Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పదిహేనవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - గోతముడు.
కస్తే జామిర్జనానా మగ్నే కో దాశ్వధ్వరః |
కోహ కస్మిన్నసి శ్రితః ||
1. అగ్నిదేవా! మనుష్యులందు నీకు బంధువు అగువాడు ఎవడు? వాస్తవ దానమున నిన్ను యజించు వాడెవ్వడు? అసలు నీవు ఎవ్వరవు? దేనిని ఆశ్రయించి ఉన్నావు?
2. అగ్నిదేవా! నీవు అచింత్యుడవయ్యు ప్రభావశాలివి. జనులకు మిత్రుడవు. తృప్తి కలిగించువాడవు. స్తుతి యోగ్యుడవగు నీవు మిత్రుని వంటి ప్రియంకరుడవు.
3. అగ్నిదేవా! మా కొరకు మిత్రావరుణులను యజింపుము. దేవతలను యజింపుము. ఋతమును యజింపుము. అందుకొరకు ఈ మహా యజ్ఞశాలయందు ప్రవేశింపుము.
రెండవ తృచ : ఋషి - దేవశ్రవ లేక దేవవాత.
1. అగ్ని స్తవనీయుడు. పూజనీయుడు. తిమిర ధ్వంసి. దర్శనీయుడు. వరదుడు. అతడు ఆహుతులచే ప్రజ్వలింప బడుచున్నాడు.
2. అగ్ని వరదుడు. అశ్వము వలె దేవవాహనుడు. ఆహుతులచే ప్రజ్వలితుడు. అట్టి అగ్నిని హవిష్మంతులు స్తుతించుచున్నారు.
అగ్నీ! నీవు వరదుడవు. మేము హవిస్సులు అర్పించు వారలము. ఆహుతులు అర్పించుచున్నాము. దీపితుడ వగు నిన్ను ఎంతో ప్రజ్వలింపచేయుచున్నాము.
మూడవ తృచ : ఋషి - విరూపుడు.
1. వెలుగులు చిమ్ము అగ్నీ! నిన్ను మండించుచున్నాము. నీ జ్వాలలు నాల్కలు చాచుచున్నవి.
2. అర్ధించబడు అగ్నీ! నేయి నిండిన మా స్రుక్కులు నిన్ను చేరును గాక. మా హవిస్సులను స్వీకరించుము.
3. అగ్ని ఆహ్లాదకర్త. దేవతల ఆహ్వాత. హోత. విశేష ఋతువున యజనయోగ్యుడు. విచిత్రకిరణుడు. దీప్తిరూప ధనశాలి. అతడు మా స్తుతులను తప్పక ఆలకించుచున్నాడు.
నాలుగవ తృచ : ఋషి - భర్గుడు.
1. అగ్నీ! మమ్ము ఒక ఋక్కుచే రక్షించుము. రెండు ఋక్కులచే రక్షింపుము. మూడు వాక్కులచే రక్షించుము. బలపతీ! విశాలములగు నాలుగు వాక్కులచే రక్షించుము.
2. అగ్నీ! సమస్త రాక్షసుల నుండియు, అదాతల నుండియు మమ్ము రక్షింపుము. యుద్దములందు మమ్ము రక్షించుము. మాకు దగ్గరి వాడవగు నిన్నే యజ్ఞసిద్ది కొరకును అభ్యుదయము కొరకును శరణు వేడినాము కదా!
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - ఆప్త్యత్రిత.
1. అగ్నీ! నీవు ఈశానుడవు. హవి అందించువాడవు. మంటలు మండువాడవు. అరి భయంకరుడవు. భక్త శుభంకరుడవు. యజమానులకు ధనవర్దనుడవు. సర్వ జ్ఞాతవు. విచిత్ర దీప్తవు. తెలుపు వెలుగులు అన్ని దిక్కులందు పరచువాడవు. మహా జ్వాలలతో సాయం హోమమునాకు సిద్ది కలిగించి రాత్రిలోనికి జారి పోవుచున్నావు.
2. అగ్ని తండ్రివంటివాడు. సకల జగత్తుల మహాపాలకుడు. అతడు సూర్యునిచే ఉత్పన్నమగు ఉషస్సుగా ప్రకాశించుచు రాత్రి రూప అంధకారములను అణచి వేయుచున్నాడు. అప్పుడు అగ్ని సంచారశీలుడై తన మహా తేజస్సున ద్యులోకమును క్రమ్మి సూర్యుని అడ్డుకొని దేదీప్యమానుడగు చున్నాడు.
