Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అలా జరగడం అదే తొలిసారి. ముద్రిసులు - ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటున్నారు. సర్కారు ఏమంటుందో? ఏం చేస్తుందో అని సదర్ ముద్రిస్ గడగడలాడాడు. ఎడారిగా మారిన పాఠశాలలో పాపం, పంతుళ్లు గజగజలాడుతున్నారు!
ఆ సాయంకాలం మామిళ్లగూడెంలోని ప్లేగ్రౌండులో జరిగిన మీటింగుకు విద్యార్థులు తండోపతండాలుగా వచ్చారు. అక్కడక్కడా పోలీసులు కనిపించారు. అయినా అంతమందిమి కూడాం కదా - భయం మాయం అయింది.
మాట్లాడిన నలుగురం ఆవేశంగా - ఘాటుగా - ఉద్రేకంగా మాట్లాడాం. అందరూ విద్యార్థులే. విద్యార్థులు తప్ప ఎవరూ లేరు. అలా మూడు రోజులు సమ్మె జరిగింది. మూడు రోజులూ మీటింగులు జరిగాయి. ఊరంతా ఉడికిపోయింది. అందరినోటా సమ్మె తప్ప వేరేమాట లేదు. ఊళ్లోకూడా భయం భయంగా ఉంది.
"పిల్లలు సర్కార్ను ఎదిరిస్తున్నరు! ఏమైతదో!" ఇదేమాట అందరినోట!
నాలుగోనాడు స్కూలుముందు బ్లాక్ బోర్డుమీద మా కోరిక మన్నించినట్లు వ్రాసి, హెడ్ మాస్టరు సంతకం పెట్టాడు. గాంధీటోపీ తప్ప ఏ టోపీ అయినా పెట్టుకోవచ్చని వ్రాశారు.
అది చూచాం. మా ఆనందానికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి! ఆ సాయంకాలం జరిగిన సభలో చాలమంది విద్యార్థులు మాట్లాడారు, సభ ముగియగానే నన్ను ఎత్తుకున్నారు. ఎగిరారు. గంతులు వేశారు. సమ్మె ముగిసినట్లు ప్రకటించాం.
తెల్లవారినుంచి పాఠశాల కళకళలాడింది. అందరం స్కూలుకు వెళ్లేం. క్లాసులు నడిచాయి. అందరూ నన్ను మొనగాణ్ణి చేశారు. మొనగాడిగా చూశారు. నేనూ సంబరపడి ఉంటాను. కాలరు ఎగరేసి ఉంటాను. ఒక వారంపాటు హీరోను అయినాను.
ఒకనాడు హెడ్ మాస్టరు పిలిపించాడు. వెళ్లాను. అక్కడ మరో నలుగురు టీచర్లున్నారు. హెడ్ మాస్టరు నాకు ఒక కాగితం అందించారు. అది నన్ను స్కూల్లోంచి తొలగించినట్లూ - నిజాం రాజ్యంలో ఎక్కడా చేరకుండా చేసిన రాజాజ్ఞ! అది చూచాను. కళ్లు చీకట్లు కమ్మాయి. అయినా నిబ్బరంగా నుంచున్నాను. కన్నీటి బొట్టు రాలనీయలేదు.
హెడ్ మాస్టరు "గద్దారీకీసజా - రాజద్రోహపు శిక్ష" అన్నాడు. అక్కడ ఉన్న టీచర్లసహితంగా హెడ్ మాస్టరు వికటంగా నవ్వాడు.
అది నాకు అవమానం అనిపించింది. దుఃఖం ముంచుకువస్తున్నది. కాగితం పట్టుకుని బయటికి వచ్చాను. క్లాసులోకి వెళ్లలేదు. పుస్తకాలు తీసుకోలేదు. బయటికి వచ్చి, స్కూలు ముందరి మైదానంలో కూలబడి భోరున ఏడ్చాను. నేనే ఓదార్చుకున్నాను. విద్యార్థులకు ఈ విషయం తెలిసి, స్కూలు వదులుతే అందరూ నాకు సాయపడ్తారనీ - మళ్లీ సమ్మె చేస్తారనీ ఆశించాను. చొక్కాతో కళ్లు తుడుచుకున్నాను. స్కూలు ముందరి అరుగుమీద కూలబడ్డాను.
