Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పద్దెనిమిదవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - మేధాతిథి.
పన్యం పన్యమిత్సోతార ఆ ధావత మద్యాయ |
సోమం వీరాయ శూరాయ ||
1. ఇంద్రుడు హర్షణీయుడు. వీరుడు. శూరుడు. స్తోతలారా! సర్వత్ర ప్రశంసనీయమగు సోమమును ఇంద్రునకు ప్రత్యక్షముగా సమర్పించండి.
2. ఇంద్రుని హర్యశ్వములు స్తుతి, హవిస్సుతో రథమున కూర్చబడునవి. సమర్ధములు. అవి ఈ యజ్ఞమునకు మిత్రుడు, మంత్ర స్తుత్యుడగు ఇంద్రుని తీసికొని రావలెను.
3. ఇంద్రుడు సోమపాయి. వృత్రహంత అతడు తన అశ్వముల మీదనే రావలెను. మాకు దూరమున ఉండవలదు. వచ్చి మమ్ము బహువిధముల రక్షించవలెను. శత్రునాశము చేయవలెను.
రెండవ తృచ : ఋషి - శ్రుతకక్షి లేక సుకక్షి.
1. ఇంద్రా! నదులు సముద్రమునకు చేరినట్లు ఈ సోమములు నిన్ను చేరును గాత. నిన్ను మించిన వారు లేకున్నారు.
2. ఇంద్రా! నీవు అప్రమత్తుడవు. వరదుడవు. నీ ఉదరమున చేరు సోమ పానమునకు నీవు లోకమంతటను వ్యాపించి ఉన్నావు.
3. వృత్రహంత ఇంద్రా! మా సోమము నీ ఉదరమునాకు సరిపోవును గాత. నీ ప్రభావమున అది దేవతలందరకు చాలును గాత.
మూడవ తృచ : ఋషి - శునశ్శేపుడు.
1. అగ్నిదేవా! నీవు స్తుతులకు ప్రజ్వరిల్లువాడవు. ప్రతి యుద్దమునకు యజ్ఞశాలకు చేరుము. ఉగ్రుడవగు నిన్ను స్తుతించుచున్నాము.
2. అగ్ని మహానుడు. అపరిచ్చిన్నుడు. పొగ గలవాడు. ఆనందప్రదుడు. అతడు మాకు సాహసము అన్నము కలిగించును గాత.
3. విశ్వపతి, దివ్యుడు, దూత, బృహద్భానుడగు అగ్ని - రాజువలె - మా స్తుతులు ఆలకించును గాత.
నాలుగవ తృచ : ఋషి - శంయుడు.
1. స్తోతలారా! సోమము అభిషుతము అయినది కదా! పురుహూత, శత్రుంజయ ఇంద్రుని గుమిగూడి స్తుతులు పాడండి. గోవునకు గడ్డి సుఖము కలిగించునట్లు - ఆస్తోత్రము ఇంద్రునకు సుఖకరమగును గాత.
2. ఇంద్రుడు సర్వవ్యాప్తి. అతడు మా స్తుతులు విన్నంత బహు ధన గోదానములకు వెనుకంజ వేయడు.
3. ఇంద్రుడు దైత్యనాశకుడు. అతడు దైత్యులు దాచిన గో వ్రజమును వశపరచుకున్నాడు. ఆ దైత్యులే కదా మా గోవులను అపహరించి దాచినది!
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - మేధాతిథి.
1. విష్ణువు ఈ సమస్త జగత్తును ఆక్రమించినాడు. అప్పుడు అతడు మూడు అడుగులు వేసినాడు. కావున ఈ సమస్త జగత్తు అతని పాదరేణువై ఉన్నది.
2. విష్ణువు ఎదురు లేనివాడు. జగద్రక్షకుడు. మూడు లోకములందు అగ్ని మున్నగు వానిని స్థాపించినాడు. అతడు మూడు అడుగులచే ఆక్రమించినాడు.
