Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    చూడమ్మ అమ్మమ్మ - అత్తయ్య నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ముఖానికి సబ్బు - పౌడరు వేస్తున్నారు. తినడానికి మంచి మంచి పదార్థాలు పెడ్తున్నారు. మంచి ముచ్చట్లు, కథలు చెప్పుతున్నారు. సింగరమ్మను చేసుకొమ్మని రోజూ కమ్మగా బోధిస్తున్నారు. సింగరమ్మంటే సికిందరాబాదు పిల్ల. వారు నన్ను మహారాజును చూసినట్లు చూస్తున్నారు.

 

    అమ్మా, నాయనా ఇద్దరు వప్పుకోకున్నా - నా ఇష్టంతో నన్ను ఎత్తుకుపోయి పెళ్లి చేయాలని పథకం.

 

    రోజులు దొర్లిపోతున్నాయి. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. ముహూర్తం దగ్గర పడుతున్నది.

 

    ఒక రోజు మామయ్య వచ్చి సాష్టాంగ పడ్డాడు. కాళ్లు వదల్లేదు. ప్రాయోపవేశం చేస్తున్నానన్నాడు. "లాభం లేదురా, నీ నక్క వినయాలు, నా దగ్గర చెల్లవు" అన్నారు నాయన. "బావగారూ! నా మాట వినండి. రెండు వందల పదహార్లు ఇస్తాం. మంగళసూత్రం కూడా మాది. మిమ్ములను పైసా అడగం. కర్చులన్నీ మావే. పిల్లకు పెట్టాల్సిన బంగారం విషయం పట్టుపట్టం. యాదగిరి గుట్టలో ముహూర్తానికే పెళ్లి చేస్తాం. పెళ్లి పీటల మీద నేనూ - మా ఆవిడ కూర్చుంటాం" అని కొంత ముట్ట చెప్పినట్లున్నారు. "బావగారూ! రంగణ్ణి మాకు వప్పగించండి. మిగతా కథ నేను నడిపిస్తాను. ముందు 'ఊఁ' అనండి, చాలు" అని ప్రార్థించాడు.  

 

    నాయన మెత్తపడ్డారు. "అరే, సాధించావురా! ఊఁ అనేటట్లు చేశావు. అయితే ఈ విషయంలో నాకేమీ తెలియనట్లే! మీ అక్కా నువ్వు కథ నడిపించుకోండి. నన్ను రంగంలోకి దింపవద్దు. ఈ విషయం నాకేమీ తెలియదు. తెలియదు. తెలియదు. ముమ్మాటికి గుర్తించుకో" అన్నారు. లేచి వెళ్లిపోయారు.   

 

    మామయ్య - అత్తయ్య సంబరానికి అంతులేదు. తనకు స్వతంత్రం వచ్చినందుకు అమ్మకూడా మురిసిపోయింది. అమ్మ "రంగడూ! మామయ్య చెప్పినట్లు చెయ్యి. వాండ్లు మనకు కావలసిన వాండ్లు" అన్నది. తొలిసారి అమ్మ సంబర పడడం చూశాను. అమ్మకు నచ్చిన పని చేస్తున్నందుకు నాకూ ఎంతో సంతోషం కలిగింది.

 

    నాకు సంతోషం కలగటానికి - చిన్నతనం నుంచీ నాకు ఇష్టమయిన సింగరమ్మత్తయ్యను సంతోషపెట్టడం - సికిందరాబాదు, హైదరాబాదు - చార్మినార్ వగైరాలు చూడడం. అయితే, నాకు ఆనాడు కలిగిన భావాల్లో పెళ్లికి సంబంధించినవి లేశమాత్రం లేవు.

 

    నేను ముందు పెళ్లి వద్దనుకున్నాను. తరువాత అన్నయ్యను చూచి ఈర్ష్యపడ్డాను. ఇప్పుడు ఒకరి సంబరం కోసం స్వచ్ఛందంగా వప్పుకున్నాను. మనిషి మనసు కుప్పిగంతులు వేస్తుంది!

 

    ఒకనాడు నాకు తలంటి పోశారు. అమ్మా, నేనూ అమ్మమ్మ ఇంటికి వెళ్లాం. అక్కడ నాకు అత్తరు రాసి, పన్నీరు చల్లి, తాంబూలం ఇచ్చి, జరీ కండువా - ఉంగరం పెట్టారు. అవి తీసుకొని ఇంటికి వచ్చాం. నాయన వాటిని తీసుకున్నారు దాచిపెట్టారు.