స్కూలు వదిలారు. పిల్లలు గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్నారు. ఒక్కడూ నావైపు కన్నెత్తి చూడలేదు. పెదవి విప్పి పలకరించలేదు. అంతా వెళ్లిపోయారు. నేను క్రుంగిపోయాను. నిరామయంలో కూలబడ్డాను.
ఎంతసేపని కూర్చుంటాను? దుఃఖం నిండిన గుండెతో వంటరిగా - కాళ్లీడ్చుకుంటూ ఇంటికి చేరాను. నాయన ఆకలిగొన్న పులిలా ఉన్నారు. జంకాను. బయటనే ఉన్నాను. "నువ్వు రాజద్రోహివి. నా యింట్లో స్థానం లేదు!" అని గొంతుచించుకుని తలుపులు దభాల్న వేశారు!
అప్పటి నా దుస్థితిని తలచుకుంటే ఇప్పుడూ నా గుండె దడదడలాడుతున్నది!
"నీవేతప్ప ఇంతఃపరం బెరుగ" అనడం కూడా తెలియక కాళ్లీడ్చుకుంటూ మునేటికి చేరుకున్నాను. ముఖం కడుక్కున్నాను. నీళ్లు తాగాను. వంతెన కమానుక్రింద - శ్మశానం పక్కన - బండమీద కూలబడ్డాను. అప్పుడు ఏడుపు రాలేదు. నదీప్రవాహాన్ని చూస్తూ కూర్చున్నాను.
అలా కూర్చున్న నన్ను హమాలి లింగయ్య పలకరించాడు. అంతకుముందు అతను నాకు తెలియదు. అతడే పరిచయం చేసుకున్నాడు. నా కథ విన్నాడు. కరిగాడు. తినడానికి ఏదయినా తెచ్చిపెడ్తా నన్నాడు. "మేము శ్రీవైష్ణవులం. ఇతరులు వండినవి తినం" అన్నాను. లింగయ్య నన్ను వాళ్లఇంటికి తీసికెళ్లాడు. అరటిపళ్లు తెచ్చిపెట్టాడు. తిన్నాను. వాళ్లఇంట్లో నీళ్లు త్రాగలేదు. కాలవలో నీళ్లు తాగాను. నరసింహస్వామి గుట్టమీద తపస్సు చేస్తాను అన్నాను. పులులు ఉన్నాయి మింగుతాయి అన్నాడు లింగయ్య.
రెండు రోజులు అలా గడిచాయి. మూడోనాడు అన్నయ్య వచ్చాడు. నేను శూద్రుని ఇంట్లో ఉండడం నాయనకు తలవంపులవుతున్నదట. నన్ను తీసుకురమ్మని అన్నయ్యను పంపించారు. నాకు అమ్మ గుర్తుకు వచ్చింది. అన్నయ్య వెంటవెళ్లాను. అమ్మ నన్ను పట్టుకొని పెద్దగా ఏడ్చింది. తన నిస్సహాయతను తానె నిందించుకున్నది. నేను స్నానం - తిరుమన్కాపు చేసుకున్నాను. నాయన జంధ్యం మార్పించారు.
అమ్మ అన్నం కలిపి తినిపించింది.
దుఃఖం, అవమానం అన్నింటినీ మరిపించింది.
ఖమ్మంలో ఉన్నంతకాలం లింగయ్య స్నేహం వదల్లేదు. అతనికి నేను చేసింది లేదు. అతనే మాకు ఎంతో సాయం చేశాడు. మా కుటుంబం క్లిష్టదశలో ఉన్నప్పుడు లింగయ్య తాను బస్తాలు మోసి సంపాదించినదాన్లోంచి ప్రతిరోజు బేడ ఇచ్చాడు!
తరువాత ప్రయత్నించాను - లింగయ్య కనిపించలేదు!
నిజాం సర్కారు అంత తొందరగా - అంత తేలిగ్గా - విద్యార్ధుల కోరిక ఎందుకు మన్నించినట్లు? తరువాత కాలంలో అర్ధం అయిన విషయాలు:
1. విద్యార్థుల వెనుక ఎలాంటి సంస్థ లేకపోవడం.
2. ఉద్యమం ఇతరచోట్లకు పాకకుండా అరికట్టడం
3. వందేమాతరంలోవలె చేతులు కాల్చుకోతలచుకోకపోవడం
4. భేదనీతి ప్రయోగించి - సమ్మెతరువాత - విద్యార్థులును భయపెట్టడం.
