Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
వారింట్లో శ్రీముఖలో నారాయణాచార్యులు వారి ధర్మపత్ని - వారి మేనకోడలు ప్రసవించారు. ఆడపిల్లను కన్నారు. ఆ సందర్భంలో నాయన రత్నమాచార్యుల వారి ఇంటికి వెళ్లారు. బాలింతరాలు సీతమ్మగారు మా నాయనతో "నా బిడ్డను మీ కొడుక్కు చేసుకోండి" అన్నారు. నాయన ఉపాయంగా తప్పుకున్నారు. వాగ్దానం చేయలేదు కాని, విధి బలీయం అయింది. అలాగే జరిగింది. పెళ్లిళ్లు పైలోకంలో నిశ్చయం అవుతాయి అంటారు.
ఇది వద్దనుకున్నా జరిగింది. కాని - పుట్టినపుడే వరుణ్ణి నిశ్చయించడం - అనుకొన్న మాట ప్రకారం పెళ్లిళ్లు జరగడం సర్వసాధారణం. తొట్లెలకు బాసికాలు కట్టి పెళ్లిళ్లు చేశారు అనేవారు. కాని అది అవాస్తవం అనుకుంటా.
అలా నిశ్చయం అయినవారూ - మేనమామ - మేనత్తల పిల్లలూ బాల్యం నుంచే భార్యాభర్తలుగా పెరుగుతారు. అవే ఆటలు ఆడుకుంటారు. మగపిల్లలు తమ సహజ పురుషాధిక్యత కనబరుస్తారు. ఆడపిల్లలను మొట్టికాయలు వేస్తారు. అమ్మాయి ఏడ్చుకుంటూ తల్లితో "బావ కొట్టాడు" అని చెపుతుంది. 'బావే కదమ్మా, కొడ్తె మానేలే' అని తల్లి ఆనాటినుంచే మొగుని దెబ్బలు అలవాటు చేస్తుంది. ఆప్యాయతలూ ఉంటాయి. ఒకరికి పెట్టకుండా ఒకరు తినరు. ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు.
చినగూడురులో సీతతో నాకు అలాంటి పరిచయం. మేము వెళ్లిపోయింతరవాత ఆమే మరొకరికి దక్కింది. ఆమెకు పెళ్లయింది. పిల్లలు లేరు. ఆరవ దశకంలో ఆమెను కేన్సరు ఆస్పత్రిలో చూచాను. కళ్లనిండా నీళ్లతో "బావా! నువ్వు చేసుకుంటె ఇట్ల జరిగేది కాదు" అన్నది. నాకూ గుండెనీరయింది. కళ్లల్లోకి రానీయలేదు. సీత చేయి నా చేతిలోకి తీసుకొని "ఛీ! ఏమిటా కన్నీరు" అని తుడిచి, "ఎందుకా అధైర్యం! నువ్వు బాగవుతావు. నీకు పిల్లలు కలుగుతారు" అని ఉత్తుత్తి ధైర్యం చెప్పాను. నా మాటలకే సీత మురిసిపోయింది.
మాటకే కదా మనిషి తపించేది!
సీత వెళ్లిపోయింది. అది భరించలేక ఆమె భర్తా వెళ్లిపోయాడు!
సీతది అంత అనురాగం!
సీత కథ - బాల్యం నాటిది; "తామరపూవులు" కథలో చెప్పాను.
మా అన్నయ్యకు పదిహేనేళ్లు వచ్చాయి. వచ్చే సంవత్సరం మెట్రిక్ పెళ్లిప్రయత్నాలు ప్రారంభం అయినాయి. పిల్ల పుట్టగానే అనుకున్న సంబంధాన్నిగురించి రామాచార్లమామ నాయనతో ప్రస్తావించారు. నాయన అందుకు అనుకూలంగా స్పందించలేదు. ఇంకా చాలమంది వచ్చారు 'చూద్దాం' అని దాటవేశారు.
ఇంతమంది నా సంబంధానికి రావడానికి కారణం ఉంది. అప్పటికే మా వాళ్లు ఇంకా సంప్రదాయ విద్యను వదల్లేదు. అప్పటికి మా వాళ్లలో బహుశా మేమే "మ్లేచ్ఛవిద్య" చదువుతున్నాం. అంతేకాక, ఆస్తిపాస్తులు ఉండిన సంప్రదాయ కుటుంబం.
