Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                        

                                              నాలుగవ సూక్తము -9
   
వినియోగము :-

   
      1. గర్భమును గట్టిపరచుటకు 1-3 మంత్రములచే ధనుస్సు వారిని మూడు మారులు సరిచేసి స్త్రీకి కట్టునది. వీనితోనే పొలపు మట్టిని అభిమంత్రించి గర్భిణికి నాకించునది. వీనితోనే నల్లటి దుమ్మును  అభిమంత్రించి గర్భిణి మంచము మీద చల్లునది.
   
    జంభ గ్రహణ శాంతి కొరకు వీనిచే ధనుస్సు ప్రత్యంజను కట్టుట మున్నగునవి చేయునది.
   
      2. స్త్రీ విషయక ఈర్ష్యను తొలగించుటకు ఈర్ష్య గలవానిని చూచుచు 4-6 మంత్రములు జపించునది.
   
1.    ఈ మహా పృథ్వి సమస్త భూతములను గర్భము ధరించిన రీతి ఈమె ప్రసవించు పర్యంతము గర్భమును ధరించునుగాక.
   
2.    ఏ విధముగా ఈ మహా పృథ్వి వనస్పతులను ధరించి యున్నదో అట్లే ఈమె ప్రసవించు పర్యంతాము గర్భమును ధరించునుగాక.
   
3.    ఏ విధముగ ఈ మహా పృథ్వి చరాచరాత్మక జగత్తును ధరించి యున్నదో అట్లే ఈమె ప్రసవ పర్యంతము గర్భమును ధరించునుగాక.
   
4.    ఈర్ష్యా దృక్కులందు మొదటి దానిని, తరువాతి దానిని శాంత పరచుచున్నాము. ఈర్ష్యాళువా! నీ కోపతాపములను నీ నుండి తొలగించుచున్నాము.
   
5.    ఈ భూమి మనసు చచ్చినది. చచ్చిన మనసును మించినది అగుచున్నదో - ఎట్లు మృత దేహము నుండి మనసు వెడలి పోవుచున్నదో - అట్లే ఈర్ష్యాళువు నుండి ఈర్ష్య తొలగిపోవును గాక.
   
6.    ఈర్ష్యాళువా! ఎట్లు కొలిమి తిత్తి నుండి గాలి వెడలిపోవునో అట్లే నీ మనసునుండి అటునిటు తిరుగు ఈర్ష్యను వెడలగొట్టుచున్నాను.
   
                                                ఐదవ సూక్తము -10
   
వినియోగము:

   
       1. 1-3 మంత్రముల పాఠము బృహద్గణములందున్నందున శాంత్యుదకాదులందు దీని వినియోగము.
   
    ధనము తీయునపుడు కలుగు విఘ్నముల శాంతికి దేవతలకు క్షీరాన్న, ఘ్రుతాహుతులు ఇచ్చునది కాశదివిధువక వేతస ఓషధులను ఒక పాత్రలో ఉంచి సంపాతన, అభిమంత్రణలు చేసి అధోముఖముగ జలమధ్యమునకు తీసికొని వానిని నీటిలో వేయవలెను. కుక్కతల, గొర్రె తలను అభిమంత్రించి నీటిలో వేయునది. మానవ కేశములను చెప్పుటకు వెదరుబొంగు కొనకు కట్టునది. ఊక సహితముగ పచ్చి కుండ నీటితో ప్రోక్షించి, మూడు పురుల ఉట్టిలో ఉంచి నీట ముంచునది. వర్షాభిలాషి సంపాతిత, అభిమంత్రిత ఘటము నందలి నీటిని ఈ మంత్రములచే సేవించి, స్నానము చేయునది.
   
