Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పదహారవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - మేధాతిథి
అభిత్వా పూర్వసీతయే ఇంన్ధ్ర స్తోమేభిరాయవః |
సమీచీనాస ఋషభః సమస్వరన్ రుద్రా గృణన్త పూర్వ్యమ్ ||
1. ఇంద్రా! నిన్ను తొలి సోమము త్రాగుమని మానవులు స్తోత్రములచే స్తుతించుచున్నారు. "ఋభువులు" ఒకచోట చేరి నిన్ను స్తుతించుచున్నారు. రుద్రపుత్రులు పూర్వ పురుషుడవగు నిన్ను స్తుతించినారు.
2. ఇంద్రుడు అభిషుత సోమము సేవించును. అది అతని శరీరమందు వ్యాపించును. అప్పుడు ఇంద్రుడు యజమాని వీర్యమును, బలమును పెంపొందించుచున్నాడు. మానవులు నేడు పూర్వకాలము వలెనే ఇంద్రుని మహిమలను గానము చేయుచున్నారు.
రెండవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
1. ఇంద్రాగ్నులారా! వేద విధులు నిన్ను స్తుతులచే అర్చించుచున్నారు. తమకు ఫలము కలుగవలెనని ఉద్గాతలు అర్చించుచున్నారు. అన్నము ప్రసాదించుమని నేను ప్రార్ధించుచున్నాను.
2. ఇంద్రాగ్నులారా! తొంబది తొమ్మిది శత్రు పురములను ఒకే దెబ్బకు గడగడలాడించిన మిమ్ము ఆహ్వానించుచున్నాము.
3. ఇంద్రాగ్నులారా! హోతలు సత్యమార్గమును అనుసరించి మా యజ్ఞమును సకల విధముల నిర్వర్తించుచున్నారు.
4. ఇంద్రాగ్నులారా! మీ యందు బలము, అన్నము పరస్పరము కలసి ఉన్నవి. వర్షధారల ప్రేరణ సహితము మీ యందే ఉన్నది.
మూడవ తృచ : ఋషి - భర్గుడు.
1. ఇంద్రదేవా! మాకు అభీష్ట ఫలములను ఇమ్ము. శచీపతి వగు శూర ఇంద్రా! నీవు సమస్త రక్షణలు కలవాడవు. భాగ్యము వంటి తేజస్వివి, ధనదాతవు. అట్టి నిన్ను మేము ఉపాసించుచున్నాము.
2. ఇంద్రా! నీవు అశ్వసంఖ్యను పెంచువాడవు. గోవులను మరింత పెంచువాడవు. నీవు బంగారము ప్రవాహము వలె తృప్తి కలిగించువాడవు. నీవు చేసిన దానమును నష్టపరచ గలవాడు లేడు. "యద్యద్యామి తదాభర" కావున నేను కోరిన వాటిని తెచ్చి ఇమ్ము.
నాలుగవ తృచ : ఋషి - భర్గుడు.
1. ఇంద్రదేవా! నాకు ధనము లిచ్చుటకు తప్పక విచ్చేయుము. నేను సదాచారిని. నాకు సంపద ప్రసాదించుము. మఘవా! గోవులు కోరువారికి గోవులు, అశ్వములు కోరువారికి అశ్వములు ప్రసాదించుము.
2. ఇంద్రదేవా! నీవు అనేక వేల, వందల గో సమూహములను యజమానులకు ఇచ్చుచున్నావు. పురందరుడగు ఇంద్రుని మమ్ము రక్షింపుమని స్తుతించుచున్నాము. మంది మాటలతో ఇంద్రుని ప్రత్యక్షము చేసికొనుచున్నాము.
ఐదవ తృచ : ఋషి - సౌభరి.
1. అగ్ని హోత ఆనందప్రదుడు. అతడు జనులకు సమస్త ధనములు ఇచ్చుచున్నాడు. అట్టి అగ్నికి సోమపూర్ణ పాత్రను, స్తుతులను సమర్పించండి.