3. విష్ణువు మహిమలు కాంచండి. అతని వలననే యజ్ఞయాగాదులు జరుగుచున్నవి. అతడు ఇంద్రునకు మిత్రుడు అయి ఉన్నాడు.
4. విద్వాంసులు - నేత్రము ఆకాశపు అన్ని దిశలను చూచినట్లు - విష్ణువు యొక్క పరమ పదమును సదా దర్శించుచున్నారు.
5. విష్ణువు యొక్క ఏ పరమపదమైతే ఉన్నదో దానిని విశిష్టముగా స్తుతించునట్టియు, అప్రమత్తులైనట్టియు విద్వాంసులు దీప్తము చేయుచున్నారు.
6. విష్ణువు భూలోకమున కన్న పై లోకమున అడుగుల మోపుచు భూలోకమున ఉన్న మమ్ము రక్షించును గాత.
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. ఇంద్రదేవా! ఈ ఋత్విజులు కూడ నిన్ను మాకు దూరముగా రమింప చేయకుందురు గాక. దూరమునందున్నను మా యజ్ఞమునకు విచ్చేయుము. విచ్చేసి మా స్తుతులను ఆలకింపుము.
2. ఇంద్రదేవా! సోమము అభిషుతమైనంత స్తోతలు తేనెతీగల వలె నీ చుట్టు కూర్చుందురు. ధనము కోరు స్తోతలు తమ కోరికలను రథము మీద అడుగు పెట్టినట్లు నీకు విన్నవింతురు.
మూడవ తృచ : ఋషి - ఆయువు.
1. ఇంద్రుని కొరకు పురాతనములు, మననీయములగు స్తుతులు గానము చేయండి. ప్రాచీన, యజ్ఞసంబంధ బృహత్సామములను ఉచ్చరించండి. స్తోతకు స్తుతించు బుద్ది కలుగును గాక.
2. ఇంద్రుడు మాకు ధనములు మరిన్ని ఇచ్చును గాత. భూములు ఇచ్చును గాత. సూర్యుని వంటి దీప్తమగు నిర్మల సోమము ఇంద్రుని చేరుచున్నది. గో దుగ్ధ సహిత సోమము ఇంద్రుని ప్రసన్నుని చేయుచున్నది.
నాలుగవ తృచ : ఋషి - అంబరీషుడు.
1. సోమమా! వృత్రహంత ఇంద్రుని పానము కొరకు పాత్రలందు నిండుము. దక్షిణ లందు కొను ఋత్విజులు ఇంద్రునకు హవి అర్పించుచున్నారు. యజ్ఞశాలయందున్న యజమానికి యజ్ఞఫలము కలుగును గాక.
2. మిత్రులారా! విద్వాంసులగు మీరు, మేము కలసి దీప్తము, బలకరము, సుగంధి యగు సోమమును ఆస్వాదింతము. బలకర సోమమును త్రాగుదుము.
3. పరిత్యం హర్యతం హరిం బభ్రుం పువన్తి వారేణ |
యో దేవాన్ విశ్వాం ఇత్పరి మదేన సహ గచ్చతి ||
పూర్వార్చిక 5వ అధ్యాయము 8వ ఖండము 8 మంత్రము పునరావృతము.
ఐదవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. కస్తమిన్ద్ర తవ వసవా మర్త్యో దధర్షతి |
శ్రద్దాహితే మఘవన్ పార్యే దివి వాజీ వాజం సిషాసతి ||
పూర్వార్చిక 3వ అధ్యాయము 5వ ఖండము 8వ మంత్రము పునరావృతము.
2. ఇంద్రా! నీకు హవిస్సులు అర్పించు వారిని శత్రువధకు పురి కొల్పుము. హర్యశ్వ ఇంద్రా! నీచే ప్రోత్సహించబడిన స్తోతలు, పుత్రాది సహితముగ దుఃఖములను దాటుదురు గాక.
మూడవ ఖండము.
