Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                         

                                    మూడవ సూక్తము -13
   

వినియోగము:-

   
      1) 1 - 3 మంత్రములచే గండమాలను తొలగించుటకు సూత్రోక్త కాప్టాదులచే ప్రజ్వలనాది కర్మలు  చేయునది.
   
      2) 4 - 6 ఋక్కులచే వ్యాధుల చికిత్స నిమిత్తము సూత్రోక్త తంత్రులు జరిపి మూడు పురోడాశ  సమ్వర్తనములను బాటల కూడలిలో ఉంచునది.
   
    మహా శాంత్యాదులు చేసినపుడు నిర్రుతి కర్మమున వీనిని జపించుచు నది వడ్డునకు పోవునది.
   
1.    గొంతు మీది నరములందు ఏబది అయిదు తీరులు వ్యాపించిన గండమాలలు పతివ్రత వలన వదిలిన పాపముల వలె - వదలి పోవును గాక.
   
2.    గొంతు యందలి నాడులందు వ్యాపించిన డెబ్బది ఏడు గండమాలలు పతివ్రత వలన వదిలిన పాపముల పగిది వదలి పోవును గాక.
   
3.    స్కంధధమనులుదున్న తొంబది తొమ్మిది గండమాలలు - పతివ్రత వలన వదలిన పాపముల వలె - వదలి పోవును గాక.
   
4.    పాప దేవతా! నన్ను విడువుము. అందరను వశమునందు ఉంచుకొందువు కదా! నాకు మాత్రము సుఖములు ప్రసాదించుము. నన్ను పుణ్యములకు ఫలస్వరూపమమగు స్వర్గమున ఉంచుము.
   
5.    పాప దేవతా! నీవు మమ్ము విడువకున్న నిన్ను బాటల కూడలి యందుంచి పంపించి వేయుచున్నాము. అచటినుంచి నీవు మమ్ము ద్వేషించు వారిలో ప్రవేశించుము.
   
6.    పాప దేవత వేల కనులది. మరణము లేనిది. అది మమ్ము విడుచునుగాక. అది మమ్ము ద్వేషించు వారిని - మేము ద్వేషించు వారిని నష్ట పరచును గాక.

                                                నాలుగవ సూక్తము - 14
   

వినియోగము: -

   
    గృహము మున్నగు వాని యందు పావురము, గుడ్లగూబ మున్నగునవి ప్రవేశించినపుడు శాంతికి గాను శాంత్యుదక అభిమంత్రణమున మహాశాంతి గణముల ప్రయోగము జరుగును. అందు ఈ సూక్తమును 15 వ  సూక్తపు 1 - 3 మంత్రములను అర్ధము చేసి కొనునది.
   
    4 - 6 మంత్రముల తొలి సూక్తము పూర్వ సూక్తముతో వినియోగము.
   
    పావురము, గుడ్లగూబ గృహాదులందు ప్రవేశించినపుడు 5 వ మంత్రముచే అగ్నిని, ఆవును ఆ స్థలమున   త్రిప్పునది.
   
    (ప్రతి సూక్తమున రెండు తృచలు మూడు మంత్రములు ఉండునని చెప్ప బడినది. ప్రతి తృచకు మంత్రసంఖ్య  వేరుగా ఇవ్వబడు చున్నది. వీనిని రెండు సూక్తములుగ కూడ లెక్కించుచున్నారు.)
   
1.    దేవతలారా! పాప దేవతచే పంపబడిన పావురము చేరినది. ఆ దోష నివారణార్ధము హవిస్సులర్పించి శాంతి చేయుచున్నాము. మాకు శుభమగును గాక. ద్విపాత్తులకు చతుష్పాత్తులకు శుభమగును గాక.
   
2.    దేవతలారా! పాప దేవత పంపిన కపోతము మాకు సుఖములను ఇచ్చును గాక. అపరాధమెరుగని పక్షి మా ఇంటికి హాని కలిగించ కుండును గాక. విప్రుడగు అగ్ని మా హవిస్సులను స్వీకరించును గాక. కపోతము పేరిటి మారణాయుధము మమ్ము వదలును గాక.
   
3.    పక్షిరూప ఆయుధము మమ్ము వధించకుండును గాక. అది అగ్నిశాల యందో, వనమునందో వసించును గాక. అది మా జనులకు, గోవులకు సుఖప్రదము అగును గాక.
   
    దేవతలారా! కపోతము మమ్ము హింసించ కుండును గాక.
   
                                                 --౦౦౦--
   
1.    దేవతలారా! ఈ మంత్రముచే కపోతమును వెళ్ళగొట్టండి. మేము అన్నము గల వారలమై తృప్తుల మగుదుము. గోవును నలువైపుల త్రిప్పుదుము. దుర్గతి కలిగించు కపోత పద చిహ్నములకు శాంతి చేయుచున్నాము. కపోతము మా ఇంటిని విడిచి పక్షులందు శ్రేష్ఠము అగును గాక.
   
2.    కపోతము ప్రవేశించిన ఇంటియందు అగ్నిని ప్రవేశ పెట్టుచున్నారు. గోవును తెచ్చి త్రిప్పుచున్నారు. దేవతలకు హవిస్సులు అర్పించుచున్నారు. ఇన్ని చేసిన తరువాత మమ్ము బాధించ గలవాడెవ్వడు?
   
3.    యముడు దేవతలందు ముఖ్యుడు. ప్రాణుల ఆయువులు లెక్కించువాడు. అతడు బహు మార్గముల నుండి వచ్చువాడు. ద్విపాద, చతుష్పాత్తులకు ప్రభువు. అట్టి యమునకు, మృత్యువునకు నమస్కరించుచున్నాము.
   