2. అగ్నిదేవా! నీవు దర్శనీయుడవు. విశ్వపతివి. ధానము లిచ్చువారు, దేవతలను సేవించువారు రథమును అశ్వముల వలె - నిన్ను స్తుతులచే సేవించుచున్నారు. మా పుత్ర పౌత్రులకు ధనవంతులంతటి ధనము నిమ్ము.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - శునశ్శేపుడు.
1. వరుణ దేవా! నా ఈ ఆహ్వానము ఆలకింపుము. నేడే మాకు సుఖములు కలిగించుము. నీ ఎదుట నిలిచి రక్షించుమని నిన్ను ప్రార్ధించుచున్నాను.
రెండవ తృచ : ఋషి - సుకక్షి.
1. వరద ఇంద్రా! ఏ రక్షణలచే మాకు పరమానందము కలిగించుచున్నావు? ఏ విధముగా వచ్చి మమ్ము ధనములతో నింపుచున్నావు?
మూడవ తృచ : ఋషి - మేదాతిథి.
1. యజ్ఞము కొఱకు దేవతలందు ఇంద్రునే ఆహ్వానించుచున్నాము. యజ్ఞము జరుగచుండ ఇంద్రునే ఆహ్వానించుచున్నాను. యజ్ఞసమాప్తియందు సేవకులమగు మేము ఇంద్రునే ఆహ్వానించుచున్నాము. ధనలాభమునకు ఇంద్రునే ఆహ్వానించుచున్నాము.
2. ఈ ఇంద్రుడే తన బలమహిమచే ద్యావాపృథ్వులను నింపినాడు. ఈ ఇంద్రుడే సూర్యుని ప్రకాశింపచేసినాడు. ఈ ఇంద్రుని యందే సకల భువనములు నిలిచియున్నవి. అభిషుత సోమము ఈ ఇంద్రుని యందే చేరి ఉన్నది.
నాలుగవ తృచ : ఋషి - విశ్వకర్మ.
1. విశ్వకర్మా! హవిస్సులర్పించి నిన్ను వర్ధిల్ల చేయుటకు తన శరీరమే ఆహుతిగా గల అగ్నియందు హవిస్సులు అర్పించుచున్నాము. యజ్ఞము చేయని వారు సకల దిశలందు మోహ వశ్యులు అగుదురు గాక. మేము అర్పించిన హవిస్సులందుకొని ఆ ధనశాలి మాకు స్వర్గము నిచ్చును గాక.
ఐదవ తృచ : ఋషి - అనానతుడు.
1. పవమాన, హరిత వర్ణ సొమ్ము దీప్యమాన ధారలచే - సూర్యుడు చీకట్లను వలెను విద్వేషులను నశింపచేయును. దశా పవిత్రపు సోమధారలు దీపించును. రసగ్రాహ్యములగు సోమధారలు స్తుతిముఖ తేజస్సున నక్షత్రములందు వ్యాపించి ఉన్నవి.
2. సోమమా! నీవు జ్ఞానివి. పూర్వ దిశకు సాగుచున్నావు. దివ్యము, దర్శనీయమగు నీ రథము సూర్య కిరణములను కలసి కొనుచున్నది.
పౌరుషస్తుతులు ఇంద్రుని చేరుచున్నవి. జయప్రదములగు ఈ స్తుతులు ఇంద్రుని ప్రసన్నుని చేయుచున్నవి. వజ్రము ఇంద్రుని చేరుకొనుచున్నది.
సోమము, ఇంద్రుడు యుద్దములందు శత్రువులచే పరాజితులు కాని వారు అగుచున్నారు. విజేతలగు చున్నారు.
3. సోమమా! పణులు దాచిన ధనమును తెచ్చినావు. యజ్ఞమును ధరించు మాతృసమ జలములందు పరిశుద్దవైనావు. దూరము నుండి సామనధము వంటి నీ ధ్వని విని యజమానులు ఆనందభరితులు అగుచున్నారు. ముల్లోకములను వెలిగించగల వెలుగులు గల సోమము స్తోతలకు అన్నము ప్రసాదించుచున్నది. యజమానులకు అన్నము ప్రసాదించుచున్నది.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - భరద్వాజుడు.
