Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఉస్మానియా బహిష్కరించిన విద్యార్థులకు నాగపూర్ విశ్వవిద్యాలయం స్థానం కల్పించింది.
నాగపూరు విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఆ విద్యార్థులలో కొందరు తరువాత జరిగిన నిజాం వ్యతిరేక సమరంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. వారిలో పి. వి. నరసింహారావుగారు ఒకరు.
వందేమాతర ఉద్యమ స్ఫూర్తి ఖమ్మానికీ పాకింది. మమ్ములను మిన్నకుండ నీయలేదు. అంతకుముందునుంచే ఉర్దూ ప్రార్థన చదవడానికి వ్యతిరేకంగా ఉన్నాం. అందుకు కారణం ఆర్యసమాజం.
1875లో స్వామి దయానంద ఆర్యసమాజం స్థాపించారు. సమాజం విగ్రహారాధనను వ్యతిరేకించింది. వేదంలోనే సర్వం ఉందనీ - దాన్ని అనుసరించాలని బోధించింది. ఆర్యసమాజం హిందూమత సంస్కరణకు, పునరుజ్జీవనానికి ప్రాధాన్యతను ఇచ్చిన సంస్థ. బ్రిటిషిండియాలో ఆర్యసమాజం రాజకీయ శక్తిగా ఎదగలేదు.
నిజాం రాజ్యంలో ఆర్యసమాజం తొలి రాజకీయ శక్తిగా రూపొందింది. ఇందుకు కారణం తేటతెల్లం. మెజారిటీ హిందువులున్న రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి దృఢసంకల్పుడయిన కరకు తురక నిజాం ఇందుకు కారకుడు!
1938కి పూర్వం నిజాం ముస్లిం పక్షపాత విధానాలను వ్యతిరేకించిన ఏకైక సంస్థ ఆర్యసమాజం. నిజాం ప్రభుత్వం ఆర్యసమాజ కార్యకర్తలను నిర్బంధించింది. వేద్ ప్రకాశ్ వంటివారిని హతమార్చింది.
నిజాం ప్రభుత్వపు 'తబ్లీగ్' మత మార్పిడిని తమ శుద్ధి ఉద్యమం ద్వారా ఎదుర్కొన్నది ఆర్యసమాజం. బహదుర్ యార్ జంగ్ ఇస్లాం మతానికి మార్చిన అనేకమందిని 'శుద్ధి' ఉద్యమం ద్వారా నరేందర్ జీ హిందువులను చేశారు. ఆ విధానాన్ని నా నవల "చిల్లరదేవుళ్లు"లో వివరించాను. వాస్తవానికి హవనం చేసి, తిరిగి హిందూమతంలో చేర్చుకోవాలి. కాని. నరేందర్ జీకి గ్రామాల్లో అంత సహకారం లభించేది కాదు. అందువల్ల తమ వెంట తెచ్చిన జలాన్ని గంగాజలం అని వారిమీద చల్లి మళ్లీ హిందువులను చేసేవారు.
"హమారేపూరే కోషిషోఁ పర్ గిడ్డా పానీ ఫేర్నా రహాహై" అని బహదూర్ యార్ జంగ్ నిజాం నవాబుకు మొర పెట్టుకున్నాడని నరేందర్ జీ నాతో స్వయంగా చెప్పారు. మన ప్రయత్నాలన్నింటిని పొట్టివాడు నీట ముంచుతున్నాడు అని దాని అర్థం.
"పొట్టివాడు" అంటే నరేందర్ జీ, 'పానీ ఫేర్నా', అనే ముహావిరా - జాతీయం - చక్కగా అతికింది.
"పానీ ఫేర్నా" అంటే నీరు చల్లటం - నీట ముంచడం రెండూ అవుతాయి. నరేందర్ జనంమీద నీరు చల్లి సర్కారును నీటముంచుతున్నారు అని బహద్దూర్ మొర!
1938 సత్యాగ్రహంలో అరెస్టయిన సత్యాగ్రహుల్లో కాంగ్రెస్ వారు 400 కాగా ఆర్యసమాజంవారు 7,500. అయితే, వీరిలో ఎక్కువమంది బయటిప్రాంతాలనుంచి - జయపూర్, గ్వాలియర్, రావల్పిండినుంచి వచ్చినవాళ్లు .
నిజాం రాజ్యంలో ఆనాటి అన్ని రాజకీయ పోరాటాల నాయకులు - ఎక్కువమంది - తొలుత ఆర్యసమాజంతో ప్రభావితులు అయినవారే!
