Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


          

                   భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
                   భద్రా ఉత ప్రశస్తయః ||

                                        పదిహేడవ అధ్యాయము
                                           మొదటి ఖండము
                              మొదటి తృచ : ఋషి - శునశ్శేపుడు.

   
    విశ్వేభిరగ్నే అగ్నిభిరిమం యజ్ఞమిదం వచః |
    చనో ధా సహసో యాహో ||

       
1.    బలపుత్ర అగ్నీ! సమస్తమగు అగ్నుల సహితుడవై మా యజ్ఞమునకు రమ్ము. మా మాటలు వినుము. మాకు అన్నము ప్రసాదించుము.
   
2.    మేము నిత్యము, విస్తారమగు హవిచే అనేక దేవతలను యజించుచున్నాము. అయినను వానిని అన్నింటిని అగ్నివగు నీ యందే హోమము చేయుచున్నాము.
   
3.    అగ్నీ! నీవు విశ్వపతివి. హోతవు. ప్రసన్నుడవు. వరేణ్యుడవు. "నః ప్రియః అస్తు" మాకు ప్రియతముడవు అగుము. "స్వగ్నయః వయం ప్రియాః" అగ్నులందరకు మేము ప్రియతమములము అగుదుము.
       
                                   రెండవ తృచ : ఋషి - మధుచ్చందుడు.
   
1.    ఇంద్రుడు సకలలోకముల పైన ఉన్నవాడు. మేము ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. "అస్మాకం కేవలః అస్తు" ఇంద్రుడు కేవలము మావాడు కావలెను.
   
2.    ఇంద్రా! నీవు సమస్త కోరికలు తీర్చువాడవు. వరదుడవు. ప్రసిద్దుడవగు నీవు మా యజ్ఞమును ఆవిష్కరించుము. మాకు విముఖుడవు కాకుండుము.
   
3.    ఇంద్రుడు ఈశానుడు. అప్రతిష్క్రుతుడు. వరదుడు. అతడు స్వబలమున మానవులను అనుగ్రహించుటకు వచ్చుచున్నాడు.
   
                                     మూడవ తృచ : ఋషి - తృణపాణి.
   
1.    అగ్నిదేవా! నీవు ధనికుడవు. విచిత్రుడవు. దర్శనీయుడవు. మాకు రక్షణల సహిత ధనములను ప్రసాదించుము. నీవు ధనములు అందించువాడవు కదా! మా పుత్రులకు శీఘ్రముగ కీర్తి కలిగించుము.
   
2.    అగ్నిదేవా ! నీవు అపరాజితుడవు. పిత్రుస్థానమున నిలిచి మా పుత్ర, పౌత్రాదులను రక్షించుము. దేవతల కోపమును మా దరికి చేరనీయకుము. మానవుల హింసను దూరమున నిలుపుము.
   
                                    నాలుగవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
   
1.    విష్ణూ ! ఆ నీ పేరు ఎంతో విఖ్యాతము. నీ పేరు కిరణ యుక్తమని చెప్పుచున్నావు కదా! అట్టి రూపమును మా నుండి దాచకుము. యుద్దమున నీవు మరొక రూపము దాల్చుచున్నావు. మాకు దర్శనము ఇచ్చుచున్నావు.
   
2.    కిరణ్మయమూర్తీ! నీవు హవిస్సులకు స్వామివి. జ్ఞాతవ్యుడవు. విద్వాంసుడవు. ఆహ్వానయోగ్యుడవు. అట్టి నిన్ను స్తుతించుచున్నాను. నీవు మహితాత్ముడవు. ఈ లోకమునకు దూరముగా ఉన్నవాడవు. నిన్ను కీర్తించుచున్నాను.
   
3.    విష్ణుదేవా! నీకు సుఖము కలుగుటకు అభిముఖుడనై వషట్కారము ద్వారా హవిని హోమము చేయుచుచున్నాను. కిరణ్మయమూర్తీ! దానిని స్వీకరించుము. మా స్తుతులు నిన్ను వర్ధిల్లచేయును గాత. మీరు మాకు శుభములు కలిగించుచు నిత్యము మమ్ము రక్షించండి.
   
                                        రెండవ ఖండము
                          మొదటి తృచ : ఋషి - వామదేవుడు.

   
1.    వాయుదేవా! నీవు సంబంధించిన వ్రతములు చేసి దీప్తుడను అయినవాడను. స్వర్గసుఖములను కోరుచున్న వాడను. నీకు అందరికన్నముందు సోమము సమర్పించుచున్నాను. నీవు నీ నియుతనామక అశ్వములపై సోమపానము చేయుటకు విచ్చేయుము.
   