3. కళ్యాణ రూపయై, సేవణీయ ఉషస్సుచే సేవించబడు అగ్ని గార్హ పత్యము నుండి ఆహవనీయమునకు చేరుచున్నాడు. పిదప శత్రునాశకుడగు అగ్ని ఉష యందు చేరుచున్నాడు. సచేతన కేతనములచే సర్వత్ర వార్తమానుడగు అగ్ని సాయం సవనము కొరకు తెల్లని తన వెలుగులను పరచి రాత్రి చీకట్లను తొలగించి నిలిచి ఉన్నాడు.
రెండవ తృచ : ఋషి - ఉశనుడు.
1. అగ్నీ! నీవు సర్వత్రగామివి. సూర్యశక్తికి ప్రపౌత్రుడవు. ద్యోతమానుడవు. అందరకు వరణీయుడవు. శత్రువు పై మండిపడువాడవు. నీకు ఎట్టి స్తోత్రములను అర్పించవలెను?
2. బలపుత్ర అగ్నిదేవా! ఏ యజ్ఞపు మనసుతో నీకు హవిస్సులు అర్పింతురు? ఏ వచనముచే నీకు నమస్కరింతును?
3. అగ్నిదేవా! ఇక నీవే మా సమస్త స్తుతులను స్వీకరింపుము. మమ్ము పుత్ర, పౌత్రాది ధనయుక్తులను చేయుము.
మూడవ తృచ : ఋషి - భర్గుడు.
1. అగ్నిదేవా! హోతవగు నిన్ను అర్చించుచున్నాము. సకల అగ్నుల సహితుడవై విచ్చేయుము. హవిస్సులు కుశలపై ఉంచబడినవి. అవి నీకు చేరును గాక.
2. బలపుత్రుడు, సర్వత్రగామి అగ్నిని యజ్ఞమునకు తెచ్చుటకు స్రుక్కు సాగుచున్నది. సూర్యశక్తికి ప్రపౌత్రుడు, ఘ్రుతకేశి, సనాతనుడగు అగ్నిని యజ్ఞములందు స్తుతించుచున్నాము.
(ఆదిత్యా జ్జాయతే వృష్టి ర్వ్సష్టే రన్నంతతః ప్రజాః అని మనుస్మృతి. సూర్యుని నుండి వర్షము. వర్షము సూర్యపుత్రుడైనది. వర్షము నుండి అన్నము. అన్నము సూర్యునకు పౌత్రుడైనాడు. అన్నము నుండి ప్రజ అనగా అగ్ని. అప్పుడు అగ్ని ఆదిత్యునకు ప్రపౌత్రుడు అగుచున్నాడు.)
నాలుగవ తృచ : ఋషి - పురుమీఢుడు.
1. మా స్తుతులు అజ్ఞానమును దహించువాడును, దర్శనీయుడును అగు అగ్ని సమ్ముఖమునకు చేరును గాత. మమ్ము రక్షించుటకు గాను యజ్ఞమందలి మా ప్రణామములు అధిక ధనవంత, అత్యంత ప్రశంసణీయ అగ్ని ముందుకు చేరును గాత.
2. అగ్ని రెండు రూపముల వాడు. అతడు దేవతలందు అమృత రూపమున, మానవులందు మర్త్య రూపమున ఉన్నాడు. అతడు యజమానికి యజ్ఞసిద్ధిని, పరమానందమును కలిగించుచున్నాడు. బలపుత్రుడు, సర్వజ్ఞుడగు అగ్నికి ఆహుతులు అర్పించుటకు ఆహ్వానించుచున్నాను.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
1. అగ్ని మానవులకు సన్మార్గదర్శి. ఆహుతులను చేర్చుట యందు రథము వంటివాడు. నిత్య నూతనుడు. అగ్ని ఎదురు లేనివాడు.
2. హవిస్సులర్పించువాడు హవ్యవాహక అగ్ని వలన అన్ని దిశల నుంచి అన్నములు అందుకొనుచున్నాడు. పవిత్ర కాంతుల అగ్ని అతనికి నివాసము కలిగించుచున్నాడు.
3. దండెత్తివచ్చు సేనలను తన బలమున లొంగదీయు వాడును, ఎంతటి శత్రువున కైనను లొంగని వాడును -దేవతలను పోషించువాడును అగు అగ్ని అనేక రకముల అధిక అన్నము కలవాడు అగుచున్నాడు.