1. పూషదేవా! నీవు గోవులను, అశ్వములను, అన్నములను, పుత్రులను, సేవకులను ఇచ్చువాడవు. నీ బుద్ధి అంతటి ఉదారము. ఆ బుద్దితో మాకు రక్షణ కలిగించుము.
రెండవ తృచ : ఋషి - గోతముడు.
1. అమోఘ బలశాలులగు మరుత్తులారా! మిమ్ము స్తుతించి, స్తుతించి స్తోతలకు చెమటలు పట్టినవి. వారికి కోరిన ఫలములు ప్రసాదించండి.
మూడవ తృచ : ఋషి - ఋజిశ్వ.
1. అమృత పుత్రులగు విశ్వేదేవతలు మా స్తుతులు ఆలకింతురు గాక. మాకు చక్కని సుఖములు కలిగింతురు గాక.
నాలుగవ తృచ : ఋషి - వామదేవుడు.
1. శుచి మంతలగు ద్యావాపృథ్వులారా! మిమ్ము ప్రశంసించువారు మీ దరికి చేరినారు. ద్యోతమానులగు మీ కొరకు ఉత్తమ స్తోత్రములు సముపార్జించుచున్నారు.
2. ద్యావాపృథ్వులారా! మీ బుద్దితోను, బలము తోను యజ్ఞమును, యజమానిని పవిత్రము చేయుచున్నారు. మీరు రాజిల్లుచున్నారు. నిత్యము సత్యమును నిర్వహించుచున్నారు.
3. మహా ద్యావాపృథ్వులారా! మీరు మిత్రులకు సిద్ధి కలిగించుచున్నారు. సత్యమును తరింపచేసి యజ్ఞమును పూర్తి చేయుచున్నారు.
ఐదవ తృచ : ఋషి - శునశ్శేపుడు.
1. ఇంద్రా! ఈ సోమము నీ కొరకు సిద్దము చేయబడినది. మగపావురము గర్భము ధరించు ఆడ పావురమును చేరినట్లు - ఈ సోమము నిన్ను చేరుకున్నది. అట్లే మా స్తుతులు సహితము నిన్ను చేరుచున్నవి.
2. ధనపతి, స్తుతివాహక, శూర ఇంద్రా! నీ స్తుతులు ఏవి కలవో అవి నీకు సంపన్నములు, సత్యస్వరూపములు అగును గాత.
3. శతక్రతూ! ఈ సంగ్రామమున మమ్ము రక్షించుటకు ఉత్తిష్ఠ, మనము కలిసి అన్య కార్యములను గురించి ఆలోచింతము గాక.
ఆరవ తృచ : ఋషి - హర్యతుడు.
1. గోవులారా! యజ్ఞములందు మంత్రములచే పితుకబడు గోవుల, మేకల పాలు ఎంతో అవసరమై ఉన్నవి. మీఋ అవటమునకు చేరండి. మీ రెండు చెవులలో ఒకటి బంగారపుది ఒకటి వెండిది అయి ఉన్నవి.
2. అధ్వర్యాదులు దరికిచేరి మిగిలిన మధువును పాత్రలో పోయుచున్నారు. విసర్జించునపుడు అవటమున చేర్చుచున్నారు.
3. పైన చక్రము, క్రింద ద్వారము కలిగిన, అక్షయ మగు అవటమునకు నమస్కరించి హోమము చేయుచున్నారు.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - దేవాతిథి.
1. ఇంద్రా! నీవు ఉగ్రుడవు. నీ మైత్రి లభించినంత మాకు శత్రుభయము లేకుండును గాక. వరదుడగు నీ చరిత్ర స్తవనీయము. యదు, తుర్వశులు నీ అనుగ్రహము వలననే జీవించి ఉన్నారు!
2. ఇంద్రా! నీవు వరదుడవు. నీ కుడి భాగము సకల ప్రాణులను ఆచ్చాదించుచున్నది. ఎంతటి శత్రువైనను నిన్ను బాధించజాలడు. తేనె వంటి పాలనిచ్చు గోవు వంటి సోమమా! త్వరగా రమ్ము ద్రవించుము. ఇంద్రా! సేవింపుము.