2.    వాయుదేవా! ఇంద్రుడు, నీవు సోమపానార్హులు. నీరు గుంతలోనికి చేరినట్లు సోమము మిమ్మే చేరుచున్నది.
   
3.    ఇంద్ర, వాయువులారా! మీరు బలములకు స్వాములు. శక్తిమంతులు. నియుతాశ్వవంతులు. మమ్ము రక్షించుటకును, సోమపానమునకును ఒకే రథము మీద విచ్చేయండి.
   
                                      రెండవ తృచ : ఋషి - సూనుడు లేక రేభుడు.
   
1.    రాత్రి గడచినంత జలములందు శోభిల్లు సోమమా! నీవు అన్నములవైపు సాగుచున్నావు. యాజ్ఞికులు హరితవర్ణవాగు నిన్ను సవనములకు చేర్చుచున్నారు.
   
2.    ఏది మదకము, రసరూపమగునో, ఏది ఇంద్రునకు పానయోగ్యమగునో, దేనిని స్తోతలు పూర్వము, ఇప్పుడు సేవించుచున్నారో, దేనిని గోవులు గడ్డిరూపమున మేయుచున్నవో అట్టి సోమరసము శుద్దిచేయబడుచున్నది.
   
3.    పవమాన సోమమును సనాతనస్తుతులచే స్తోతలు కీర్తించుచున్నారు. కర్మచేయుటకు వినమ్రములైన అంగుళులు దేవతలకు హవి సమర్పించుచున్నవి.
   
                                    మూడవ తృచ : ఋషి - శునశ్శేపుడు.
   
1.    ఆధ్వర సామ్రాట్టువగు అగ్నీ! నిన్ను స్తుతించియు, హవిస్సులు అర్పించియు ప్రణమిల్లుచున్నాము. గుర్రము తన తోకతో దోమలను తోలినట్లు నీవు నీ జ్వాలలచే మా విరోధులను తొలగించుము.
   
2.    అగ్ని మాకు మంగళమయము, సుఖప్రదము అగునుగాత. బలపుత్రుడు, వేగవంతుడగు అగ్ని మా కోరికలు తీర్చువాడు అగునుగాక.
   
3.    అగ్నీ! నీవు విశ్వవ్యాప్తివి. మాకు నష్టము కలిగించువారు దూరమందున్నను, దగ్గర ఉన్నను వారి నుండి మమ్ము రక్షించుము.
   
                                    మూడవ తృచ : ఋషి - నృమేధ.
   
1.    ఇంద్రదేవా! యుద్దములందు ఎంతటి శత్రువునైనను లక్ష్యపెట్టవు. నీవు శత్రుబాధకుడవు. దేవతల ఆపదలను పరిహరించుచు అసురులకు ఆపదలు కలిగించుచున్నావు. వృత్రహంతా! బాధించు వారికీ సకల బాధలు కలిగించుచున్నావు.
   
2.    ఇంద్రాదేవా! నీ బలము శత్రునాశకము. తల్లిదండ్రులు పిల్లల వెంట వెళ్ళినట్లు ద్యావాపృథ్వులు నీ బలమును అనుసరించుచున్నవి. నీవు వృత్రుని వధించినావు కదా! నీ క్రోధమునకు సకల సంగ్రామములందలి సేనలు గడగడలాడుచున్నవి.
   
                                              మూడవ ఖండము
                   మొదటి తృచ : ఋషి - గోషూక్త్యుడు లేక అశ్వసూతి.

   
1.    ఇంద్రుడు ఆకాశమున మేఘములను ఏర్పరచుచున్నాడు. భూమి మీద వర్షము కలిగించుచున్నాడు. యజ్ఞము అట్టి ఇంద్రుని వర్ధిల్ల చేయుచున్నది.
   
2.    ఇంద్రుడు సోమము త్రాగినాడు. ఉత్సాహము కలిగినాడు. మేఘములను భిన్నము చేసినాడు. దీపించు అంతరిక్షమును మరింత సంపన్నము చేసినాడు.
   
3.    ఆ ఇంద్రుడు గుహలందు దాచిన గోవులను విడిపించినాడు. వానిని ఋషులకు ఇచ్చినాడు. బలాసురుని తలవంచి పారగొట్టినాడు.
   
                              రెండవ తృచ : ఋషి శ్రుతకక్షి లేక సుకక్షి.
   
1.    స్తోతలారా! ఇంద్రుడు సకల శత్రు తిరస్కర్త అతడు మీ సమస్త స్తుతులందు పరివ్యాప్తుడై ఉన్నాడు. అట్టి ఇంద్రుని మమ్ము రక్షించుమని యజ్ఞమునకు ఆహ్వానించండి. మాకు ప్రత్యక్షము గావించండి.
   
