పూషా మాకు అక్షయ శుభములు కలిగించును గాక. తిరుగులేని ఆయుధముల గరుత్మంతుడు మాకు అక్షయ శుభములు కలిగించును గాక. మహా మహా దేవతలకు ప్రభువు అగువాడు మాకు అక్షయ శుభములు కలిగించును గాక.
   
    ("బృహస్పతిః బృహతాం దేవానాం పతిః" అని సాయాణాచార్యులు.)
   
           విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటక కర్త, బాలసాహిత్య  కారుడు,  విమర్శకుడు, సినీ రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య  సమరయోధుడు, ప్రగతి పథగామి, ప్రసన్నుడు, శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత, శుక్ల యజుర్వేద సంహిత, కృష్ణ యజుర్వేద సంహిత, శ్రీమద్రామాయణ శ్రీమహాభారత  శ్రీమద్భాగవతాద్యనేక గ్రంథకర్తయునగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన  సామవేద సంహిత సమాప్తము.
   
   
   
    సర్వేభవన్తు సుఖినః             -    అందరు సుఖింతురు గాత.
    సర్వేసన్తు నిరామయాః         -    అందరు రోగ రహితులు అగుదురు గాత.
    సర్వేభద్రాణి పశ్యన్తు             -    అందరు శుభములనే చూచెదరు గాత.
    నాకశ్చిద్దుఃఖ భాగ్భవేత్        -     ఏ ఒక్కడు దుఃఖభాజనుడు కాకుండును గాత.
   
   
    28-2-97
    శుక్రవారం.
   
   
                                                   తథాస్తు




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.