రెండవ తృచ : ఋషి - మేధాతిథి.
1. అనంత ధనవంత ఇంద్రా! నా స్తుతులు నిన్ను వర్ధిల్ల చేయును గాత. అగ్ని వంటి తేజోవంతులు, పవిత్రులగు స్తోతలు నిన్ను స్తోత్రములచే నుతించుచున్నారు.
2. ఈ ఇంద్రుడు వేలమంది ఋషులచే బలవంతునిగా చేయబడినాడు. ఇంద్రుడు సముద్రమంతటి విశాలుడు అయినాడు. ఇంద్రుని సత్యమును, బలమును, మహిమలను యుద్దములందును, యజ్ఞములందును కొనియాడు చున్నారు.
మూడవ తృచ : ఋషి - శ్రుష్టిగుడు.
1. ఈ విశ్వములు యజ్ఞమునకు ప్రభువులు అగుచున్నవి. అవియే సేవకులై విధులను రక్షించుచున్నవి. సరస్వతి పిత స్వామియు నియంతవు అగుచున్నాడు. అయినను ఇంద్రా! ఈ హవిరూప ధనము నీకే చెందుచున్నది.
2. తొందరపడు ఋత్విజులు మధుక్షీరాది ఆహుతులు అర్పించియు, ఘ్రుతము సమర్పించియు ఇంద్రుని యజించుచున్నారు. కావున మా ధనములు ప్రసిద్దములగును గాక. సోమపు వర్షక శక్తి ప్రసిద్దమగును గాక. మా వద్దనున్న సంస్కృత సోమములు ప్రసిద్దములగును గాక.
నాలుగవ తృచ : ఋషి - ఆప్యద్దితుడు.
1. బలశాలి సోమమా! అభిషుత వైన నీవు మాకు గోరూప, అశ్వరూప ధనములను ప్రసాదించుము. తదుపరి పవిత్రము, దీప్యమానమగు నీ యొక్క రసమునందు ఆవు పాలు కలుపుదును.
2. దివ్యసోమమా! నీవు మా పశువులకు అధిపతివి. దీప్తవు. రసమయివి. ఋత్విజుల హితకారివి. నీవు మమ్ము మిత్రునకు మిత్రుని వలె కాంతి మంతులను చేయుము.
3. సోమమా! మా విషయమున నీ పురాతన మైత్రిని వెల్లడించుము. మా దీప్తులను అడ్డువారిని దూరము చేయుము. శత్రు తిరస్కర్త వాగు నీవు మమ్ము బాధించువారిని నష్టపరచుము. ద్వంద్వ స్వభావులను దూరము చేయుము.
అయిదవ తృచ : ఋషి - అత్రి.
1. ఆ సోమమును ఋత్విజులు ఆవుపాలలో కలుపుదురు. బాగుగా కలుపుదురు. కలసిపోవునట్లు కలుపుదురు. దేవతలు సోమరసమును ఆస్వాదింతురు. తదుపరి దానిలో మధుర గోరసమును కలుపుదురు. దానిని ఎత్తున ఉంచి, దిగుచున్న ద్రష్టయగు సోమమును బంగారముచే శుద్దిచేసి జలము నందు చేర్చెదరు.
2. మేధావి, పవమాన సోమాపు స్తుతులు గానము చేయండి. సోమము - వర్షధారలవలె- అన్నము కలిగించుచున్నది. పాము కుబుసము విడిచినట్లు - సోమము అభిషవాదుల వలన - తన పాతరూపమును విడుచును. సొమ్ము అశ్వము వలె క్రీడించుచు ద్రోణకలశమున చేరును.
3. సోమము అగ్రగామి. విరాజమాన. అది నీట చేరి స్తుతించబడుచున్నది. అది దినములను కొలత వేయుచున్నది. హరిత వర్ణయై నీట వ్యాపించుచున్నది. సోమము సుందరము. దర్శనీయము. జ్యోతిర్మయ రథము కలది.
సోమము ధనము కలిగించుచున్నది. నివాసములు ఏర్పరచుచున్నది.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి పదహారవ అధ్యాయము సమాప్తము.





