Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
నాయనమ్మ తీర్థ తిరువధ్యయనాలు నాయన - మా పెళ్లిళ్లకన్నా అట్టహాసంగా చేశారు. నాయనమ్మకు తమ్ముడు - అమ్మకు తండ్రి - నాయనకు మామ - మాకు మాతామహులు అయిన భట్టరాచార్యులవారిని నాయన పిలువలేదు. వారు రాలేదు. మా కుటుంబంలో పైతరం అంతరించింది.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:
పది
శిథిలాలయం :
మార్పు ప్రకృతి సిద్ధం. మార్పుకు లొంగనిది సృష్టిలో ఏదీలేదు. ప్రతిదీ మారుతుంది. వృద్ధి - క్షయాలే మార్పులే.
ప్రకృతి సాంతం ఒక వలయం. వలయంలో ఒక నిర్దిష్ట బిందువునుంచి వృద్ధి ప్రారంభమవుతుంది. అది వలయపు ఉపరి బిందువు వరకూ పెరుగుతుంది. అక్కడినుంచి క్షయం ప్రారంభమవుతుంది. మళ్లీ ఆరంభ బిందువు వరకూ క్షీణిస్తుంది. అక్కడ అంతరిస్తుంది.
అంతరిస్తుంది అంటే నశిస్తుంది అని అర్థం కాదు. పరిమాణం చెందుతుంది. మరొక రూపం దాలుస్తుంది. ప్రకృతి సాంతంలో ఏ పదార్ధానికి నాశం లేదు. మార్పు మాత్రమే ఉంటుంది. అంటే, అది రూపం మార్చుకుంటుంది. అంతే. కర్ర కాలుతుంది. బొగ్గు అవుతుంది. బొగ్గు బూడిద అవుతుంది. బూడిద మట్టి అవుతుంది. నీరు ఆవిరి అవుతుంది. మేఘం అవుతుంది. మళ్లీ నీరు అవుతుంది. ఇది ప్రకృతి శాసనం. ప్రకృతి నియమం. దీనిని పరిశీలించడమే గాని మార్చడం అసాధ్యం. అసంభవం.
వ్యక్తి జీవితానికివలె సమాజానికి మారుట సహజం. సమాజం విరాట్ రూపం గలది. వ్యక్తిజీవితంలో పోల్చినపుడు సమాజపు ఆయువు అనంతం. పరిధి అనంతం. రూపం అనంతం. ప్రకృతి పదార్థాల్లో కనిపించి నంత సులభంగా సామాజిక మార్పులు రావు. కనిపించవు. భౌతిక పరిణామపుకాల ప్రమాణం సామాజిక ప్రమాణానికి వర్తించదు. హిమవంతం పెరగడాన్ని మనిషి చూడలేదు. అధ్యయనం చేయాలి. అలాగే సామాజిక పరిణామాలు కనిపించవు. అధ్యయనం చేయాలి.
ప్రతి సమాజానికీ కొన్ని అలవాట్లు - ఆచారాలు సంప్రదాయాలూ ఉంటాయి. అలవాట్లు స్థిరపడితే ఆచారాలవుతాయి. ఆచారాలు స్థిరపడితే సంప్రదాయాలు అవుతాయి. సమాజం సంప్రదాయ బలంమీద జీవిస్తుంది. రాజకీయ బలం మీద కాదు. సంప్రదాయాన్ని - సమాజాన్ని శాసించే శక్తి ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలు సంప్రదాయాలను గుర్తించగలవు. మార్చలేవు .
