Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పందొమ్మిదవ అధ్యాయము
మొదటి ఖండము
తొలి తృచ : ఋషి - విరూపుడు.
అగ్నిఃప్రత్నేన జన్మనా శూమ్భానస్తన్వాం స్వామ్ |
కవిర్విప్రేణ వావృధే ||
1. అగ్ని అనుభవజ్ఞుడు. సనాతన స్తోత్రములచే శోభయమానుడు అగుచున్నాడు. విప్రులచే వర్ధిల్ల చేయబడుచున్నాడు.
2. అన్నములకు పుత్రుడు, పావకుడు, దీప్తి మంతుడగు అగ్నిని స్వధ్వరమగు ఈ యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాను.
3. అగ్నిదేవా! నీవు మిత్రులచే పూజించబడువాడవు. జ్వాలలచే ప్రకాశించువాడవై దేవతలతో కూడి ఈ యజ్ఞమునకు విచ్చేయుము.
రెండవ తృచ : ఋషి - అవత్సారుడు.
1. రాతితో నలిగిన సోమమా! నీ వేగమున రాక్షసులను చిందర వందర చేసి నిలుచుచున్నావు. బాధించు శత్రువులను పీడించుము.
2. సోమమా! నీ బలము అపారము. నీవు శత్రువులకు నష్టము కలిగించుచున్నావు. అందువలన నేను భయము లేకున్నాను. శత్రునాశమునకు రథములతో సిద్దపడినాము. ధనము కొరకు స్తుతించుచున్నాను.
3. పవమాన సోమాపు వ్రతములకు ఆటంకము కలిగించువాడులేడు. సోమమా! నిన్ను ఎదిరించు శత్రువులను బాధల పాలు చేయుము.
4. సోమము హర్షదాయకము. పాపహారి. బలయుక్త. మదకారి. ఆ సోమమును ఇంద్రుని కొరకని జలములందు చేర్చుచున్నారు.
మూడవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
1. ఇంద్రా! నీ అశ్వములు ఆనంద దాయకములు. నెమలి పించము వంటి రోమములు కలవి. పాపహారులు అట్టి అశ్వములు గల నీవు యజ్ఞమునకు విచ్చేయుము. వేటగాడు త్రాళ్ళచే పక్షులను నిలిపినట్లు నిన్ను ఎవరును నిలుప కుందురు గాత. ఎడారిని దాటినట్లు వారిని ఉల్లంఘించి వెంటనే విచ్చేయుము.
2. ఇంద్రుడు వృత్రహంత. మేఘ విదీర్ణుడు. శత్రుపుర ధ్వంసి. జల ప్రేరకుడు. హర్యశ్వ రథమున ఆసీనుడగువాడు. బలవంతులగు శత్రువులను సహితము పరిమార్చువాడు.
3. ఇంద్రదేవా! నీవు గభీర సముద్రములను జలములచే పుష్టి కలిగించినట్లు యజ్ఞములకు పుష్టి కలిగించుచున్నావు. మంచి గోపాలుర వలన గోవులకు తృణాదికములు లభించినట్లు నీకు సోమము లభించుచున్నది. కుల్యములకు జలమువలె సోమము నీకు అందుచున్నది.
నాలుగవ తృచ : ఋషి - దేవాతిథి.
1. ఇంద్రా! గౌరమృగము దప్పి గొన్నపుడు జలాశయము వైపు వెళ్ళినట్లు మైత్రిగల నీవు మావద్దకు వెంటనే విచ్చేయుము. కణ్వులమగు మేము సిద్దము చేసిన సోమమును త్రాగుము.
2. మఘవ ఇంద్రా! సోమాభిషవన కర్తలకు ధనము ప్రసాదించునట్లు నిన్ను సోమము ప్రసన్నుని చేయును గాత. మిత్రావరుణు జలముచే సంస్కరించిన సోమమును బలవంతముగా గుంజుకొని పానము చేయుచున్నావు. అందువలననే నీవు మహా బలశాలివని కీర్తించబడుచున్నావు.