నాకు ఈనాటికీ అర్థంకాని విషయాలు:
1. వాస్తవంగా నేను అంతటి సమ్మెను నడిపానా?
2. ఆవేశం కనపరచి బలిపశువును అయినానా?
3. ప్రభుత్వం వందేమాతరంనాటి నామీద పగ ఇలా తీర్చుకున్నదా?
అప్పటికి నా వయసు పన్నెండేళ్లు. నేను ఆరో క్లాసులో ఉన్నాను. కొంత కుర్రతనం - కొంత ఆవేశం!
ఈ వయసులోనూ ఆవేశానికి కొదువలేదు.
అన్యాయం సహించలేను.
"ఏషమే సహజోదోషః స్వభావో దురతిక్రమః" అంటాడు వాల్మీకి. ఇది పుట్టుకతో వచ్చిన గుణం. స్వభావాన్ని అతిక్రమించడం అసాధ్యం.
మరొక ముఖ్యవిషయం - అప్పటికే నాకు పెళ్లయింది!
అదొక కథ.
మానవ స్వభావాన్ని మించిన విచిత్రం మరొకటి లేదు. మనిషి ఇతరుల బాధలు లెక్కించడు. తన మాట నెగ్గినందుకు సంబరపడతాడు.
నన్నుబడినుంచి బహిష్కరించినందుకు నాయన బాధపడలేదు. నాకు ఈ చదువు అబ్బదు అన్న తన మాట నెగ్గినందుకు ఉబ్బిపోయారు. నన్ను సన్నిధి స్వామిని చేసుకుని తమవెంట తిప్పారు. వంటసహితంగా వారికి సకల పరిచర్యలు చేయడం నా పని. వారికి తీరిక ఉన్నపుడు నాకు ద్రావిడమూ - సంస్కృతమూ చెప్పారు.
నాయనమ్మకు తీవ్రంగా జబ్బుచేసింది. ఆమెకు ఆమెపుత్రుడే సర్వస్వం. అన్యం ఆమె ఆలోచించలేదు. నాయనకూడా అలాగే సేవలు చేశారు.
నాయనమ్మ జబ్బు విషయం తెలిసింది. నాయనా నేనూ ఇంటికి చేరుకున్నాం. నాయన ఏ లోటూ రానివ్వలేదు. అమ్మ అన్నీ మరచి మూత్ర పురీషములు ఎత్తిపోసి - అపరిమితం అయిన పరిచర్యలు చేసింది. శక్తివంచన లేకుండా మేమూ చేశాం.
నాయనమ్మ నుంచి ఎదో దుర్గంధం ఇంటినిండా వ్యాపించింది. భరించడం కష్టం అయింది. అదికాక తాతయ్య పరమపదించిన నక్షత్రం మంచిదికాక కొంతకాలం ఇల్లు వదలాల్సి వచ్చింది. వీటిని దృష్టిలో ఉంచుకొని నాయనమ్మను ఎదుటి ఇంటికి మార్చారు.
అక్కడా ఆమెకు ఎలాంటి లోటూ రానివ్వలేదు. దుర్గంధం భరించరానిది అయింది. అపస్మారంలోనూ ఆమె పోయిన భర్తను తలచలేదు. ఉన్న తమ్ముని తలచలేదు. కోడలు, మనుమలు, మనుమరాళ్లు ఎవరినీ తలచలేదు.
తన పుత్రుడు వేంకటాచార్యులవారి వడిలో - వారి చేతితో తీర్థం ఉంచగా - మేమందరం పరివేషించి ఉండగా - నాయనమ్మ దాశరథి బుచ్చమ్మగారు - ప్రమాది సంవత్సర శ్రావణ శుక్ల షష్ఠినాడు పరమపదించారు.
గోవర్ధనంవారింట యల్లపేటలో పుట్టి - భద్రాచలం దాశరథి వారింట మెట్టి - పుత్రరక్షణార్థం చినగూడూరు చేరి - బుచ్చంమగారు ఖమ్మంమెట్టులో పరమపదించారు.
మునేటి వడ్డున - తాతయ్యను దహనం చేసినదానికి పక్కన నాయనమ్మ భౌతిక కాయాన్ని అగ్నికి ఆహుతి చేశారు.