మొదటి తృచ : ఋషి - విశ్వమనువు.
1. అధ్వర్యులారా! మధుర సోమరూప అన్నమును, ఆనందదాయక సోమ రసమును ఇంద్రునకు సమర్పించండి. ఇంద్రుడు సమర్ధుడు. బలమును పెంచుకొనువాడు. ఇతడే కదా! స్తుతించ దగినవాడు!
2. హర్యశ్వస్వామి ఇంద్రా! ప్రాచీన స్తుతులన్నియు నీవే యగును. మరొకడు స్వబలమున వానిని సాధించజాలడు. తేజోరూప ధనము సహితము నీదేయగును. మరొకడు సాధించజాలడు.
3. మేము అన్నార్దులము. ఇంద్రుడు అన్నముల స్వామి. మేము నిర్విఘ్నముగ యజ్ఞములు జరిపి వర్ధిల్లువారలము. మీ ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
రెండవ తృచ : ఋషి - సౌభరి
1. స్తోతలారా! ప్రసిద్దుడగు అగ్నిని స్తుతించండి. దేవతలను యజించు వారు యోగ్య ధనమును పొందుచున్నారు.
అగ్నిదేవా! నీవు దేవతలకు సకల దిశల నుండి హవిస్సులు అందించుచున్నావు.
2. అగ్ని బృహత్ ధనవంతుడు. విచిత్ర కిరణముల వాడు. సోమ సాధకుడు. యజ్ఞ పూర్తి కర్త. పురాతనుడు. దేవతలకు హవి అర్పించు విప్రులారా! యజ్ఞ నిమిత్తము ఆ అగ్నిని స్తుతించండి.
మూడవ తృచ : ఋషి - భౌమఅద్రిః.
1. సోమమా! రాళ్లచే అభిషవించబడుచు, ఉన్ని పాత్రల నుండి జల్లించబడి, హరిత వర్ణవై కలశమున చేరుచున్నావు. జనులు పురమున ప్రవేశించినట్లు - చెక్క పాత్రలందు చేరుము.
2. అన్నాభిలాషియు, వీర్య అశ్వము వలె హర్షదాయకమగు సోమము ఉన్ని పాత్రలందు జల్లించబడి, ఋక్కులు చదువు విప్రులచే స్తుతించబడుచున్నది. శుద్దిచేయబడుచున్నది.
నాలుగవ తృచ : ఋషి - కలి.
1. వజ్రియగు ఇంద్రుని గతమందునను, వర్తమానమునను సోమము సమర్పించి తృప్తుని చేయుచున్నాము. ఈ ఇంద్రుని కొరకే యజ్ఞమున సోమము అభిషవించబడుచున్నది. దీనిని వినగనే ఇంద్రుడు ఇచటికి చేరును గాత.
2. ఇంద్రుని మార్గములు జ్ఞానము ప్రశస్తములు. అవి ధారి దోపిడీ గాండ్రను సహితము అనుకూలురను చేయుచున్నవి. అటువంటి ఇంద్రా! మా స్తుతులు వినుము. అనేక ఫలముల నిచ్చు మనసుతో విచ్చేయుము.
ఐదవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
1. ఇంద్రాగ్నులారా! మీరు దివిని ప్రకాశింప చేయువారు. యుద్దములందు మీరు అందరిని తిరస్కరింతురు. మీ పరాక్రమమె యుద్దములందు విజయము కలిగించుచున్నది.
2. ఇంద్రాగ్నీ అపసస్పర్యుప ప్ర యాన్తి ధీతయః |
ఋతస్య పథ్యా అను.
ఉత్తరార్చిక అ. 16. ఖం. 1. తృ 2. మం. 3. పునారావృతం.
3. ఇంద్రాగ్నీ తవిషాణి వాం సధస్థాని ప్రయాంసిచ |
యువారప్తూర్యం హితమ్.
