Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


        

                యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్|
               నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||

                      శ్రీ మదాంధ్ర వచన అథర్వవేద సంహిత
                                         ఆరవ కాండ
                                     మొదటి అనువాకము
                                     మొదటి సూక్తము - 1

   
            దోషోగాయ బృహద్ గాయ ద్యుమద్దేహి |
                 ఆథర్వణ స్తుహి దేవం సవితారం ||

   
1.    అథర్వ పుత్రా దధ్యజ్గా! రాత్రింబవళ్ళు గానము చేయుము. బృహత్సామము గానము చేయుము. సవితా దేవతను స్తుతించుము. మాకు దీప్తవంత ధనము నిమ్ము.
   
వినియోగము :-
   
1.    ఈ సూక్తపు తొలి మూడు ఋక్కులచే నూతన గృహమున తేనె కలిపిన ఘ్రుతాహుతులు ఇచ్చునది. స్వస్త్యయనము కోరువాడు. ఘ్రుత, సమిధ, పురోడాశాది పదమూడు ద్రవ్యములచే ఆహుతులు ఇచ్చునది. సర్వలోక ఆధిపత్యము కోరువాడు దీనిచే అథర్వర్షిని యజించునది. సమావర్తనము తరువాత అన్నమును సంపాతన, అభిమంత్రణములు చేసి భక్షించునది.
   
2.    సోమయాగపు ప్రాతస్సవనమున, బహిష్పవమాన స్తోత్ర సమయమున బ్రహ్మ ఈ సూక్తమును జపించుచు ఉద్గాతను చూచునది.
   
    తరువాతి మూడు ఋక్కులచే సోమయాగమందు ద్రోణ కలశమున గల సోమమును బ్రహ్మ అనుమంత్రించునది.
   
    యద్యాపి అస్మిన్ కాన్డే ప్రాణేయ సర్వాణి సూక్తాని తృచాత్మ కాన్యేవ. తథాపి అధ్యాపక సంప్రదాయామరోధేన తృచద్వయం ఏకీకృత్య సూక్తత్వేన వ్యవహీయతే.
   

    ఈ కాండమున సూక్తములన్నియు మూడు ఋక్కులచే అట్లయినను అధ్యాపక సంప్రదాయమును అనుసరించి మూడు ఋక్కుల త్రుచలు రెండింటిని సూక్తముగా వ్యవహరించుచున్నారు.
   
2.    స్తోతా! నీవు సవితను స్తుతించుము. అతడు సత్యసూనుడు. నిత్య యవ్వనుడు. చీకట్లను తరుమువాడు. శోభనవాక్కులవాడు. సుసేవితుడు. సముద్రమున ఉదయించుచు దర్శనమిచ్చువాడు.
   
3.    సవితా దేవతయే మాకు భూరి అమృతములను అందించును గాక. మేము ఉభయ స్తుతులు గానము చేయుదుముగాక.
   
4.    ఋత్విజులారా! ఇంద్రుని కొరకు సోమమును అభిషవించండి. ప్రవహింప చేయండి. ఇంద్రుడు మా స్తుతులను ఆకర్షించునుగాక.
   
5.    పక్షులు వృక్షములకు చేరినట్లు సోమము ఇంద్రుని దేహమున ప్రవేశించుచున్నది. సోమపానమున మదించిన ఇంద్రా! నీవు రాక్షస సేనను వధించుము.
   
6.    ఇంద్రుడు వజ్రి. యువకుడు. విజేత. ఈశానుడు. బహుస్తుతుడు. అతని కొరకు సోమమును అభిషవించండి.
   
                                               రెండవ సూక్తము -2
   
వినియోగము :-

   
       తొలి మూడు ఋక్కులచే స్వస్త్యయన కర్మము ఘ్రుతాహుతులిచ్చి ఖడ్గమును సంపాతన అభిమంత్రణము చేసి యోధునకు ఇచ్చునది. స్వస్త్యయనమును కోరువాడు వీనిని జపించుచు చేయి ముఖము మీద వేసుకొని పడుకొనునది. నిద్ర మేల్కొన్నపుడు వీనిచే మూడడుగులు వేసి కళ్ళు తెరుచునది.
   