ఐదవ తృచ : ఋషి - గోతముడు.
1. బలశాలి ఇంద్రా! దీప్యమానుడవగు నీవు మానవస్తోతలను ప్రశంసించుచున్నావు. ధనశాలి ఇంద్రా! నీవు తప్ప సుఖదాత లేడు. బ్రవీమి తే వచః - కావున నిన్నే కీర్తించుచున్నాను.
2. వ్యాపక ఇంద్రా! నీ భూతము మమ్ము ఎప్పటికి నష్ట పరచకుండును గాత. నీ వాయువులు మమ్ము నష్టపరచకుండును గాత. మేము మంత్రద్రష్టలము. మాకు సంస్థ ధనములు తెచ్చిఇమ్ము.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - పురుమీఢుడు లేక అజామీఢుడు.
1. ప్రాణులకు ప్రేరణ కలిగించు, ఫలములు కలిగించు, తన సోదరి రాత్రి తిమిరములను ధ్వంసము చేయు ఉషస్సు అందరకు దర్శనము ఇచ్చుచున్నది.
2. అశ్వము వలె విచిత్ర వర్ణ, దీప్యమాన, కిరణ కారిణి, యజ్ఞవంత ఉష అశ్వినులతో కూడి స్తుతివంత అయినది.
3. ఉషాకుమారీ! నీవు అశ్వినీ కుమారుల సహచరివి. "ఉత మాతా గవా మసి" ఇంకను కిరణములకు తల్లి వంటిదానవు. మరి ధనములకు స్వామివి అగుచున్నావు.
రెండవ తృచ : ఋషి - ప్రస్కణ్వుడు.
1. ఈమె ఉష. దృశ్యమాన. ప్రియతమ. రాత్రి చివరన అవతరించునది. దివినుండి దిగి చీకట్లను దూరము చేయుచున్నది.
అశ్వినులారా! మిమ్ము మరింతగా స్తుతించుచున్నాను.
2. అశ్వినులు దేవతలు దర్శనీయులు సముద్రమున ఆవిర్భవించిన వారు. ధనములను మనసా ఇచ్చువారు. కర్మ చేసి దానములను ఇచ్చువారలు అగుచున్నారు.
3. అశ్వినులారా! మీ రథము అస్త్ర శస్త్ర సహితమై ప్రశంసనీయ స్వర్గమునకు అశ్వసహితమై చేరినపుడు స్తుతించబడుచున్నది. స్తుతులు మిమ్ము చేరుచున్నవి.
మూడవ తృచ : ఋషి - గోతముడు.
1. ఉషోదేవీ! నీవు అన్నయుక్తవు. మేము పుత్రపౌత్రులను పోషించదగిన విచిత్ర ధనమును అందించుము.
2. గోమతి, అశ్వవతి, సూనృతవతి, విభావరి ఉషా! మేము కర్మలు చేసుకొనుటకు చీకట్లను పోగొట్టుము.
3. అన్నవతి ఉషా! అరుణాశ్వములను రథమునకు కట్టుము. "అథానో విశ్వా సౌభాగ్యా న్యావహ" ఇక మాకు సకల సౌభాగ్యములను తెచ్చి ఇమ్ము.
నాలుగవ తృచ : ఋషి - గోతముడు.
1. అశ్వినులారా! మీరు శత్రుధ్వంసకులు. మా ఇంటికి విచ్చేయండి. గోవులు, హిరణ్యముతో కూడిన రథమును - సమమనస్కులై - మా ముందునకు తెచ్చి నిలుపండి.
2. అశ్వినులు శత్రునాశకులు. ఉపాసకులకు ఆరోగ్య ప్రదులు. సుఖప్రదులు. వారి అశ్వములు వేకువనే మేల్కొనునవి. అవి బంగారు రథమునకు తగులవలెను. వారిని సోమపానమునకు తీసికొని రావలెను.