రెండవ తృచ : ఋషి - సౌభరి
1. భద్రోవో అగ్నిరాహుతో భద్రారాతిః సుభగభద్రో అధ్వ్రరః భద్రా ఉత ప్రశస్తయః ||
ఆహుతులచే తృప్తుడైన అగ్ని మాకు శుభప్రదుడు అగును గాక. ధనవంతుడగు అగ్ని యొక్క కళ్యాణ రూపధానము మాకు అందును గాక. మా యజ్ఞము శుభప్రదము అగును గాక. మా స్తుతులు మంగళప్రదములు అగును గాత.
2. అగ్నిదేవా! యుద్దములందు మా మనసులను మంగళప్రదములు చేయుము. ఏ మనసుతో నీవు శత్రువులను ఓడించుచున్నావో ఆ మనసుతోనే శత్రువులను ఓడించగల సేనలను పరాజితము చేయుము. మాకు ఫలములు ప్రసాదించుమని నిన్ను అర్ధించుచున్నాము.
మూడవ తృచ : ఋషి - గోతముడు.
1. బలపుత్ర అగ్నీ! నీవు అనేక గోవుల అన్నములకు స్వామివి. జాతవేదా! మాకు మరింత ధనము ప్రసాదించుము.
2. అగ్ని దీప్తిమంతుడు. నివాసప్రదుడు. కవి. స్తుతియోగ్యుడు. అన్నవంతుడు అతడు మాకు అన్నము అందించుచు ప్రజ్వరిల్లును గాత.
3. విరాజిల్లు అగ్నీ! రాత్రింబవళ్ళు నీ వారితో రాక్షసులను పీడింపచేయుము. నీవు కూడ పీడించుము. జ్వాలా ముఖుడవగు నీవు రాక్షసులను ఒక్కొక్కరిని భస్మము చేయుము.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - గోపవనుడు.
1. అగ్ని అందరకు అతిథి వంటి వాడు ప్రీతుడు. అతనిని స్తుతించండి. అగ్ని మాకు ధనము లిచ్చువాడు. గుహయందున్న వాడు. అతనిని స్తుతించండి.
2. మీరు జాతవేదస అగ్నిని ప్రశంసించి మంచి పని చేసినారు. అగ్ని దేవయజ్ఞములందలి హవిస్సులను దేవతలకు చేర్చువాడు కదా!
రెండవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. సమిధలచే మండుచున్న అగ్నిని వేదవాణిచే స్తుతించండి. శుచివంతుడు, స్థిరుడు, పావకుడగు అగ్నిని యజ్ఞపు అగ్రమున స్థాపించండి. విప్రుడు, హోత, సర్వవరేణ్యుడు, సర్వానుకూలుడగు అగ్నిని ధనము అర్ధించుచున్నాము.
2. అగ్నిదేవా! నీవు పాలకుడవు. స్తుతియోగ్యుడవు. నిన్ను దేవతలు, మానవులు యజ్ఞములందలి హవి వహించుటకు దూతను చేసినారు. అప్రమత్తుడవు, వ్యాప్తుడవు, ప్రజారక్షకుడ వగు నిన్ను మనుష్యులు, దేవతలు ఉభయులు నమస్కరించుచున్నారు.
3. అగ్నీ! నీవు దేవ, మానవులను ఇరువురిని శోభిల్లచేయుచున్నావు. వ్రతములందు దేవతలకు దూతవు అగుచున్నావు. ఈ లోకము నుండి హవిస్సు తీసికొని వెళ్లుటకు దానిని ద్యులోకమునకు చేర్చుటకు తిరుగుచున్నావు. నిన్ను కర్మలు, స్తుతులు భజించుచున్నవి కదా!
మూడవ తృచ : ఋషి - ప్రయోగుడు.
1. అగ్నీ! యజమాని పక్షమున వేదవాణి నీ గుణగణములను అక్క చెల్లెండ్ర వలె కీర్తించుచున్నది. వాయు సమీపమునకు నిన్ను చేర్చుచున్నది.
2. అగ్ని త్రిధాతువు. ఆవృతము. అగ్ని కట్టులేని కుశల మీద నిలిచినాడు. అందు నీరు సహితము అడుగు పెట్టుచున్నది.
3. అగ్ని ఫలప్రదాత ద్యోతమానుడు. అగ్ని స్థానము సురక్షితము. అది సేవించబడుచున్నది. ఈ అగ్నిస్థానము సూర్యుని వంటి పూజనీయము.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి పదిహేనవ
అధ్యాయము సమాప్తము.