 

    పెళ్లికి తరలిపోయే రోజు వచ్చింది. తెల్లవారి అన్నయ్యను తీసుకొని అంతా వెళ్తారు. ఆ సాయంకాలం అమ్మ నన్ను దొడ్లోకి తీసికెళ్లింది. నేరేడు చెట్టు కింద కంటతడి పెట్టింది. కంటతడి పెడ్తే నేను వెళ్లను అన్నాను. "అది కాదురా, నేను మీ అమ్మను. నన్ను నీ పెండ్లి చూడకుండ చేసిన్రు. పీటలమీద కూచునే అదృష్టం లేకుండ చేసిన్రు. నిన్ను వాళ్లకు పట్టించే కర్మ పట్టించిన్రు. మాకు తెలియకుండ మామయ్య నిన్ను ఎత్తుకు పోతున్నడు. ఇక ఏడుపు రాక ఏమైతదిరా?" అని కుమిలి కుమిలి ఏడ్చింది. ఈ విషయం ఇంట్లో ఉన్న బంధువులకు తెలియరాదు!

 

    అమ్మ తానే ఏడుపు మానింది. కొంగుతో కళ్లు తుడుచుకున్నది. దొడ్డి దారిన నన్ను అమ్మమ్మ ఇంటికి తీసికెళ్లింది. "రాములూ - సింగమ్మా! నా కొడుకును మీ చేతుల్లో పెడ్తున్న. మీరే రంగనికి తల్లిదండ్రులు" అని పెద్దగా ఏడ్చింది. నాకూ ఏడుపు వచ్చింది. ఏడ్చాను. అమ్మ నన్ను సమాధానపరచింది. వాళ్లు అమ్మను సమాధానపరిచారు. మామయ్య అమ్మను దొడ్డి దర్వాజవరకూ పంపించి వచ్చాడు.  

 

    `మామయ్య, అత్తయ్య నన్ను తీసుకొని స్టేషను చేరారు. చీకటి పడింతరువాత రైలెక్కాం. తెల్లవారి సికిందరాబాదులో దిగాం. సికిందరాబాదు ముందు బెజవాడ పల్లెలా కనిపించింది. టాంగాలో జేమ్స్ స్ట్రేట్ - ఇత్తడి బొమ్మ దగ్గరి నారాయణాచార్యులవారి ఇంటిముందు దిగాం. నాకు ఘన స్వాగతం లభించింది.

 

    పట్టుగౌను తొడిగిన ఏడేళ్ల పెళ్లిపిల్ల నన్ను చూచి తుర్రుమన్నది. మెరుపులా మాయం అయింది. ఆ పిల్ల - సింగమ్మ - నేను కనిపించగానే చాటున నక్కేది. అందీ అందనట్లుండేవి!

 

    అత్తవారింట్లో - ఇప్పుడది నిశ్చయంగా అత్తవారిల్లు - నాకు రాజోపచారాలు జరిగాయి. ఎర్రరంగు ఉన్న కోటు - పాంటు - కమీజు కుట్టించారు. నేను దర్జీ దగ్గరినుంచి కదల్లేదు. నాకు తొలిసారి బూట్లు - టైకూడా కొనిపెట్టారు.

 

    అక్కడ నాకు ఎలాంటి లోటు లేదు. కావలసినవాటికి మించి ఉన్నాయి. అయినా అమ్మ గుర్తుకు వచ్చేది. నాయన - అన్నయ్య - అన్నయ్య పెళ్లి తలపుకు వచ్చేవి. బాధ కలిగేది. కాని అమ్మ చెప్పింది - బయటపడనిచ్చేవాణ్ణి కాను.  

        

    సికిందరాబాదు బ్రిటిషువారి పాలనలో ఉండింది. అక్కడ శారద యాక్టు - బాల్య వివాహ నిషేధ చట్టం - అమల్లో ఉంది. పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా జరగాలి.

 

    పెళ్లిరోజు వచ్చింది. తలంట్లూ వగైరాలు జరిగాయి. పీటలమీద కూర్చున్నాం. అమ్మా - నాయన స్థానంలో రామంచార్ల మామ, సింగరమ్మత్తయ్య కూర్చున్నారు. మంత్రాలు - బాజాలు - బంధువులు సందడిగానే ఉంది. అట్టహాసం లేదు.

 

    మంగళసూత్రం నాచేతి కిచ్చారు. పెళ్లిపిల్ల సింగరమ్మకు కట్టమన్నారు. నేను కట్టబోయాను. ఆమె ఏడ్చింది. అత్తగారు ఊరడించారు. ఆమె తలవంచింది. అత్తగారు ఆమె జడ ఎత్తి పట్టుకున్నారు. మంగళవాద్యాల మధ్య నేను సింగరమ్మ మెడలో మంగళసూత్రం కట్టాను. మూడు ముళ్లు వేశాను.

 

    సరిగ్గా ఆ సమయానికి బయట పోలీసు వచ్చాడు. అందుకుగాను ఏర్పాటు చేసిన వ్యక్తి సత్యనారాయణ వ్రతం అని ఏదో ముట్టచెప్పిపంపాడు.