అధ్యాయాదులు 2 వలెనే. మంత్రము 4
ఆరవ తృచ : ఋషి - మేధాతిథి / మేధ్యాతిథి
1. క ఈం వేద సుతే సచా పిబంతం కద్వయో దధే |
అయం యః పురో విభినత్త్యోషసా మందానః శిప్య్రయంధసః ||
2. ఇంద్రుడు శత్రువును వెదకి పట్టువాడు. గజము వంటి మదము గలవాడు. సకల యజ్ఞములకు సంచరించువాడు.
ఇంద్రా! నిన్ను నియంత్రించ గలవాడు లేడు. సోమము అభిషుతమైనది. విచ్చేయుము. నీవు మాకు పూజనీయుడవు. స్వబలమున సంచరించుచున్నావు.
3. ఇంద్రుడు ఉగ్రుడై శత్రువులను తుద ముట్టించువాడు. నిశ్చలుడు. యుద్దము కొరకు ఆయుధములు ధరించువాడు. ధనవంతుడు. ఇంద్రుడు స్తోతల ఆహ్వానము విన్నంత మరొక చోటికి పోడు. ఇచటికే విచ్చేయును.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - నిధ్రువి.
1. సోమము ఉజ్జ్వలము. దీప్యము. పూయమానము. అది సకల స్తుతులచే శుద్ది చేయబడుచున్నది.
2. పవమానము అంతరిక్షము నుండి భూమి యొక్క ఉన్నత ప్రదేశమగు యజ్ఞ వేదికి చేరుచున్నది.
3. వేగవంతము, శ్వేతవర్ణమగు పవమాన సోమము సకల విద్వేషులను వధించుచు వర్ధిల్లుచున్నది.
రెండవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
1. ఇంద్రాగ్నులు శత్రు బాధకులు - పాపనాశకులు. సమాన విజేతలు. అన్న ప్రదాతలు. వారిని ఈ యజ్ఞమునకు సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
2. ప్ర వామర్చన్త్యుక్థినో నీథా విదో జరితారః |
ఇంద్రాగ్నీ ఇషా ఆవృణే
ఉ.అ. 16 అ. 1. ఖం. 4. తృ. 1వ మంత్రము.
3. ఇంద్రాగ్నీ సవతిం పురో దాసపత్నీ రధూమతమ్ |
సాకమకేణ కర్మణా ||
ఉ. అ. 16 అ. 1. ఖం. 4తృ. 2వ మంత్రము.
మూడవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. బలముల నుండి ఆవిర్భవించిన అగ్నీ! మేము హవిస్సులు పట్టుకొని ఉన్నాము. రమణీయుడవు. దర్శనీయుడ వగు నిన్ను స్తుతించుచున్నాము.
2. అగ్నిదేవా! నీది బంగారు వన్నె. వెలుగొందు వాడవు. ఎండకు మాడిన వాడు నీడకు చేరినట్లు నీ శరణు జొచ్చినాము.
3. అగ్నిదేవా! నీవు పరమ బలశాలురను ధ్వంసము చేయగల ధనుస్సు వంటివాడవు. శీఘ్రగామివి. తీక్ష్ణశృంగుడవు. నీవు మూడు అసుర పురములను ధ్వంసము చేసినావు.
నాలుగవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. అగ్నిదేవా! నీవు యజ్ఞసంబంధివి. వైశ్వానరుడవు. జ్యోతిషస్పతివి. అవిచ్చిన్నుడవు. దీప్యమానుడవు. నిన్ను వరములు వేడుచున్నాము.
2. జగముల యజ్ఞముల ఆటంకములు తొలగించు అన్నింటిని వశము నందుంచుకొను అగ్ని రుతువులను కలిగించుచున్నాడు.
3. భూత భవిష్యత్కామి, సామ్రాట్టు అగు ఒకే అగ్ని భూమండలమున విరాజిల్లుచున్నాడు.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి పద్దెనిమిదవ అధ్యయము సమాప్తము