3. అశ్వినులారా! మీరు ద్యులోకము నుండి ప్రశంసనీయ తేజస్సును తెండి. దానిని మాకు ఉపయోగ కరము చేయండి. మాకు బలము కలిగించు అన్నము ప్రసాదించండి.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - వసుశ్రుతుడు.
1. సర్వత్ర వ్యాపక అగ్నిని - ఆశ్రయ భూతమై ధేనువులకు తృప్తి కలిగించు అగ్నిని ఆశ్రయభూతమై శీఘ్రగామి అశ్వములను కలిగించు అగ్నిని - యజ్ఞకర్తలు ఆశ్రయించు అగ్నిని స్తుతించుచున్నాను.
అగ్నీ! స్తోతలమగు మాకు అన్నము తెచ్చి ఇమ్ము. "ఇషం స్తోతృభ్య ఆ భర"
2. అగ్ని మాత్రమే జనులకు అన్నము నిచ్చు చున్నాడు. అగ్నిని సమస్త జనులు అర్చించుచున్నారు. అట్టి అగ్ని ప్రసన్నుడు అయినాడు. అగ్ని సర్వత్ర వ్యాప్తము. సర్వ ప్రార్ధనీయమగు ధనమును ఇచ్చుటకు వచ్చినాడు.
"ఇషం స్తోతృభ్య ఆభర"
3. అతడు అగ్ని అగ్ని వ్యాపకుడు. స్తుత్యుడు అగ్నిని ధేనువులు యజ్ఞమునకు చేర్చుచున్నవి. అశ్వములు మెల్లమెల్లగా చేర్చుచున్నవి. సద్వంశజ విద్వాంసులు చేర్చుచున్నారు.
"ఇషం స్తోతృభ్య ఆభర"
రెండవ తృచ : ఋషి - సత్యశ్రవుడు / వత్సుడు.
1. ఉషా! నీవు దీప్తిమతివి. మాకు ధనము కలిగించుటకు నేడు పూర్వము వలెనే వెలుగులు ప్రసాదించుము. నీవు మంచి జన్మ కలదానవు. సత్యప్రియ వాణివి. వయ్యపుత్రుడను సత్యశ్రవుడనగు నన్ను అనుగ్రహించుము.
2. సూర్య పుత్రి ఉషా! శుచద్రథ పుత్రుడగు సునీథుని అంధకారమును దూరము చేయుము. నీవు సుజతహవు. సూనృత వాణివి. వయ్య పుత్రుడను సత్యశ్రవుడనగు నన్ను అనుగ్రహించుము.
3. ద్యులోక పుత్రీ - ఉషా! నీవు ఎంతో బలవంతవు. ధనదాత్రివి. నీవు పూర్వము అంధకారమును దూరము చేసినావు కదా! అట్లే నేడు మాకొరకని అంధకారమును దూరము చేయుము.
ఉషోదేవీ! నీవు సుజాతవు. సత్యవాణివి. నేను వయ్య పుత్రుడను. సత్యశ్రవుడను. నన్ను అనుగ్రహించుము.
మూడవ తృచ : ఋషి - అవస్యుడు.
1. అశ్వినులారా! మీరు ఫలప్రదాతలు. ధనమును అందించువారు. పరమ ప్రియమగు మీ రథమును ఋషులగు స్తోతలు స్తుతులచే శోభిల్ల చేయుచున్నారు.
"మాధ్వీ మమ శృతం హవమ్" మధు విద్యా విశారదులారా! మా ఆహ్వానమును ఆలకించండి.
2. అశ్వినులారా! మీరు శత్రునాశకులు. బంగారు రథముల వారు. శ్రేష్ఠ ధనవంతులు. నదులను ప్రవహింప చేయువారు. నన్ను సమస్త శత్రు తిరస్కర్తను చేయండి.