    స్వ యజ్ఞములందు ఈ మూడు ఋక్కులచే యజమాన పత్ని, పుత్రులను ప్రోక్షించునది. పవిత్ర సవమున  వీనిచే హోమించబడని హవిస్సును అభిమర్శన, సంపాతనాదులు చేయునది. దీక్షా కుశల కట్టచే  పవిత్రుడైన యజమాని వీనిని జపించునది. 'అయంతృచః ఆసిచ్యమానశతాతృణ్ణానుమన్త్రేణ వినియుక్తః"
   
      2. పిత్తజ్వర చికిత్స యందు 4-6 ఋక్కులచే దావాగ్ని యందు రాగి స్రవముచే ఘ్రుతాహుతులిచ్చి రోగితల మీదకు సంపాతములను తెచ్చునది.
   
1.    దేవతలు నన్ను పవితుర్ని చేయుదురుగాక. మానవులు తమ బుద్దిబలమున నన్ను పవిత్రుని చేయునుగాక.
   
2.    నా యొక్క క్ర్రతువులు, బలము, జీవనము కొరకు సోమము నన్ను పవిత్రుని చేయునుగాక. అహింస కొరకు పవిత్రుని చేయునుగాక.
   
3.    సర్వ ప్రేరక సవితా దేవా! నీ వద్ద నున్న తేజస్సు, ప్రేరణయను పవిత్రీకరణములచే మేము ఉభయలోకములందు సుఖించుటకు పవిత్రులను చేయుము.
   
4.    సర్వమును దహించు అగ్ని వంటి జ్వరము సర్వాంగములకు వ్యాపించినది. రోగి ఉన్మత్త ప్రలాపములు చేసి వెడలినాడు. ఈ జ్వరము వ్రతములు చేయనివానిని చేరునుగాక. జ్వర దేవతలకు నమస్కరించుచున్నాను.

5.    నమో రుద్రాయ నమో అస్తు తక్మనే నమో రాజ్ఞే వరుణాయత్విషీమతే|
    నమోదివే నమోపృథ్వివ్యై  నమ ఓషధీభ్యః||

   
6.    ఈ జ్వరము సర్వాంగములందు నిప్పు పెట్టునది. ఎన్నో విధములుగ రక్తమును చెరచునది. దేహమును పసుపు రంగునకు మార్చునది. అట్టి అరుణవర్ణ, బభ్రువర్ణ జ్వరమునకు నమస్కరించుచున్నాను.
   
                                            మూడవ అనువాకము
                                       మొదటి సూక్తము -11
   

వినియోగము :-

   
      1. కేశవృద్ది కోరువాడు చెట్టు, నేల మీది ఓషధులతో కాచిన నీటితో లేక విభీతక చెక్క నీటితో, లేక పసుపు  కొమ్ము నీటితో 1-3 మంత్రములచే అభిమంత్రించి ప్రాతః కాలమును వెంట్రుకలను కడుగునది.
   
      2. 4-6 మంత్రములచే ఉదర వ్యాధిగ్రస్తుని చిత్తి ప్రాయశ్చిత్తి మున్నగు ఓషధుల నీటిచే స్నానము  చేయించునది.
   
    పూర్వ సూక్తపు 1-3 మంత్రముల వినియోగము నందలి ధనము తీయుటకు విఘ్న శాంతికి' బదులు "ఈ చికిత్స యందు" చేర్చిన మిగిలినది దీనికి వర్తించును.
   
    దీని పాఠము అపాంసూక్తములందున్నందున ఆసావనాదులందు దీని వినియోగము.
   
1.    లోకములు మూడు. వానిలో భూమి శ్రేష్టము. వాని పైపొరలందు పుట్టునట్లు ఓషధులను నేను చేకొనుచున్నాను.
   
2.    హరిద్రా రూప భేషజమా! జాములందు సూర్యచంద్రుల వలె, దేవతలందు వరుణుని వలె నీవు ఓషధులందును, వనస్పతులందును శ్రేష్ఠమవు.
   
3.    ఓషధులారా! మీరు ధనవతులు. బాధింపబడనివారు. ఆరోగ్య దాయినులు. మాకు ఆరోగ్యము ప్రసాదించండి. కేశములను చిక్కిన చేయండి.
   