ఒక్కొక్క సంప్రదాయం ఏర్పడడానికో - మార్పు చెందడానికో శతాబ్దాలు, సహస్రాబ్దాలు పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
సంప్రదాయాలు సాధారణంగా ఉత్పత్తి విధానాల మీద ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో వ్యవసాయ నాగరకత, దాని మీద ఆధారపడిన ఆచారాలు సంప్రదాయాలు - లెక్కకు సాధ్యం కానంతకాలం నుంచి అమలులో ఉన్నాయి పారిశ్రామిక - యాంత్రిక నాగరకత - అనాదిగా వస్తున్న వ్యావసాయిక నాగరకతను ఛిన్నా భిన్నం చేసింది. కాని, తన స్వంత సంప్రదాయాలను సృష్టించలేకపోయింది. పారిశ్రామిక నాగరకతలో సామాజిక నేతలు ఉండరు. ఆర్థిక నేతలు మాత్రమే ఉంటారు. వారు రాజకీయాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటారు.
గత అర్ధశతాబ్దంలో వచ్చిన సామాజిక మార్పు లేక పతనం - మానవుడు తన చరిత్రలో చూసిఉండడు. ఇవ్వాళ్టినుంచి గత అర్ధశతాబ్దం క్రితపు కాలాన్ని పరికిస్తే అదేదో కలలా - కల్పనలా కనిపిస్తుంది. నాటి సమాజాన్ని నేటి సమాజాన్ని పరిశీలించినపుడు ఒక చిత్రకారుడు ఒక కాన్వాసు మీద. ముందు ఉండిన చిత్రాన్ని పూర్తిగా చెరిపి ఒక సరికొత్త చిత్రాన్ని చిత్రించినట్లుంటుంది. అవశేషాలు సహితం మిగలకుండా మారిపోయింది.
నాటి ఉమ్మడి కుటుంబాలు స్వపరిపాలనా సంస్థలు. వేరు కుటుంబాలు వచ్చిం తరువాత "ఉమ్మడి" అనే పదం వచ్చింది. అంతకు ముందు అది 'కుటుంబం' మాత్రమే. కుటుంబంలో మూడు నాలుగు తరాలు కలిసి ఉండేవి. ఈ తరాలకు పైతరం వాడు 'కర్తలేక యజమాని' - ఆ తరం ఒకరినిమించి ఉంటే పెద్దవాడు యజమాని అవుతాడు.
యజమాని ఆ కుటుంబానికి ప్రభువులాంటివారు. మిగతా కుటుంబాలు సభ్యులు - ప్రజల్లాంటివారు. వీరందరూ యజమాని అదీనులు. అతని శాసనానికి లొంగవలసినవారే. కుటుంబ ఆస్తులకు అతడే యజమాని. శుభాశుభ కార్యాలకు అతనే కర్త. అతని శాసనానికి తిరుగులేదు. ఎదురులేదు. కుటుంబ సభ్యుల అభ్యుదయము - సంక్షేమము చూడవలసిన బాధ్యత కర్తది.
పూర్తి నుంచి పూర్తి చెడువున్న సంస్థ సృష్టిలో లేదు. ఉమ్మడి కుటుంబంలో లోలోవాట లేకపోలేదు. కాని పరస్పర సహకారం - అనుబంధాలు, ప్రేమలు ఉండేవి. అన్నింటిని మించింది భద్రత!
ఏ సంస్థ అయినా దానిని నిర్వహించే వ్యక్తిమీద ఆధారపడి ఉంటుంది. పండంటికి సోషలిస్టు వ్యవస్థను నిర్మించినవారూ - నాశనం చేసినవారూ వ్యక్తులే! అలాగే ఒక కుటుంబపు మంచి చెడ్డలు యజమాని మానవతమీద ఆధారపడ్తాయి.
ఈనాటి పరిస్థితులనుంచి చూస్తే ఆనాటి స్త్రీల స్థితి గతులు హీనంగా - దీనంగా - అధ్వాన్నంగా - అన్యాయంగా ఉండేవి. కుటుంబంలోని స్త్రీలకు నామమాత్రపు స్వతంత్రం లేదు. వారు పురుషుల ఆస్తిగా పరిగణించబడేవారు. ఇక్కడ మళ్లీ వ్యక్తి అతనిలోని మానవత; సంబంధాలను నిర్ణయిస్తుంది. అన్యోన్యదాంపత్యాలు అనేకం ఉండేవి! అనుకూల దాంపత్యాలు లేనిసమాజం వర్ధిల్లదు!
