Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

4.    భార్యా! నన్నే కామించుచు, నన్ను విడువకుండు రీతి - తీవ చెట్టును అల్లుకున్నట్లు - నన్ను ఆలింగనము చేసికొనుము.
       
5.    భార్యా! నీవు నన్నే కామించుచు, నన్ను విడవకుండుటకు - పక్షి ఎగురునప్పుడు రెక్కలను కొట్టినట్లు - నీ మనసును బాధించి వశపరచుకొనుచున్నాను.
   
6.    భార్యా! నీవు నన్ను కామించుచు నన్ను విడువకుండునట్లు - సూర్యుడు ద్యావాపృథ్వులందు వ్యాపించునట్లు - నీ మనసు నిండ వ్యాపించుచున్నాను.
   
                                              ఐదవ సూక్తము -5
   
వినియోగము :

   
      1. తొలి మూడు ఋక్కుల వినియోగము 4వ సూక్తపు 4-6 ఋక్కుల వంటిది.
   
      2. 4-6 ఋక్కులు సకల సంపత్కర్మలందు ఘ్రుతాహుతులకు.
   
1.    కామినీ! నీవు నా దేహమును, పాదములను, కనులకు, తొడలను కామించుము. యువకుని కామించి నీ కేశములు, కనులు నా మనసును మురిపించుచున్నవి.
   
2.    కామినీ! నీవు నా కోరిక తీర్చుటకు నా మనసున చేరునట్లు నిన్ను నా బాహువులందు, హృదయమునకు బంధించుచున్నాను.
   
3.    ఏ యువతుల నాభి, మున్నగు అవయవములు ప్రశంసనీయములో, ఏ యువతులందు విధాత వశీకరణము నింపినాడో, అట్టివారిని పాడి యావులు నాకు వశపరచును గాక.
   
4.    పృథివి, అగ్ని, శ్రోత్రముల, వనస్పతుల అధిష్టాన దేవతలకు స్వాహా.
   
5.    ప్రాణములకు, అంతరిక్షమునకు, పక్షులకు, వాయువునకు 'అధిపతియే స్వాహా'
   
6.    దివికి, కన్నులకు, నక్షత్రములకు, సూర్యునకు 'అధిపతియే స్వాహా'
   
                                             రెండవ అనువాకము
                                          మొదటి సూక్తము -6

   
వినియోగము :-

   
    1-3 ఋక్కులచే పుంసవన కర్మమున జమ్మి చెట్టులో పుట్టిన రావి అగ్నిని మధు మంథమున వేసి అభిమంత్రించి స్త్రీకి తాగించునది. అగ్నిని నల్ల ఉన్నిలో చుట్టి సంపాతన అభిమంత్రణములు చేసి స్త్రీకి  కట్టునది.
   
    సర్పవిష చికిత్స యందు 3-6 మంత్రములచే మధుక్రీడను అభిమంత్రించి విషదూషితునకు త్రాగించునది. వీనితోనే 4-6లో చెప్పినరీతి జప, ఆచమనలు చేయునది.
   
1.    జమ్మి మీద రావి ఎక్కి ఉన్నది. అచట పుంసవనము చేయబడినది. అది పుత్రుని కలిగించు శక్తిని స్త్రీయందు ప్రవేశ పెట్టుచున్నది.
   
2.    పురుషునియందే వీర్యము నిలిచి ఉన్నది. అది స్త్రీ యందు ప్రవేశపెట్టబడుచున్నది. అదియే పుత్రుని కలిగించుచున్నదని "ప్రజాపతి రబ్రవీత్" ప్రజాపతి చెప్పినాడు.
   
3.    ప్రజాపతి, అనుమతి, సినీ వాలి స్త్రీ గర్భము నందలి బీజమునకు అవయవములు, ప్రాణము కలిగించుచున్నారు.
   
4.    సూర్యుడు అంతరిక్షమున వ్యాపించినట్లు, రాత్రి భూమి మీద వ్యాపించినట్లు నేను సమస్త సర్పములందు వ్యాపించినాను. విషగ్రస్తా! ప్రాణమందు తప్ప అన్యత్ర వ్యాపించిన విషములను ఈ ఓషధిచే నివారించుచున్నాను.
   
5.    బ్రాహ్మణులు, ఋషులు, దేవతలు పూర్వము తెలిసికొన్న దానితోను, భూత భవిష్య ద్వర్తమానములందు తెలిసిన, తెలియనున్న వానితోనూ నీ విషమును దింపుచున్నాను.
   
6.    నదులందు మాధుర్యము నిండునుగాక. పర్వతములు, గిరులందు తీపి నిండునుగాక. నాచునిండిన పురుష్ణీ నది మధురమగునుగాక. అస్తు శం హృదే. హృదయమున శాంతి, సుఖములు కలుగునుగాక.
   
                                                రెండవ సూక్తము -7

   
వినియోగము :-

   
    జయమును కోరువాడు 1-3 మంత్రములచే తపసేన నలుదిశల మరియు ప్రత్యేక దిక్కున ఉపస్థానము  చేయునది.
   
    వైశ్యుడు యుద్దమున గెలుచుటకు దాడి చేయనున్న శత్రువును చూచుచు వీనిని చదువునది.
   
    వీనితోనే ఘ్రుత హోమము, సక్తు హోమము, ధనురూప అగ్నియందు ధనురూప సమిధల సమర్పణ,     శరరూపాగ్నిలో శరరూప సమిధాదానము, సంపాతిత అభిమంత్రిత ధనుస్సును అందించుట చేయునది.
   
    పాము తేలు భయ నివారణమునకు వీనిచే 3-26లో విధించిన కర్మను ఆచరించునది.
   