గుంటిమల్లన్న బజారులో మా ఇంటి ఎదురు వరుస చివరలో ఆర్యసమాజపు కార్యాలయం అనడానికి వీల్లేదు - గృహం ఉండేది. అక్కడ రోజూ హవనం జరిగేది. కేశవదేవ్ గారు హిందూమతానికి జరుగుతున్న ద్రోహాలను గురించి వివరించేవారు. కొన్ని పత్రికలు - పుస్తకాలు ఉండేవి.
మా అన్నయ్యా, నేను తరచుగా అక్కడికి వెళ్లేవాళ్లం. పండిత కేశవదేవ్ ఉపన్యాసాలు మమ్ములను ప్రభావితులను చేశాయి. పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గుంటిమల్లన్న సత్రంలో "పాండురంగ భక్తసమాజం" ఉండేది. వాళ్లు చేసేవి భజనలే అయినా, నాకు ఎదో ఆవేశం - సందేశం వినిపించేది. వారు అప్పుడప్పుడు నాటకాలు వేసేవాళ్లు. నేనూ ఒక చిన్న వేషం వేసినట్లు గుర్తు.
వీటన్నింటివల్ల వాస్తవంగా ఒక మతం విషయంలో మనసులో బద్ధవ్యతిరేకత ఏర్పడింది. మత ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు కావని తరవాత కాలంలో గ్రహించాం. అప్పుడు అర్థం ఆయిందేమంటే - ఆర్యసమాజం స్వమత అభిమానంకంటే పరమత ద్వేషం ఎక్కువ నేర్పింది.
కొంత పరిపక్వత వచ్చిన ఈనాడు స్పష్టం ఆయిందేమంటే - ద్వేషం ఆధారంగా ఎ ఉద్యమమూ నెరవేరడం దుస్సాధ్యం అని.
ఈ మత వ్యతిరేకత వల్ల స్కూల్లో చదివే ఉర్దూ ప్రార్ధన వ్యతిరేకించాలనే అభిప్రాయం ఏర్పడింది. నేను 'తాబిశ్ ఖాలిక్' చదివేవాణ్ణి కాదు. అంతమందిలో నన్ను ఎవరూ గమనించేవారు కాదు. క్రమంగా అలా చదవడం మానేసినవాళ్లం కొంతమందిమి చేరాం.
అలా కొంతకాలం జరిగింది. ఒకనాడు మేం రామాలయంలో కూడాం. దాన్ని సమావేశం అనలేం. అది రహస్యంగా జరిగింది. అందులో నిర్ణయించిందేమంటే - ప్రార్థన చదవకుండా ఉండడంతో సరిపోదు; అందరూ ఉర్దూ చదివేప్పుడు వందేమాతరం గొణగాలి.
అలా కొంతకాలం సాగింది. అప్పుడు ఉస్మానియాలో వందేమాతరం ఉద్యమం వచ్చింది. అది విద్యార్థులను ఉత్తేజపరిచింది. మాతో అనేకమంది కలిశారు. అయితే అందరూ గొణగడమేగాని ఎవరూ పైకి చదవలేదు. సంఖ్య ఎక్కువ అయింది. రహస్యం బయటపడింది. ఉద్యమ ప్రభావంకూడా కావచ్చు - ముద్రిసులు కనిపెట్టారు. అది సదర్ ముద్రిస్ - హెడ్ మాస్టరుదాకా పోయింది.
సదర్ ముద్రిస్ ఒకనాడు తన ఇజ్లాస్ - ఆఫీసుకు పిలిపించాడు. "తుమ్ గద్దార్ హో" - నీవు రాజద్రోహివి అని పేం బెత్తంతో విపరీతంగా కొట్టాడు. "పహలా జుర్మ్ హై - మాఫ్ కర్తాహూఁ , ఫిర్ హువాతో ఖారిజ్ కరూఁ గా" తొలినేరం క్షమిస్తున్నాను. మళ్ళీ జరుగుతే బహిష్కరిస్తాను అని బెదిరించి పంపించాడు.
నాకు ఇవ్వాళ్టికీ ఆశ్చర్యం కలిగించేదేమంటే, పదకొండేళ్లవాణ్ణి అన్ని దెబ్బలుతిన్నా ఏడవలేదు, బెదరలేదు!
