Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
3. విద్వాంసుడగు ఇంద్రుడు ఈ యజ్ఞము నందలి ఉక్ద శక్తి యుక్తుడగును గాత - స్వాహా.
4. శిష్ట జనులారా! ఈ యజ్ఞమున చేరండి, భార్యా యుక్తులై వాక్కులను దాల్చండి - స్వాహా.
5. తల్లి బిడ్డను పోషించినట్లు మరుత్తులు ఈ తగ్నమును చేరి ఛందస్సులను పాలింతురుగాక స్వాహా.
6. అదితి దేవి కుశలు, ప్రోక్షణియుల సహితముగ యజ్ఞమును వర్ధిల్ల చేయుటకు విచ్చేసినది స్వాహా.
7. విష్ణువు అనేక విధముల తపస్సులను ఈ యజ్ఞమున చేర్చునుగాత - స్వాహా.
8. త్వష్ట అనేక విధముల రూపములను ఈ యజ్ఞమున చేర్చునుగాత - స్వాహా.
9. విద్వాంసుడగు భగుడు ఈ యజ్ఞమున చక్కని ఆశిర్వాధములు సమకూర్చునుగాత - స్వాహా.
10. సోముడు ఈ యజ్ఞమున బహు విధజలములను చేర్చునుగాక - స్వాహా.
11. ఇంద్రుడు ఈ యజ్ఞమునకు తగిన బలములను సమకూర్చునుగాత - స్వాహా.
12. అశ్వినులారా! మంత్ర, వషట్కారములతో ఈ యజ్ఞమును వర్ధిల్లచేయుచు విచ్చేయండి - స్వాహా.
బృహస్పతీ! మంత్రముచే యజ్ఞాభిముఖుడవై విచ్చేయుము. ఇది యజమానికి స్వర్గము కలిగించును గాత - స్వాహా.
ఆరవ అనువాకము
మొదటి సూక్తము -27
వినియోగము :-
1) ఈ సూక్తముచే పుష్టికామి అగ్నియందు మంథాకార ఔదుంబరము నిచ్చి ఘ్రుతాహుతినిచ్చునది.
లెక్కలేనన్ని 'శష్కులు' లను వండి ఈ సూక్తముచే ఏడింటిని అగ్నిలో వేసి ఘ్రుతాహుతులిచునది మిగిలినవి కర్తకు ఇచ్చునది.
2) వశాకర్మము నందు కూడ దీని వినియోగము చెప్పబడినది.
1. అగ్ని యొక్క సమిధలు ఊర్ధ్వములు. అతని కాంతులు ఊర్ధ్వములు. అవి తాపకములు. అతడు సూర్యసముడు. బలశాలి. "భూరిపాణిః"
2. దేవతలందలి దేవతలు మార్గములను మధు, ఘ్రుతములచే నింపుదురు గాక.
3. నరులకు కీర్తనీయుడు, సుకర్మసవితయు సర్వలోక భజనీయుడగు అగ్నియు యజ్ఞమున మధువును చేర్చి వ్యాపించుచున్నారు.
4. ఘ్రుతబలము, హవిరూప అన్నము, స్తుతులను స్వీకరించుచు అగ్ని ప్రత్యక్షమగుచున్నాడు.
5. యజ్ఞములందున, స్రవములందునను అగ్ని తన మహిమలను చేర్చును గాక.
6. హర్షము కలిగించు - దేవ సహిత - యజ్ఞమున తారక, అగ్ని, ధన పోషక వసువులు నిలిచి ఉన్నారు.
7. వెలుగులు చిమ్ము అగ్నిదేవుని జ్వాలలు యజమాని యజ్ఞమును బహు విధముల రక్షించుచున్నవి.
8. అగ్ని దీప్తియు, ఆహుతి దీప్తియు సుందరములై మందహాసమున యజ్ఞమును సముపార్జింతురు గాక.
ఉషా, రాత్రులు పరస్పరాశ్రితలు. కలిసి దీపించునవి. అవి ఈ అధ్వర యజ్ఞమును రక్షించును గాక.
9. దేవ సంబంధ హోతలారా! మా ఈ యజ్ఞము ఉన్నతము ద్రష్టము. దీనిని అగ్నిజిహ్వచే ప్రశంసించండి. మాకు శుభములు కలుగునట్లు ఆశీర్వదించండి. ముగ్గురు దేవేరులు సరస్వతి మహీ - భారతి యజ్ఞమును ప్రశంసించుచు దర్భాసనముల మీద ఆసీనలు అగుదురు గాక.
10. త్వష్టదేవా! మాకు మరింత జలము, ఎంతో అన్నము, అద్భుత ధనము కలిగించుము. ధనపు ముడిని విప్పుము.
11. వనస్పతీ! ధ్వనించుచు నిన్ను వీడుము. శమిత, అగ్నిదేవతల కొరకు హవిని స్వాదిష్టము వేయుము.
(చెట్టు రొద చేయుచు పడిపోవుటను చక్కగా చెప్పినాడు.)
12. జాతవేద అగ్నీ! ఇంద్రునకు యజ్ఞము చేర్చుము. సమస్త దేవతలు హవి సేవింతురు గాత స్వాహా.
రెండవ సూక్తము - 28
వినియోగము :-
1) సంపూర్ణ సంపత్తి జనక కర్మమున ఈ సూక్తము వినియోగము. ఆయుష్కామి సువర్ణ మణి బంధనమున కూడ దీని వినియోగము. ఈ రెండింటి వివరములు 1 - 35 చూచునది.