2.    స్వస్త్యయనము కోరువాడు 1-5 ఋక్కులచే 13 ద్రవ్యములను ఆహుతి చేయునది.
   
    4-6 ఋక్కులచే దాయాదుల విభాగమున పుష్టికోరువాడు తల్లి వంటి దూడగల ఆవు పాల అన్నమును సంపాతన, అభిమంత్రణములు చేసి భుజించునది. వీనితోనే ధనుస్సు నారిని సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది. దండమును సంపాతన, అభిమంత్రణములు చేసి ధరించునది.
   
    పుష్ట్యర్ధ చిత్రా కర్మమున చెట్టు కొమ్మకు సామాగృలను సంపాతన, అభిమంత్రణలు చేయునది.
   
    పుత్ర, పుత్రిక తలమీద రెండు సుళ్ళు ఉన్నప్పుడు వీనిచే ఘ్రుతాహుతులిచ్చునది.
   
1.    ఇంద్రుడు, పూష, అదితి, మరుత్తులు మమ్ము రక్షింతురుగాక. అపాంనపాత్, సప్త సింధువులు, విష్ణువు, ద్యులోకము మమ్ము రక్షించునుగాక.
   
2.    కోరిన ఫలము సిద్ధించుటకు ద్యావాపృథ్వులు అభిషవ శిల, అభిషుత సోమము మమ్ము పాపముల నుండి రక్షించునుగాక. సుభగ సరస్వతీ దేవి, అగ్ని మమ్ము రక్షింతురుగాక. అగ్నియొక్క కాంతులు మాకు శుభప్రధములు అగునుగాక.
   
3.    శుభస్పతులగు అశ్వినులు మమ్ము రక్షింతురుగాక. రాత్రింబవళ్ళు మమ్ము రక్షించునుగాక. నభమునందలి నీటిని కాపాడు అపాంనపాదగ్ని మమ్ము కాపాడునుగాక. త్వష్ట సమస్త ఫలములు ప్రసాదించి మమ్ము వర్ధిల్ల చేయునుగాక.
   
4.    నేను చేయు దేవోచిత స్తుతులను త్వష్ట, బ్రహ్మణస్పతి, పర్జన్యుడు ఆలకింతురుగాక. భ్రాత్రు, పుత్ర సహితయై అదితి ఎదిరి బలము నుండి మమ్ము రక్షించును గాక.
   
5.    అదితి అంశగల భగ, వరుణ, మిత్ర, ఆర్యమలు మమ్ము రక్షింతురుగాక. అదితి మరుద్గణములు మమ్ము రక్షించునుగాక. మాకు నష్టము కలిగించు శత్రువు మాకు దూరమగునుగాక. నలువైపులా నుంచి హింసించు వాడు మా నుంచి దూరమైనాడు. శత్రువు యొక్క ద్వేషము దూరమగునుగాక.
   
6.    అశ్వినులు మా అగ్నిహోత్రములను, మా సద్బుద్దులను రక్షింతురుగాక. వాయువు ప్రమాద రహితుడై మమ్ము రక్షించును గాక. మా తండ్రియగు ద్యులోకము మమ్ము కుక్కల వంటి దుష్ట శక్తుల నుండి రక్షించును గాక.
   
                                                మూడవ సూక్తము -3
   

వినియోగము :-

   
1.    గ్రామకామి 1-2 ఋక్కులచే ఇంద్రుని పూజించునది. వీనితోనే "ఉదుమ్బర పలాశ శకర్కంధూత క్షణాధానమ్" సభ యొక్క పడక పరకాల నుంచునది. లేదా అభిమంత్రిత అన్నాసన మిచ్చునది.
   