2.    శత్రువు మీద దండెత్త గలిగిన అపరిహార్య సేనల యుద్దములందు తలవంచనివాడును, సోమపాయియు, ఏమ్తతి శూరులును పరాక్రమమును గ్రహించజాలనట్టి ఇంద్రుని మా యజ్ఞమునాకు ఆహ్వానించండి.
   
3.    ఇంద్రా! నీవు దర్శనీయుడవు. విద్వాంసుడవు. దానములను శత్రువులనుండి హరించుము. మాకు మరల మరల ప్రసాదించుము. శత్రువునుండి గుంజిన ధనముతో మమ్ము రక్షించుము.
   
                        మూడవ తృచ : ఋషి - గోషూక్త్యుడు లేక అశ్వసూక్తి.   
   
1.    ఇంద్రా! ఈ స్తుతి నీ మహాబలమును, శౌర్యమును, పరాక్రమమును, వరణీయ వజ్రమును తీక్షతరము చేయుచున్నది.
   
2.    ఇంద్రా! ద్యులోకము నీ బమును భూలోకము నీ యశస్సును పెంచుచున్నవి. మేఘములు, జలములు నిన్ను తమ స్వామిగా భావించి నిను చేరుచున్నవి.
   
3.    ఇంద్రా! పరమ ధామమును ఇవ్వగల విష్ణువు, మిత్రుడు, వరుణుడు నిన్ను స్తుతించుచున్నారు. మరుత్తులు తమ బలముచే నీకు హర్షము కలిగించుచున్నారు.
   
                                               నాలుగవ ఖండము
                                  మొదటి తృచ : ఋషి - విరూపుడు.

   
1.    అగ్నిదేవా! యజమానులు తమకు బలము కలుగుటకు నిన్ను స్తుతించి ప్రణమిల్లు చున్నారు. నీవు నీ పరాక్రమమున శత్రువులను నాశము చేయుము.
   
2.    అగ్నిదేవా! మేము మా గోవుల కోరికలు తీర్చ వలసి ఉన్నది. అందుకు మాకు మరింత ధనము అందించుము "ఉరు కృదురు ణస్క్రుధి" నీవు గొప్పలు చేయువాడవు నన్ను గొప్ప వానిని చేయుము.
   
3.    బరువులు మోయువాడు మధ్యంతరమున బరువును విడువనట్లు ఇంద్రా! నీవు మమ్ము సంగ్రామ మధ్యమున విడువకుము. "సంవర్గం సం రయిం జయ" శత్రువులు కూడబెట్టిన ధనమును మా నిమిత్తము జయించుము.
   
                                            రెండవ తృచ : ఋషి - వత్సుడు.
   
1.    సముద్రమునకు నదులు తలలు వంచి చేరుచున్నవి. అట్లే ఇంద్రుని క్రోధము ముందు విశ్వప్రజ వినమ్రమగు చున్నది.
   
2.    లోకములను గడగడలాడించిన వాడు వృత్రుడు. అట్టి వృత్రుని శిరమును ఇంద్రుడు తన శౌర్యమున సహస్రధారల వజ్రముచే తెగవేసినాడు.
   
3.    అదిగో ఇంద్రుని బలము ప్రదీప్తమైనది. ఇంద్రుడు ఆ బలముతోనే ఉభయలోకములను చర్మమును వలె - తన అదుపునందుంచినాడు.
   
                                  మూడవ తృచ : ఋషి - శునశ్శేపుడు.
   
1.    ఇంద్రా! నీ అశ్వములు జ్ఞానవంతములు, ధనవంతములు, రమణీయములు వాని నేత్రములు సుందరములు.
   
2.    ఇంద్రా! నీవు సమరూపివి. అభీష్ట ప్రదుడవు. నీ అశ్వములు భద్రములు. వాహనయోగ్యములు. వానిని రథమున పూన్చి వెంటనే మా యజ్ఞమునకు రమ్ము. మేము నిన్ను, నీ అశ్వములను సేవించగలవారము.
   
3.    తన దశాంగుళులతో కోరిన వానిని ఇచ్చువాడు ఇంద్రుడు. అతడు యజ్ఞమున సోమమధ్యమున నిలిచి ఉన్నాడు. అతనిని దర్శించండి. అతడు కలిగించు శుభములను తల దాల్చండి.



                             దాశరథి రంగాచార్య విరచిత
          శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత ఉత్తరార్చిక యందలి
                     పదిహేడవ అధ్యాయము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.