2) ఆయుష్య గణమున దీని పాఠము. కావున ఉపనయనమున ఆయుష్కామి వటువు ఘ్రుత హోమమున దీని వినియోగము. ఉపనయనము తరువాత ఆయుష్కామి వటువునకు బంగారము, వెండి, ఇనుప ముక్కలను మణిగా చేసి దీనిచే సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది.
3) "వైష్ణవీం అన్న కామస్య అన్నక్షయేచ"
1. "దీర్ఘయుత్వాయ శత శారదాయ" తొమ్మిది ప్రాణములను తొమ్మిదవ సంఖ్యచే కలుపుచున్నాము. ఇందులో మూడు బంగారు తీగలు, మూడు వెండి తీగలు, మూడు ఇనుప తీగలు ఉన్నవి.
2. ఈ 'త్రివృత్' కర్మమున అగ్ని, సూర్యుడు, చంద్రుడు, భూమి, జలము, దివి, అంతరిక్షము, దిశలు ప్రదిశలు, ఋతువులు ఋత్వంశములతో కలసి మమ్ము దాటించును గాక.
3. ఈ 'త్రివృత్' కర్మను మూడు పుష్టులు ఆశ్రయించును గాక. పూషా దుగ్ధ, ఘ్రుతములచే దీనిని శుద్ది చేయును గాక. అన్నసమృద్ది, జనసమృద్ది, పశుసమృద్ది దీనిని ఆశ్రయించును గాక.
4. ఆదిత్య దేవా! ఇతనికి ధనము నింపుము. వర్ధిల్లు అగ్నీ! ఇతనిని వర్ధిల్ల చేయుము. ఇంద్రదేవా! ఇతనిని శక్తి యుక్తుని చేయుము. పోషించు 'త్రివృత్' కర్మము ఇతనిలో ఆశ్రయము పొందును గాక.
5. భూమి సువర్ణముచే నిన్ను రక్షించును గాక. లోకములను పోషించు అగ్ని అనుగ్రహించి ఇనుముచే నిన్ను రక్షించును గాక. లతలతో లభించు శక్తితో నీ యందు శుభసంకల్ప బలమును కలిగించును గాక.
6. ఈ హిరణ్యము జన్మతః మూడు విధములది అయినది. ఒకటి అగ్నికి పరమ ప్రియము. రెండవది సోమమును బాధించి పతనమైనది. మూడవ దానిని వేధా జలముల శక్తి రూపము అందురు. వటువా! ఈ హిరణ్యము నీ కొరకు త్రివృతమగును గాక.
7. జమదగ్నికి మూడు ఆయువులు. కశ్యపునకు మూడు ఆయువులు. వారు మూడు విధముల అమృతమును ఆరగించినారు. నీకు ఆ మూడు ఆయువులు కలుగును గాక.
8. మూడు శక్తివంత సువర్ణములు ఏకాక్షరము మీద త్రివృత్ రూపమున చేరినపుడు అమృతముచే మృత్యువును పారద్రోలినవి. లోకము నుండి దుఃఖమును అంతర్దానము చేసినవి.
9. హిరణ్యము నిన్ను ద్యులోకము నుండి రక్షించును గాక. తెల్లని రజతము మధ్య లోకము నుండి రక్షించును గాక. భూమి యందుండి లోహము రక్షించును గాక. ఇవన్నియు దేవపురి నుండి లభించినవి.
10. ఈ మూడు దేవపురి నుండి వచ్చినవి. తాస్త్యా రక్షన్తు సర్వతః - అవి నిన్ను అంతట రక్షించును గాక. వీటిని ధరించిన నీవు వర్చస్వి వగుము. శత్రువుల తల తన్నిన వాడవు ఆగుము.
11. తొలి దేవత హిరణ్యరూప అమృతమును దేవతల ముందు ఉంచినాడు. దానికి పదిసార్లు ప్రణమిల్లు చున్నాను. ఆ దేవతలు త్రివృత్ బంధనమునకు నన్ను అనుమతింతురు గాక.
12. ఆర్యమ, పూష, బృహస్పతి ముడి వేయుదురు గాక. నిత్యము పుట్టు వాని పేరుతోనే నీకు కట్టుచున్నాము.
13. నీకు ఆయువు, తేజస్సు కలిగించుటకు రుతువుల, మాసముల, సంవత్సరముల తేజస్సును నీలో ప్రవేశపెట్టుచున్నాను.
14. ఘ్రుతమున తడువు, మధువున ముంచు, భూమి వలె పటిష్టము గల ధరి చేర్చగల, శత్రువుల భేదించు, చిత్తు చేయు, మహా సౌభాగ్యము కలిగించు వాడు నీ యందు నిలుచును గాక.
మూడవ సూక్తము - 29
వినియోగము :-
చాతహన్ గణములందు దీని పాఠమున్నది. కావున చాతన గణము వచ్చినపుడల్ల దీని వినియోగము వివరములకు 1-7 చూచునది.
1. జాతవేదాగ్నీ! నీవు ముందుండు వాడవు. కావున దీనిని వహింపుము. చేయవలసిన దానిని ఎరుంగుము. నీవు వైద్యుడవు. చికిత్స చేయువాడవు. నీ అనుగ్రహమున మాకు గోవులు, అశ్వములు జనులు కలుగుదురు గాక.
2. జాతవేదాగ్నీ! నీవు సమస్త దేవతలతో కలసి మమ్ము ఆటలాడించిన వానిని, మాకు హాని తలపెట్టిన వాని పరిధిని పడవేయుము - 'పరిధిష్పతాతి'