నాయన అన్నయ్య పెళ్లి విషయంలో అప్పటికి ఉన్న సంప్రదాయానికి భిన్నంగా నడిచారు. పెళ్లికి ముందు పిల్లలు చూసుకోవడం ఆనాటి ఆచారం కాదు. నాయన అన్నయ్య - నచ్చిన పిల్లను చేయాలనుకున్నారు. ఆడపిల్లల వాళ్లకు అదొక వింతగా విడ్డూరంగా తోచింది. చాలమంది అన్నయ్యకు తమ కూతుళ్లను చూపడానికి అంగీకరించలేదు. నాయన పట్టు వదల్లేదు. కొందరు చూపించారు. తుదకు యాదగిరిగుట్ట ఆస్థాన విద్వాంసులు నరసింహాచార్యులవారి కూతురు రామానుజమ్మను మా అన్నయ్య మెచ్చాడు. నాయన స్థిరపరచారు.
నాకు అప్పటికి పన్నెండేళ్లు. ఇవన్నీ సరదాగా వినేవాణ్ణి. అన్నయ్య అప్పటికే కవిత్వం వ్రాస్తున్నారు. ఎదిగిపోయాడు. నాతో అంత దగ్గరగా ఉండడం లేదు. అందువల్ల అన్నయ్య చెప్పేవాడు కాడు. నాయన చెప్పరు కదా! అమ్మ చెప్పేది. సింగరమ్మత్తయ్య చెప్పేది.
కట్నం పిశాచం అప్పుడప్పుడే అడుగు పెడ్తున్నది! కాలగతి విచిత్రం అయింది. అనతికాలంలోనే "కన్యాశుల్కం" వరవిక్రయం" అయింది. అన్నయ్యకు నూట పదహార్లు కట్నమూ లాంఛనాలు పెడ్తామన్నారు.
ఇది ఇలా ఉండగా అనుకోని మరో అధ్యాయం అవతరించింది. నాకు పిల్లనిస్తామని రావడం మొదలయింది. నాయన చూద్దాం అని దాటవేస్తున్నారు. భక్తలాపురం - వాళ్లు పట్టు బట్టారు. వాళ్లు చెప్పిన అంశాలు.
1. రెండు పెళ్లిళ్లూ ఒకేసారి చేయవచ్చు. వాళ్లుకూడా పెళ్లిపిల్ల లక్ష్మిని, యాదగిరిగుట్టకే తీసుకొని వస్తారు. నాయనకు ఒక పెళ్లి కర్చుతో రెండు పెళ్లిళ్ళూ జరుగుతాయి.
2. లక్ష్మి చిన్నపిల్ల, ఇప్పట్లో కాపురానికి రాదు. ఆమె భారం నాయనకు ఉండదు. పిల్లను ఇస్తారు కాబట్టి నా చదువు భారం కొంత వారు భరిస్తారు.
నాయన అంత సుముఖంగా లేరు. చిన్నవాడు, వాడికేం పెళ్లి అనే ధోరణిలో మాట్లాడారు. కాని, వాళ్లు వదల్లేదు. రోజూ వచ్చి నాయనను సతాయిస్తున్నారు. నాయన విసుక్కోవడం లేదు.
అన్నీ నాకు తెలుస్తున్నాయి. నేను గ్రహిస్తున్నాను. పెళ్లి తప్పిపోతే బావుండును అనుకుంటున్నాను. అమ్మ నిరాసక్తంగా ఉంది. అన్నయ్య సంబంధం విషయంలో ఆమె తెలుసుకున్నది కాని, ఆమెకు చెప్పలేదు. సంప్రదించడం పెద్ద పదం! నా పెళ్లి విషయం పట్టనట్లే ఉంది! ఆమెకు చెప్పుకున్నాను. "నేను ఎవ్వరిని కావాలె! నన్నెవ్వరు అడుగతరు?" అన్న ధోరణిలో మాట్లాడింది. సింగరమ్మత్తయ్యతో చెప్పాను. "పెళ్లి చేసుకోపిల్లగా, పిల్లతో ఆడుకోవచ్చు" అన్నది. నాకు సిగ్గనిపించింది.
వాళ్లు నిర్దిష్టం అయిన ప్రతిపాదనలతో వచ్చారు:
1. అన్నయ్యకు ఇచ్చినట్లే నూట పదహార్లు, లాంఛనాలు ఇస్తారు.
2. పిల్లకు పెట్టే బంగారం విషయంలో నాయన ఇష్టం. వాళ్లు అడగరు.
నాయన ఈమాట కోసమే ఎదిరి చూస్తున్నారు. మెత్తపడ్డారు. కాని, వెంటనే అంగీకరించలేదు. మూడు నాలుగు రోజుల తరువాత అంగీకరించారు. తాంబూలాలు పుచ్చుకున్నారు.