4.    సూర్య కిరణములు చీకట్లు కలిగించును. మరల మారి అంతరిక్షము నుండి భూమి మీద పడును. జలమును పీల్చును. ఆకసమునకు ఎగురును. అచటి నుండియే వర్షము కలిగించును. భూమిని తడుపును.
   
5.    రొమ్ము మీద బంగారు నగలు గల మరుత్తులారా! మీరు కదలుచు జలములకు, ఓషధులకు సుఖము కలిగించుచున్నారు. మీరు మధుర వృష్టి కలిగించిన చోట జనులు బలశాలురు, బుద్దిమంతులు అగుచున్నారు.
   
6.    మరుద్దేవతలారా! జలదములను పంపండి. అవి పంటలు పండించి, నదులను ప్రవహింపచేయునుగాక. పేద తల్లిదండ్రులను కన్య గడగడలాడించినట్లు, మేఘ గర్జన అందరను వడకించునుగాక. భార్య భర్తతో ముచ్చట పెట్టుచు అన్నము పెట్టినట్లు ఉరుము మబ్బుతో ముచ్చట పెట్టుచు ఆహరాము అందించును.
   
                                               రెండవ సూక్తము -12
   
వినియోగము:

   
      1. 1-6 మంత్రముల పాఠము బృహద్గణ, అపాంసూక్తములందు ఉన్నందున శాంత్యుదక , అసావనాదులందు వినియోగము.
   
          ధనము తీయుట యందు విఘ్న శాంతికి వీనిచే 10 వ సూక్తము నందు వలె చేయునది.
   
      2. ఉదర వ్యాధికి 1- 3 మంత్రములచే 11 వ సూక్తపు 4 - 6 వినియోగమును అనుసరించునది.దర్శపూర్ణమాసములందు ప్రణీతలను బ్రహ్మ ను మంత్రించునది.
   
      3. 4 - 6 మంత్రములు శాంత్యుదక అభి మంత్రణాదులందు, ఆసావనాదులందు, అర్ధోత్థాపనాదులందు 1 - 3 తోపాటు వినియోగము.
   
    హృదయ దోష, జలోదర, కామిలారోగ శాంతి కొరకు ఏటివాలు నీటిని తెచ్చి అందు ఇంటి పరకలు వేసి ఈ  ఋక్కులచే రోగి మీద చల్లునది. స్నానము చేయించునది.
   
1.    జలము ప్రాణప్రదాయిని. రాత్రింబవళ్ళు ఎడతెగక ప్రవహించునది. శ్రేష్ఠ కర్మలు చేయునేను అట్టి జలదేవతను ఆహ్వానించుచున్నాను.
   
2.    అవిచ్చిన్నముగ ప్రవహించు జలములు ఫలప్రాప్తి కలుగుటకు గాను సమస్తపాపముల నుండి విముక్తులను చేయును గాక.
   
3.    సవితా దేవత ప్రేరణ వలన మానవులు కర్మలు చేయుదురు గాక. జలములకు శాంతి కలుగును గాక. ఓషధులు సుఖప్రదములు అగును గాక.
   
4.    హిమవంతము నుండి బయలు దేరిన నదులు సముద్రమున కలియుచున్నవి. అట్టి జలములు  నా హృదయమునకు శాంతి కలిగించు ఓషధులను ప్రసాదించునుగాక.
   
5.    నా కళ్ళను, పాదములను, పిక్కలు, తొడలను బాధించు వ్యాధులను జలదేవత తొలగించును గాక. వ్యాదులను తొలగించు ఓషధుల చికిత్స ఈ  జలమునకు తెలిసి ఉన్నది.
   
6.    నదులారా! మీరు సముద్రపత్నులు సముద్రుడు మీకు ప్రభువు. మీరు మాకు ఆరోగ్యప్రద ఓషధులు ప్రసాదించండి. అందువలన మేము అన్న వంతులము అగుచున్నాము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.