Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

3.    జాతవేదాగ్నీ! నీవు సమస్త దేవతలతో కలసి వాని పరిధిని పడవేయుము.
   
4.    జాతవేదాగ్నీ! ఇతనిని భక్షించ దలచిన పిశాచపు నేత్రములు పొడువుము. గుండె బ్రద్దలు చేయుము. నాలుక కోసివేయుము. దంతములు ఊడగొట్టుము. ప్రాణములు తీయుము.
   
5.    ఇతని నుండి పిశాచములు హరించినది, పీకినది, తిన్నది, తొలగించిన వానిని అన్నింటినీ అగ్నీ! తిరిగి ఇతని యందు ప్రవేశపెట్టుము. ఇతని శరీరమున మాంసమును ప్రాణము మేము ఏర్పరచెదము.
   
6.    ఏ పిశాచములు పచ్చికుండ, కాలిన కుండ, పక్వ, అపక్వ భోజనములందు చేరి మాకు హాని కలిగించ దలచినవో" అవి అదే తీరున తన వారి సహితముగా యాతనలు అనుభవించును గాక. ఇతడు రోగ రహితుడు అగును గాత".
       
    "తదాత్మనా ప్రజయా పిశాచా వియాత యన్తా మగదో2 యమస్తు"

   
7.    ఏ పిశాచములు పాలయందు, పొలమున పండిన అన్నమునందు చేరి మాకు హాని కలిగించ దలచినవో
   
    "తదాత్మనా ప్రజయా పిశాచా వియాత యన్తా మగదో2 యమస్తు"
   
8.    ఏ పిశాచములు నీరు త్రాగునపుడు - బాధలు పడునపుడు - పడక మీద ఉన్నప్పుడు మాకు హాని కలిగించ దలచినవో
      

     "తదాత్మనా ప్రజయా పిశాచా వియాత యన్తా మగదో2 యమస్తు"
   
9.    ఏ పిశాచములు బాధలు పాడునపుడు - పడుకున్నపుడు రాత్రింబవళ్ళు మాకు హాని కలిగించ దలచినవో
   
    "తదాత్మనా ప్రజయా పిశాచా వియాత యన్తా మగదో2 యమస్తు"
   
10.    జాతవేదాగ్నీ! నీవు మాంసము తిను, రుధిరము త్రాగు, మనసును పాడు చేయు పిశాచములను హతమార్చుము. అశ్వవంత ఇంద్రుడు వానిని వజ్రాయుధముచే వధించును గాక.
   
11.    అగ్నిదేవా! నీవు కలకాలముగా యాతుధానులను మర్దించుచున్నావు. యుద్దములందు రాక్షసులు నిన్ను జయించ జాలరు. ఈ క్రవ్యాదులను, వారి వద్దగల మూర్చన శక్తి సహితముగ దహింపుము వారు నీ ఆయుధమును తప్పించుకొన కుందురుగాక.
   
12.    జాతవేదాగ్నీ! పిశాచములు ఇతని నుండి హరించినవి. పీకిన వాటిని మరల సమకూర్చుము. ఇతని అవయవములు వర్ధిల్లును గాక. అతడు సోమాంకురము వలె శక్తివంతుడు అగును గాక.
   
13.    అగ్నిదేవా! సోమాంకురము వలె ఇతడు శక్తివంతుడు అగును గాక. ఇతడు గుణవంతుడు. పవిత్రుడు. ఇతనిని ఆరోగ్యవంతుని చేయుము. "జీవతు" - ఇతడు జీవించును గాక.
   
14.    అగ్నీ! ఈ సమిధలు పిశాచ హంతలు. వానిని గ్రహించుము. ప్రసన్నుడవగుము.
   
15.    అగ్నిదేవా! ఈ సమిధలు నీ దాహార్తిని తీర్చునవి. వీనిని గ్రహించుము. ఇతని మాంసమును పీకునట్టి పిశాచములు తమ రూపములను విడుచును గాక.
   
                                          నాలుగవ సూక్తము - 30
   
వినియోగము :-

   
      1) అంహోలింగ గణమున దీని పాఠము కలదు. ఈ గణపు సమస్త చికిత్సలందు దీని వినియోగము.వివరములకు 2-30 చూచునది.
   