    ఆవసథ్యాధానమున క్రవ్యాచ్చమనానంతరము ఇంటికి వచ్చి 1-3 మంత్రములచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
   
    బ్రాహ్మణుడు ఆయుధము ధరించుట, దేవతా మూర్తులను ఆడించుట చూచి నవ్వుట మున్నగు వాని శాంతికి     వీనిచే హోమము చేయునది.
   
    యజ్ఞమునందు వశీ, పురోడాశాది హవిస్సులను కాకులు, గుడ్ల గూబలు, కుక్కలు తాకినచో ప్రాయశ్చిత్తార్ధము వీనిచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
   
     2. 4-6 మంత్రములను కఫపు చికిత్సయందు సంపాతిత, అభిమంత్రిత చెట్టు బెరడు నీటిని రోగి మీద చల్ ఆచమనము చేయించునది.
   
1.    దేవతల ఆయుధములకు, రాజుల ఆయుధములకు, వైశ్యుల ఆయుధములకు నమస్కారము. "మృత్యో నమోస్తు తే" మృత్యువా! నీకు నమస్కరించుచున్నాను.
   
2.    మృత్యువా! నీకు అనుకూలముగ వచించువానికి, వ్యతిరేకముగ వచించువానికి నమస్కరించుచున్నాను. నీ సద్బుద్దికి, దుష్ట బుద్దికి నమస్కరించుచున్నాను.
   
3.    యాతు ధానులకు నమస్సులు. వైద్యములకు నమస్సులు మృత్యుమూలములకు నమస్సులు. బ్రాహ్మణులకు ఇదే నమస్కరించుచున్నాను.
   
4.    ఎముకలను కదిలించు, కీళ్ళను సడలించు, శక్తిని క్షీణింపచేయు హృదయమునకు బాధ కలిగించునట్టి సర్వాంగములందు వ్యాపించిన శ్లేష్మ రోగము హరించునుగాక.
   
5.    కొలను నుంచి తామరను వేరుతో పెరికినట్లు ఇతని శ్లేష్మ వ్యాధిని పెరికి వేయుచున్నాను. పండు పండిరాలిన విధముగ ఇతని వ్యాధిని రాల్చి వేయుచున్నాను.
   
6.    బలమును క్షీణింపచేయు రోగమా! కుందేలు పరిగెత్తినట్లు వెళ్ళి పొమ్ము. ఒకమారు కురిసిన మబ్బు మరలి రానట్లు మా సంతానమునకు హాని కలిగించక వెడలిపొమ్ము.
   
                                            మూడవ సూక్తము -8
   
వినియోగము :-

   
      1. పుష్టిని కోరువాడు 1-3 మంత్రములచే పలాశమణిని వాసితము చేసి సంపాతన, అభిమంత్రనములచే కట్టునది.
   
      2. 3-7 మంత్రము లచే నేత్ర రోగికి ఆవనూనెతో సంపాతించి, ఆవకాడలను అభిమంత్రించి రోగికి కట్టునది వీనిచే ఘ్రుతాహుతులిచ్చి ఆవకాడలను సంపాతించి, ఆవనూనెతో తడిపి అభిమంత్రించి కట్టునది.  ఆవనూనెలో వేపిన ఆవ ఆకులను వీనిచే నేత్రరోగికి ఇచ్చునది. నాలుగు "శాక వృక్ష ఫలాని" వీనితో  అభిమంత్రించి రోగికి ఇచ్చునది. వీనిచే 'మూలక్షీరమ్' ను సంపాతన, అభిమంత్రణములు చేసి భుజించునది.
   
      3. అన్న స్వస్త్యయనము కోరువాడు 7వ మంత్రముచే మూడు సస్యవల్లులను అభిమంత్రించి పొలము మధ్యన  పాతిపెట్టునది.
   
1.    పలాశమా! నీవు ఓషధులందు శ్రేష్ఠమవు. అన్య వృక్షములు నిన్ను ఉపాసించుచున్నవి. మమ్ము క్షీణింపచేయదలచిన శత్రువు నీవలన క్షీణించునుగాక.
   
2.    మమ్ము బాధించదలచిన సబంధు, అబంధువులందు - పలాశము వృక్షములందు వలె శ్రేష్టుడను అగుదును గాక.
   
3.    హవిస్సులందు ఉపయోగించుట వలన సోమము ఓషధులందు ఉత్తమమైనట్లు, వృక్షములందు పలాశము శ్రేష్ఠమైనట్లు నేను నా బంధువులందు శ్రేష్టుడను అగుదునుగాక.
   
4.    తినదగిన, తినదగని సర్షపమా! నీ తైలము అమోఘము. నీ నూనెలో వేపిన నీ కాండములను వ్యాధి నివారణార్ధము భుజించుచున్నాము.
   
5.    సర్షపమా! నీ తండ్రి విహహ్లుడు. తల్లి మదావతి. సద్వంశ సంజాతవైనందున నీవు నీకు హాని కలిగించుకొని అన్యులకు ఉపకారము చేయుచున్నావు.
   
6.    తౌవిలక నామ పిశాచీ! నీవు వ్యాధుల తలలు వంచి పంపివేయుము. 'ఏలన' మను నేత్ర రోగమా! పారిపొమ్ము. బభ్రు, బభ్రు కర్ణ వ్యాధులు కూడ విడిచివెళ్ళును గాక. 'నిరాల' రోగమా! పారిపొమ్ము.
   
7.    అలసాల నామ సస్యమంజరీ! నీవు తొలుత గ్రహించదగినదానవు. కావున 'పూర్వ'వు. శాలాంజల నామక సస్యమంజరీ! నీవు చివరన దాల్చవలసినదానవు. కావున 'ఉత్తరవు' అయినావు. నీలాగల సాలనామక  సస్యమంజరీ! నీవు ఆ రెండింటి నడిపిదానవు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.