ఇంటికి చేరుకుంటే నాయన చింత బరికెతో సిద్ధంగా ఉన్నారు. బెబ్బులిలా నామీద పడ్డారు. నాయనమ్మ సహితంగా ఎవరు అడ్డంవచ్చినా ఆగలేదు. నేను ఏడ్చినా, మొత్తుకున్నా వినలేదు. చింత బరికె విరుగుతే అవతల పారేశారు!
నాయన కొట్టిన దెబ్బలకు వంటినిండా దద్దులయి, జ్వరం వచ్చింది; తగ్గింది. ఆర్యసమాజపు ఛాయలకు వెళ్లవద్దని నాయన హెచ్చరించారు.
జ్వరం తగ్గింతరువాత మదర్సకు వెళ్లాను. అంతా ముక్తకంఠంగా "తాబిదఖాలిఖె ఆలం" చదువుతున్నారు. నేను చదవలేదు. వందేమాతరం గొణగలేదు. రామాలయం మీటింగులు బంద్! ఒక్కడూ అటు తొక్కలేదు!
1940లో కాంగ్రెసువారు వ్యక్తిసత్యాగ్రహానికి పిలుపు ఇచ్చారు. 11-9-1940 రాత్రి 10.30కు స్వామి రామానంద తీర్థను అరెస్టు చేసి, నిజామాబాదు జేలుకు పంపించారు. ఆ తరువాత గోవిందాస్ ష్రాఫ్ యుక్తంగా అనేకమందిని ఔరంగాబాదులో అరెస్టు చేశారు. సుమారు రెండేళ్ల నిర్బంధం తరువాత విడుదల చేశారు .
కుచ్చుటోపీ సమ్మె:
1940లో అనుకుంటా - నిజాం నవాబు ఒక ఫర్మాను ద్వారా విద్యార్థులకు యూనిఫాం ఆజ్ఞాపించాడు. విద్యార్థులందరూ విధిగా చుడీదార్ పైజమా - నీలం లేక నలుపు షేర్వాణీ - కుచ్చుటోపీ ధరించాలి. ఇది పూర్తిగా ముస్లిముల వేషం అని మేము అభిప్రాయపడ్డాం. ముస్లిముల వేషాన్ని హిందువుల మీద రుద్దుతున్నారు అనుకున్నాం. అది చాలవరకు వాస్తవం కూడా. దాన్ని వ్యతిరేకించాలి అని నిర్ణయించాం.
మళ్లీ చాటుమాటు సమావేశాలు! బయటికి పొక్కరాదు. ప్రచారం చేయరాదు. ఇవ్వాళ జరిగినచోట మళ్లీ సమావేశం జరపరాదు. ఇండ్లల్లో ఎవరూ మీటింగు పెట్టనివ్వరు! రామాలయంలో ఒకసారి, గుంటిమల్లన్న గుడిలో ఒకసారి - ఏటిదగ్గర ఒకసారి, నరసింహస్వామి గుట్టమీద ఒకసారీ సమావేశం అయినాం. సమ్మె చేయాలని నిర్ణయించాం.
చుడీదార్ పైజామా, షేర్వాణీ విషయంలో అభ్యంతరం లేదు. నెహ్రూగారు ఆ బట్టలే వేసుకుంటారు! కుచ్చుటోపీ పెట్టుకోం. వేరే టోపీ పెట్టుకుంటాం. వేరే టోపీ అనుమతించేదాకా సమ్మె చేస్తాం. ఈ విషయం విద్యార్థుల్లో రహస్యంగా ప్రచారం చేశాం. చాలమంది సమ్మెకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది. సమ్మెతేదీ నిర్ణయించాం.
తెల్లవారితే సమ్మె అనగా ఆ రాత్రి ఈ విషయాలన్నీ బ్లాక్ బోర్డుమీద వ్రాసి పెట్టాం. భయం భయంగా ఏం జరుగుతుందో అని చూచాం.
సమ్మెరోజు దూరం దూరంగా నుంచున్నాం. స్కూలుముందు నుంచోవడంతో - పిల్లలను వెళ్లవద్దని హెచ్చరించడం సాధ్యపడదు. అయినా, విద్యార్థులు అయిక్యంగా నిలిచారు. తురకపిల్లలు - ఒకళ్లిద్దరు ఇతరులు తప్ప, స్కూలుకు రాలేదు. ప్రార్థనలో అతి కొద్దిమంది విద్యార్థులు కనిపించారు. క్లాసులు ఖాళీ. గంటలు మాత్రం కొడ్తున్నారు.