వాళ్లెవరు? అక్కడ పిల్ల ఎలాంటిది? ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? సంప్రదాయం ఏమిటి? ఏమీ ఆలోచించలేదు. పెళ్లికి వప్పుకున్నారు. నాకు అది ఏమాత్రం బాగనిపించలేదు. అన్నయ్యమీద ఇసుమంత ఈర్ష్య కూడా కలిగింది అన్నాను అన్నయ్యతో. నేనేం కావాళనలేదు, నాయనే చూపించారు, ధైర్యం ఉంటే అడుగు అన్నట్లు మాట్లాడారు.
ఈరోజుల వలె పెండ్లాన్ని వెంట తెచ్చుకొని తల్లిదండ్రులను దీవించమనే కాలం కాదది. "నేను అమ్మాయిని ప్రేమించాను. వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడండి" అన్నాడు నా కొడుకు నాతో. అంతరం అంత అయ్యింది.
నాయనముందు నుంచునే ధైర్యం లేదు. ఏదయినా కావాలనిగాని వద్దనిగాని అనే సాహసం లేదు. వారిది సుగ్రీవాజ్ఞ. చెప్పింది వినడమే మనపని.
నాలోనే ఒక వింత పరిణామం. ముందు పెళ్లి వద్దే వద్దు అనుకున్నాను. ఇప్పుడు అన్నయ్య విషయంలో వలె నాకూ జరగాలనుకుంటున్నాను. మిత్రులు నా పెళ్లి మాటకు నన్ను పరహసిస్తున్నారు. నాకు లజ్జగా ఉంది. దోస్తులను విడువలేను. వారితో తిరగలేను. వంటరితనం భరించలేను. అదొక విచిత్రమయిన స్థితి. ఆ వయసుకు తగిందికాదు. నిస్సహాయంగా - నా ఇష్టంతో నిమిత్తం లేకుండా - దారిలేని అరణ్యంలో సాగిపోతున్నాను.
ఇది ఇట్లుండగా రంగంమీద కొత్తపాత్రలు ప్రవేశించాయి.
పుట్టినప్పుడు అనుకున్న సంబంధం - బాబాయ్ నారాయణాచార్యులవారు - సీతమ్మగారు సికిందరాబాదులో ఉంటారు. మా అన్నదమ్ముల పెళ్లి విషయం వారికి ఆలస్యంగా తెలిసింది. అప్పుడు వారికి వేడెక్కింది. ఏ విధంగానయినా కార్యం సాధించాలనుకున్నారు. సీతమ్మగారి చెల్లెలు సింగరమ్మత్తయ్య. ఈ కార్యభారం సింగరమ్మత్తయ్యకు - రామంచార్ల మామకు అప్పగించారు.
మామయ్య మా ఇంటికి వచ్చాడు. నాయనతో వాదించడం అసాధ్యం అని అతనికి తెలుసు. అమాంతంగా కాళ్లు పట్టుకున్నాడు. కథ సాంతం విన్నవించుకున్నాడు. మాట ఇచ్చేదాకా కాళ్లు వదలనంటాడు. కావలసినవాళ్లు - అనుకున్న సంబంధం - ఏవేవో చెప్పాడు.
నాయనకు మామ అంటే కొంత అభిమానమే. చిన్నతనంనుంచి కలిసి తిరిగినవాళ్లు. కాని, కుదిరిన సంబంధం ఎత్తగొట్టడం ఎట్లారా అంటారు. ఏదయినా మీరే చేయాలే. మీ శరణు జొచ్చాను. రాముడు శరణుజొచ్చిన విభీషణునికి రాజ్యం ఇచ్చాడు. మీరు మాట ఇవ్వాలె అనేది మామయ్య ధోరణి.
నాయన మెత్తపడలేదు. కాదనీ అనలేదు. మామయ్య వస్తున్నాడు. ప్రతిరోజూ శరణాగతుడు అవుతున్నాడు. నాయన శ్రీసూక్తి సాయిస్తున్నారు.
మామయ్య - అమ్మ రోజూ ఏటికి వెళ్లేవారు మంచినీళ్లు తేవడానికి. మామయ్య అమ్మతో మంతనాలు సాగించాడు. అమ్మ సులభంగా మెత్తపడింది. ఒకటి - ఆమెతో సంప్రదించడమే ఆమెకు మహదానందం అయింది. రెండు - నాయనకు నచ్చకున్నా తనమాట నెగ్గుతుంది. అది ఆమెకు గెలుపు. మూడు - తమ్ముని తరపు సంబంధం. కోడలు తన పక్షపుది అవుతుంది. అది ఆనందం.
మామయ్య పథకం ఏమంటే, నాయన ఒప్పుకోకున్నా - అమ్మ అనుమతితో - నన్ను ఎత్తుకుపోయి పెళ్లి చేయాలని.