      2) ఉపనయనము తరువాత బాలుని తాకి దీనిచె అనుమంత్రణ చేయునది. ఋషిచేత బాలకుని తాకినపుడు కూడ దీని వినియోగము.
   
      3) పిష్ఠ రాత్రి కల్పమున ఆవాలు అభిమంత్రించిన తదుపరి దీనిని జపించునది.
  
1.    దూరము నుండి, దగ్గర నుండి నీ ప్రాణములను గట్టిగా కట్టి పెట్టుచున్నాను. నీవు నీ పూర్వ పితరులను అనుసరించకుము. "ఇహైవ భవ" - ఇచటనే ఉండుము.
   
2.    పిత్రు ఋణము తీర్చని వాడు నీ మీద అభిచారము చేసినాడు.

    "ఉన్మోచనప్రమోచనే ఉభే వాచా వదామి తే" వానినుండి నీకు ముక్తి, విముక్తి రెండు కలుగవలెనని నేను పలుకుచున్నాను.
   
3.    ఎవడు మోహ వశమున నీకు ద్రోహము తలపెట్టినాడో - శపించినాడో
   
    "ఉన్మోచనప్రమోచనే ఉభే వాచా వదామి తే"
   
4.    మాతృకృత, పిత్రుకృతముల వలన ఏ వ్యాధులచే నీవు బాధ పడుచున్నావో
   
    "ఉన్మోచనప్రమోచనే ఉభే వాచా వదామి తే"
       
5.    నీ తల్లి, తండ్రి సోదరులు, భగినులు అందించిన ఔషధములను సేవించుము. నిన్ను వార్దక్యము వరకు జీవించు వానిగ చేయుచున్నాను.
   
6.  పరిపూర్ణ మనసుతో నీవు ఇహముననే వర్ధిల్లుము. యమ దూతలను అనుసరించకుము. పూర్వము వలెనే ఈ లోకముననే జీవించుము.
   
7.    ఆహ్వానించినంత మరల విచ్చేయుము. నీవు ఉదయించు మార్గముల తెలిసిన వాడవు కదా! ఆరోహణము ఆక్ర్రమణము అయనములు నీ జీవిత కాలముననే కలుగుచున్నవి.
   
8.    రోగీ! బెదరకు నిన్ను వార్ధక్యము వరకు జీవింపచేయుచున్నాను. నా వాక్కు వినుము. నీవు ఇహముననే జీవించుము. నీ దేహము నుండి యక్ష్మ, జ్వరము తొలగి పోయినవి.
   
9.    అంగభేద, అంగజ్వర, హృదయ బాధ, యక్ష్మలమ నా వాక్కు ప్రభావమున - డేగ వలె తొలగించి దూరమున పారవేసినాను.
   
10.    ప్రమత్త, అప్రమత్త, అస్వప్న, అప్రతిబోధులగు నీ ప్రాణరక్షక ఋషులు రాత్రింబవళ్ళు సావధానులై ఉందురు గాక.
   
11.    అగ్ని నీ యందుండు వాడు. సూర్యుడు నీ కొరకు ఉదయించును గాక. ఘోర అంధకార రూప మృత్యువు నుండి విముక్తుడవై, సూర్యుని వలె ఉదయించుము.
   
12.    నమో యమాయ నమో అస్తు మృత్యవే నమః పిత్రుభ్య ఉత యే నయన్తి   
   
    శరీర పారణను తెలిసిన అగ్ని ముందు ఇతని క్షేమాభివృద్దిని గురించి విన్నవించుచున్నాము.
   
13.    ఇతనిలో ప్రాణములు, మనస్సు, నేత్రములు, బలము చేరును గాక. నేను ఇతని దేహమును గ్రహించినాను. "సధ్భ్యాం ప్రతి తిష్ఠతు" అతడు కాళ్ళ మీద నిలుచును గాక.
   
14.    అగ్నిదేవా! ఇతనికి ప్రాణశక్తి, నేత్రశక్తి కలిగించుము. శరీరమున ప్రేరణ కలిగించుము. ఇతనిని బలయుతుని చేయుము. నీవు అమృతము నెరిగిన వాడవు. ఇతడు ఈ లోకము విడువకుండును గాక.
   