"మాధ్వీ మమ శృతం హవమ్"
3. అశ్వినులారా! మీరు ఉగ్రులు. హిరణ్మయ రథవంతులు. అన్న, ధనవంతులు. యజ్ఞమును సేవించుచు విచ్చేయండి.
"మాధ్వీ మమ శృతం హవమ్"
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - బుధుడు లేక గవిష్టురుడు.
1. ప్రాతః కాలమున - పాలిచ్చు ఆవు వలె - అగ్ని జనుల సమిధలచే సచేతనుడు అగుచున్నాడు. ఉషః కాలము తీరునపుడు అట్టి అగ్ని కిరణములు - మహా వృక్షపు శాఖల వలె - అంతరిక్షమున వ్యాపించుచున్నవి.
2. హోతయగు అగ్ని దేవతలను యజించుటకు సచేతనుడు అయినాడు. సుమనస్కుడై పైకి ఎదుగుచున్నాడు. ప్రజ్వలిత, ప్రకాశమాన జ్వాలారూప అగ్ని తన బలమును కనబరచుచున్నాడు. "మహాం దేవస్తమసో విరమోచి" ఆ మహాదేవత తమస్సు నుండి ముక్తి కలిగించినాడు.
3. చీకట్ల త్రాళ్ళచే కట్టిన ఈ లోకమును ఈ మహాగ్ని విడిపించి తన కిరణములచే ప్రకాశింప చేయుచున్నాడు. తదుపరి ఘ్రుతధారలు జుహువునందు చేరి ఎగయుచున్నవి. అట్లు ఎగిసిన ఘ్రుత ధారలను ఆ మహాగ్ని సేవించుచున్నాడు.
రెండవ తృచ : ఋషి - కుత్సుడు.
1. "ఇదం శ్రేష్ఠం జ్యోతిషాం జ్యోతిః" ఈ ఉషస్సు వెలుగొందు గ్రహ నక్షత్రాదులన్నింటిలో శ్రేష్టము. అదిగో ఆ ఉషస్సు తూర్పున ఉదయించినది! సూర్యుని వలన కలిగిన రాత్రి ఉషస్సుకు కారణమైనట్లు దీని కిరణములు సమస్తమునకు వెలుగు నిచ్చుచున్నవి.
2. ఉష దీప్త. శ్వేతవర్ణ ఆమె తనకు పూర్వ రూపమగు రాత్రినుండి వెలువడినది. ఉషారాత్రులు సమాన బంధువులు. అమృత స్వరూపలు. అవి ఒకదాని తరువాత ఒకటిగా ఆవిర్భవించునవి. ఒకటి మరొక దానికి తావిచ్చుచు ఆకసమున సంచరించుచున్నవి.
(ఉషా, రాత్రులు సూర్యుని వలెనే కలుగుచున్నవి. కావున 'సమాన బన్దువులగు చున్నవి.)
3. ఉషా రాత్రులు అక్క చెల్లెండ్రు. వారిది ఒకే ఆకాశమార్గము. వారు అనంతలు. సూర్యునిచే శిక్షణ పొంది వారు ఆ మార్గమున సంచరించుచున్నారు. ఉషారాత్రులు అనన్యలు. స్పర్ధించరు. కలసి ఉండరు.
మూడవ తృచ : ఋషి - అత్రి.
1. ఉషస్సుల ముఖస్వరూప అగ్ని అవతరించినాడు. విప్రుల దేవతాస్తుతులు ఉదయించుచున్నవి. రథములు గల అశ్వినులారా! నేడు మాకు ప్రత్యక్షము కండి. పరిపూర్ణ యజ్ఞమునకు విచ్చేయండి.
2. అశ్వినులారా! సంస్కారమును, సంప్రదాయమును చెరపకండి. ఈ యజ్ఞమునకు విచ్చేయండి. స్తుతులను స్వీకరించండి. ప్రాణము పోవు వానికి అన్నము దొరికినట్లు ప్రాతః కాలమున వచ్చుచున్నారు. హవి అర్పించు వారికి సుఖములు కలిగించుచున్నారు.