                                                అయిదవ సూక్తము -15
   

వినియోగము:-
   

      1) మొదటి తృచ వినియోగము పూర్వసూక్తమున చెప్పబడినది.
   
      2) రెండవ తృచలోని తొలి మంత్రముచే పౌనసిరసవమున మధుమంధపు అభిమరర్సనాది కర్మలు చేయునది.
   
    రెండవ తృచయొక్క 2,3 మంత్రములచే శమీలవన పాప లక్షణపు శాంతి కొరకు శమీవల్మముచే తల మీద  ఉద్వాపన చేయునది.
   
      3) మూడవ తృచచే పృశ్నిసవమున గోవునకు అభిమర్శన, సంపాతనాది కర్మలు చేయునది. ఆధానమందు     ఆహవనీయాగ్నిని దీనిచే ఉపస్థానము చేయునది. ద్వాదశాహపు అవివాక్య దినమందు మానస స్తోత్రమును         దీనిచే అనుమంత్రించునది.
   
1.    దూరము నుండి కనిపించు శత్రువుల మీద ఈ రెక్కల ఆయుధము పడును గాక. గుడ్లగూబ అశుభవాక్కు నిర్వీర్య మగును గాక. వంటింట కాలు మోపు పావురపు అశుభవాక్కు నిర్వీర్య మగును గాక.
   
2.    పాప దేవతా! నీ దూతలగు కపోత ఉలూకములను నీవు పంపినను, పంపకున్నను మా ఇంటికి వచ్చినచో మా ఇల్లు వానికి ఆశ్రయము కాకుండును గాక.
   
3.    ఈ పక్షుల దుర్నిమిత్తములు మా యోధులను హింసించనివి అగును గాక. యమదూతి కపోతమా! యముని ఇంటి నీవు నిర్వీర్యవై పోవుటయే గాని వచ్చుట తెలియని రీతి మా వీరులకు శుభములు కలుగుటకు నీయొక్క దుర్నిమిత్తములను దూర దేశమునకు కొని పొమ్ము. తిరిగి రాకుండుము.
   
                                               --౦౦౦--
   
1.    మధుసహిత యవలను దేవతలు సరస్వతీనది వద్ద మానవులకు ప్రసాదించినారు. అప్పుడు పొలము దున్ని విత్తనము వేయుటకు శతక్రతు ఇంద్రుడు నాగలికి అధిపతి అయినాడు. సుదాతలగు మరుత్తులు కృషీవలులు అయినారు.
   
2.    శమీ! నీ యొక్క శక్తి బట్ట తల మీద వెంట్రుకలు పెంచునది అగుచున్నది. ఆ శక్తితోనే నీవు నరులను నవ్వించుచున్నావు. అడవిలో నిన్ను తప్ప మిగిలిన వృక్షములను కొట్టెదము. నీవు వందల కొమ్మల దానవై అనేక విధముల వర్ధిల్లుము.
   
3.    శమీ! నీవు గొప్ప ఆకుల దానవు. సుఖములనిచ్చు దానవు. వాన నీటికి పెరుగు దానవు. తల్లి తన బిడ్డలను వలె నీవు శిరోజములను పెంచుము.
   
                                           --౦౦౦--
   
1.    సూర్యుడు ఉదయాద్రిని ఆక్రమించినాడు. తదుపరి తల్లి వంటి భూమి మీద తన కిరణములను పరచినాడు. తరువాత తండ్రి వంటి ద్యులోకమునకు చేరినాడు.
   
2.    ప్రాణాపానముల మధ్య సూర్యుడు వర్తిల్లుచున్నాడు. స్వర్గాది లోకములను ప్రకాశింప చేయుచున్నాడు.
   
3.    సూర్యునకు పగటి ముప్పది గడియలు అవయవములు అగుచున్నవి. వాటిని అతడు ఎంతో ప్రకాశింపచేయుచున్నాడు. సూర్యుడు వేగవంతుడై వేదమును ఆశ్రయించి నడుచుకొనుచున్నాడు.
   
                                           నాలుగవ అనువాకము
                                      మొదటి సూక్తము - 16

   
వినియోగము:-

   
      1) మొదటి తృచచే రాక్షస, పిశాచాదుల వలన కలుగు భయ నివారణార్ధము సూత్రోక్తరీతిగా అగ్నికి మూడు సార్లు ప్రదక్షిణచేసి, పురోడాశమును హోమించునది.
   
      2) రెండవ త్రుచచే పొలములో నాగలి చేర్చునది. వలపలి ఎద్దును కట్టునది. ఎద్దులను కట్టి యజమాని     దీనిని జపించుచు చేను యొక్క తూర్పు దిక్కును దున్ని తృచ ముగిసినంత దున్ను వానికి ఇచ్చునది.     మూడుచాళ్ళు ఏర్పడినంత ఉత్తరపు చాలు చివరన అగ్నిని ఉంచి పురోడాశముచే ఇంద్రుని స్థాలీపాకముచే,     అశ్వినులను ఈ తృచచే పూజించి ఆ చాలులోనికే సంపాతములను తెచ్చునది.
   
    సమస్త ఫలాభిలాషి దీనిచే ఇంద్రుని పూజించునది.
   
    నాగలిచే దున్నునపుడు ఆటంకము కలిగిన దాని శాంతికి శాంత్యుదకమున వీనిని చదువునది.
   
1.    యాతుధాన సంహారకమగు ఆ హవిని ఘ్రుత యుక్తముగ అగ్నికి అర్పించండి. అగ్నిదేవా! ఉపద్రవములు కలిగించు రాక్షసులను దూరముననే భస్మము చేయుము. నీవు మా ఇండ్లకు తాపము కలిగించు వాడవు కాకుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.