సమాజం స్త్రీకి ఆస్తిహక్కు కల్పించలేదు. ఒక విధవకు భర్త ఆస్తి సంక్రమించినా ఫలితం మాత్రమే అనుభవించగలదు. క్రయ విక్రయ దాన ధర్మాల అధికారం ఆమెకు లేదు. సమాజం స్త్రీ ధనాన్ని గుర్తించింది. దానిమీద సంపూర్ణ అధికారం ఆమెదే. దానిమీద భర్త - కర్త ఎవరి అధికారమూ లేదు.
బహు భార్యత్వ దురాచారం అమల్లో ఉండేది. పురుషుడు ఎందరు భార్యలనయినా చేసుకోవచ్చు. స్త్రీ తనను కట్టుకున్నవాడిని విడువరాదు. అయితే ముప్పాతిక మువ్వీసం మంది ఒక భార్యతోనే కాపురం చేశారు. "ఉంచుకోవడం" అనే అతి దుష్ట సంప్రదాయం ఉండేది. దీనికి సంఖ్యాపరిమితి లేదు. ఉంచుకున్న ఆమెకు, ఆమె పిల్లలకు ఎలాంటి హక్కులూ ఉండవు. అయితే భార్యను మించి విశ్వాసపాత్రులయిన ఉంపుడుకత్తెలు - భార్యను మించి ఆదరించిన పురుషులూ లేకపోలేదు. ఇది వ్యక్తిస్థాయినిపట్టి ఉంటుంది.
వ్యవస్థ ఎలాంటిదయినా మనిషి మానవత్వం మీదా - మంచితనం మీదా ఆధారపడి ఉంటుంది.
వేశ్యావృత్తిని సమర్థించడం కాదు కాని ఆనాడు AIDS వ్యాధిలేదు. అంటే ఈనాడున్నంత లైంగిక విశృంఖలత్వం లేదు. సమాజం కొన్ని గ్రామ కట్టుబాట్లను బట్టి వ్యవహరించింది. ఈనాడు ఉన్నది స్వేచ్ఛకాదు - విశృంఖలత!
బాల్య వివాహాలు ఆనాటి ఆచారం. ఆడపిల్లకు రజస్వలకు ముందే వివాహం చేయాలి!
ఆనాటి - ఏనాటి దురాచారాలనయినా నిరసించాలి. మార్చాలి. కాని ఈనాటి దృష్టిలో ఆనాటిని చూడడం సరికాదు. ఆనాటి పరిస్థితుల్లో అవి ఏర్పడటాన్ని సామాజిక శాస్త్రజ్ఞులు పరిశీలించాలి. గతం సాంతం దుష్టత్వం అనడం సమంజసం కాదు. ఎంచేతంటే, మనం గతానికి వారసులం!
నేనూ ఒకప్పుడు అనాలోచితంగా గతాన్ని నిరసించాను.
"గతానికీ, మతానికీ కళ్లులేవు.
మనిషికీ, మనసుకూ నకళ్లులేవు" అన్నాను.
ఈ నేపథ్యంలో మాకు బాల్యవివాహాలు జరిగాయి.
ఖమ్మం - బీటు బజారులో రత్నమాచార్యులవారు ఉండేవారు. మాకు దగ్గరి బంధువు. బహుముఖ ప్రజ్ఞాశాలి. వారికి సంగీతం - చిత్రలేఖనం - నటన వైద్యం - పాండిత్యం అన్నింటిలోనూ ప్రావీణ్యత ఉంది. వారు చూడమ్మ అమ్మమ్మకు సోదరులు.