15.    రోగీ! నీ ప్రాణము క్షీణించకుండును గాక. అపానము మూత పడకుండును గాక. అధిపతి యగు సూర్యుడు తన కిరణములచే నిన్ను మృత్యువు నుండి కాపాడును గాక.
   
16.    కట్టివేయబడి కదలిక గల నాలుక అంతరంగమున అన్న దానిని చెప్పుచున్నాను:-
   
    నీ నుండి యక్ష్మ తొలగి పోయినది. బ్రతుకును బాధించు వందల జ్వరపు ఆక్రమణలు తొలగి పోయినవి.
   
17.    ఈ లోకము దేవతలకు ప్రియతమము. అపరాజిత. ఇహమున మృత్యువు నిన్ను వెన్నాడుచున్నది. అయినను నిన్ను మేము ఆదేశించుచున్నాము. వార్ధక్యమున కన్న మున్ను మరణించకుము.
   
                                         అయిదవ సూక్తము -31

వినియోగము :-

   
    కృత్యాప్రతిహరణ గణమున. వివరములకు 2-11 చూచునది.
   
1.    కృత్యా! అభిచారకులు నిన్ను పచ్చికుండ, మిశ్రధాన్యము, పచ్చి మాంసము నందు ప్రయోగించినచో దానిని మరల త్రిప్పి పంపుచున్నాను.
   
2.    కృత్యా! నిన్ను కోడిమీద, వెంట్రుకల మేక మీద, గొర్రెమీద ప్రయోగించినచో "పునః ప్రతిహరామి తామ్". దానిని మరల త్రిప్పి పంపుచున్నాను.
   
3.    కృత్యా! నిన్ను ఒక గిట్టగల, రెండు గిట్టలు గల, దంతములు గల గాడిద మీద ప్రయోగించినచో "పునః ప్రతిహరామి తామ్"
   
4.    కృత్యా! మానవులు పూజించు భోజ్య పదార్ధములను పొలమున పాతిపెట్టినచో "పునః ప్రతిహరామి తామ్"
   
5.    కృత్యా! దుశ్చింతులు నిన్ను గార్హపత్యాగ్ని, అగ్నిశాల యందు పూర్వాగ్నిలో ప్రయోగించిన "పునః ప్రతిహరామి తామ్"
   
6.    కృత్యా! సభయందు జూద గృహమున అక్షములందు ప్రయోగించినచో "పునః ప్రతిహరామి తామ్"
   
7.    కృత్యా! నిన్ను సేన యందు, ఆయుధములందు శరీరములందు, దుందుభులందు ప్రయోగించినచో "పునః ప్రతిహరామి తామ్"
   
8.    కృత్యా! నిన్ను కూపమందు, శ్మశానమున పాతి, గృహమున ప్రయోగించినాచో "పునః ప్రతిహరామి తామ్"
   
9.    కృత్యా! నిన్ను మనిషి అస్థికలందు, ధనమును ఎత్తుకొని పోయి కాల్చు క్రవ్యాదులందు ప్రయోగించినచో "పునః ప్రతిహరామి తే"
   
10.    ఎరుగక కృత్యను కుమార్గమున పంపు వానిని, నీతిలేని వాడు నీతి మంతుని మీదకు ప్రయోగించిన దానిని ఆ మార్గముననే వారి మీదకు పంపుచున్నాము.
   
11.    మా మీద కృత్యను ప్రయోగించి మా కాలుకు, వేలుకు నష్టము చేయదలచిన వాడు చేతగాని వాడు అగును గాక. అట్టి దౌర్భాగ్యుడు భాగ్యవంతులకు శుభములే కలిగించును గాక.
   
12.    చాటుగ ప్రయోగించు, శాపము పెట్టు, జడులను చేయు కృత్యాకారులను ఇంద్రుడు తన మహాయుధమున వధించును గాక. అగ్ని భస్మము చేయును గాక.
   
    (సాయణాచార్యుడు ఈ కాండకు వ్యాఖ్య రచించలేదు.)
   
     


       దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ వేంకటాచార్య వేంకటాంబలపుత్రుండును, ఆంద్రప్రదేశ ఆస్థాన కవీశ్వరుడు దాశరథి కృష్ణమాచార్య అనుజుండునగు  దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత యందలి  ఐదవ కాండ సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.