2.    దశ పూర్ణ మాసమున ఆగ్నేయ చరును 1-3 ఋక్కులచే హోమించునది.
   
3.    అగ్ని చయనమున షోడశ గృహీతవైశ్వ కర్మణ హోమమున మొదటి ఋక్కుచే పేర్చిన సమిధలను బ్రహ్మ అనుమంత్రించునది.
   
4.    దర్శపూర్ణ మాసమున 2వ రుక్కుచే బ్రహ్మ 'ఐన్ద్రం ఆధారం' అనుమంత్రించునది. ఇంద్ర సంబంది సాంనాయ్య యాగమును అనుమంత్రించునది.
   
5.    అద్భుత మహాశాన్తి యొక్క ఇంద్ర పూజనమున రెండవ ఋక్కు వినియోగము.
   
1.    ఘ్రుతముచే ఆహ్వానించబడు అగ్నీ! ఇతనికి ఉత్కృష్ట పదము కలిగింపుము. ఇతనికి వర్చస్సు కలిగింపుము. బహు సంతానము కలిగించుము.
   
2.    ఇంద్రదేవా! నీవు ఇతనిని ఎంతో వర్ధిల్లచేయుము. అతడు తనవారిని తన వశమున ఉంచుకొనును గాక. అతనికి ధనపుష్టి కలిగించుము. అతనిని వార్ధక్యము వరకు జీవింప చేయుము.
   
3.    ఎవని ఇంట మేము అగ్నికార్యములు నిర్వర్తించుచున్నామో అగ్నిదేవా! అతనిని వర్ధిల్లచేయుము. సోముడు, బ్రహ్మణస్పతి అతనిని తమవానిగా పరిగణింతురుగాక.
   
4.    బ్రహ్మణస్పతీ! దేవతలను పూజించక మమ్ము వధించ దలచిన వానిని సోమాభిషవము చేయు ఈ యజమానికి వప్పగించుము.
   
5.    సోమదేవా! దుష్ట శత్రువు మా ప్రియ భాషణమును తిరస్కరించినపుడు వాణి ముఖముపై వజ్రముతో బాదుము. అందువలన అతడు పిండియై పారిపోవును గాక.
   
6.    సోమదేవా! మమ్ము నాశనము చేయదలచు బంధువులను, మమ్ము పీడించదలచు దుష్ట శత్రువును పిడుగు పాటుతో నాశము చేయుము.
   
                                                నాలుగవ సూక్తము - 4
   
వినియోగము :-

   
1.    యాగ విఘ్న శాంతి కొరకు 1-3 ఋక్కులచే తల్లిరూపపు దూడగ ఆవుపాల పాయసమును సంపాతన, అభిమంత్రణలు చేసి భక్షించునది. అయోగ్యుడు యజ్ఞము చేయించినపుడు యజ్ఞసమాప్తి యందు వీనిచే సోమమును యజించునది.
   
    స్త్రీ వశీకరణ కర్మమున 4-6 ఋక్కులచే చెట్టు జెరడు, శరఖండము, తగరము, అంజనము, కుటూది ద్రవ్యములను నూరి నేతిలో కలిపి స్త్రీ మర్మాంగము మీద పూయునది.
   
1.    సోమదేవా! ఏ మార్గమున జగదనుగ్రహ కారకులగు అదితి, మిత్రాదులు సంచరింతురో ఆ మార్గమున మమ్ము రక్షించుటకు విచ్చేయుము.
   
2.    సోమదేవా! ఏ బలమున నీవు మా కొరకని రాక్షసులను వశపరచుచున్నావో ఆ బలముననే నీవు మమ్ము నీవారినిగా చెప్పుము.
   
3.    దేవతలారా! ఏ బలమున అసురుల బలమును క్షీణింప చేయుచున్నారో ఆ బలమున మాకు సుఖ శాంతులు ప్రసాదించండి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.