3. అశ్వినులారా! ఉదయించు ప్రాతః సంధ్యలందు, మండుచుండు మధ్యాహ్నములందు, క్రుంగుచుండు అపరాహ్నములందు, రాత్రులందును మాకు సుఖములు కలిగించి, మమ్ము రక్షించుటకు విచ్చేయండి. ఇప్పుడు ఇతర దేవతలతో సమానముగా సోమపానము చేయండి.
అయిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - గోతముడు.
1. ఇవి ఉషస్సులు. చీకట్లు నిండిన లోకమున వెలుగులు నింపుచున్నవి. భూమి పూర్వార్దమును ప్రకాశింప చేయుచున్నవి. సంస్కరించునట్టియు, సంచరించునట్టియు, మాతృమూర్తులగు ఉషస్సులు నిత్యము అవతరించుచున్నవి. రక్షించుచున్నవి.
2. అరుణకాంతుల ఉషస్సులు అనాయాసముగ ఉదయించుచున్నవి. సులభముగ రథమునకు కూర్చగల వృషభముల వంటి తెలుపు వెలుగులను రథమునకు పూన్చి ఉషస్సులు జనులకు తెలివి కలిగించుచున్నవి. తదుపరి అరుణ ఉషస్సులు శ్వేతవర్ణ సూర్యునిలో లీనమగుచున్నవి.
3. సత్కర్మలు చేయువారికీ, మంచిదాతలకు, అభిషవించు యజమానులకు ఉషస్సులు సమస్త అన్నములు కలిగించుచున్నవి. ప్రేరణ కలిగించు ఉషస్సులు తమ కాంతులచే సమస్త ఆకాశమును యుద్దమున వ్యాపించు వీరుని వలె - వ్యాపించుచున్నవి.
రెండవ తృచ : ఋషి - దీర్ఘతముడు.
1. అగ్ని స్థాపితుడై ప్రజ్వరిల్లినాడు. సూర్యుడు ఉదయించినాడు. మహా ఉషస్సు చీకట్లను తరిమినది. అశ్వినులారా! అశ్వములను రథమునకు కట్టండి.
ప్రాసావీద్దీవః సవితా జగత్పృథక్ - సవితా దేవత విశ్వమును పనులకు పంపును గాక.
2. అశ్వినులారా! మీరు ఫలప్రదమగు మీ రథమును సిద్దపరచినపుడు మా బలమును ఘ్రుతమును వలె అమృతాయమానము చేయుచున్నారు. మా సంతానమునకు బ్రహ్మతేజము ప్రసాదించుడు. "వయం ధనా శూరసాతా భజా మహే" శూరులు చేయు యుద్దమున మేము ధనమును అనుభవింతుము గాక.
3. అశ్వినుల రథము మా ముందుకు వచ్చును గాక. ఆ రథము మూడు చక్రములది. అమృతము ధరించినది. వడి గల గుర్రములు చేరినది. మాచే స్తుతించబడినది. త్రిబంధుర. ధనవంతము. విశ్వసౌభాగ్య అది మా మనుషులకు, పశువులకు సుఖము కలిగించును గాత.
మూడవ తృచ : ఋషి - అవత్సారుడు.
1. సోమమా! దివి నుండి కురియు వర్షము వలె నీ నిరంతర ధారలు మాకు అపరిమిత అన్నమును ప్రసాదించుచున్నవి.
2. హరిత వర్ణ సోమము జగత్కళ్యాణ కార్యములను వీక్షించుచు, ఆయుధములు ధరించుచు అరుదెంచుచున్నది.
3. పవమాన సోమమా! ద్యులోక, భూలోకములందున్న సకల ధనములను మాకు తెచ్చి ఇమ్ము.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి పందొమ్మిదవ
అధ్యయము సమాప్తము.