 

    దంపతులం - అప్పుడు దంపతులం అయ్యాం కదా - చాల హుషారుగా పోటీలు పడి తలంబ్రాలు పోసుకున్నాం. చెంబులో ఉంగరాన్ని పట్టి పట్టి తీశాం. మా ఇద్దరినీ చెరొకరు ఎత్తుకొని - వాద్యానికి తాళబద్దంగా అడుగులేస్తూ డేగాట ఆడారు. మేమిద్దరం ఒకరిమీద ఒకరం పంతంగట్టి బుక్కాగులాలు చల్లుకున్నాం. మేం రంగురంగులయినాం.

 

    వెండి పళ్లేలు - వెండి గిన్నెల్లో రకరకాల వంటకాల భోజనాలు. నా పళ్లెంలోవి ఆమె పళ్లెంలో వేశాను. ఆమె నా పళ్లెంలో వేసింది. రాత్రిపూట లైట్ల వెలుగులో పూబంతులు ఆడించారు. ఆ విధంగా అక్కడ ఉన్నన్ని వెలుగులో పూబంతులు ఆడించారు. ఆ విధంగా అక్కడ ఉన్నన్ని సాయంకాలాలు ఆడించారు. 

 

    ఆ రోజుల్లో పెళ్లిళ్లు అయిదురోజులు జరిగేవి. బహుశః ఒక్కరోజు జరిగిన పెళ్లి నాదే మొదటిదేమో! ఎంచాతంటే  - నాది అన్ని విధాల దొంగపెళ్లి కదా!

 

    నాయన వచ్చింది డబ్బుకోసం. నాకు పెట్టిన బట్టలు వగైరాల బాబతు మినహాయించుకొని ఇస్తామంటారు మామగారి వాళ్లు. మొత్తం కావాలంటారు నాయన. నాయన తమ పంతం నెగ్గించుకున్నారు. డబ్బు మూట కట్టుకొని వెళ్లిపోయారు.

 

    భక్తలాపురం వాళ్లు బండ్లమీద సమస్త సామాగ్రి సహితంగా పెళ్లి పిల్లను చేసుకుని గుట్టమీద దిగారు. ఆ స్థితిలో పెళ్లి తప్పిపోయిన హృదయవిదారకస్థితిని ఊహించవలసిందే! వాళ్లు పెళ్లి పందింట్లో మన్నులూ - దుమ్ములూ పోశారు. శాపనార్థాలు పెట్టారు. కనీసం భోజనాలు చేయకుండా అవే బండ్లలో వెళ్లిపోయారు!

 

    నాయన చెప్పిన ప్రకారం మేము రైలెక్కాం. అత్తవారి పక్షాన మామగారి తమ్ములు అళహసింగరాచార్యులవారు వచ్చారు. వంగపల్లిలో ఆ పెళ్ళి వాళ్లు మా పెట్టెలోనే ఎక్కారు. వదినను తొలిసారి చూచాను. అన్నయ్య ఎన్నికను మెచ్చాను. వదిన మంచిది. నాకోసం ప్రత్యేకంగా లడ్డూలు తెచ్చి పెట్టింది! అమ్మ మా ఇద్దరినీ దగ్గరికీ తీసుకుంది. ఇరుపక్కల కూర్చుండపెట్టుకున్నది. కంటతడి పెట్టింది!

 

    ఖమ్మంలో దిగాం. మమ్ములను అమ్మమ్మ ఇంట్లో దింపారు. మావాళ్లు మా ఇంటికి చేరారు. ఆ రాత్రి ఊరేగింపు. మా నలుగురినీ టాపులేని కారులో కూర్చుండ పెట్టారు. ముందు బాజాలు - పక్కన పెట్రోమాక్సు లైట్లు - మా వాళ్లు - మెల్లగా సాగుతున్నాం. సరిగ్గా తాసిల్దారు ఇంటిముందు కారు మొరాయించింది. బిసచెడింది - బాగుచేయడం కోసం ఆగింది.

 

    తురక తాసిల్దారు బయటికి వచ్చాడు. కారులో మమ్ములను చూచాడు. "క్యాహై" అడిగాడు. "షాదీహై" చెప్పారు.

 

    "బచ్చోఁ కా ఖేల్ దిఖ్తాహై" పిల్లల ఆటలా కనిపిస్తూంది అన్నాడు. సర్వయ్యసార వగైరాలు అతనికి సవినయంగా వివరించారు. "అచ్ఛా, అయిసాహైతో ఠైరో" అని లోనికి వెళ్లాడు. కారు బాగయింది. కదలడానికి లేదు.

 

    తాసిల్దారు బేగం సహితంగా మిఠాయీలు వగైరా తెచ్చాడు. "బచ్చే అచ్ఛె లగై హైఁ" పిల్లలు బాగనిపిస్తున్నారు అని భార్యకు చూపాడు. మిఠాయీలు వగైరా మాకు ఇచ్చాడు. సాగిపోయేవరకూ నుంచుని చూశారు.

 

    ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. పాలకులు ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థం అవుతుంది. ప్రజల ఆచార వ్యవహారాలు కూడా వారికి తెలియవు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.